Wednesday 30 December 2020

పీత్వామోహమయీం ప్రమాదమదిరా

 పీత్వామోహమయీం ప్రమాదమదిరా


ఆదిత్యస్యగతాగతై రహరహ స్సంక్షీయతే జీవితం

వ్యాపారై ర్బహుకార్యభారగురుభిః కాలో న విజ్ఞాయతే

దృష్ట్వా జన్మజరావిపత్తిమరణం త్రాస శ్చనోత్పద్యతే

పీత్వామోహమయీం ప్రమాదమదిరా మున్మత్తభూతం జగత్.


సూర్యుని ఉదయాస్తమాలతో ఆయువు తరిగిపోతోంది. ఎడతెగని పనులలో మునిగితేలు జనులు అది గుర్తించకున్నారు.పుడుతున్నవారిని, చనిపోతున్నవారిని, ముసలివాళ్ళవుతున్నవాళ్ళని,కష్టాలు పడుతున్నవాళ్ళని చూస్తూ కూడా జనులు భయపడటం లేదు. కల్లుతాగి పిచ్చెక్కినట్టు అజ్ఞానం లో పడి ఉంది, జగత్తులో జనసమూహం. అనగా తెలుసుకోవలసినదానిని తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు.


తెల్లవారుతోంది పొద్దుగూకుతోంది, రోజులు,వారాలు,నెలలు, సంవత్సరం 

గడచిపోతోంది.   కొత్త సంవత్సరం   వచ్చేస్తోంది, పండగ చేసుకుంటున్నాం, ఎలా?సంవత్సరం ఆఖరిరోజు, అర్ధరాత్రి దాకా మేలుకుంటున్నాం. ఆడా మగా తేడా లేక గుమిగూడుతున్నాం, మన దీపాలు మనమే ఆర్పుకుంటున్నాం. పన్నెండుకి చీకట్లో కొత్త సంవత్సరం వచ్చిందని అరుస్తున్నాం, దీపాలు వెలిగించుకుంటూ తాగుతున్నాం, వాగుతున్నాం, ఊగుతున్నాం. ఆ తరవాత ఒళ్ళు తెలియని స్థితిలో ఆడా మగా తేడా లేక మోటర్ సైకిళ్ళెక్కి హేపీ న్యూ ఇయర్ అని అరుస్తూ ఊరు తిరుగుతున్నాం. ఇదేమిరా అని అడిగినవారిని ఈసడిస్తున్నాం. సంస్కారం లేనివాళ్ళు అంటున్నాం. మన పయనమెటు?

  ఇదంతా ఎందుకో తెలీదు, అదో ఆనందం, తుత్తి. కాని ఒక సంవత్సరం ఆయుస్సు గడచిపోయిందనుకోటం లేదు. గడచిన సంవత్సరం ఎలా గడచిందీ? రోగం,భయం, పుట్టేవాళ్ళు పుడుతున్నారు, పుట్టినరోజు పండగలూ చేస్తున్నాం, పెరిగేవాళ్ళు పెరుగుతున్నారు, కష్టపడేవాళ్ళు     పడుతున్నారు, ముసలాళ్ళవుతున్నారు ఛస్తున్నారు, వాళ్ళని పంపించేసి వస్తున్నాం. ఇంత మన కళ్ళ ఎదుట జరుగుతున్నా, పనుల్లో పడిపోయి తిరిగుతున్నాం. రేపు మనకూ ఇదేగతి పడుతుందనే భయమే కనపడటం లేదు. మూము గుడ్డలు కట్టుకోవలసివచ్చినా, తిరిగేస్తున్నాం లేకపోయినా. కొత్త దయ్యమొచ్చింది, భయమేలేదు. అయ్యో కాలం ఇలా జరిగిపోతూ ఉంది, ఈ పుట్టుక చావుల అంతరార్ధం ఏమిటీ? ఈమధ్య కాలంలో కల్లుతాగినపిచ్చెక్కిన కోతిలా, మోహంతో డబ్బు వెనక ఎందుకు పడిపోతున్నాం, దీనికి కారణం అన్వేషించటం లేదు. అసూయ, ద్వేషాలతో కొట్టుకుంటున్నాం, ఇదే సుఖం అనుకుంటున్నాం,ఇంతేనా ఈ కతంతేనా?  

 అనుదినమున్ నశించు బరమాయువు సూర్యునిరాకపోకలన్

ఘనబహుకార్యభారముల గాలము పోవుట గానరాదు సం

జననజరామయంబులును జావునుజూచి భయంబు లేదు, దు

ర్జనభువనంబు మోహమదిరారస విహ్వల మయ్యె నయ్యయో...లక్ష్మణ కవి

స్వస్తి


6 comments:



  1. హేవిటో ! తల తిక్క సమాచారం . ఉన్నన్ని నాళ్లు లైఫ్ ఎంజాయ్ చెయ్యక సూరీడు ఎగ బాకె దిగ బాకె అంటూ ఉస్సూరు మంటూ ఏడ్పు ంంంంంం మొగాలున్ను!

    అబ్బబ్బ ఈ భారతీయుల వేదాంత ధోరణి పాసగూల నిర్వీర్యులని చేసేస్తోంది జనాల్ని.


    ప్చ్! ప్చ్! ప్చ్!


    జిలేబి

    ReplyDelete
    Replies

    1. ఐతే నేటి రాత్రి పన్నెండు గంటలకి మందు పార్టీ ఆ తరవాత జిలేబి ఊరేగింపు అనమాట. అస్తు.

      Delete
  2. ఈ ఏడాది ముప్పావు వంతంతా మూడు రికవరీలు ఆరు ఇన్ఫెక్షన్లు గా సాగింది. శార్వరి నామ ఉగాది కోవిడ్ శరాఘాతం గావించి కరోనా నామ సంవత్సరమై చరిత్ర పూటల్లో ఎక్కేసినాద్..

    వచ్చే ఏడాది ఎలా ఉండబోతోందో ఏమో.. నెమరు వేసుకోవటానికి గడచిన సంవత్సరమంత మాస్కులు, శానిటైజర్, డిస్టంసింగ్ లతోనే సరిపోయింది.. మరీ వచ్చే ఏడాది ఈ ఏడాదికి ఫోటోకాపి కాబోతోందో.. లేదా ఎఫికసి వ్యాక్సిన్ మూలానా సాధారణ జీవనశైలి సాగబోదోంతో లేక కీడేంచి మేలెంచ మనినట్లు ఇంకా భయంకరోత్పాతాన్ని సృష్టించబోతోందో.. ఏమో.. మనం కేవలం సాక్షులం.. నిమిత్తమాత్రులం.. వీటన్నిటికి ఆ కాలమే సమాధాన పరచగలదు.. ఏది ఏమైనా వచ్చే ప్లవ నామ ఉగాది పేరిట ఏ విప్లవానికి దారి తీయబోతోందో అంతా దైవేచ్ఛా.. మార్ఘళి మాసం.. గోదారంగనాధ.. పెరుమాళాండాళ్.. మలయప్ప

    ReplyDelete
    Replies

    1. జరగబోయేదానికి ఎదురు చూడ్డం తప్ప చేయగలది కనపడటం లేదండి.

      Delete
  3. మనచేతిలోనె లేవే ,
    మనచావూ పుట్టుక, నడుమనగల వన్నీ
    మనచేతిలోనెగలవని
    మనుజుడు తెగవిఱ్ఱవీగు మహిత జిలేబీ !

    ReplyDelete
    Replies
    1. రాజావారు

      మాయ అంతా మాయ:)

      Delete