అశుద్ధం మీద రాయేస్తే
నోరు మంచిదైతే ఊరు మంచిదే.
అశుద్ధం మీద రాయేస్తే ముఖాన చిందుతుంది.
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు.
చెబితే తప్పు చెప్పకపోతే ముప్పు.
అశుద్ధం మీద రాయేస్తే
నోరు మంచిదైతే ఊరు మంచిదే.
అశుద్ధం మీద రాయేస్తే ముఖాన చిందుతుంది.
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు.
చెబితే తప్పు చెప్పకపోతే ముప్పు.
అనానిమస్సు
అనానిమస్సులు ఒక్క సోషల్ మీడియానే కాదు,రాజకీయరంగాన్ని కూడా పట్టికుదుపుతున్నారు. ఎలక్టరల్ బాండ్లు కొని, అనానిమస్సుగా రాజకీయపక్షాలకి డొనేషన్ ఇవ్వచ్చని, ప్రభుత్వం ఎలక్ట్రల్ బాండ్ల పథకం తెచ్చింది. 2017-22 దాకా మొత్తం పదహారు వేలకోట్లు రూపాయల
బాండ్లు అమ్మితే అందులో పదివేల కోట్లు బి.జె.పి కి పదహారు వందలకోట్లు కాంగ్రెస్ కి, మిగిలినది మిగిలిన పార్టీలకి చేరిందిట. ఈ బాండ్లు కేష్ చేసుకోలేదు, వాటిని కోర్ట్ ఆపింది. రాకీయపక్షాలకిచ్చే డొనేషన్లన్నీ ఆనానిమస్సులనుంచే అందుతున్నాయి,ఏ కొద్ది మొత్తమో ఇతరులనుంచొస్తున్నాయేమో! ఈ డొనేషన్లిచ్చేవారెవరో తెలియాల్సిన అవసరముందని ఒక పి.ఐ.ఎల్ వేస్తే, సుప్రీం కోర్టు అనానిమస్సుల ముసుగు తొలగించి వారెవరో చెప్పాల్సిందే, అని రూలింగ్ ఇచ్చింది, ఎలక్టరల్ బాండ్లు చెల్లవంది. బాండ్ల సొమ్ము కొన్నవారికి తిరిగిచ్చేయాలంది. ఏది అమలు జరుగుతుందో చూడాలి, రాజకీయ పక్షాలకి అనానిమస్సుగా సొమ్మిద్దామనుకునేవాడు తన స్వంతపేరున బాండ్లు కొంటాడా? అనుమానమే! ఎంతమంది అనానిమస్సులు సొమ్ము వెనక్కి తీసుకుంటారో చూడాలి.
సోషల్ మీడియాలో అనానిమస్సులు కామెంట్లు వెనక్కి తీసుకోలేనట్టు, వీళ్ళూ సొమ్ము వెనక్కి తీసుకోలేకపోవచ్చు.
ప్రతిపక్ష రాజకీయులు సుప్రీం కోర్ట్ అలా అన్నతరవాత అవును వారెవరో తెలియాల్సిందే అంటున్నాయి. బి.జె.పి కి సొమ్ము రాకుండా పోయిందని చంకలు గుద్దుకుంటే ప్రతిపక్ష రాజకీయులవారికొచ్చే సొమ్ము కూడా పోయింది.
అనానిమస్సూ ఏమైనా నువ్వు గొప్పవాడివోయ్! నీతో ఏదైనా సాధ్యమే సుమా!! అన్నాడు మా గిరీశం.
కొసమెరుపు:- శ్రీ కపిల్ సిబాల్ గారు చేపట్టిన ప్రతి కేసు ఓడిపోవడమే జరుగుతోంది, ఈ కేసు నెగ్గేరు, జన్మకో శివరాత్రన్నట్టు.
అప్పుడే రెండు రోజులనుంచి సూరీడు చురుక్కుమంటున్నాడు, రాత్రి చలి పగలు 37/38 c degrees వేడి. సూరీడు అనానిమస్సు కాదే!!!
కాళ్ళగజ్జి కంకాళమ్మ
కాళ్ళగజ్జి కంకాళమ్మ
వేగు చుక్క వెలగ మొగ్గ
మొగ్గకాదు మోదుగ నీరు
నీరుకాదు నిమ్మలవాయ
వాయకాదు వావింటి కూర
కూరకాదు కుంకుమ బొట్టు
కాలుతీసి కడగ బెట్టు.
ఇది చిన్న పిల్లల పాటగా ప్రసిద్ధిలో ఉంది, కాని దీనిలో ఒక వ్యాధికి నివారణోపాయాలున్నాయని అంటారు. నిజమెంతో తెలియదు. తెలిస్తే చెప్పండి. ఈ పాట చాలా రూపాల్లో కనపడుతోంది.
నాకు తెలిసి మొండి గజ్జి అనగా మాదకి ఒక మందు అని అనుకుంటున్నా! ఇందులో కంకాళం అనేది మానవ పుఱ్ఱె. శ్మశానంనుంచి మానవ పుఱ్ఱెను తెచ్చి మరల కాల్చితే తెల్లని భస్మం తయారవుతుంది. ఇది మందు,మొండి గజ్జిలాటి చప్పి,మాదలకి మందు. ఈ భస్మాన్ని ఆముదంలో కలిపి రాయాలంటారు. ఒకప్పుడు ఇది వాడుకలో ఉండేదని చెప్పగా విన్న గుర్తు.
ఇక ఇందులో చెప్పిన కూరలపేర్లు వెలగమొగ్గ తెల్లగా ఉంటుంది. వేగు చుక్కంటే మార్నింగ్ స్టార్ గా చెప్పబడే శుక్రుడు.మోదుగ చెట్టు తెలిసినదే! నిమ్మలవాయ అన్నది ఒక ఆకు కావచ్చా అని అనుమానం లేదా నిమ్మకాయకావచ్చా? వావింటి కూర అనేది ఆవాలజాతిలో వామింటి అనే కూర ఉన్నది. కుంకుమ పసుపుతో తయారైనది కూడా మందే. ఈ పాట చెప్పినవారేం చెప్పదలుచుకున్నారు. కాలంలో ప్రజలనోట మాటల్లో మార్పులేమైనా వచ్చి ఉండచ్చు కూడా!!!
ఎలక్ట్రల్ బాండ్లు -- కొబ్బరిచెట్టుకు మడిబట్ట కట్టినట్టు...
కొబ్బరిచెట్టుకు మడిబట్ట కట్టినంతలో కొబ్బరికాయల దొంగతనం ఆగుతుందా? అంటుంటారు మా జిల్లాలలో.
అనగనగా ఒక పేద బ్రాహ్మడికి పెరట్లో నాలుగు కొబ్బరిచెట్లున్నాయి. చెట్టు గెలవేసి కాయ దింపుకొచ్చే సమయానికి ఎవరో దొంగ, కాయలు చడీ,చప్పుడూ కాకుండా దింపుకుపోతున్నాడు. దొంగని పట్టుకోడానికి,కాయలు దొంగతనం జరగకుండా ఉండడానికి, ఎన్నో ప్రయత్నాలు చేస్తూవచ్చాడు, కాని దొంగతనం ఆగటం లేదు. ఈ సంగతివిని మరొకరు, కొబ్బరి చెట్లకి మడిబట్ట కట్టు, ఎలా కాయలెత్తుకెళతాడో చూద్దామని, పేదవాడిని ఎగసనతోసాడు. నిజమేననుకుని పేదవాడు మడిబట్టలు కట్టేడు, నాలుగు చెట్లకీ. దొంగ మామూలుగానే చెట్లకాయలూ, చెట్లకి కట్టిన మడిబట్టలూ కూడా ఎత్తుకుపోయాడు. మర్నాడు ఉదయం కాయలు,బట్టలూ కూడా పోవడం చూసి పేదవాడు గొల్లుమన్నాడు. అన్నవస్త్రాలకోసం పోతే ఉన్నవస్త్రాలు పోయినట్టు బట్టలుకూడా పోయినందుకు ఏడ్చేడు.
