Tuesday 23 August 2022

రుచి చేకురునటయ్య భాస్కరా!

 రుచి చేకురునటయ్య భాస్కరా!


కొంతమందితో మాటాడకపోవడం తప్పు. మరికొంతమందితో మాటాడటమూ తప్పే. ఎవరితో మాటాడాలి ఎంతవరకు మాటాడాలి, ఎలా మాటాడాలి అన్నదే వివేకం. దానినే భాస్కరశతకంలో ఇలా చెప్పేడు,శతకకారుడు. 


చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్

బదునుగ మంచికూర నలపాకము జేసినయైన యందు ఇం  

 పొదవెడునుప్పులేక రుచి చేకురునటయ్య భాస్కరా!


ఎంతచదువు చదివినా మాటాడకూడని చోట మాటాడటం మాటాడవలసిన చోట మౌనంగా ఉండటం తప్పే! ఇది తెలుసుకోవడమే రుచి కలిగించే ఉప్పులాటి రసజ్ఞత.


ఎంతచదువు చదివి ఎన్ని నేర్చినగాని 

హీనుడవగుణంబు మాన్చలేడు

బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు 

విశ్వదాభిరామ వినుర వేమ


పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతోకాని పోదు.పాముకి పాలు పోసిపెంచినా విషమే కక్కుతుంది. ఇది తెలుసుకోవడం విజ్ఞత.


ఎంత విజ్ఞానం ఉండి ఆచరణలేని విజ్ఞానం నిష్పలం, ఉపయోగంలో లేని విజ్ఞానం అడవికాచిన వెన్నెల.


2 comments:

  1. భర్తృహరి గారు ఏమన్నారో ఈ అంశం మీద? ఎనీ ఐడియా, శర్మ గారు?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      భర్తృహరి ఈ విషయంలో ”కేయూరాణి.........వాగ్భూషణం,భూషణం” అన్నారు.కాని భాస్కర శతక కారునిలా మాట రసజ్ఞత గురించి చెప్పినట్టులేదు, లేదో నేనే పొరబడ్డానో! రసజ్ఞత ను ఉప్పుతో పోల్చారు కవి, నిజానికి చూస్తే ఇదేం పోలిక అనిపిస్తుంది కాని వంటలో సరిగా ఉప్పు లేకపోతే వంట ఎంత ఛండాలంగా ఉంటుందో మాటలో రసజ్ఞత లేకపోతే అలాగే ఉంటుందని చెప్పిన మాట ఎంత గొప్పగా ఉందన్నదే ఇప్పటి మాట :)

      ఇక మా పల్లెటురివాళ్ళమైతే ”నోరా వీపుకి దెబ్బలు తేకే” అనేస్తాం! :) అంతేకాదు ”పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతోకాని పోదనీ” అనేస్తాం :)

      Delete