మానసిక రోగులు.
ఇదెప్పటి మాటా? ఏభై సంవత్సరాల పైబడినది. ఒక రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాకా కాఫీ ఇచ్చి కబుర్లు చెబుతూ ఓ కార్డ్ చేతిలో పెట్టింది, ఇల్లాలు.ఏంటన్నట్టు చూసా. మీరే చూడండన్న మాటగా చూసింది. ఈలోగా అమ్మ కలగజేసుకుని ఇటువంటి ఉత్తరాలు వస్తూనే ఉంటాయి, అనేసి వెళిపోయింది.
అసలింతకీ ఉత్తరంలో సంగతేమంటే ”ఓం నమో వేంకటేశాయ” అని పాతిక సార్లు రాసి పదిమందికి పంపండి మీ కష్టాలు తొలగిపోతాయి, అదీ సారాంశం. నిజమే పీకలోతు కష్టంలో ఉన్నాం, అప్పటికి. పెద్దమ్మాయికి వినపడదు, మాటలు రాలేదు, ఏం చేయాలి? నీటిలో ములిగిపోతున్నవాడు గడ్డిపరక దొరికినా ఆసరా చేసుకోడానికి ప్రయత్నించినట్టు, ఎవరేది చెబితే అది చేస్తున్న కాలం.
నాకైతే ఇలాటి వాటిని నమ్మేవాడిని కాదుగాని, ఇల్లాలేమంటుందోనని చిన్న భయం. ఆవిడేమో చెళ్ళపిళ్ళవారికి ముద్దుల ఆడపడుచు, మరో పక్క దువ్వూరి సుబ్బమ్మగారికి (స్వాతంత్ర్య సమరయోధురాలు) అనుంగు శిష్యురాలు. ఈ దువ్వూరి సుబ్బమ్మ అనేపేరు చాలామందికి ఉన్నదికాని అసలు సుబ్బమ్మగారిది కడియం, ఇల్లాలు ఆవిడకి అనుంగు శిష్యురాలు, అదనమాట సంగతి.
ఏంటన్నట్టు చూశా,మళ్ళీ. ఇలా కార్డులు రాసేస్తే కష్టాలు తొలగిపోతుంటే, ఇంకా లోకంలో చాలామందికి కష్టాలెందుకున్నాయంటారు? ప్రశ్నించింది. ఏం చెప్పాలో తోచలేదు. కార్డ్ పట్టుకు వెళిపోతుంటే ఆపేను, రేపు పొద్దుటే నీళ్ళపొయ్యి అంటించుకోడానికి ఏమీ లేదే అని చూస్తున్నా అంటూ కార్డ్ పట్టుకుని వెళ్ళిపోయింది. తన భావమేంటో అర్ధమయి ఊరుకున్నా!
కాలం గడుస్తుండగా ఇటువంటివే కొన్ని భయపెడుతూనూ, కొన్ని మభ్యపెడుతూ, మరికొన్ని ప్రలోభపెడుతూ రకరకాల ఉత్తరాలొస్తుండేవి. అలవాటయిపోయాయి కూడా. కాలం మారింది ఉత్తరాలు రాసే అలవాటేమో వెనకబట్టింది, కాని మనుషుల్లోని అవకరం మాత్రం వెనకబట్టలేదు. ఆ తరవాత కాలంలో మెయిళ్ళొచ్చాయి. ఈ మెయిల్ పాతిక మందికి ఫారావార్డ్ చేయండి, పార్వార్డ్ చేయండి గంటలో శుభవార్త వింటారు, ఇలా రకరకాలే..మెయిళ్ళూ వెనకబట్టేయి, ఇప్పుడు మరీ తేలికైపోయింది, వాట్సాప్ లో. కింద మెసేజి చూడండి.
వీరు ఇటువంటివి ప్రచారం చెయ్యడమే కాక పుకార్లు పుట్టించడంలో ప్రచారం చేయడం లో సిద్ధ హస్తులు కూడా. ఈ మధ్య కాలంలో వీరికి కొంత సొమ్ముకూడా గిట్టుబాటవుతున్నట్టే వుంది
టెక్నాలజీతో అవకరం కూడా పెరిగిందిగాని తరగలేదు. ఇటువంటి మానసిక రోగులై తే పెరుగుతూనే ఉన్నారు.
వీరు మానసికరోగులు మరో మానసిక రోగిని తయారు చెయ్యాలనే తాపత్రయంలో ఉన్నారంతే