మన సుప్రీం కోర్ట్ వారు ఎలక్ట్రల్ బాండ్లు చెల్లవని తీర్పిచ్చారు. భేష్! మన దేశంలో ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టడం కొత్తకాదు. స్వతంత్రం వచ్చింది మొదలు అన్ని పార్టీలు డబ్బు కర్చుపెడుతూనే ఉన్నాయి. అన్ని దేశాల్లోనూ ఎలక్షన్లకి సొమ్ములు కర్చుచేయడం కొత్తకాదు. ఈ చట్టం చెల్లకపోతే, మరో చట్టం రావచ్చు. లేదా మరో పద్ధతిలో రాజకీయపార్టీలు సొమ్ములు వసూలు చేసుకుంటాయిగాని మానవు. చిత్రమేమంటే ఎలక్టరల్ బాండ్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన పార్టీ కనపడ్డ దాఖలాలు ఉన్నట్టు లేదు. చాలా తేలిక విధానం, క్రౌడ్ ఫండింగ్, చాలా తేలిక. ఎంతమందిచ్చారు? తెలీదు. ఎవరిచ్చారు? తెలీదు. ఎంతిచ్చారు? తెలీదు.ఎక్కడిచ్చారు? తెలీదు. ఎవరు చెప్పలేరు. ఏ బహిరంగ సభలో ఎంతిచ్చారు? చెప్పలేరు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు.
విరాళాల విషయంలో మాత్రం రాజకీయ పార్టీలు నువ్వంటే నువ్వనుకోవు,అదీ చిత్రం. అన్నీ ఆ తానులో ముక్కలే! ప్రపంచంలో రాజకీయపార్టీలకి, ప్రజలు,కార్పొరేట్లు సొమ్ములెందుకిస్తాయి? వాళ్ళు అధికారంలో కొస్తే తమకి లాభం చేకూరుస్తారనేగా!డబ్బుతో సంబంధంలేని ఎన్నికలొస్తాయా? సాధ్యమా? డబ్బున్నవాళ్ళు గాని, డబ్బున్నవాళ్ళు వెనకున్నవాళ్ళుగాని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, నెగ్గుతున్నారు. డబ్బులేనివాళ్ళంతా డబ్బున్నవాళ్ళని పాలకులుగా ఎన్నుకుంటున్నారు, అదికదా చిత్రం. ఇదింతే
భాస్కర జయంతి (రథసప్తమి)
నమస్సవిత్రే జగదేకచక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే
జగత్తుకి కన్ను,సృష్టి, స్థితి, లయ లకు కారణము, సర్వము త్రిగుణాత్మకమైన,బ్రహ్మ,విష్ణు,మహేశ్వర రూపమైన భాస్కరునికి నమస్కారము.
భారతదేశంలో సూర్యోపాసన అనాదిగా ఉన్నదే!సనాతన ధర్మంలో సూర్యోపాసన ప్రముఖమైనదే. భాస్కరుణ్ణి ప్రత్యక్షనారాయణుడిగా (ప్రత్యక్ష దైవం) ఆరాధిస్తారు. మాఘశుక్ల సప్తమి రోజు కృత్తికా నక్షత్రంలో సూర్యజననం అంటారు. ఉదయమే తలకు కొద్దిగా నూనెపెట్టుకుని జిల్లేడాకు మీద ఒక రేగుపండు ఉంచుకుని తలపై ఉంచుకుని శిరఃస్నానం చేయడం ఆచారం. సూర్యునికి పరమాన్నం ప్రీతికరమైనది. గోమయంతో చేసిన పిడకలపై ఆవుపాలతో కొత్తబెల్లంతో బియ్యపు పరమాన్నం సూర్యుని వెలుగులో వండి భాస్కరునికి నైవేద్యం చేసి ప్రసాదంగా తీసుకోవడం ఆచారం. ఇలా తయారు చేసిన పరమాన్నం నిజంగానే అమృతం లా ఉంటుంది.
పలుకులతల్లి పండగ
మాఘ శుద్ధ పంచమి
సరస్వతీ నమఃస్తుభ్యం
వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి
సిద్ధిర్భవతు మే సదా
అమ్మా! కామరూపాల్లో ఉండగల సరస్వతీదేవికి నమస్కారం. నన్ను కటాక్షించు. విద్యను పారంభిస్తున్నాను,ఎల్లప్పుడూ సిద్ధించు.
ఇది నిత్యమూ చెప్పుకోవలసినమాట. అమ్మ ఎప్పుడూ సిద్ధించాలి,కరుణించాలి,కటాక్షించాలి,కాపుకాయాలి.
అమ్మ భండపుత్ర వధోద్యుక్త,భండసైన్య వధోద్యుక్త, బద్ధకాన్ని చంపేతల్లి.
,సర్వజ్ఞ,వాగ్వాదిని,సద్యఃప్రసాదిని,విద్యావిద్యా స్వరూపిణి,ఇఛ్ఛా శక్తి,జ్ఞానశక్తి,క్రియాశక్తి స్వరూపిణి,సరస్వతి అలాటి తల్లికి నమస్కారం, అనేక రూపాల్లో ఉండగలతల్లి. నాకెప్పుడూ సర్వకాలసర్వాస్థలలోనూ సిద్ధించు, నాకింతకంటే మాటలు రావటం లేదు,నీవు నేర్పినపలుకులే పలుకుతున్నా!తప్పులున్న మన్నించు. తల్లీ! నీకు నమస్కారం.
రాజకీయం- ధీరత్వముచితజ్ఞతా
మా సత్తిబాబు, సుబ్బరాజు వచ్చారో సాయంత్రం. 'అమ్మా! కాఫీ' అనరిచేలోగానే కాఫీ తెచ్చేసింది కోడలమ్మాయి. 'అమ్మా! చిన్నదానివి ఎక్కువగా పొగడకూడదు గాని ఒక మాట చెబుతా!
దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వ ముచితజ్ఞతా
అభ్యాసేన న లభతే చత్వార సహజా గుణాః
దాతృత్వం,ధీరత్వం,సమయానికి తగినట్టుమాటాడటం,ప్రియంగా మాటాడటం అన్నవి నేర్చుకుంటే రావు పుట్టుకతో రావాలంటారు ఆచార్య చణకులు. ఇవి నీలో పుష్కలంగా ఉన్నాయి. జీవితంలో అభివృద్ధిలోకొస్తావు, దీర్ఘసుమంగళీభవ' అన్నాడు. దానికి సుబ్బరాజు 'మీ అమ్మాయిగా పొగుడుకో ఎవరూ కాదనరులే!' అన్నాడు. దానికి సత్తిబాబు 'నీదంతా యతికుతం' అని నవ్వేసేడు. మాటలు చివరికి రాజకీయం దగ్గరాగాయి.
''ఏంటో! మమతమ్మ కాంగ్రెస్ కి దేశం మొత్తం మీద నలభై సీట్లు కూడా రావంటదే! ఏటీ చోద్యం'' అడిగాడు, సుబ్బరాజు. సత్తిబాబు మాటాడలేదు,నేనూ మాటాడలేదు. సుబ్బరాజే ఒక మెట్టు దిగి 'సత్తిబాబు!, ఇదేంటో చెప్పవా?' అడిగాడు. 'సరిలే చెబుతా, చెప్పేకా ఇల్లా అన్నావు అల్లా అన్నావు అని కోపగించుకోకు,నా మాట నేను చెబుతాను, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. వద్దన్నవారు లేరంటే,' 'చెప్పు సత్తిబాబూ అన్నా!' మరీ అన్యాయంగా ఊరుకుంటే సుబ్బరాజు చిన్నబుచ్చుకుంటాడని.సత్తిబాబు మొదలెట్టేడిలా..
ఎవరేమన్నా,అనుకున్నా కాంగ్రెస్ రాజకీయాలు రాహుల్ బాబు మాట మీద నడుస్తున్నాయన్నది సత్యం. భారత్ జోడో యాత్ర చెయ్యాలనుకున్నాడు రాహుల్ బాబు. మొదలయింది, చెప్పుకుంటే చాలా ఉందిగాని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు,బి.జె.పి పాలిత రాష్ట్రాలగుండా యాత్ర నడచి శ్రీనగర్ చేరింది, తల్లీ బిడ్డా న్యాయంగా విమర్శలు ప్రతి విమర్శలతో. ఫలితంగా ఆ తరవాత జరిగిన ఎన్నికల్లో రాజస్తాన్,చత్తీస్ గడ్ లలో అధికారం పోగొట్టుకుని, తెలంగాణాలో నెగ్గి, చావుతప్పి కన్నులొట్టబోయినట్టు పరువు కాస్త దక్కించుకున్నాడు. దక్షణాది నుంచి ఉత్తరాదికి నడచిన ఊపుతో తూర్పునుంచి పడమరకి నడిచెయ్యాలనుకున్నాడు. ఈ లోగా పరువునష్టం కేసు, చాలా గందరగోళం తరవాత పదవి నిలబెట్టుకున్నాడు. ఆ తరవాత రాబోయే ఎన్నికల గురించి దేశం మొత్తం మీద ప్రతిపక్షాలని ఏకం చెయ్యాలని INDI అలయన్స్ చేసి,సీట్లు పంచుకోవాలనుకున్నారు, ఎవరెక్కడ పోటీ చేయాలో తేల్చుకోవాలనుకున్నారు.. ఇంత దాకా బాగానే జరిగింది. ఎవరికితోచిందో మరి రాహుల్ బాబా తూర్పునుంచి పడమటి నడక ఎన్నికలు రెండు నెలలుండగా మొదలెట్టేడు, అదిన్నీ మణిపూర్ నుంచి, అక్కడ జరిగిన గొడవల్ని ఆధారంగా చేసుకుని గద్దెనెక్కెయ్యాలని. తప్పు కాదనుకో!
