Friday 20 March 2020

టముకు



భారత దేశం అంటే పల్లెలే. పాత రోజుల్లో వార్త ప్రజలకి చేరాలంటే ఆనోటా ఆనోటా చేరాల్సి వచ్చేది. వార్తను అదే ఊళ్ళో ఉన్నవారికి చేర్చేందుకుగాను ప్రభుత్వం ఇలా టముకు ద్వారా చార్త చేరేసేది. సాధారణంగా ఇవి కోర్ట్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ద్వారా వేలం వేసే ప్రక్రియ గురించిన వార్తలే ఐ ఉండేవి. వ్యక్తుల ఆస్థులను వేలం వేసే సందర్భాలలోనే ఎక్కువుండేవి. ప్రోనోటు బాకీలు తీర్చలేకపోయిన సందర్భాలలో వ్యక్తుల ఆస్థులను జప్తు చేసేందుకు ఇలా టముకు ద్వారా వార్త చేరేసేవారు, వేలంలో పాల్గొనేవారి కోసం. ఈ ప్రక్రియ జరగడం అవమానకరంగా భావించేవారు. అదే టముకుమీద దెబ్బ పడటం అంటే,  డప్పు మీద దెబ్బ పడటం అన్నా! అంటే నీ ఆస్థి జప్తు చేయించి బాకీ వసూలు చేసుకుంటానని..బాకీ తీర్చలేక ఆస్థి జప్తు చేసే స్థితి రావడం అవమానకరంగా భావించేవారు..


కాలం మారింది. ప్రభుత్వం ప్రజలకు వార్త చవేయడానికి ఆ తరవాత కాలంలో వార్తాపత్రికలొచ్చాయి. ఆ తరవాత రేడియో మరో సాధనమయింది. ఐనా వార్త చేరడానికి సమయమూ పట్టేది. ఆ తరవాత టి.వి. వచ్చింది. వార్తల్ని వండి వడ్డించడం మొదలయింది.నిజమేదో అబద్ధమఏదో తెలిస్తే ఒట్టు. ఒక్కో పార్టీకో టి.వి ఛానలు, ఎవరి మాట వారిదే నిజం భగవంతునికే తెలుసు. :)

మరి నేటి కాలంలో వార్త గ్రామము,రాష్ట్రము,దేశమూ కూడా దాటి ఖండాంతరాలకి చేరడం చిటికెలో పని. ఒక్కసారి ఒక్క నొక్కు నొక్కితే మొత్తం ప్రపంచానికి వార్త తెలిసినట్టే. అందుకే మనవారు పెదవిదాటితే పృధివి దాటుతుందనేవారు.అంచేత మాట మాట్లాడే ముందు ఆలోచించాలి.. :) 

వార్త ఇంత సులభం చేరుతోందని సంతోషించాలో అబద్ధపు వార్తలు పెరిగినందుకు విచారించాలో తెలీటం లేదు. ప్రతిదానికి ఫేక్ట్ చెక్ చేసుకోవలసి వస్తోంది. ఇదీ నేటి ప్రారబ్ధం.

కరోనా గురించి కంగారొద్దు, నీలివార్తలు ప్రచారం చెయ్యద్దు. వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం.