Saturday, 2 November 2019

పదుగురాడు మాట

పదుగురాడు మాట పాటియై ధర జెల్లు 
నొక్కడాడు మాట ఎక్కదెందు
నూరకుండువాని నూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ

పదిమంది మాటాడేమాట చెల్లుతుంది. ఒక్కడు మాటాడేది చెల్లదు. అలాగే ఊరుకుని ఉన్నవాడిని ఊరు మొత్తం ఏం చేయలేదు అన్నారు వేమనతాత.

పదిమందిమాటాడేది అంటే మెజారిటీ మాటాడేది,నిర్ణయించేది చెల్లుబాటవుతుంది, అదే డెమోక్రసీ అంటారు తాత. డెమోక్రసీ అంటే ఏంటో తెలియని కాలం లోనే రాబోయే డెమోక్రసీ గురించిన నిర్వచనం చెప్పినవాడు మన వేమన తాత. డెమోక్రసీ అంటే చెబుతున్న నిర్వచనం నూటికి ఏభయ్యొక్కమంది చెప్పేమాట చెల్లుబాటు కావాలి,మిగిలిన నలభతొమ్మిది మంది చెప్పేమాట మెజారిటీ వినాలి, కాని మెజారిటీ చెప్పినదాన్నే అమలు చేయాలి.  ఎవరిదోవ వారిదే అనడానికి లేదు. ఎందుకంటే ఇది మనందరిది అనుకోవాలి. ప్రభుత్వ పక్షము ప్రతి పక్షము, రెండూ   ప్రజలకు జవాబుదారీయే. ప్రతి పక్షమూ ప్రభుత్వంలో భాగమే. మందిని ఆకట్టుకోవడమే గొప్ప.  ప్రభుత్వ పక్షాన్ని ఎప్పుడు చీల్చి చెండాడాలో తెలిసినదే అసలైన ప్రతి పక్షం, లేకపోతే అది రెక్కలు తెగిన పక్షి. అసందర్భంగా నోరు పారేసుకుంటే నవ్వుల పాలే!

అలాగే, ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదని సామెత. అలాగే మన మాట సాగదని అనిపించినపుడు ఊరుకుని ఉండడమే ఉత్తమం. ఊరుకు ఉన్నవానిని ఊరంతా కలసి కూడా ఏం చేయలేదు కదా! 


వ్యక్తుల విషయంలో, లోకులు కాకులు. ఎలాగైనా అరుస్తారు,సావకాశాన్నిబట్టి, అందుచేత లోకులను పట్టీంచుకోక ఊరుకుని తనపని తాను చేసుకునేవాడిని లోకం ఏమీ చేయలేదు కదా!

పదుగుర్ని ఒక మాట మీదకి తేవడం కష్టం, విడదీయడం తేలిక,ద్వేషం రెచ్చకొట్టడం బహు సులభం. ఆశయాలు ప్రధానంగా సంస్థలు కొనసాగించండి. వ్యక్తులు ప్రధానంగా సంస్థల మనుగడ కొద్దికాలం దే. 


విడదీసి పాలించడం కొంతకాలమే సాగుతుంది, అంతకాలమూ సాగదు. దేశము, ప్రజల అభ్యున్నతి ముఖ్యాశయాలుగా సంస్థలని నడపండి. ప్రభుత్వాలు ప్రజలకోసమే ఉండాలి. ప్రభుత్వం వేరు,ప్రజలు వేరు కాదు. చేస్తున్న పనిలో పొరబాట్లు తప్పులు ఎత్తి చెప్పినపుడు తప్పులు దిద్దుకునే ప్రభుత్వాలే కొనసాగుతాయి. ప్రజలనాడికి స్పందించని ప్రభుత్వాలు కూలిపోతాయి,ఎంత గొప్ప వ్యక్తులు అధికారంలో ఉన్నా! పదుగురాడు మాట పాటియై ధరజెల్లు! అదీ తాతమాట. 

No comments:

Post a Comment