నడకమొదలయింది. అసోం చేరేతలికి విమర్శలు ప్రతి విమర్శలు సరే!, కుర్రగాళ్ళు మోడీ! మోడీ!! అనరచినారని కోపగిస్తే ఎట్టా? ఈ లోగా అయోధ్యలో ప్రాణప్రతిష్టకి పిలుపొచ్చింది. రామని చెప్పేసేరు. కుక్కజట్టీలకి సమయమా చెప్పు! దేశమంతా రాముని చుట్టూ తిరుగుతోంది, రాహుల్ బాబు కాదన్నాడు. ఆయనిష్టమనుకో! బెంగాల్ దగ్గరకొచ్చేటప్పటికి మమతమ్మ పర్మిషన్లు ఇవ్వలేదు,నడకకీ,మీటింగులకీ. నా ఇలాకాలో నడుస్తూ నాకు చెప్పాలనే ఇంగితజ్ఞానంలేదా? అడిగింది మమతమ్మ. అక్కడ పర్మిసన్ల కోసం రెండు రోజులు ఖాళీగా కూచుని సమయం వృధా చేసేడు. ఇది ఖాళీగా కూచునీ సమయమా? చెప్పు! మరురోజు నీకు రెండు సీట్లిస్తా అన్నది. ఇండీఅలయన్స్ లో ఉన్నోళ్ళంతా సీట్లు మాటడుకుందామంటే పలకలేదు. ఆ మర్నాడు మార్క్సిస్టుల్ని వదిలేసిరా! సీట్లు మాటాడుకుందామంది. పలుకు లేదు.ఆ తర్వాత రోజు నీకొక్క సీటూ ఇవ్వను అనిజెప్పేసింది. ఈలోగా బీహార్ లో నితీష్ INDI అలయన్స్ లో సీట్ల గురించి కాంగ్రెస్ మాటాడదు, నేను బయటికి పోతన్నా, అని పోయి బి.జి.పి తో చేరేడు. సీట్ల గురించి మాటాడకపోడంతో అఖిలేష్ నీకు11 సీట్లిస్తా,పోటీ చెయ్యి అని తనపని తను చేసుకోడం మొదలెట్టేడు. ముందుకెల్తే కేజ్రీవాల్ డిల్లీ పంజాబుల్లో తనపని చేసుకుంటావున్నాడు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కుడి భుజం మురళీ దేవరా పార్టీ వదిలేసిపోయాడు,కాంగ్రెస్లో పట్టించుకునేవారు లేరంటూ. ఇదంతా చూసిన మమతమ్మ నీకు దేశం మొత్తం మీద నలభై సీట్లు కూడా రావని దీవించింది. కాంగ్రెస్ నుంచి జనాలు బయటికిపోతన్నారు ఏమని? అడిగాడొక విలేకరి. నితీష్,దేవరా ఇలా ఎంతమంది బయటికిపోయినా లెక్క చేసేది లేదన్నట్టు చెప్పడం అందంగా ఉందా? , ఈ సమయంలో అలామాటాడటం మనుషుల్ని కూడదీసుకునీ లక్షణమా చెప్పు? చిలిపి కయ్యాలకి సమయమా? ఓపక్క ఎన్నికలు తరుముకొస్తుంటే, చెప్పు!
చాలా రోజుల తరవాత మా సత్తిబాబు, సుబ్బరాజు వచ్చారు. వస్తూనే మా సత్తిబాబు ''చెల్లెమ్మా! కాఫీ''
అనరచి నాలిక కరుచుకున్నాడు, ఈలోగా లోపలనుంచి కోడలమ్మాయి ''తెస్తున్నా! బాబాయ్!!'' అంది. కూచునోలోగానే కాఫీ తెచ్చిచ్చింది, ముగ్గురుకీ! చాలా రోజుల తరవాత కదా పుచ్చేసుకున్నా! సత్తిబాబు కాఫీ కప్పు పుచ్చుకుని ''అమ్మా! కాఫీ అద్భుతం'' అన్నాడు. దానికి సుబ్బరాజు ''తాగకుండానే ఎలా చెప్పేవేంటీ?'' అని నిలదీశాడు. సత్తిబాబు, ''కాఫీ వాసనే ఘుమఘుమలాడిపోతోంటే తాగి మరే చెప్పాలా?'' అనడంతో కబుర్లు మరో దోవపట్టేయి. కబుర్లు దొల్లిపోతున్నాయి, అలా అవి బడ్జట్ దగ్గరకొచ్చి ఆగాయి.
మా సుబ్బరాజు ''బడ్జట్ లో ఏముందిలే? పయోళ్ళకి కిందోళ్ళని చూసేరు, మద్దెలో ఓళ్ళనొదిలేసేరు అంతేగా'' అన్నాడు. దానికి మా సత్తిబాబు 'అనుకో' అని ఊరుకున్నాడు. ''అదేమన్నమాట సత్తిబాబూ! అదేదో చెప్పరాదా'' అన్నా, కలగజేసుకుని. ''ఈయనడుగుతాడు, నేను నిజాలు చెబితే, ఈయనకి కోపాలొస్తాయి, మద్దెలో నాకెందుకొచ్చిన తంటా చెప్పండి'' అన్నాడు, భీష్మునిలా! ''నీ అభిప్రాయం నువు చెబుతున్నావు దానికి కోపమెందుకు చేసుకుంటాం! చెప్పు'' అని బ్రతిమాలాను. సత్తిబాబు అందుకున్నాడిలా!
మన దేశంలో ప్రజలు నాలుగు రకాలు
కలిగినవారు,లేనివారు,మధ్య తరగతివారు. నాలుగో రకమే రాజకీయనాయకులు. కలిగినవారు నూటికి పదిమంది.లేనివారు నూటికి ఏభై.మధ్య తరగతివారు నూటికి ముఫై ఐదు. రాజకీయనాయకులు నూటికి ఐదుగురు.
కలిగినవారు నూటికి పది మంది,వీరు పెద్ద వ్యాపారవేత్తలు,పారిశ్రామికులు,ధనవంతులు.వీరికి బడ్జట్లు గొడవలు,పెంచడాలు,తుంచడాలు అక్కరలేదు. వారికి కావలసిన పని ఏ ప్రభుత్వం ఉన్నా అవుతుంది. బయట వీరిని తిట్టిపోసేవారంతా, లోపల వీరి కాళ్ళ దగ్గర కూచునేవారే! ఎందుకంటే, వీరే వారికి పోషణ కర్తలు. వీరూ ఈ మధ్యన ఓట్లు వేస్తున్నారు. వారు ఎవరికి వేస్తారన్నది బహిరంగ రహస్యమే! వారినెప్పుడూ రాజకీయనాయకులు ఈగ వాలకుండా చూసుకుంటారు. వీరు అన్ని పార్టీలకి విరాళాలిస్తారు.వీళ్ళు ఓటెయ్యడానికి రావడమే గొప్పనుకుని లైన్ లో ఉన్నవారంతా తప్పుకుని లోపలికి పంపించేస్తారు. అప్పుడప్పుడు వీళ్ళు కూడా లైన్ లో నిలబడినట్టూ, లైన్ లో రమ్మని చెప్పినట్టూ డ్రామాలు కూడా కనపడుతూ ఉంటాయి.
లేనివారు నూటికి ఏభై మంది.వీరు ఏమీ లేనివారు. రెక్కాడితే డొక్కాడేవారు, లేదా ఏదో కొద్దిగా ఉన్నవారు అంతే!ఎవరి ప్రభుత్వమైనా వీళ్ళనే చూసుకుంటుంది . లైన్ లో నిలబడి ఓట్లేసేవాళ్ళు వీళ్ళే! వీళ్ళు అల్ప సంతోషులు.శ్రామికవర్గ పచ్చపాతులమని చెప్పుకునేవాళ్ళకి,చొక్కాలు చింపుకునేవాళ్ళకి ఓట్లెయ్యరెందుకో! వీళ్ళు, డబ్బుకి మందుకి లోబడిపోతున్నారంటూ ఉంటారు,
కొందరు పైవాళ్ళు. ఎదుటి పార్టీవాళ్ళ దగ్గర డబ్బులుచ్చుకుని, ఓట్లు మాకెయ్యండంటూ ఉంటారు, రాజకీయనాయకులు. వీళ్ళంత తెలివైనవాళ్ళు మరొకరు లేరు. డబ్బులుచ్చుకుంటారు,మందూ పుచ్చుకుంటారు. కావలసినోళ్ళకే ఓట్లు నొక్కుతారు. వీళ్ళకి కావల్సింది రక్షణ,నిత్యావసరాలు,అంతే!
