ఎంతో కొంత, అంతా హిరణ్యకశిపులే!
నడకల్లో రకాలున్నాయట. నత్తనడక, పిల్లినడక,పెళ్ళివారి నడక...ఇలా...ఆధునికులైతే మార్నింగ్ వాక్,ఈవినింగ్ వాక్, స్టేరింగ్ వాక్, ...ఇలా.
మొన్న నడకలో ఎముక చిట్లినదగ్గర్నుంచి మంచానికే అతుక్కుపోయా! నిన్న కాలికి కట్టిప్పేరు దాంతో ఇక్కడికొచ్చా! ఈమధ్యలో మందస్మితవదనారవింద సుందరి,
( అబ్బా ఇంత పేరా! ఎత్తుపళ్ళ సుందరి అంటే బాగోదుగా) దరహాసోజ్జ్వలన్ముఖి తో
జరిగిన సంభాషణ.
''అయ్యయో! ఎలా జరిగింది? ఏమయింది?'' అడిగింది.
''నడుస్తోంటే జరిగింది, (విరిగింది)నెప్పిగా ఉంది''
''చిన్నపిల్లాణ్ణనుకుంటున్నారా, గెంతుకుంటూ నడవడానికి, నెమ్మదిగా నడవాలిగా? '' అభిమానం, ప్రేమ, ఆతృత, ఆవేదన, కొంచం విచారం, కోపం,విసుగు, కలగలిపి.
బుస్సున కోపమొచ్చింది.తమాయించుకున్నా! ఊరుకున్నా!
ఒకరోజు తరవాత. ''తిట్టేవా?'' అడిగా
''మరి! నైస్!! బలే పడ్డారు!!! అని అప్రీసియేట్ చేశా అనుకున్నారా?'' అడిగిందీ సారి నిజంగానే కోపంగా.
''కాలు కావాలని విరుచుకుంటారా?నీకు దయ లేదు'' అనేశా!
''నాకు దయ ఉంది. మీకు భయం లేదు. జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్న.. పర్వా లేదు కదా.. ''అన్నది
నేనేదో సమాధానం చెప్పేనుగాని, ఆలోచనలో పడ్డా.
విరిగిందంటే, ఇలా అన్నదేం! అని. నా కాలు విరిగిందన్న బాధ, బాధ పడుతున్నానన్న బాధ అదనం, అభిమానం, ప్రేమ, ఆతృత, ఆవేదన, కలగలిపి,అభిమానం పెల్లుబికి అన్నమాటగా చెప్పుకుని.....
"ఏంటి భయం,జాగ్రత్త, పర్వా లేదు కదా" అని ఆలోచనలో పడ్డా!
భయం ఎలాపుడుతుంది? స్వయంగా ఒక సంఘటన చూడడం లేదా వినడం ద్వారా భయం పుడుతుంది. భయంనుంచి జాగ్రత్త పుడుతుంది.
ఒక ఉదాహరణ చూదాం. భాగవతం దగ్గరకెళితే...
హిరణ్యాక్షుడు హరి చేతిలో మరణించిన తరవాత హిరణ్యకశిపుడికి భయం పుట్టుకొచ్చింది. మనమూ
ఇంతేనేమో అని. అందుకు తపస్సుచేసేడు.బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ''వత్సా! ఏమి నీకోరికంటే?'' ''చావులేని వరంకావాల''న్నాడు. ''అది ఇవ్వడం కుదరదుగాని మరేమన్నా కోరుకోమంటే!'' ''గాలిన్ కుంభిని..అని ఈ చోట్ల, వీళ్ళచేత చావు రాకూడ''దన్నాడు. ''సరే! ఇచ్చానురా!! చాలామందికి వరాలిచ్చా గాని ఇలాటి వరం అడిగినవాడు లేడు, బుద్ధికలిగి బతుకు'', అన్జెప్పి తిరోహితులయ్యారు, బ్రహ్మగారు..ఆ తరవాత కత తెలిసిందే! వీడేవైతే కాదనుకున్నాడో, వాటిని తప్పించి నరసింహ రూపంలో గడపమీద గోళ్ళతో పొట్ట చీల్చి చంపేడు. వీడు తీసుకున్న జాగ్రత్తలు ఉపయోగించాయా?
ఇలాటిదే మరొకటి భారతం నుంచి
శాపానికి మరణిస్తావంటే భయపడ్డాడు,ఒంటి స్థంభం మేడలో దాగాడు, ఎన్నిజాగ్రత్తలో తీసుకున్నాడు,చివరికి చావు తప్పిందా? చివరికి పండులో పురుగుగా వచ్చి కాటేసిపోయాడు, తక్షకుడు.
అభివృద్ధి చెందేమనుకుంటున్న వారు, ఆ దేశాల మనుషులు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఆరోగ్య రక్షణలుంటాయి, చెకప్ లుంటాయి,హాస్పిటళ్ళుంటాయి, మేధావులైన డాక్టర్లుంటారు,డబ్బుకైతే లోటే లేదు. కానీ, చిత్రంగా ఆ దేశాల్లోనూ పౌరులు చచ్చిపోతున్నారు, వ్యాధుల మూలంగా! మరీ జాగ్రత్తలు ఎందుకు పనిచెయ్యటం లేదు? అర్ధం కాలేదు.
కాలం ఎవరిని వదలదు. అందుకే కాలగ్రాసీభూతులయ్యారంటుంటారు,అంటే కాలం మింగేసిందన మాట. కాలOమూడితే (కాలం పూర్తైతే) జాగ్రత్తలేం పని చెయ్యవు.అదే విధి
ఏమనమాట? కాలాన్ని జయించినవారు లేరు. జాగ్రత్తలేం పని చెయ్యవు.
నిన్న పుట్టిన శరీరం పెరిగింది. పెరిగినది శాశ్వతంగా ఉండదు. నశిస్తుందనే స్పృహ లేకపోతోంది. నిన్న మధువులొలికించిన సోగకళ్ళు నేడు లొత్తపోయాయి. నిన్నటి వయసు అందాలు నేడు జారిపోయాయి. నిన్న హరి నామస్మరణ చేసినవారిని నిందించిన నోరు పెగలటం లేదు. నిన్న అందరిని తన్నిన కాలు నేడు లేవటం లేదు. నిన్న విచక్షణలేక దండించిన చేయి నేడు ఎండిపోయింది. ఐనా మానవులకి జ్ఞాననాడి ఆడటం మొదలు కావటం లేదు. మనసును జయించే ఆలోచనే మొదలుకావటం లేదు. కనీసం పగ,అసూయ,ఈర్ష్య,ద్వేషాలను వదలించు కోవాలనే కోరిక ఆలోచనకే రావటం లేదు.
శరీర సుఖాలతో కాలం గడిపెయ్యచ్చనే ఆలోచన కలిగిన
మానవులంతా ఎంతోకొంత, అంతా హిరణ్యకశిపులే!
విధి తప్పదు! అందుకే వేదం చెప్పేమాట
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుక మివబంధనాత్మృత్యో ముక్షీయమామృతాత్!
ఎంత చక్కటి కోరిక!! అపమృత్యువు నుంచి రక్షించు! దోసకాయ ముగ్గిన తరవాత తొడిమనుంచి విడిపోయినట్టు, కాలం చెల్లిన తరవాత తీసుకుపో!!!