Tuesday 22 October 2019

ఆ చూపులకర్ధమేంటి?






కదలబోతున్న లిఫ్ట్ లోకి ఒక యువకుడు దూసుకొచ్చాడు. లిఫ్ట్ నా తాహతు కు మించిన బరువు మోయలేనని, కదల్లేనని మొరపెడుతూ ఒకళ్ళని దిగమని అరుస్తోంది.. చూసిన యువకుడు నాకేం సంబంధం లేదన్నట్టుగా,  నేను అదనపు బరువు కాదు, బయటికిపోనన్నదానికి సూచనగా  మొరాయిస్తూ తలవిదిలించి,తలొంచుకుని ఫోన్ లో ములిగిపోయాడు. అప్పటికే లిఫ్ట్ లో ఉన్నవారు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు, చివరగా దూసుకొచ్చిన యువకుని కేసీ చూశారు. సమయం మించిపోతోందని వాచీలు చూసుకున్నారు, ఎవరు లిఫ్ట్ నుంచి బయటకు నడవలేదు. లిఫ్ట్ అరవడం మానలేదు, కదల లేదు. ఇంతలో ఒకమ్మాయి నెమ్మదిగా, వెనుకనుంచి దారి చేసుకుని బయటికొచ్చింది,నడవడానికి ఇబ్బంది పడుతూ ఊతకర్రల సాయంతో. లిఫ్ట్ లో అందరూ ఆమెను చూశారు, యువకుడూ చూశాడు. అప్పుడూ అతనిలో మార్పురాలేదు. మిగతావారు మాటాడ లేదు. అమ్మాయి లిఫ్ట్ నుంచి బయటకు వెళ్ళి వెనుతిరిగి చూచింది, విరిసీ విరియని పెదవులపై చిరునవ్వో, మౌన నిరసనో తెలియనట్టు. ఇంతకీ, ఈ సంఘటనలోనివారి, ఆ నడవలేని ఆయువతి చూపులకర్ధమేంటీ?


యువకుడు:- నేను పైకి వెళ్ళాలి, నా అవసరం తీరాలి, లిఫ్ట్ కదలకపోడానికి నాది కాదు పొరబాటు,వ్యవస్థ తప్పు.  ఒకళ్ళు దిగిపొండి. నడవలేక ఊతకర్రల సాయంతో నడచే యువతి దిగినపుడు " అది ఆమె ఇష్టం, నాకేం సంబంధం" అనే తిరస్కార భావం. 


లిఫ్ట్ లో ఉన్నవారు:- కదలబోతున్న లిఫ్ట్ లోకి యువకుడు దూసుకురావడంతోనే బరువు ఎక్కువై లిఫ్ట్ కదలనంటోంది, దాని ఓపికకంటే ఎక్కువ బరువు కావడం చేత. ఎవరు దిగాలి? చూపులలోప్రశ్న  . చివరికి దూసుకొచ్చిన యువకుని మూలంగానే బరువు ఎక్కువైంది కనక, అతనే దిగాలని ఏకాభిప్రాయం, కాని ఒక్కరి నోటి వెంట వెలువడని నిర్ణయం. యువకుని నిర్లక్ష్యం. అతనిని బయటికి  పంపలేని అసహాయత. చివరికి కాళ్ళు గట్టిగా లేక చంకకర్రలతో నడిచే యువతి దిగినప్పుడైనా నోరు విప్పలేని అసహాయత, అన్యాయం జరుగుతున్నా,  అన్యాయం జరుగుతోందని తెలుస్తున్నా మాటాడలేని, తప్పు సరి దిద్దలేని పెద్దలు.


యువతి చూపులకర్ధమేంటీ:- విరిసీ విరియని పెదవులపై అది చిరునవ్వా? లేక సమాజం మీద ఎక్కుపెట్టిన నిరసనా? నిర్ణయంగా చెప్పలేను.