రాజకీయ నాయకులు,వీరు నూటికి ఐదుగురు.వీరు ఏపార్టీ వారైనా అధికారమే ప్రధాన లక్ష్యం.
పోలసీలు వగైరాలంతా ఉత్తిమాటే. అధికారమున్నచోటకి చేరిపోడమే ధ్యేయంగా ఉంటుంది. సాధారణంగా వీరంతా మధ్యతరగతి మేధావులే! అక్కడక్కడ కలిగినవారుంటారు.వీళ్ళంతా నోరున్నవాళ్ళు :) ఎక్కడా మొదటి ఓట్లు వీళ్ళవే!వాళ్ళకి వాళ్ళే ఓట్లేసుకుంటారు :)
ఇక మధ్య తరగతివారు,వీరు నూటికి ముఫైఐదనుకున్నాంగా! వీళ్ళంతా ఏకరూపుగాదు. వీళ్ళలో మూడు రకాలు.అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్.
అప్పర్ మిడిక్లాస్ వాళ్ళు నూటికి ఐదుగురు. వీళ్ళు రాజకీయనాయకులతో రాసుకుపూసుకు తిరుగుతారు.పెద్ద ఉద్యోగస్తులు. పాలసీ మేకర్లు.చట్టాలు,రూల్స్ తయారు చేసేవాళ్ళు.బడ్జట్లు తయారు చేసేవాళ్ళు, వీళ్ళే! వీళ్ళంతా మహా మేధావులు,గుంట చిక్కులు పెట్టగలిగిన,విప్పగలిగినవాళ్ళు. చట్టాలకి భాష్యాలూ,వక్రభాష్యాలూ,వ్యాఖ్యానాలూ చెప్పగలవాళ్ళు నోరున్నవాళ్ళు , వీళ్ళ లో కొంతమంది నోరు పైకి వినపడదు,తొడపాశాలు పెట్టగలిగిన రకాలు. అంతెందుకు రెండు మీటర్ల చొక్కాగుడ్డ టైలర్ దగ్గరికి పట్టుకెళితే మనకి కావల్సిన ఫేషన్ లో కొలతలు తీసుకుని కుట్టే దర్జీలాటివాళ్ళు. ఏటైలరుకిచ్చినా గుడ్డ రెండు మీటర్లే, అందులోనే పొడుగుచేతులు,పొట్టి చేత్లులు,కాలర్ లెస్ ఇలా రకరకాలుగా చొక్కా కుట్టగల దర్జీలాటివారు. ఏపార్టీ వాళ్ళు అధికారంలో కొస్తే ఆ పార్టీ రాజకీయనాయకులు చెప్పినట్టు బడ్జట్లు, పరిపాలన అల్లగలవారు.
వీళ్ళూ ఓట్లేస్తారుగాని తెలీదు,ఎక్కడేసేరన్నది, వీళ్ళగురించి వార్తలే తెలియవు. కన్నగాడు కత్తిమరవడని, వీళ్ళబాగు ఒప్పు వీళ్ళు బాగానే చూసుకుంటారు. బడ్జట్ బాధలుండవు.
ఇక మిడిల్ క్లాసు వాళ్ళు. వీరికీ బడ్జట్ గోలుండదు, పట్టించుకోరు. పైవారంతా పోలసీ మేకర్లైతే వీరు పాలసీ ప్రోపగేటర్లు,కొత్తకొత్త,వింతవింత భాష్యాలూ చెప్పగలవారు, ఒపీనియన్ మేకర్లు.వీరు ఏ రంగంలోనైనా ఒకటే, అది పబ్లిక్ కావచ్చు లేదా ప్రైవేట్ కావచ్చు. వీరతి మేధావులు. నూటికి పది మంది. వీరిలో వ్యాపారస్తులు,మధ్య మేనేజిమెంటువారు, పన్నులు వసూలు చేసేవాళ్ళు ఇలా ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే పత్రికా ఎడిటర్లు,కొండొకచో విలేకరులు. వీరందరి ధ్యేయం సొమ్ములు చేసుకోడమే,ఎలాగైనాగానీ! అల్లప్పుడు అలా జరిగింది,ఇల్లిప్పుడిలా జరిగిందంటూ పుస్తకాలు రాసుకునీవోళ్ళు, అమ్ముకుని సొమ్ము చేసుకునీటోళ్ళు.వీరంతా రాజకీయనాయకుల కళ్ళలో పడాలని అనుకుంటూ ఉంటారు,ఎప్పుడూ. అతిమేధావులుగా గుర్తింపు పొందాలని తహతహలాడిపోతుంటారు. ప్రాజాస్వామ్యం,వ్యక్తిస్వాతంత్ర్యం,వాక్స్వాతంత్ర్యం,కాన్సిట్యూషన్, రాజ్యాంగం ఇలా గొప్పగా మాటాడగలవారు.తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని చేయగలవారు. వీరూ ఓట్లేస్తారు,వీలుబట్టి.వీళ్ళు పైవాళ్ళలో చేరిపోవాలనుకుంటూ ఉంటారు,పైవాళ్ళు వీళ్ళని అవసరానికి ఉపయోగించుకుంటారు. అవసరం తీరేకా బయటికి గెంటుతూ ఉంటారు.
ఇక చివరివాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్. వీళ్ళు నూటికి ఇరవైమంది. వీరికి సోకులెక్కవ, వచ్చేది తక్కువ. వీరంతా మేధావులు. వీళ్ళకి ఏమిచ్చినా తృప్తి లేనివాళ్ళు. నిత్య అసంతృప్తులు. ఏదో ఒకటి ధర తగ్గిందంటే రెండోది పెరగలేదా అంటారు. వీళ్ళకి పట్టింపులెక్కువ,ఆచారాలు,వ్యవహారాలు అన్నిటా.వ్యక్తి ఆరాధకులు, అలా అరాధించే నమ్మినవానికైనా ఓటేయరు. వీరు తీవ్రంగా ద్వేషిస్తారు,తీవ్రంగా ప్రేమిస్తారు. ఎన్నికల రోజు తప్పకపోతే, ఎవరేనా వచ్చి తీసుకెళితే, అక్కడ లైన్ లో జనం లేకపోతే ఓటేస్తారు, లేదూ శలవు రోజుకదా! ముడిచిపెట్టుకు పడుకుంటారు. అబ్బో వీరే పెద్ద పెద్ద ఉపన్యాసాలు రాస్తారు,కీ బోర్డ్ వారియర్లూ వీరే! మమ్మల్నెవరూ పట్టించుకోటంలేదంటారు. వీళ్ళకి భయమెక్కువ.ఉన్నమాట చెప్పలేరు. అలాగే చస్తూ బతుకుతూ బతుకీడ్చేస్తారు. నిజంగానే వీళ్ళనెవరూ పట్టించుకోరు.కింద తరగతిలోకి జేరలేరు,పైతరగతికి జేరలేరు. వీళ్ళింతే! నిత్య అసంతృప్తులు!.
ఇక చాల్లే! చెప్పుకుంటే ఎంతైనా ఉంది, నడు అంటూ లేచాడు మా సత్తిబాబు.
వినతి
అభిమాన మిత్రులకు సవినయ వినతి
కొంతమంది నాతో ఫోన్లో మాటాడటానికి ప్రయత్నిస్తున్న కాల్ రికార్డ్ నాదగ్గర ఉన్నది. అందులో ముఖ్యంగా ఒకరు అమెరికా,మరొకరు ఆస్ట్రేలియా ఉన్నట్టు అనిపిస్తున్నది. ఈ మధ్య బహరైన్ దేశం నుంచి ఒకరు నాతో మాటాడటానికి ప్రయత్నిస్తున్నది కాల్ రికార్డ్ చూశాను. నేను ఎవరితోనూ ఫోన్ లోకాని వీడియో కాల్ లోగాని మాటాడలేను, వినపడకపోవడమే కారణం. నేను అత్యవసరంగా మాటాడాలంటే నాకు మరొకరు తోడు ఉండాలి,తప్పదు. అందుచేత దయచేసి నన్ను మన్నించ ప్రార్ధన. నా పరిస్థితి ఈ మధ్య నన్ను దయతో చూడటానికి వచ్చిన మిత్రులు ప్రత్యక్షంగా చూడటం వలన వారికి తెలుసు. మీరు మెయిలివ్వండి జవాబిస్తాను,లేదా బ్లాగులోకి రండి, జవాబిస్తాను.
