Friday 26 August 2022

నమస్కారం



 నమస్కారం


బ్లాగులో రాయడం అన్నది ఒక వ్యసనమైపోయింది, నాకు, కాని బ్లాగు రాయడం కూడా ఒక కళే! కలకాదు సుమా! :) 


కాదు సుమా! కలకాదు సుమా!! అమృతపానమున అమరగానమును, గగనయానమును కల్గినట్లుగా గాలినితేలుచు  సోలిపోవుటిది, 

కాదు సుమా! కలకాదు సుమా!! 


 బ్లాగు మొదలుపెట్టి పదకొండేళ్ళవుతోంది. ఇబ్బందులు, కష్టాలు, బాధలు అనుభవిస్తూ వాటిని బ్లాగులో పంచుకోవడం అలవాటయిపోయింది. ఈ అలవాటు ఎప్పుడు తప్పుతుందో తెలియటం లేదు. నేనా సహస్రచంద్ర దర్శనానికి దగ్గరలో ఉన్నాను, శని ప్రస్తుతం మకరం లో ఉన్నారు, శని మేషం లోకి వచ్చేదాకా ఇది కొనసాగగలదని అనుకుంటున్నాను :). 

దీనికి తోడు కవిని కూడా (కవి,కనపడదు, వినపడదు)ఇప్పుడు మాటాడాలంటే ఎవరు ఉంటారు?ఉన్నన్నాళ్ళూ ఇల్లాలు వినేది, నాలుగేళ్ళయింది, దాటిపోయి.  నా చెవిటి గోల వినడానికి ఎవరు ఉంటారు  ? ఎవరిగోల వారిది కదా! అందుకు వాటిని బ్లాగులో ఒలకబోసుకోవడం. :) బ్లాగులో రాసేవి ఎప్పుడూ ఎవరిని ఉద్దేశించినవి కావు. నాకెవరి మీద కోపం, కసి,ద్వేషం లేవు, రావు కూడా! మౌనేన కలహో నాస్తి అని నమ్మినవాడిని. చదువుకోనివాడిని, పల్లెటూరివాడిని, మా పల్లెటూరి మాటలు సున్నితంగా ఉండవు, కొంచం మోటు కూడా!. డిగ్రీలు లేవు, యూనివర్సిటీలు ఎరగను, కాలేజి మెట్లే ఎక్కనివాడిని యూనివర్సిటీ గురించి మాట్లాడటం హాస్యాస్పదం కదా! చిన్నప్పుడు బట్టీ వేసిన కొన్ని శతకాలు మాత్రం అస్తిగతాలు. అవే బయటపడుతుంటాయి.  మనసులో బాధ, సంతోష వ్యక్తం చేయడమే! ఎవరేనా కొన్నిమాటలు గాని, కొన్ని టపాలుగాని తమను ఉద్దేశించినవి అని అనుకుంటే అసహాయుడను.

నమస్కారం.


 ఆగండి! ఆగండి!! ఎవరో ఏదో అన్నారని, అనుకున్నారని బ్లాగులో రాయడం మాత్రం మానలేను, లేను,లేను.   


మరోసారి నమస్కారం పెట్టను ఎందుకో చెప్పండి :)

2 comments:

  1. వజ్రం గారు,

    వజ్రాయుధం ప్రయోగించేసేరు, నా మీద. తట్టుకోగలనా? :)
    నమస్కారం

    ReplyDelete