Monday 13 March 2023

నా దరిద్రమే పోయింది.

  నా  దరిద్రమే పోయింది.


ట్రేక్ మీద సాయంత్రం నడుస్తున్నా! ట్రేక్ మీద ఒకపక్క చివరగా ఇసక ఉంటుంది. చెప్పులు లేకుండా ఆ ఇసకలో నడిచే అలవాటు చాలామందికుంటుంది. నాకూ ఆ అలవాటు. ఒక పక్క పచ్చికుంటుంది. ఎండలు ముదురుతున్నాయిగా, పచ్చిక ఎండిపోయింది. పచ్చికపై చెప్పులు లేకుండా నడవడమూ మంచిదే! మంచి నిద్ర పడుతుంది. టెన్షన్ తగ్గుతుంది.   BP  తగ్గుతుంది

 చెప్పులు ట్రేక్ దగ్గర వదిలేస్తే కుక్కలు పాడుజేస్తున్నాయి, అందుకు అరుగు దగ్గర వదిలేసి నడకకి వెళ్ళడం అలవాటు. కొంచం దూరంలో ఉన్నా, నడక పూర్తి చేసుకుని. చూస్తుండగానే ఎవరో, తెలిసిన వ్యక్తే తనజోళ్ళు అక్కడ వదిలేసి నా జోళ్ళు తొడుక్కుపోతున్నాడు. పొరపాటు కాదని తెలుస్తూనే ఉంది. ఒక్క నిమిషం, కొత్త చెప్పులు, పదిరోజులకితం కొన్నవి, తొడుక్కుపోతున్నాడని బాధ కలిగింది, కేకేద్దామనుకుని ఆగిపోయా!.  చెప్పులు తొడుక్కుని పట్టుకుపోతున్నందుకు సంతోషించా! 


అదేంటి కొత్త చెప్పులుపోతే సంతోషమా అనకండి. నిజం! ఎందుకంటే శని పాదాలలో ఉంటాడు, అందునా వాడుతున్న చెప్పుల్నీ అనుసరించి ఉంటాడు. ఈ రోజుతో నా శనిపోయింది, దరిద్రమూ పోయింది, అందుకే సంతోషం.


    షోలాపూర్ చెప్పులు రెండు పోయాయీ, మెత్తగ హత్తుకుపోయేవీ!!!

 రేపు కొత్తవి కొనుక్కుంటా. ఇంటికొచ్చేటప్పుడు కొంచం ఇబ్బందిపడ్డా,చెప్పులు లేక రోడ్డు పై నడకకి.  కాళ్ళకి వేసుకునే చెప్పులు గుడి దగ్గర, ఇతరచోట్ల కావాలని తొడుక్కుపోయే జనాలు ఉంటారు. బాధ పడద్దు, శనిపోయినందుకు సంతోషించండి. ఈ వేళ శని నా కాళ్ళలో ఉన్నాడంటారు, తిరుగుడు ఎక్కువైన రోజు, ఇది నిజం, శరీరం కింది భాగంలో కాళ్ళలో అందునా పాదాలు శనిస్థానం. 


పెద్దవాళ్ళు కాలం చేసిన తరవాత తొమ్మిదో రోజు వారు వాడుకునే కఱ్ఱ,చెప్పులు, మంచం, పరుపు, బట్టలు ఇచ్చేస్తారు. ఇతరులు అవి తీసుకోడమూ తప్పుగా భావించరు.  పాత కాలంలో కుటుంబం అంటే కొడుకులు,కోడళ్ళు; కూతుల్లు,అల్లుళ్ళు; మనవలు,మనవరాళ్ళు; కొండొకచో మునిమనవలు,మనవరాళ్ళు కూడా ఉండేవారు. పెద్దవాళ్ళతో వీరిలో కొందరికి చెప్పలేని అనుబంధం ఉండేది. తాతగారి జోళ్ళు,కఱ్ఱ రోజూ కనపడుతూ, తాతగారు లేకుంటే నిత్యమూ మనసుకి కోత, దానినుంచి తప్పించుకోడానికే వీటిని ఇచ్చేసేవారు.


 స్త్రీలైతే, పోయినవారు కట్టుకున్న చీరలని, కుటుంబంలోని  తీసుకునేవారు. దీనికో కారణమూ ఉంది, చనిపోయినవారితో ఆ కుటుంబంలోని ఆడపడచులకు,కోడళ్ళకు ఉన్న అనుబంధాన్ని తెలిపేదే ఇది. అంతేకాదు, ఆ పెద్దవారిని దగ్గరగా ఉంచుకున్న అనుభూతి కూడా. మీరు నవ్వచ్చు, కాని ది నిజం. మనం కట్టి వదిలేసిన బట్టలకి మన ఫెరుమోన్స్ అంటి ఉంటాయి, అవి ఎన్ని సార్లు ఉతికినాపోవు. అందుకే ఆ అనుభూతి.ఇంకా మా అత్తగారిచ్చిన నగ, మా అమ్మ ఇచ్చిన గాజులు,  మా మామ్మ ఇచ్చిన గొలుసు, మా అమ్మమ్మ ముక్కుపుడక,  అనుభూతి పెంచేవే! ఇది చెప్పుకోడం స్త్రీ లకి ఇష్టమే, నేటికిన్నీ!

