Thursday 24 October 2019

వెల్లుల్లిం, దిలపిష్టమున్

కుల్లాయించితి, గోకజుట్టితి, మహాకూర్పాసముందొడ్గితిన్
వెల్లుల్లిం, దిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్తవడ్డింపగాఁ
జల్లాయంబలిద్రావితిన్, రుచుల్ దోసంబంచు బోనాడితిన్
దల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా నేను శ్రీనాథుడన్


కుళ్ళాయి లేదా కుల్లాయి అంటే తలపాగా, తెలుగు కన్నడనాట తలపాగా చుట్టడం అలవాటుండేది. అందునా ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే జిల్లాలలో. ఇదై చాలా పొడుగ్గా ఉండేదట, ఎందుకంటే ఎండలో ప్రయాణం చేసేటపుడు తలకు రక్షణ అదేగాక మంచినీటి వసతి తక్కువగా ఉన్నచోట దిగుడు బావులే గతి, వాటిలో కూడా నీరు చాలా లోతుగానూ ఉండేది. గొంతు తడుపుకోడానికి ఈ తలపాగాను ఉపయోగించుకునేవారు. శ్రీనాథుడు బయలుదేరితే మంది మార్బలం పల్లకీలు ఏనుగులు ఇలా సపరివారంగా బయలుదేరేవాడు ఒంటిగా సామాన్యునిలా తలపాగా చుట్టుకుని కాలి నడకన సంచారం చేశారన్నదానికిది సూచిక. నాటి సామాన్యులంతా ఈ తలపాగాలు ధరించేవారనమాట. 

కోక జుట్టితి, కోక అంటే నేడు స్త్రీలు కట్టుకునే వస్త్రమనే అర్ధం నిశ్చితమైనది తప్ప, నాడు కోక అంటే స్త్రీ పురుషులిద్దరు కట్టుకునే దానిని కోక అనే అనేవారు. శ్రీనాథుడు పట్టు పీతాంబరాలు కట్టుని పైన మరొక పీతాంబరం వేసుకునే అలవాటున్నవాడు, సామాన్యులు కట్టుకునే పంచ కట్టుకున్నానని చెబుతున్నమాట. 


కూర్పాసం అంటే పొట్టి చొక్కా!కటివలయం దాకా ఉండేది. మహా కూర్పాసం అంటే పెద్ద చొక్కా. ఆ చొక్కా ఎలా ఉండేది? చేతులు లేని జుబ్బా లాగా పొడుగ్గా పక్క జేబులతో మోకాళ్ళు దిగేదాకా ఉండేదే మహా కూర్పాసం. పల్లెలలో సామాన్యులు దీన్నే తొడిగేవారన్నది సూచన. 


ఇక్కడికి ఆయన ఆహార్యం చీని చీనాంబరాలు, పట్టు వస్త్రాలనుంచి ఎంత సామాన్య స్థితికి దిగజారిపోయిందో చెప్పారు.


ఇక ఆహారం గురించి చెబుతున్నారు. ఒకప్పుడు బంగారు పళ్ళెంలో రాజనాలు, మొలగొలుకులు 
లాటి మేలి వరి అన్నం, షడ్రుచులతో భోజనం చేసినవాడు, ఇప్పుడేలా ఉన్నది చెబుతున్నారు. 


తిలపిష్టం అంటే తెలగపిండి. నేటికి తెలగపిండి కూర అంటే నీచంగానే చూస్తారు. ఈ తెలగపిండి కూరలో వెల్లుల్లి వేయడం సామాన్యులకు అలవాటూ. మరి శ్రీనాథుడు ఆహితాగ్ని, వెల్లుల్లి తినడం నిషేధం, కాని వెల్లుల్లి వేసిన తెలగపిండి కూర తిన్నాను అన్నారు. అది కూడా ఎంత హీనస్థితిలో, ఆచారం ఐతే విశ్వస్త వంట చేసిన,వడ్డించినా ఆహితగ్నులకు పనికిరాదు. మరి శ్రీనాథుడు కడుపు కాలిపోతుంటే వెల్లుల్లివేసిన తెలగపిండి కూర తిన్నానన్నారు. విశ్వస్త అంటే విధవ, సకేశి అనగా కేశములుంచుకున్న విధవ.   ఆహితాగ్ని ఐన శ్రీనాథునికి ఈమె వడ్డిస్తే తినడం నిషిద్ధం. చల్లాయంబలి ద్రావితిన్, ఆయన జన్మలో ఎప్పుడూ చల్లగాని అంబలికాని తాగలేదు అప్పటి వరకూ, పెరుగు మాత్రమే ఎరిగినవాడు, అది లేదు సరికదా చల్ల తాగేనన్నారు, అది కూడా దొరక్కపోతే అంబలి తాగేనన్నారు. కడుపులో కాలుతుంటే, దోషమని తెలిసినా రుచులు, ఆచారాలు వదిలేశానన్నారు. 


 తల్లీ కన్నడ రాజ్యలక్ష్మీ, దయ చూపవా,  నేను శ్రీనాథుడిని సుమా,  అన్నారు. 

No comments:

Post a Comment