అది చిరునవ్వయితే......
చిరునవ్వు:- యువకుడిని ఉద్దేసించి, ''అన్నా కాళ్ళు బలంగా లేకున్నా, ఊతకర్రల్తో నడిచే శక్తి ఇచ్చిన భగవంతునికి ప్రణామం. నేడు మెట్లు ఎక్కి ఐనా ఆఫీస్ కు చేరగలనన్న నమ్మకం నాకుంది, నేను జీవన గమ్యం చేరడానికి ఆలస్యం కావచ్చేమోగాని, కచ్చితంగా మాత్రం గమ్యం చేరతాననే ధైర్యం ఉన్నది. నీవు జీవన గమ్యం చేరడానికి,  తొందరగా చేరాలనే ఆతృతలో తప్పులు చేసి అసలు గమ్యమే చేరలేవేమో చూసుకో! భగవంతుడు నాకు గట్టి కాళ్ళివ్వకపోయినా సంఘం పట్ల నా గట్టి నిర్ణయాన్ని అమలు చేసే తెలివి, సంస్కారం,ఆలోచన ప్రసాదించాడు, నీకది శూన్యమేమో తెలుసుకో! ''అన్నా! నీ శరీర అవయవాలన్నీ బాగున్నా, నీ మనసులోని అవిటితనానికి నా సానుభూతి.

అది నిరసనైతే....
నిరసన... ఒక  పాపం జరిగినపుడు దాని పాప  ఫలితం  ముగ్గురు పంచుకుంటారు, వారు, కర్త,కారయిత,అనుమోదకులు. కర్త, పాపం చేసేవాడు. కారయిత,  పాపం చేయించేవాడు. అనుమోదకుడు,   పాపం ను బాగుందని ప్రోత్సహించేవాడు. ఇందులో మీరెవరు? మీరు నోరు విప్పనంతకాలం, సమాజం ఇలాగే లిఫ్ట్ లాగే కదలదు.  అన్యాయం మీదాకా వచ్చినపుడు మాత్రమే మీకు నొప్పి కలుగుతుంది, అప్పుడు బాధపడి లాభం ఉండదు, చేతులుకాలిన తరవాత ఆకులు ప ట్టుకున్నట్టవుతుంది. ధర్మో రక్షతి రక్షితః ..నేడు లిఫ్ట్ కదలడానికి, నేను అదనపు బరువు కాకపోయినప్పటికీ, స్వయంగా నేనే అదనపు బరువుగా భావించుకుని తొలగిపోయాను, మీ అందరూ పైకి వెళ్ళడానికి సహకరించాను. సమాజం కూడా కదలలేని లిఫ్ట్ లాగానే ఉంది. అదనపు బరువైనవారి కోసం ఎవరో ఒకరు త్యాగాలు చేస్తూనే ఉన్నారు, ఇక ముందు సాగదేమో, హెచ్చరిక, తస్మాత్ జాగ్రత! 


కొసమాట:- లిఫ్ట్ అరుపులు తప్పించి, మాట లేని చిన్న టెలిఫిల్మ్ లో దర్శకుడు అన్నీ తానే ఐ కనిపించాడు విశ్వరూపంతో. గొప్ప భావాలను చూపులతోనే తెలుపగలిగిన దర్శకునికి జే జేలు. నటీ నటులంతా పాత్రలలో జీవించారంటే అతిశయోక్తి కాదు, దర్శకుని భావాలను కళ్ళతోనే పలికించారు. యువకుడు నటనలో జీవించాడు, పాత్రలో. యువతి విరిసీ విరియని పెదవులలో చిరునవ్వో, మౌన నిరసనో, తెలిసీ తెలియనట్లు భావాన్ని ప్రదర్శించి లఘు చిత్రానికి కొలికి పూసైయిందంటే,ఆశ్చర్యం లేదు.

వాట్సాప్ లో కనిపించిన ఈ చిత్రం పాతదే కావచ్చు, నా దృష్టిని ఆకర్షించింది.  
I feel it is an old, short  telefilm. OLD IS GOLD. Enjoy!!!

No comments:

Post a Comment