 

వాడుతున్న చెప్పులుపోతే సంతోషమే సంతోషం, ఎందుకంటే మన శనిని స్వంతం చేసుకుంటున్న అభాగ్యుడు.  


7 comments:

  1. Emito ee mooDha nammakaalu.
    cheppulangaDivaaDu
    entamandiki Sanini anTagaDutunnaTTu?

    ReplyDelete
    Replies
    1. Anonymous13 March 2023 at 11:42
      Emito ee mooDha nammakaalu.
      cheppulangaDivaaDu
      entamandiki Sanini anTagaDutunnaTTu?
      /ఏమిటో ఈ మూఢ నమ్మకాలు.
      చెప్పుల అంగడివాడు
      ఎంతమందికి శనిని అంటగడుతున్నట్టు?/
      ***********************************
      మందస్మితవదనారవిందసుందరా/సుందరీ
      నాది మూఢనమ్మకమే! చెప్పులు కొనుక్కోలేని ఒక దరిద్రుడు నేను వాడుకుంటున్న చెప్పుల్ని పట్టుకుపోతుంటే ఆపకుండా ఉంచిన మూఢనమ్మకం నాకు నచ్చినదే సుమా!
      తమకి వాడుకుంటున్న చెప్పుల్ని ఎత్తుకుపోవడం వెల ఇచ్చి అంగడిలో కొత్తచెప్పులు కొనుక్కోడం ఒకలాగే అనిపించాయా?
      అస్తు!అస్తు!!

      Delete
  2. ఇంకా నయం, చెప్పుల దుకాణాల వాళ్ళే తమ మనుషుల్ని పెట్టి చెప్పుల దొంగతనాలు చేయిస్తుంటారు అనలేదు పై వ్యాఖ్యాత.

    శర్మ గారన్నది *వాడుతున్న* చెప్పులు పోతే సంతోషమే అని.

    ReplyDelete
    Replies
    1. ఇంకో అనామకుడు13 March 2023 at 21:50

      శని పాదాల్లోనే ఉన్నాడని శర్మగారు చెప్పారు కదా? మరి శర్మగారు కొత్త చెప్పుల్ని కొని వాడితే మళ్ళా శని రాడంటారా? ఆ చెప్పులు పోకపోతే శని శర్మగారినే అంటిపెట్టుకొని ఉంటాడా?

      Delete
    2. విన్నకోట నరసింహా రావు13 March 2023 at 12:06
      ఇంకో అనామకుడు13 March 2023 at 21:50
      మందస్మితవదనారవిందసుందరా
      మొగాణ్ణని చెప్పుకున్నారు సంతసం.
      మన శని మనదగ్గరే ఉంటాడు, ఎక్కడికిపోడు. కొత్తచెప్పులైనా, పాత చెప్పులైనా. మరి శని దరిద్రంపోయినట్టు అనుకోడమేం.
      ఎవరో మనం చూడకుండా మనం వాడుతున్న చెప్పులెత్తుకుపోతే ఎవడో నా శని దరిద్రం పట్టుకుపోయాడంటారు. చూస్తుండగా నా వాడుకుంటున్న చెప్పుల్ని ఎత్తుకుపోతున్న దరిద్రుని ఆపి నా చెప్పుల్ని రక్షించుకోలేదు.నా మూఢనమ్మకం నన్ను ఆపింది, అలా ఒక దరిద్రునికి చెప్పుల్ని ఇవ్వగలిగేను, అంతేకాదు, ఎంతదరిద్రంతో మరొకరు వాడుకుంటున్న చెప్పుల్ని ఎత్తుకుపోతాడు? నా భావదారిద్ర్యం పోయింది, కాళ్ళని అనుసరించే శనిపోయిందనుకున్నా! నిజం నాది మూఢనమ్మకం, అదే నన్ను ఆపింది.ఇక మీచిత్తం.

      Delete
    3. MooDanammakam annadaaniki ekkaDo kalukkumannaTTumdi.

      Delete
    4. Anonymous14 March 2023 at 20:53
      /MooDanammakam annadaaniki ekkaDo kalukkumannaTTumdi./

      /మూఢనమ్మకం అన్నదానికి ఎక్కడొ కలుక్కుమన్నట్టుంది./


      నాది మూఢనమ్మకమే! అదే నన్ను కాపాడిందని సకారణంగా వివరిస్తే తమరికి ఎక్కడో గుచ్చుకుని గుండెకలుక్కుమన్నట్టుంది. కోవిడ్ దాటేం ఇక H3n2 దాటాలి సుమా, జాగర్తా

      Delete