Friday, 29 November 2019

కాకినాడ జ్ఞాపకాలు




 విన్నకోటవారు కాకినాడ జ్ఞాపకాలని కదిలించారు. 

నిన్న కొన్ని జ్ఞాపకాలు కామెంట్ గా వర్మ గారి బ్లాగ్ లో వేశాను.
వర్మగారి బ్లాగ్ కబ్జా చేస్తున్నానేమో అనే భయం, అందుకు ఇక్కడ టపా ముఖ్యమైనవి చెప్పి ముగించేస్తా. ఇవన్నీ ఏభై సంవత్సరాల కితం మాట, కొన్ని మార్పులూ జరిగి ఉండచ్చు.

జగన్నాధపురంలో మునసబుగారి వీధి ప్రాంతంలో ప్రముఖ హాస్య నటుడు రేలంగి గారిల్లు.రంగూన్ మేడ వెనక పెద్ద పెద్ద పడవల తయారీ కేంద్రం. ఈ పడవలు చాలా పెద్దవి,ఓడ దగ్గరకి సరుకులు తీసుకెళ్ళేవి. ఇంత పెద్ద పడవలని కాకినాడలోనూ కలకత్తాలోనూ తయారు చేసేవారు,నాటి కాలంలో. పాతవంతెన దాటితే వార్ఫ్ రోడ్ వైపు ఒన్ టవున్ పోలిస్ స్టేషను అలా ముందుకెళిపోతే రైల్ గేట్ ముందు మైన్ రోడ్ చివర రెండవ పోలీస్ స్టేషను. మైన్ రోడ్ వెంట ముందుకొస్తే ఎడమవైపు మేడ మీద తేలుకాటుకి మంత్రం వేసి వేడి కాఫీ ఫ్రీగా ఇచ్చి పంపే ఉడిపి అయ్యరు హోటలు. పట్నాల చిట్టెయ్య సెంటర్ నుంచి ఎడమవైపు వీధిలో జైన్ దేవాలయం. వీరిదే దిల్వారా టెంపుల్ అంత ప్రాధాన్యం ఉన్న దేవాలయం మండపేట నుంచి ఆలమూరు వెళ్ళే రోడ్లో కుడి పక్క గుమ్మిలేరు గ్రామానికి ఇవతల ఉన్న జైన్ దేవాలయం. కుడి వైపు వీధిలో కూరగాయల మార్కెట్ దాన్ని ఆనుకుని ఒక చెరువు. మైన్ రోడ్లో మసీదుకు పక్కగా కొద్ది దూరంలో కోటయ్య కాజా ఇల్లు,మసీదు సెంటర్ దాటిన తరవాత సెంటర్లో ఎడమ వైపు సుధితా బుక్ స్టోర్స్, ఇంజనీరింగ్,మెడికల్ పుస్తకాలు దొరికేవి. సెంటర్లో మూల మీద నూర్జహాన్ కిళ్ళీ షాప్ జానీ.ముందు కెళితే టవున్ హాల్ సెంటర్లో టవున్ హాల్ లైబ్రరీ, ఎదురుగా ఉడిపి గణేశ్ భవన్, ఆపక్క వేదార్ధ నిధి జటావల్లభుల సూర్యనారాయణ శాస్త్రిగారిల్లు, ఆ పక్కనే కోదండరామస్వామి ఆలయం. టవున్ హాల్ సెంటర్ నుంచి ఎడమపక్క వీధిలో జడ్జి బంగళా. టవున్ హాల్ సెంటర్ నుంచి కుడి వైపు వీధిలో కాంగ్రెస్ ఆఫీస్ దాని ఎదురుగా ఐ.సి.హెచ్, కల్పనా ధియేటర్, మునిసిపల్ ఆఫీస్. జడ్జి బంగళా కి ఎదురుగా మెక్లారిన్ హైస్కూల్. ముందుకెళితే ఆక్సిడెంట్ స్పాట్, పక్కనే పిండాల చెరువు, దాని వెనక రాజ రాజేశ్వరి ఆలయం. బాలాజీ చెరువు, దీన్ని మూసేసి టి.టి.డి కల్యాణమంటపం, దగ్గరలోనే తాలూకా ఆఫీస్.. కోర్ట్ కాంప్లెక్స్ పక్క పాత బస్ స్టాండ్. కలక్టర్ ఆఫీస్ పక్క లేడిస్ క్లబ్బు. (లాకులు)బ్రిడ్జ్ దాటితే చీడిగ పోస్టాఫీస్ పక్క శివ పురాణాన్ని తెనుగు చేసిన మా మిత్రులు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ మూర్తిగారిల్లు.

వాకలపూడి లైట్ హవుజ్.
సర్పవరం,పండూరు మామిడితాండ్ర
చిత్రాడ మొక్కలు,పువ్వులు,అంట్లు,తాటి తాండ్ర, తేగలు
కుళాయి చెరువు దగ్గర జరిగే సంవత్సరపు ఫల పుష్ప ప్రదర్శన
ఊరుకి దూరంగా నీటిపై విహారానికి బోగందాని చెరువు 

ఇలా ఎన్నెన్నో! ఆపేస్తా, దీనికి అంతు కనపట్టం లేదు.. :)

No comments:

Post a Comment