నమస్కారం.
దుర్వినియోగం
దుర్వినియోగం మన జీవితంలో భాగమైపోయిందా అంటే నిజమే అనిపిస్తూ ఉంది.
ఉదయం లేచినది మొదలు పళ్ళు తోమినంతసేపూ కుళాయి నీళ్ళు తిప్పి వదిలెయ్యడం అలవాటు దుర్వినియోగం. అలాగే మనుషులు లేకపోయినా పట్టపగలే లైట్లు ఫేన్లు పనిచేస్తూ ఉండడం. ఆపై ఆహార దుర్వినియోగం, తిన్నంత తిని, తిన్నదానికంటే ఎక్కువ పారెయ్యడం అలవాటైపోయింది. ఇక పెళ్ళిళ్ళు పేరంటాలలోనైతే చెప్పేదేలేదు. మందుల దుర్వినియోగం,అదో పెద్దకత. మూడు మాత్రలేసుకోండి, మూడు పూటలా, తగ్గితుంది చాలు, ఇది డాక్టర్ గారి మాట, చీటి పట్టుకెళితే షాపువాడు మూడు అమ్మడం కుదరదండి, స్ట్రిప్ కి పదుంటాయి, మీరువాడుకున్నా మరేం చేసుకున్నా పదీ కొనాల్సిందే. అవసరం! కొనక తప్పదు, మూడు వాడిన తరవాత మిగిలినవి దుర్వినియోగం, పారెయ్యాలి లేదా రోగాన్ని మళ్ళీ ఆహ్వానించాలి. వీటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
సమాజపరంగా దుర్వినియోగానికి లెక్కే లేదు. ఆపై చట్ట దుర్వినియోగానికొస్తే సెక్షన్ 498 A మరియుSC/ST Atrocities act దుర్వినియోగమైనంతగా మరేదీ దుర్వినియోగం కాలేదనే అనిపిస్తుంది. వాక్స్వాతంత్ర్యం పేరిట జరిగే దుర్వినియోగానికి లెక్కలేదు. మన దేశంలో అనధికారుల అధికార దుర్వినియోగం ఓ పెద్ద కత.
మధ్యాహ్న సూర్యుని మీద ఉమ్మేస్తే మన మొహానే పడుతుంది.
ఇదొకనానుడి.
సూర్యుని మీద ఉమ్మెస్తే ఏం జరుగుతుంది?ఎక్కడ సూర్యుడు ఎక్కడ మనం. సూర్యుడు మనకి 8 నిమిషాల ఇరవై సెకండ్ లు కాంతి దూరంలో ఉన్నాడు. మా పాశర్లపూడంత దూరముండదూ! అదేంటి? దూరం చెప్పాలంటే మైళ్ళో,కిలో మీటర్లో అనాలిగాని, ఈ కాంతి దూరమేంటీ? కాంతి సెకనుకి మూడులక్షల కిలో మీటర్లు దూరం ప్రయాణం చేస్తుంది. 8నిమిషాల్లో ఎంత దూరం చేస్తుంది? ఒక సెకనులో మూడులక్షల కిలోమీటర్లయితే నిమిషానికెంత దూరం? 60 X 8= 480sec. 500 X 3=1500 లక్షలకిలో మీటర్లు. అమ్మబాబోయ్! అంత దూరమా? అంతదూరాన ఉన్న సూర్యుడు వేసవిలో మనభూమి కొంచం ఆయనవైపు తిరిగితేనే భరించలేం,వేడికి. అంతదూరం ఉమ్మి వేయగలమా? దగ్గరకెళ్ళగలమా? ఆవేడికి బతికుంటామా? ఏదీ మనవల్లకాని పని అని అర్ధం. మామూలు రోజుల్లోనే మధ్యాహ్నం సూర్యునికేసి తిరిగి ఉమ్మితే అది మన ముఖానే పడుతుంది. ఇది లోకరీతికి తర్జుమా చేసుకుంటే!!!
మనకంటే గొప్పవాడైన వ్యక్తిని కించపరచడానికో,ఎగతాళీ చేయడానికో మనం పిచ్చి పిచ్చిగా వాగితే అది తిరిగి మనకే అంటుకుంటుంది. అందుచేత ఎప్పుడూ అర్హులైనవారి జోలికి పోవద్దు. వారిని తూలనాడటం, కించపరచడానికి ప్రయత్నించడం,ఎగతాళీ చేయడానికి ప్రయత్నం చేస్తే మనమే వాటికి గురవుతాము తప్పించి ఆ గొప్పవ్యక్తికి ఏం జరగదు. ఇది చెప్పడానికే ఈ నానుడి వాడుతుంటారు.
చాలాకాలంగా నన్ను చూడడానికొచ్చిన అభిమానులగురించి చెప్పలేదు.నా బ్లాగు పుస్తకంలో అభిమానులది పెద్ద ప్రకరణమే! నిజం చెప్పాలంటే, అభిమానులే నన్ను బ్లాగులో ఇంతకాలం నిలబెట్టేరన్నది కాదనలేని సత్యం.ఐదేళ్ళకితం మాట. ఓ రోజో మెయిలొచ్చిందిలా!''నాపేరు చెఱువు సుబ్రహ్మణ్య శాస్త్రి గుడివాడ దగ్గర, ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నా! మీ బ్లాగు చూస్తాను. అభిమానిని,విశాఖ పెళ్ళికెళుతున్నా!వచ్చేటపుడు వస్తా!'' అంతకుముందు పరిచయమే లేదు. రమ్మని ఆహ్వానించా!ఎలా వస్తారు? ఎప్పుడొస్తారు. అడిగా! ''నాది గాంధీగారి టిక్కట్టు, ఎప్పుడొస్తానో చెప్పలేను, వచ్చి మిమ్మల్ని చూసి వెళతా!'' అన్నారు. మర్నాడు ఉదయం, ''ఇప్పుడు స్టేషన్లో ఉన్నాను,బండి ఏది దొరికితే అది ఎక్కేసివస్తా''ననంటే బండెక్కేకా చెప్పండి స్టేషన్ కొస్తా అంటే,''రావద్దు నేనే వస్తా! ఎలా రావాలో చెప్పండంటే'' చెప్పక తప్పలేదు. ఎదురుచూస్తూ కూచున్నా! మధ్యాహ్నం పన్నెండున్నర దాటింది. అప్పుడు ఒక పెద్దాయన వచ్చారు.వయసు ఎనభై అన్నారు. భోజనాలు చేసేం,చేస్తూ కబుర్లు చెప్పుకున్నాం. కాసేపు కూచోండన్నా! ''కూచోను, ఏ బండి దొరికితే అదెక్కేస్తాను. ఏరాత్రి కైనా హైదరాబాదు చేరతానని'' వచ్చినంత వేగంగానూ వెళ్ళేరు. వారిని కలిశాను,అదో ఆనందం! అంతే!!ఆ తరవాత కాలంలో శ్యామలీయం,శ్రీమతి శారద,తమ్ముడు రామంతో "వస్తున్నా "అన్నారు, కాకినాడనుంచి. రమ్మని ఆహ్వానించా!అప్పటికే ఇల్లాలు లేవటం లేదు,మంచాన ఉంది. ఎలా వస్తున్నారు? అడిగా! కార్ ఉంది చేతిలో ఏలారావాలో చెప్పండంటే, చెప్పేను. దురదృష్టం ఆ రోజు ఫ్లై ఓవర్ కట్టేసేరు, అక్కడికొచ్చి ఫోన్ చేసేరు, ఇలా జరిగిందని. అక్కడికెళ్ళి సందుగొందులగుండా ట్రేక్ దాటించి,ఇంటికి చేరేం! ఆ తరవాత అంతంత మాత్రమే అతిథి సత్కారం చేయగలిగేం. దానికేవారు చాలా ఆనందపడ్డారు. నిజానికి ఏమీ చేయలేకపోయేం అన్నది, నిజం.ఆ తర్వాత ఇల్లాలు కాలం చేయడంతో అన్నీ వెనకబట్టేయి. ఎవరిని రమ్మనటమూ లేదు. ఇలా జరుగుతుండగా ఒక రోజు లలితమ్మాయి ''దేశంలో కొచ్చా! వస్తున్నా'' అంది! రమ్మని ఆహ్వానించా! గౌరవం చేయలేనేమోనని భయం, అనుమానం. వచ్చింది,ఇంటి ఆడపడుచుకంటే ఎక్కువగా కలసిపోయిందంటే! అభిమానం ఇలా అని చెప్పలేను. ఇంతకు మించి చెప్పను. బంగారు తల్లికి దిష్టి తగులుతుంది. తను మాకోసం ఎవో ఏవో బహుమతులు తెచ్చింది. మంచినీళ్ళు కూడా తెచ్చుకుంది,పాపం. మా చిన్న సత్కారం పుచ్చుకుంది. వీటన్నిటికంటే నాకు మీ ఆశీర్వచనం కావాలనిపాదాభివందనం చేసి, కూచుంది. చిన్న ఆశీర్వచనం పనస చెప్పి ఆశీర్వదించా! కడుపు నిండింది, మీరు పిలవకపోయినా వచ్చానంది.అవునమ్మా! నిజమే నేనే ఎవరిని పిలవలేకపోతున్నా! ఇల్లాలు కాలం చేయడంతో అన్నా! అభిమానం ఉన్నపుడు పిలుపులు పట్టింపులు ఉండవు, అందుకే పిలవకపోయినా వచ్చాను, ఆశీర్వచనానికే వచ్చానని, సరిపెట్టుకుంది.. మీ అభిమానానికి కడుపు నిండిందని సంబరపడి వెళ్ళింది. నిజానికి తను నన్ను చూడ్డానికి వచ్చి నన్ను సంబరపెట్టింది. నన్ను మళ్ళీ లోకంలో పడేయడానికి తనరాక దోహదం చేసింది.
