Wednesday 23 August 2023

సాలెగూడు

సాలెగూడు 

మానవ సంబంధాలన్నీ సున్నితమైనవేనంటారు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనన్నారటా మార్క్స్ మహాశయులు.ఎంత సున్నితమైనవంటే సాలె పురుగు గూటిలో దారం అంత సున్నితం అంటారు. 


ఎప్పుడేనా సాలెగూడు చూసారా? దీన్ని సాలె పట్టు అనికూడా అంటుంటారు. ఒక కేంద్రం నుంచి నాలుగు, లేదా ఐదు, ఆరు పక్కలకి ఒక గూడు అల్లేస్తుంది. అదికూడా ఎంతో కళాత్మకంగానూ ఉంటుంది. మరే ఇంజనీరింగ్ కాలేజిలో చదువుకుందో మాత్రం తెలీదు సుమా! ఈ సున్నితమైన దారాలని ఎక్కడనుంచి తెస్తుంది? తన నుంచి ఒక ద్రవం విడుదలచేస్తే అది బయటకొచ్చాకా గట్టిపడి దారంలా తయారవుతుంది. దీన్ని ఉపయోగిస్తుంది. చూడ్డానికీ దారం ఎంత సున్నితమంటే గాలేస్తే తెగిపోతుందేమో అనిపిస్తుంది. కాని రెండు వందలకిలోమీటర్ల వేగంతో గాలి వీచినా ఈ దారపుపోగు తెగదు. జడివాన కురిసినా తెగదు. కాని చిన్న పుల్ల ముక్కకి మాత్రం చుట్టుకుపోతుంది. మరో చిత్రం కొంతకాలమైన తరవాత ఆ సాలెపురుగు ఈ గూటినంతనీ తనలోకి మళ్ళీ వెనక్కి తీసుకోగలదు. దీనికి ఊర్ణనాభమని పేరు. 


మానవ సంబంధాలు కూడా సున్నితంగా కనపడినా బలమైనవే కాని చిన్న బలహీనత, అదే డబ్బు. దీనితో ఇంత బలంగా కనపడే మానవ సంబంధాలూ తల్లి,పిల్ల అని చూడక తెగిపోతాయి, అదే చిత్రం. ఆడ మగా తేడా లేక అవసరానికి మానవులంతా, ఇలా సాలెగూడు అల్లేస్తూ ఉంటారు అదో చిత్రం.  అది సాలెగూడని తెలిసి, తెలిసి అందులో చిక్కుకుని మోసపోతుంటారిదీ మరీ చిత్రం.

2 comments:

  1. అయ్యా ఒక సందేహం ... పుణ్యభూమి, కర్మభూమి రెండూ ఒకటేనా తేడాలు వివరించగలరు

    ReplyDelete
    Replies
    1. Anonymous23 August 2023 at 09:46
      తెలియదండి.

      Delete