ఎవరికంపు వారికింపు.
ఇదొక నానుడి.ఎవరు చేసినపని,చెప్పిన మాట వారికి సొంపుగానూ, ఇంపుగానూ కనపడతాయని దీని భావం.కాకి పిల్ల కాకికి ముద్దు ఇదీ ఒక నానుడే! కాకి తనపిల్లని ముద్దు చేయడంలో తభావతేముంది? కాని అదే కాకి పిల్లని మరొకరు ముద్దు చేస్తారా అన్నదే మాట. అలాగే ఎవరు చేసినపని,మాట ఎదుటివారికి కూడా నచ్చాలి.లోకంలో అందరికి అన్నీ నచ్చవు, కాని ఎక్కువమందికి నచ్చాలికదా! అలా నచ్చని దాన్నే ఇలా ఈ నానుడితో చెబుతారు.
ఈ విషయంమీద ఇదివరలో వాసన అని ఒక టపారాసిన గుర్తు.
శర్మ కాలక్షేపంకబుర్లు-వాసన
ఇంతేకాదు నిజంగానే ఎవరి కంపు వారికి ఇంపుగానే ఉంటుంది. కారణం తమదైన వాసన తమకి తెలియదు, ఎదుటివారికి తప్పించి. సైన్స్ కూడా చెబుతున్నమాటిదే. ప్రతివ్యక్తి శరీరం నుంచి తమదైన ఫెరోమోన్స్ విడుదలవుతాయి. ఇవి చెమటతో బయటికొస్తాయి. ఎవరి ఫెరొమోన్ వాసన వారిదే! ఇద్దరి ఫెరొమోన్ ఒకలా ఉండదు, ఇద్దరి డి.ఎన్.ఎ ఒకలా ఉండనట్టు. ఈ ఫెరొమోన్ వాసన పక్కవారికి మాత్రమే తెలుస్తుంది, ఎవరిది వారికి తెలియదు. ఈ ఫెరొమోన్స్ వాసన చూసే కుక్కలు నేరస్థులని పట్టుకుంటాయి ఈ ఫెరొమోన్స్ వాసన కుక్కలు గుర్తించినంతగా ఇతరులు గుర్తించలేరు. మనం ఒక ప్రదేశంలో కొంతసేపుండి అక్కడనుంచి వెళ్ళిన తరవాత కూడా మన ఫెరోమోన్స్ వాసన అక్కడ ఉంటుంది. నేరస్థులు దీనిని తొలగించాలని చూసినా సున్నితమైన ముక్కుతో కుక్కపసికడుతుంది. ఈ పెరొమోన్స్ లో ఆడ మగ తేడాలున్నాయష! వామ్మో!!
ఇంతేకాదు కొంతమంది కొంతమంది ఫెరొమోన్స్ ఇష్టపడతారట. ఏడుస్తున్న చిన్న పిల్లల దగ్గర తల్లి దుస్తులు పడేస్తే ఏడుపు ఆపుతారట. ఆ దుస్తులనుంచి విడుదలైన ఫెరొమోన్స్ వాసన తల్లి దగ్గరుందన్న భావం బిడ్డకు కలగజేస్తుంది. బట్టలు ఉతికిన తరవాత కూడా ఈ ఫెరొమోన్స్ వాసన మిగిలే ఉంటుందిట. మరి భార్య భర్త ఒకరి ఫెరొమోన్స్ మరొకరు ఇష్టపడితే జీవితమే హాయిలేహలా! వారే విడదీయలేని జంట.ఇది బహు అరుదు.
ఇక కొంతమందిని అందరూ ఇష్టపడతారు, కొంతమందిని ఎవరూ ఇష్టపడరు. కొంతమందిని కొందరే ఇష్టపడతారు. కారణం! మాట. అదెలాగో చూదాం. తినే ఆహారాన్ని బట్టి మనసు, మనసు బట్టి మాట. అలాగే తినే ఆహారాన్నిబట్టి ఫెరొమోన్స్ విడుదలవుతాయి. అదేవాసన. స్త్రీ పురుష ఫెరొమోన్స్ ఆకర్షణకి తోడవుతాయిట. అంటే మొత్తం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.
చిన్న ఉదాహరణ. పచ్చి వెల్లుల్లి తినండి, మీ నుండి విడుదలయ్యే చెమటలో వెల్లుల్లి వాసన ఉంటుంది. ప్రయత్నించకండీ! ప్రమాదం!
ఇక తీసుకునే ఆహారం ఎలా ఉంటుంది? వాటి రకాలు. సాత్విక,రాజస,తమో గుణాహారాల మూలంగా మూడు గుణాలు ఏర్పడతాయి.అవే సత్వ,రజస్, తమో గుణాలు. ఈ గుణాల మూలంగానే మనసు, దాన్నిబట్టి మాట అలాగే విడుదలయే ఫెరోమోన్స్ ఉంటాయి. అయ్యో! నన్నెవ్వరూ పట్టించుకోటం లేదని బాధవద్దు. సాత్విక ఆహారం తీసుకోవడం ప్రారభిస్తే మార్పువస్తుంది, దీనికి కాలం తీసుకుంటుంది, మార్పు ఒక్క రోజులో రాదుకదా! అసలు ఇష్టం అనేదొకటుందికదా! ఆహారం తీసుకోవడం లో, దాని మాటేమీ? సాత్విక,రాజస,తామసాహారాలలో ఏవి ఎక్కువ ఇష్టమో అది మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఏర్పడతాయి.
ఇంత పెద్ద విషయాన్ని మనవారు ''ఎవరికంపు వారికింపు'' అని చిన్న మాటలలో చెప్పేసేరు.