దోచుకో దాచుకో
దోచుకో! దాచుకో!! ఇదే నేటి నినాదమనిపిస్తూ ఉంది. దోచుకుని ఏమి అనుభవిస్తున్నట్లు? పొట్టకి తిండా మూడు పూటలకంటే ఎక్కువ తినలేము. కట్టుకునే గుడ్డా? ఏదైనా మానం కాపాడుకోడానికే! ఉండే ఇల్లా? ఎంతపెద్ద ఇల్లున్నా ఒకమంచంమీదే పడుకోగలం.స్త్రీ/పురుష అనుభవమా? మూడు నిమిషాల ముచ్చట. అంతే! ఇతర వైభవాలా? అర్ధం చేసుకుంటే కొరగానివే. ఇది ఐశ్వర్యంకాదు. రెండు పూటల తింటే ఆకలి వేయడం ఐశ్వర్యం.ఆరోగ్యం ఐశ్వర్యం. కట్టుకున్నవారితో మనసుకలిసుండడం ఐశ్వర్యం. ఎందుకు దోచుకుంటున్నట్లు?
నృసింహ శతకకర్త అన్నారిలా.
సీ. తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు - వెంటరాదు
లక్షాధికారైన - లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు - మ్రింగబోడు
విత్త మార్జనజేసి - విర్రవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము - తోడరాదు
పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి
దానధర్మము లేక - దాచి దాచి
తే. తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
సృష్టి మొదలు ఎందరు పుట్టేరు? ఎందరు పోయారు. పోయినవారెవరూ చిటికెడు మన్ను పట్టుకుపోలేదు. నిన్న మొన్నటి ఉదాహరణలు స్టీవ్ జాబ్స్, రాకేష్ ఝున్ ఝున్ వాలా! కదలలేని స్థితిలో నిస్సహాయంగా ప్రాణాలు వదలినవారు. ఆఖరికి తాను అనుకున్న శరీరం కూడా ఇక్కడే వదిలేసిపోతున్నారు. ఎవరూ నిన్ను గుర్తుపెట్టుకోరు. ఈవేళ చస్తే రేపటికి రెండు. దోచుకోకు!
కడుపాకలికి కక్కుర్తి పడితే అదో అందం. అంతే!!!!
నోరున్నవారూ, బలమున్నవారూ;దోచుకుంటున్నారు,దాచుకుంటున్నారు. ఎవరి వీలున్నంతవారు, వ్యాపారస్థులనుంచి, బలమైన వృత్తి వారలనుంచి,రాజకీయులదాకా! ఎందుకో!!!
ఎంత కళ్ళు మూసుకుందామనుకున్నా చూడక తప్పటం లేదు. బాధపడకా తప్పటం లేదు . ఏమీ చేయలేని అసహాయ స్థితి. ఇదింతే!!!!
రహస్యం దాగదు.
దుష్యంతుడు వేటకి వెళ్ళి, కణ్వుడు లేనప్పుడు కణ్వాశ్రమంలో శకుంతలని చూసి మోహించి, గాంధర్వం అని పెళ్ళి చేసుకుని, ఆమెను తల్లిని చేసి వెళ్ళాడు.నిన్ను తీసుకువెళతానని వాగ్దానమూ చేసాడు. అడగొచ్చిందా? అనుకున్నాడు. శకుంతల కొడుకుని కన్నది. కొడుకు పెద్దవాడవుతున్నాడు, రాజు దగ్గరనుంచి ఎన్నాళ్ళకి కబురులేకపోతే తనే బయలుదేరిందీసారి,కణ్వునికి చెప్పి. రాజసభలో కొడుకుని చూపించి, వీడు మన కొడుకు అని చెప్పింది. దుష్యంతుడు ఎవరినో కుర్రాణ్ణి తీసుకొచ్చి వీడు నీకొడుకు అనడం బాగుందా? అసలు నువ్వెవరు? నాకు తెలియదే అనేసాడు. దానికి శకుంతల చాలా చెబుతూ, ఇలా అంటుంది
విమల యశోనిధీ పురుషవృత్త మెరుంగుచు నుండు జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా
ర్థము లివి యుండగా నరుడు దక్కొన నేర్చునె తన్ను మ్రుచ్చిలన్.
తెల్లనిదైన యసస్సు కలిగినవాడా! మానవుల చర్యలను చూస్తున్నవారున్నారు సుమా! వారు
ధర్మం-1
యముడు-1
అంతరాత్మ-1
సూర్యుడు,చంద్రుడు-2
పగలు,రాత్రి-2
సంధ్యలు-3
వేదములు-4
పంచభూతాలు-5.
వీరిలో ఎవరో ఒకరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. మానవుడు రహస్యంగా, ఎవరికి తెలియకుండా ఏమీ చేయలేడు. అందుచేత నువ్వు చేసిన పని ఎవరికీ తెలియదనుకోకు. అని చెప్పింది.అబ్బే అలాగా వినలేదు, తరవాత కత చాలానే జరిగి చివరికి ఒప్పుకున్నాడు.
నేటికీ ఈ మహా పదార్ధాలు ఏదో ఒకటి మనం చేసేపని చూస్తూనే ఉంటాయి. నేటికాలం లో మరొకదాన్ని ఈ మహాపదార్ధాలలో చేర్చుకోవలసి వస్తూంది :) అదే గూగుల్. ఎలాగని అడగచ్చు. మీరు ఏం చదువుతున్నారు, ఏ రకపు వార్తలను చూస్తారు, ఏవస్తువులు కొనాలనుకుంటున్నారు, ఏవి మీకిష్టం, ఎక్కడ ఎమి దొరుకుతాయి,వాటిఖరీదులెంత,ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు,అక్కడకి దగ్గరలో చూడవలసినవేంటి? ఏమి తింటారు?
మీ ఆలోచనేంటి? కల్పితమేధస్సుతో మీరెలా ఆలోచిస్తారో కూడా చెప్పేస్తున్న సంఘటనలున్నాయి. మీరెక్కడున్నారు,ఎంతసేపున్నారు, ఏ దిశగా కదిలేరు, ఇలా సర్వం జి.పి.ఎస్ లో దొరుకుతుంది. ఆధునికత పేరుతో బందీలైపోతున్నారు సుమా! బహుపారాక్! ఒక రోజు మీ చర్యలే మీ కాళ్ళకి,చేతులకి బంధాలు కావచ్చు సుమా!
ఇలా మీసర్వస్వమూ గూగుల్ గుప్పెట్లో ఉంది. ఇది మహా పదార్ధం కాదా?
కల్లు తాగె.
స్థల,కాల,పరిమితులు లేనిదేది?
అసలే కోతి,నిప్పులు తొక్కె,
ముల్లు గుచ్చుకునె,కల్లు తాగె,
పిచ్చి పట్టె, ఆపై దయ్యం పట్టె,
ఏమని చెప్పుదు గురువరా!
జననీ జన్మ భూమిశ్చ
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి
తల్లి,జన్మ భూమి స్వర్గం కంటే గొప్పవి.
రాముడు నేడు జన్మ భూమికి చేరుతున్నాడు.
రెటమత శాస్త్రం :
చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి పడుతుంది
అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.
