మళ్ళీ జూదం (అనుద్యూతం)
అంధ్రమహాభారతం,సభాపర్వం,ద్వితీయాశ్వాసం 270 నుండి 279 వరకు స్వేఛ్ఛానువాదం.
జూదమయిపోయింది, ధర్మరాజు సర్వమూ కోల్పోయాడు, తననూ తమ్ములనూ కోల్పోయి శకుని చెప్పినట్టు ద్రౌపదిని ఒడ్డి ఓడి పోగా, ఆమె ఏకవస్త్రను, రజస్వలను అని చెబుతున్నా వినక దుశ్శాసనుడు కొప్పుపట్టి సభకు ఈడ్చుకురావడం, ఆపై వస్త్రాపహరణానికి ప్రయత్నమూ జరిగింది. భీముని ప్రతినలూ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధారి విదురునితో వచ్చి సభలో జరిగినిది సర్వమూ చెప్పడమూ జరిగింది, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి రెండు వారాలివ్వడమూ జరిగింది, ఆమె అడగకపోయినా. ఆ తరవాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును, తమ్ములందరితోనూ దగ్గరకు పిలిచి ధర్మరాజుకి,కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పి, వారి రాజ్యం వారికిచ్చి పంపించాడు. వారంతా ఇంద్రప్రస్థం వెళ్ళారు.
"ఇక్కడ జరిగిన సంగతంతా దుశ్శాసనుడు అన్న దుర్యోధనుని చెవిని వేశాడు. దుర్యోధనుడు, కర్ణ, శకుని,సైంధవులతో ఆలోచించి ధృతరాష్ట్రుని దగ్గరకొచ్చి,ఎంతమంచి చేసినా పాండవులకు ప్రీకరమైనవాళ్ళమవుతామా? పగపట్టిన పాముని మెడలో వేసుకున్నట్టయింది, పొరపాటు చేసేసేం.బలవంతులైన అర్జున,భీమ, నకుల సహదేవులను యుద్ధంలో గెలవగలమా? అంచేత మళ్ళీ వాళ్ళని ద్యూతం లో ఓడించి దేశం నుంచి వెళ్ళగొట్టడం చేయవలసిన పనని ధృతరాష్ట్రుని చెప్పగా ఒప్పుకుని మళ్ళీ జూదానికి రమ్మని ప్రాతికామిని పంపించాడు. ప్రాతికామి చెప్పినకబురుతో ధర్మరాజు, అనుజ,భార్యా సహితుడై హస్తిన చేరాడు, తండ్రి మాట జవదాటలేనని, మిత్రులు ప్రజలు గోలపెడుతున్నా!. ఇదివరలాగే అదే సభాభవనంలో ఆసీనులుకాగా, శకుని ధర్మరాజుతో సంపదలు రాజ్యము మీకు ధృతరాష్ట్రుడు గౌరవంగా ఇచ్చేడు, కనక వాటిని పందెంగా ఒడ్డి అడటం కుదరదు.ఇప్పుడు నేను చెప్పే పందెం అపూర్వం. ఇందులో ఓడినవారు నారచీరలుగట్టి,బ్రహ్మచర్యంతో, కందమూలఫలాలు తింటూ, పన్నెండేళ్ళు వనవాసం చెయ్యాలి, పదమూడో ఏట జనపదంలో అజ్ఞాతవాసమూ చెయ్యాలి. అజ్ఞాతవాసంలో పట్టుబడితే మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసమూ, ఆపై అజ్ఞాతవాసమూ చెయ్యాలి. ఇందుకు ఇష్టపడితే జూదమాడదామన్నాడు. ధర్మారజు పందెం ఒడ్డేడు, ఓడిపోయాడు. అన్నట్టుగానే నారచీరలుగట్టి వనవాసానికి పోయారు."
కొద్దికాలం కితం జూదం జరిగినదానికి, కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పిన ధృతరాష్ట్రుడు, మళ్ళీ జూదానికెందుకొప్పుకున్నట్టు?
కొడుకు మొహమాటం లేకుండానే చెప్పేసేడు, వాళ్ళు బలవంతులు, యుద్ధం చేసి నెగ్గలేం. ఎలాగైనా వాళ్ళని రాజ్యం నుంచి బయటకి తోలెయ్యడమే కావలసింది, అనికూడా చెప్పేసేడు. ధృతరాష్ట్రునికి కావలసింది కూడా పాండవులు బయటికిపోవడమే! కాని అది తను చేస్తున్నట్టు ఉండకూడదు, అదీ ఉద్దేశం. మూలకారణం ధృతరాష్ట్రుడే!
కితం సారి జూదం జరిగినపుడు సభంతా కలగుండుపడింది, నాడు జరిగిన విషయాలన్నీ అందరికి బాధ కలిగించాయి. గాంధారి అగ్నిపర్వతంలా ఉంది, ఎప్పుడు పేలుతుందో చెప్పలేనట్టు ఉంది. ఇక ద్రౌపది బద్దలైన అగ్ని పర్వతమే, వాళ్ళని చల్లార్చకపోతే నాడు కురుక్షేత్రం అక్కడే జరిగుండేది. అందుకు వరాలిచ్చి బులిబుచ్చి మాటలు చెప్పి వాళ్ళకి రాజ్యం ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు కొడుకు చెప్పిన పథకం నచ్చింది. ఇందులో రాజ్య ప్రసక్తిగాని, స్త్రీలను అవమానించే ప్రసక్తిగాని లేదు. పదమూడేళ్ళ తర్వాత ఏమగునో? ఎవరి కెరుక? అదేగాక అజ్ఞాతంలో దొరికితే మళ్ళీ అరణ్య,అజ్ఞాతవాసాలు చెయ్యాలి, పథకం బాగా నచ్చింది, ధృతరాష్ట్రునికి, అందుకే మళ్ళీ కబురు పెట్టేడు. ధర్మరాజుకి బుద్ధి లేదా? ఆయనదొకటే మాట తండ్రి చెప్పేడు, అంతే!