అరటాకివ్వకపోతే ఆపద తప్పదా?
ఉదయమే 4 కి లేచి పెరటిలోనే నడిచే అలవాటు,నిద్ర పట్టదుగా😂. ఆ తరవాత అక్కడే తూర్పు వరండాలో కూచుని ప్రాణాయమం,యోగా చేయడం అలవాటు 😂 .😂 ఆరోజు దశమి, ఉదయమే నడక తరవాత వరండాలో కూచుని ప్రాణాయామం చేస్తున్నా! ప్రాణాయామ సమయంలో కళ్ళు మూసుకోడం మరో అలవాటు.
ఎప్పుడు దూరేడో కాని కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగా కత్తి పుచ్చుకుని ఒక చిన్న కుర్రోడు ఐదు ఆరేళ్ళవాడు నిలబడి ఉన్నాడు. నీకు నేను చేసిన అపకారమేంటి నాయనా, ఉదయమే కత్తి పుచ్చుకొచ్చేవు. ఐనా నీకు అన్యాయం చేయడానికి గాని మరెందుకూ ఓపిక లేక ఉన్నవాడిని. ఎందుకు పొద్దుటే నన్ను పొడవడానికి కత్తి పట్టుకొచ్చావు? అనుకున్నాగాని మాట గొంతు దాటి బయటకు రాలేదు. పక్కనే ఉన్న కర్ర పుచ్చుకుని ఒక్కటేయచ్చు కాని వాడి చలాకీ చూస్తే నా ప్రయత్నం ఏం సఫలం కానట్టే ఉంది. ఎర్రతేలులా, కోల మొహం, రెండడుగుల ఎత్తు,మోకాళ్ళు దిగిన చొక్కా,దానికింద అది పఠాన్ డ్రస్సు అనిపించింది. మనదేశం లోకి బుల్లి ఉగ్రవాదులు కూడా కత్తులు పుచ్చుకు తిరుగుతున్నారా అని సందేహమూ వచ్చింది.
ఏంకావాలి? ఎందుకొచ్చేవు? ఎవరు నువ్వు? ఏమిటని? కొన్ని ప్రశ్నలు సంధించేననుకున్నా! వాడు అలాగే కత్తి పుచ్చుకు నిలబడే ఉన్నాడు, పెదవి విప్పి మాటలేదు. వాడు మాటాడితే నాకు వినపడలేదో! ఈ సారి కొంచం గట్టిగానే అడిగా. ఇంతలో కోడలమ్మాయి బయటికొచ్చి, అరటాకు కోసం కత్తి పట్టుకొచ్చాడు,ఇక్కడ రెండవ అపార్టు మెంట్లో ఉంటారు, అని చెప్పింది. దాంటో కొంత సద్దుకున్నా! వాడు మాత్రం ఆకు ఇస్తావా! చస్తావా! అన్నట్టె నిలబడ్డాడు. తలెత్తి చూస్తిని కదా ఆకులన్నీ మొన్న తుఫానుగాలికి చిరిగిపోయి ఉన్నాయి, ఉన్నవి రెండే చెట్లు,మిగిలినవి పీకి పారేయించా. ఏం చేయాలో తోచక అరటి చెట్ల చుట్టూ తిరిగి చేతికి అందనంత ఎత్తులో సగం చిరిగిన ఆకును గుర్తించి,వణుకుతున్న చేతులతో వాడి కత్తి పుచ్చుకుని, అందని ఆకును కర్రతో కష్టపడి వంచి, ముక్కు కూడా తెగని ఆ బండ కత్తితో ఆకు కోసి వాడి చేతిలో పెట్టి,బతుకు జీవుడా అనుకున్నా! అబ్బే వాడు కదిలితేనా? చెయ్యి చాపేడు అప్పుడు గుర్తొచ్చింది, వాడి చేతిలో కత్తి నాచేతులో ఉందని,ఆ కత్తి వాడికిచ్చి,ఇంతకంటే చిరగని ఆకులు లేవని చెప్పి చూపించి పంపేటప్పటికి బ్రహ్మ ప్రళయమయ్యింది.