ఇదొక నానుడి అమ్మ తరచు చెప్పేది. ఏమిటి ఇలా చెబుతుందనుకునీ వాడిని. నిజమే కదా! అన్నీ వడ్డించిన విస్తరి బరువుకి అణిగి ఉంటుంది, పుల్లాకు(పులివిస్తరి) ఏమీ బరువు లేక ఎగిరెగిరి పడుతుంది. జీవితం లో అనుభవాలతో గాని దీని అర్ధం తెలియలేదు. సంపద కలిగినవాడు సంపాదన ఉన్నవాడు ఎప్పుడూ నెమ్మదిగానే ఉంటాడు,ఎగిరెగిరి పడడు. ఏవిషయానికి ఉద్రేకపడిపోడు. సంపాదన లేనివాడు సంపద లేనివాడే ఎగిరెగిరి పడుతుంటాడు. అలాగే జీవితం లో కష్టసుఖాలు చూసినవాడు ఉద్రేకపడిపోడు, సమస్యను పరిష్కరించుకోడానికే చూస్తాడు. జీవితానుభవం లేనివాడు మరికొన్ని చిక్కులు తెచ్చుకుంటాడు. అలాగే చదువుకున్నా, అణుకువ కలిగి వున్నవాడు, తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు విద్యాభారంతో అణుకువగా ఉంటాడు. నోటికొచ్చినదంతా మాటాడడు. నాకింకా తెలియదు అనుకున్నవాడు వృద్ధిలో కొస్తాడు,ఎగిరి పడడు. మిడిమిడి జ్ఞానం వారు చెప్పక్కరలేదు. మొన్నటి పద్యభాగమే మరోసారి.
చమురున్న పెంకు నిలిచి కాలుతుంది, చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి పడుతుంది , అనేవారు నాటి కాలంలో. ఇదీ ఒక నానుడే!
ఎల్లరకు శోభకృత్నామసంవత్సర సంక్రాంతి శుభకామనలు.
మా పల్లెలో సంక్రాంతి
మొదలు పైకి చిగుళ్ళు కిందికి ఉన్న చెట్టు
చెట్టు మొదలు కిందికి చిగుళ్ళు పైకి ఉన్నది,మన కంటి పటలం మీద(రెటీనా)ఆ చెట్టుయొక్క బొమ్మ (image formed on retina is real and inverted ) తలకిందుగా ఉంటుంది. కాని మనకు చెట్టు మొదలుకిందికే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు?
*****
ఊర్ధ్వమూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయం
ఛన్దాంసి యస్య పర్ణాని యన్తం వేద స వేదవిత్
భగవద్గీత.15-1
అధశ్చోర్ధం ప్రసృతా స్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయ ప్రవాలాః
అధశ్చ మూలన్యనుసంతతాని కర్మానుబన్ధీని మనుష్యలోకే
భగవద్గీత.15-2
వృక్షశాఖలు ప్రకృతి యొక్క త్రిగుణములచే పోషింపబడి కిందికిని మీదికిని వ్యాపించును. చిగురాకులు ఇంద్రియార్ధములు. ఈ వృక్షమునకు కిందికిపోవు వేళ్ళు కూడా నున్నవి. ఇది లోకముయొక్క సకామ కర్మలచే బద్ధములై యుండును.
ఏకాలంలోనూ,ఏదేశంలోనూ,అబద్ధం చెప్పనిదేది?
కవులు-కదపా-మంద-మసాగత్తు/మశాగత్తు.
కవులుని, కౌలు అని కూడా అంటుంటారు, కవులు శబ్దానికి నానార్ధాలూ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది రైతు,భూయజమాని మధ్య ఒడంబడిక గురించి. ఇది రైతు భూయజమానికి రాసిచ్చేది. కవులును ఉయలు అనికూడా కొంతమంది లేకరులు నాటికాలం రాయగా చూసిన అనుభవం ఉంది. ఇక కదపా అన్నది భూయజమాని రైతుకు రాసిచ్చే హామీ. ఈ రెండిటిలో వచ్చే పదాలే మంద,మశాగత్తు/మసాగత్తు. నేను వీటితో పరిచయం వదిలేసి చాలాకాలమే అయింది, నాకు తెలిసిన కాలంలో కవులు ఎలా ఉండేది? రాస్తాను.
దివి..... .....నామ సంవత్సర,...మాస బహుళ/శుక్ల.... ...వాసరాన,......జిల్లా......తాలూకా.......గ్రామ కాపురస్థులు........గారి కుమారుడు..........గారికి.
......జిల్లా......తాలూకా..........గ్రామ కాపురస్థుడు.........గారి కుమారుడు........వ్రాయించి ఇచ్చిన కవులు.
మీకు ....గ్రామంలో ఉండుకున్న సర్వేనెం.......రి.సర్వేనెం.......లోని య........సెం.....భూమిని ఈ రోజు కొలతవేయించి వ్యవసాయం నిమిత్తంగా నాకు అప్పగించినారు. సదరు భూమిపై కవులుగా సంవత్సరం ఒక్కంటికి, యకరానికి ....... 3 గుళ్ళ /75 కే.జిల కాటాబస్తాలు మొదటిపంట ధాన్యం , మొత్తం య........సెం.....భూమి కి .....బస్తాల నెంబు,తప్ప,తాలు,పొల్లు, తుక్కు,దూగర లేని మొదటిపంట ధాన్యం, మీగాదివద్ద కొలగారంవారిచే తూకం వేయించి అప్పగించగలవాడను. ఈ కవులు కాలం ఐదు సంవత్సరములు. ఈ కాలంలో మొదటిపంటగా వరిని,రెండవపంటగా నువ్వు,మినుము,పెసర,కంది, జొన్న లాటి మెట్టపైరులు పండించుకునే నిర్ణయం. రెండవపంట ఫలసాయంలో మీకు సంబంధము లేదు. ఈ భూమికి ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు యావత్తూ మీరే చెల్లించుకోవలెను. ఈ భూమికి ఉన్న నీటివనరులు పాడుచేయక రక్షిస్తాను, ఉన్న ఈజుమెంటు హక్కుల్ని రద్దు చేయను,కొత్తవాటిని కలగజేయను. సరిహద్దురాళ్ళను జాగ్రత్తగా కాపాడతాను. చివరి సంవత్సరంలో నువ్వు పంట వేయకుండా ఉండే నిర్ణయం. చివరి సంవత్సరం రెండవపంట తరవాత మంద,మశాగత్తులు జరిపించి, మీ భూమిని మీకు అప్పగించగలవాడను. ఇది సమ్మతిని వ్రాయించి ఇచ్చిన కవులు.
సంతకం....................
ఇందుకు సాక్షులు....
౧.
౨.
దస్తూరి..............
ఇక కదపా అనేది, కవులులో చెప్పబడిన షరతులు అన్నీ ఇందులోనూ ఉంటాయి. ఫలానా,ఫలానా షరతులు రైతు అమలు చేయాలనీ,వివరాలుంటాయి. చివరలో ఈ కవులు కాలంలో ఇవ్వవలసిన కవులు బకాయిలు పెట్టకుంటే కవులు రద్దు చేయనని కదపా ఇస్తున్నాను, ఇది సమ్మతిని వ్రాయించి ఇచ్చిన కదపా.
అనగా రైతుకు యజమాని చ్చే భరోసా,గేరంటీ,హామీ. చెవికదపా ఇస్తానోయ్! అన్నమాట వింటుంటాం, అంటే చెవిని హామీ ఇచ్చాడనమాట. :)
మంద అనేది మందగట్టడం. ఏభై ఏళ్ళ కితం రసాయన ఎరువులు లేవు, ఎరువుగా పెంటతోలడం,పశువులు,మేకలు,గొర్రెలని మందగా భూమిలో ఉంచడం చేసేవారు.
ఇక మశాగత్తు/మసాగత్తు అనే పదానికి అర్ధంలేదు. మసాహత్ అనే ఉర్దూ/హిందీ పదం మన తెనుగునోటబడి మశాగత్తు/మసాగత్తు అయింది. దీనికి అర్ధం, భూమి కొలత,సర్వే అని అర్ధం. రైతు భూమి తీసుకునేటపుడు కొలతవేయించి అప్పజెప్పుకుంటాడు, మళ్ళీ కొలత వేయించి అప్పజెపుతాడు. ఇక మసాహత్ అనగా కొలత ఎందుకని సందేహం కదా! సర్వేరాళ్ళు జరిపేసేవారు,గట్లు జరిపేసేవారు, ఇలా చాలాచాలా అపభ్రంశాలు జరిగేవి,దీనితో తగవులూ చాలా ఉండేవి, వీటిని మొదటిలోనే పరిహరించడానికి చేసే ప్రయత్నమే ఇది. మాస్టర్ రాయి అని ఒక పెద్ద సర్వేరాయి ఉంటుంది. మొత్తం గ్రామ సర్వే అంతా ఆ రాయి ఆధారంగా నడుస్తుంది. ఇది ఎంతుంటుందంటే, పైన రెండ డుగుల పొడవు వెడల్పులతో దగ్గరగా పది అడుగుల పొడవుంటుంది. కిందికిపోను లావుగా ఉంటుంది. ఏడు,ఎనిమిదడుగులలోతుపాతిపెట్టి,ఒకడుగు పైకి ఉంచేటట్టు చేస్తారు. ఈ మాస్టర్ రాయిని రైతులంతా గమనిస్తుంటారు. దీనినే రాత్రికి రాత్రి తవ్వితీసి మరోచోట పాతిపెట్టిన ఘనులూ ఉన్నారు,నాడే! ఆ తరవాత కాలంలో రివెన్యూవారు సరిచేసిన సందర్భాలు కోకొల్లలు.
