Saturday 11 March 2023

వయసై పోయింది కదూ!

 వయసై పోయింది కదూ!


నిన్న సాయంత్రం నడకనుంచి తిరిగొస్తుంటే ”వారంగా కనపట్టం లేదూ!”  అడిగిందో ఎత్తుపళ్ళ సుందరి. ''నువు కనపట్టంలేదని ఎవరినడిగానబ్బా!'' అనుకుంది స్వగతంలో.

''ఎండ పెరిగినట్టుంటే నడక టైమ్ మార్చాను. అందుకు కనపడ్డం లేదనుకుంటా!'' అన్నా.'' వయసైపోయిందికదూ! ఎండవేళ జాగర్త'' అని వెళ్ళిపోయింది,లోనికి.


పదిరోజుల కితం నడకైపోయాకా కూచున్నా, సాయంత్రపు వేళ, స్కూల్ అరుగుమీద.ఇద్దరు ముఫైలోపు కుర్రాళ్ళొచ్చారు. అందులో ఒకడు, సమయం,సందర్భం లేక మీ వయసెంత? అడిగాడు. ఎనిమిదపదులు దాటిందని చెప్పేను. ఏదో అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇంతలో వెనకనుంచి చీపురు చేత్తో పుచ్చుకునొచ్చిందో లోలాక్షి.  నీ పనికి అడ్డా? అన్నట్టు చూసా! కాదని చెయ్యితిప్పుతూ!   ''బాబూ! ఇంత వయసున్నోనివి, పెద్దోనివి, వయసునిజం చెప్పకూడదు, తెలీదా?'' అనేసి, ''ఆ సన్నాసోళ్ళు ఏం కూసారో తెలుసా? ఇసుమంటి వయసైపోయిన  ముసలోల్లే దేసానికి బరువు అనుకుంటాపోయారు, నీకినిపించి ఉండదు.నీకేం కూడెట్టేరా?గుడ్డెట్టేరా ఎదవలు,నీ బరువేం మోసుకున్నారు, సన్నాసి ఎదవలు'' అని తిట్టిపోసింది.

అప్పుడుగుర్తొచ్చింది 

”ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్ర మౌషధ...”

వయసు,ఇంటిపోరు,మంత్రం,ఔషధం, ఇలా తొమ్మిదీ గుట్టుగా ఉండాలని చెప్పెరు కదా పెద్దలూ, అని

 పరమేశ్వరా! ఏమిది? అనిపించిందో క్షణం.ఈ తల్లికి నా పట్ల కలిగిన కరుణకు కారణం, ఆ కుర్రాళ్ళకి నా పట్ల కలిగిన  అకారణ ద్వేషానికి  కారణమేమి ప్రభూ! అని యోచించా!! తెలియలేదు, అదేకదా మాయ. 


.''తాతా! కుంటుతున్నావేం? ట్రేక్ మీద నడుస్తూ'' అడిగిందో చిలిపికళ్ళ సీతమాలచ్చి.''ఇంటి దగ్గర మెట్టు తగిలి వేలు చితికిందన్నా!'' ''చిన్నపిల్లాడివా? చూసుకునడవాలి, వయసైపోలేదూ!'' అనేసింది


నిన్న సాయంత్రం ట్రేక్ మీద నడుస్తున్నా! ముందు ఇద్దరమ్మాయిలు నడుస్తున్నారు. దుమ్ము రేగుతోందేమని పరిశిలించా. ఒకమ్మాయి స్కర్ట్ వేసుకుంది.రెండో అమ్మాయి పరికిణీ వేసుకుంది. ఆ పరికిణీ నేలమీద బెత్తెడు పైగా ఉంది. ముందుకెళిపోయి  వెనక్కితిరిగా! ''అమ్మలూ పరికిణీ నేలని తుడుస్తోంది చూసావా! కొంచం పొట్టిగా కట్టుకోవచ్చు, లేదా పొడుగు తగ్గించుకోవచ్చుగా!'' అనేసి,గబుక్కున నాలిక కరుచుకుని ''నీకెందుకు వయసైపోయిన ముసలోడా'' అని తిడుతుందేమోనని భయమేసి, ''చెప్పేసేనమ్మా! పొరబాటే సుమా!! ఏమనుకోకూ'' అనేస్తే నవ్వు నవ్వేసింది. ముందుకెళిపోయా. వయసైపోతే ఇలా అనవసరంగా కలగజేసుకుని వాగడం అలవాటైపోతుందేమో సుమా!!


ఏ రోగానికైనా వైద్యుడు వైద్యం చేయగలడుగాని, ఆయుస్సు పోయలేడు, అంతేకాదు ఇమ్యూనిటీ బజారులో దొరకదు. మందులికి రోగం తగ్గటం లేదంటే వయసైపోయిందిగా! ఇమ్యూనిటీ ఉండదంటారు.


తల్లీ! కనపడ్డవాళ్ళంతా వయసైపోయింది, వయసైపోయింది అంటున్నారు, అంటే నీ అవసరం ఇక ఇక్కడలేదు నిష్క్రమించచ్చు అని చెప్పినట్టే అనిపిస్తోంది. ”జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని”వైన నీకనిపించలేదా!  ఈ ఉపాధికి (శరీరానికి)  విశ్రాంతి ఇవ్వాలని తల్లీ!, ఎప్పుడో ఒకప్పుడు తప్పదు, కాని అదే ఎప్పుడూ అని కదా! అంతేకాదు ఈ శరీరం ఇక బాధలు తట్టుకునేలా లేదు తల్లీ! త్వరగా దీనినుంచి విడుదలకావాలి.  

  


4 comments:

  1. దారెంబడి పోయే దానయ్యలు తాటంకినులు చెప్పేవన్నీ బ్రహ్మాండంగా వినిపిస్తయి. కాని ఏది వినిపించాలో అప్పుడు మాత్రం "కవి" ని సుమండీ అంటూ వయ్యారాలు పోతారు‌. రోడ్డెంబడి వాకింగ్ వాకింగ్ కా లేక వామాక్షుల, బడుద్దాయిల మాటలు పట్టించుకోడానికాండి ?

    మీ కెంత వయసయిందని ? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంతే కదా ? ఎంజాయ్ చేయండి. మంచి మంచి కబుర్లు చెప్పండి. చదివేవాళ్లు కోకొల్లలు.

    బీ పాజిటివ్.

    ReplyDelete
    Replies
    1. Anonymous11 March 2023 at 10:03
      తొందరపడకో సుందరవదన/వదనుడ!
      అనుభవం ఐతేగాని తత్త్వం ఒంటబట్టదు. అంతవయసున్నట్టూ అనిపించదు.అందరూ అన్నీ జీవితంలో భాగమేస్మీ :) ఏదీ తప్పదు కాదు తప్పించుకోలేనిదే!!
      "ఎంజాయ" చెయ్యాలనే ఉంది కాని "జాయ"లేదు మరి :)

      డోన్ట్ బి పాసిటివ్ ఆల్వేస్ :)

      Delete
  2. // “ఎంజాయ" చెయ్యాలనే ఉంది కాని "జాయ"లేదు మరి :)” //

    👌👌🙂🙂

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు12 March 2023 at 16:13
      నమస్కారం

      Delete