గ్రామానికో డిగ్లాటు ఉంటుంది. ఇది కరణం దగ్గరఒకటి,తాసిల్దారు దగ్గరొకటి, కలక్టర్ దగ్గర కాపీలుంటాయి. ప్రతి సర్వే నెంబరు భూమి పరిమితం,కొలతలు,భూమి ఆకారపు చిత్రం స్కేలుకి వేసి ఉంటుంది, సర్వేరాళ్ళు ఎక్కడ ఉన్నదీ నమోదయి ఉంటుంది. మనభూమి తాలూకు డిగ్లాట్ కావాలంటే కరణం అచ్చుగుద్దినట్టు వేసి ఇచ్చేవాడు, అసలును చూసి. ఈ డిగ్లాటును సర్వే,రిసర్వేలలో సర్వే చేసినవారు, వేస్తారు. సర్వే చేసి డిగ్లాటు వేసిన వారి పేరు హోదా కూడా నమోదయి ఉంటుంది. చాలాచాలా మార్పులొచ్చాయి, ఇప్పుడెలా ఉన్నది తెలియదు.
నీళ్ళుకొడితే ఒకటవుతాయి...
నీళ్ళుకొడితే ఒకటవుతాయి! పాలు కొడితే ఒకటవుతాయా?
అనికాని
నీళ్ళుకొడితే ఒకటవుతాయిగాని, పాలు కొడితే ఒకటి
కావు.
అంటూ ఈ నానుడిని వాడుతుంటారు. ఎంటి దీని విశేషం? ఇది మానవ సంబంధాలను నిర్ణయించడానికి తరచుగా చెప్పే మాట.
ఈ నానుడి నిక్కచ్చి నిజం. జీవిత సత్యాన్ని చిన్న మాటలలో ఇమిడ్చి చెప్పేరు,ఎంతో అనుభవం మీద పెద్దలు. అది ఇప్పటికి సత్యమే! ఎప్పుడూ నిత్య నూతనమే!! నీళ్ళని ఎంత చిలికినా నీళ్ళుగానే ఉంటాయి. కాచినా ఆవిరైపోతాయేమోగాని నీళ్ళుగానే అవుతాయా తరవాత కూడా, మార్పు చెందవు. కాని పాలు చిలికితే వెన్నొస్తుంది. దీన్ని పచ్చిపాల వెన్న అంటారు. కాస్తే నెయ్యవుతుంది, కాని కొవ్వు వాసనుంటుంది. కాచి తోడు వేస్తే పెరుగవుతుంది. చిలికితే మజ్జిగవుతుంది,వెన్నొస్తుంది. వెన్న కాస్తే నెయ్యొస్తుంది. పాలు ఎన్ని రూపాంతరాలు చెందాయి? మరి నీళ్ళు మారాయా? లేదే!!
అసందర్భపు మాటే గాని అవసరమైనమాట. మజ్జిగ చుక్క వెయ్యనిది,వేలు ముంచనిది పాలు పెరుగుకావు. మరి మొదటిసారి పాలు పెరుగెలా అయ్యాయి,అవుతాయి? గోరు వెచ్చని పాలలో ఒక ముచికున్న ఎండు మిరపకాయ పడెయ్యండి, చాలు,పాలు తోడుకుపోతాయి,పెరుగవుతుంది. పాలు పెరుగవడానికి కావలసిన బేక్టీరియా ఆ ఎండు మిరిరపకాయ తొడిమలో ఉంది.
పాలుకాస్తే అందులో నీరు ఆవిరై పొడిలా మిగుల్తుంది. అంటే ఏం చేసినా నీరు ఒకటిగానే ఉంది, పాలు మాత్రం రూపాంతరం చెందిపోయింది. అలాగే కావలసినవారి మానవ సంబంధాలూ అలాగే ఉoటాయని ఈ నానుడి మాట.
ఒక ఉదాహరణ చెబుతా స్వానుభవం....
నా మిత్రుడు భార్యకి, తల్లికి, సరిపడక, తల్లిని వేరుంచాడు. మిత్రుని తల్లి ఓ రోజు వచ్చి కూచుని, తన కొడుకు కోడలి మీద చెప్పిన నేరం చెప్పకుండా చెప్పి, కళ్ళనీళ్ళు తుడవకుండా ఏడ్చి, ముక్కులు చీది గోడలు ఖరాబు చేసి వెళ్ళింది. ఆ తరవాత ఇల్లాలు నెమ్మదిగా 'మనకెందుకొచ్చిన గొడవ' అని ఊరుకుంది. నేను ఊరుకోలేక మర్నాడు మిత్రుడు కనపడితే ఒంటరిగా చూసి 'ఏం బాగోలేదురా!
నీతల్లి అలా బాధపడుతుంటే' అని క్లాసు పీకేను,
చెప్పిన సంగతీమరచాను కూడా! ఆ తరవాత వారంలో ఒకరోజు ఇంటికొచ్చేసరికి, ఇల్లాలు మొన్ననొచ్చినావిడ మధ్యాహ్నం నుంచి రెండుసార్లొచ్చింది మీకోసం, అని చెప్పింది. ఏమయిందిట,అనేలోగానే ఆవిడొచ్చి కూచుంది. ఏదో మంచిమాట చెబుతుందిగాబోలనుకున్నా! ఆవిడ,"ఔరౌరా! ఏం పెద్దమనిషివయ్యా నువ్వూ! వాళ్ళు నా కొడుకు, నా కోడలు,
పైవాళ్ళేం కాదు. ఏదో! నా కడుపులో మాట నీ చెవినేసేనో అనుకో! వాళ్ళనిలా వీధిని పడేస్తావా!" అంటూ చింతచెట్టును దులిపినట్టు దులిపి, నేను చెప్పేమాట కూడా వినక వెళ్ళింది. ఇది జరుగుతున్నంత సేపు ఇల్లాలు నవ్వు బిగబట్టుకుని ఉన్నట్టే అనిపించింది. ఆవిడెళ్ళిన తరవాత, ఇక ఈవిడ దులుపుతుంది కాబోలురా దేవుడా! అనుకుంటూ 'రోటిలో తలదూర్చి రోకటిపోటునకు వెరువనేర్తునా' అనే నానుడి గుర్తుచేసుకుని ఇల్లాలికేసి చూసాను. కాని చిత్రంగా స్వీటు,స్వీటుగా ''పాలుకొడితే ఒకటిగావు,నీళ్ళు కొడితే ఒకటే'' అని చెప్పలేదూ! అని ఊరుకుంది. ఇంత స్వీటుగా చెప్పి ఊరుకున్నందుకు ఏదో చెయ్యబోతే చాలు!చాలు!! పిల్లలెదురుగా పోకిరీ వేషాలంటూ స్నానం చెయ్యండని బాత్ రూమ్ లోకి తోసింది....నిజం కదూ! ఆ తల్లి,కొడుకు,కోడలు ఒకటయ్యారు, నేను వేరయ్యాను..
అంతెందుకు నిన్నమొన్న,మన రాష్ట్ర రాజకీయాల్లో జరిగిందిదే కదూ!
దీనికి కుటుంబాలు,కులాలు, మతాలు
ట్రేడ్ యూనియన్లు, లాయర్ల,డాక్టర్ల అసోసియేషన్లు, పత్రికా విలేకరుల యూనియన్లు రాజకీయపార్టీలు,రాష్ట్ర రాజకీయాలు,దేశరాజకీయాలు,అంతర్జాతీయ రాజకీయాలూ అతీతం కాదు.
అంతా మేము దీనికి అతీతం అంటుంటారు, విని నవ్వుకోడమే! 'అందరూ శ్రీవైష్ణవులే,బుట్టడు రొయ్యలూ ఏమైనట్టు' అన్నది ఒక నానుడి.
ఎవరు ఏం చెప్పినా నీళ్ళు కొడితే ఒకటవుతాయి, పాలుకొడితే కావు!!!!