Saturday, 25 January 2025

ఆందోళన జీవి.

 ఆందోళన జీవి.


ఎలుక ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది, లేకపోతే చచ్చిపోతుంది.  ఎలుక బతకాలంటే ఏదో ఒకటి నిత్యం కొరుకుతూనే ఉండాలి. ఎందుకలా ఇది గదా కొచ్చను. 


ఎలుక దేన్నీ   కొరకకుండా ఉండిపొతే  పళ్ళు పెరిగిపోతాయి,ఎంతలా? దాని దవడలను పుళ్ళు పడేటంతగా. ఐతే ఏమవుతుంది? పుళ్ళు పడితే,పళ్ళు పెరిగితే ఏమీ తినలేదు,చనిపోతుంది, అందుకు నిత్యం ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది. ఎలక కొట్టని వస్తువు లేదు. 


దీనికీ ఆందోళన జీవికి ఏంటి లింకు? 

దుఃఖ భాగులు ఆరుగురు తెలుసుగా. ఇందులో నిత్య శంకితుడు,నిస్సంతోషి అనేవారిద్దరున్నారు. వారి కలయికతో పుట్టినవాడే ఆందోళన జీవి.  ఈ ఆందోళన జీవి ఏదో ఒక దానిగురించి ఎప్పుడూ సంశయం వెలిబుచ్చుతూనే ఉండాలి,ఏదో ఒకదాని గురించి ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉండాలి.  లేకపోతే ఏమవుతుంది? ఈ కుళ్ళు అంతా మనసులో పేరుకుపోయి ప్రమాదానికి దారి తీస్తుంది. 

అందోళన జీవి ఎప్పుడూ ఏడుస్తూనే ఉండాలి, ఎప్పుడేనా నవ్వినా పెద్దప్రమాదం తనకో,గ్రామానికో,జిల్లాకో,రాష్ట్రానొకో,దేశానికో వచ్చి తీరుతుంది. అందువలన,అందుచేత,అందుకొరకు ఆందోళనజీవి ఎప్పుడూ ఏడుస్తూనే,అరుస్తూనే ఉండాలి. అస్తు!

స్వస్తి!


లోకాః సమస్తాః సుఖినోభవంతు!

Wednesday, 22 January 2025

సలహా!

సలహా!

అమితమైన కష్టంలో కావలసినవారు ఆసుపత్రిలో ఉండి,విషయం చెప్పినపుడు చేయగలదేమి ఉంటుంది?

జాగ్రత్త అనా?

ఆసుపత్రిలో జేర్చిన తరవాత మరి జాగ్రత్తలేం తీసుకోగలరు. 

విని ఊరుకోవడమా?

కాదే! వారెందుకు చెబుతున్నట్టు? 

మనం ఆత్మీయులమని తలచి కదా సంగతి చెబుతున్నది. ఏం చేయాలి?

జరిగేది జరుగుతుంది,నిశ్చింతగా ఉండమనా?

అదే పరిస్థితులలో మనమున్నపుడు అలా చేయగలమా?

మరేం చేయాలి? ఇది నిజంగా అందరిని వేధించే ప్రశ్న.

వీలైతే వెళ్ళి ఒక సారి చూడాలి. మనిషి సాయం అవసరమైతే చేయాలి. నిబ్బరంగా ఉండమని నెమ్మదిగా చెప్పాలి. సొమ్ము అవసరమేమో కనుక్కోవాలి. ఇదీ నాకు తోచినది.

అన్నీ చేస్తాంగాని ఆ ఒక్కటీ అడక్కు అనుకుంటాం. అంతే! ఇదే వింత లోకం. అంతా విష్ణుమాయ అనుకుంటాం.

Monday, 20 January 2025

వయసొస్తే

 


వయసొస్తే 


 వయసొస్తే వంకరకాళ్ళు కూడా తిన్నబడతాయి. 

వయసులో గాడిదపిల్ల కూడా అందంగానే ఉంటుంది.

గుర్రాన్ని నీళ్ళ దాకా బలవంతంగానైనా తొలుకెళ్లగలవు కానీ నీరు తాగించలేవు.

ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయలేదని నానుడి.

(అను)రాగ, ద్వేషాలు రెండూ దుఃఖ కారకాలే!

అనురాగం మొదటనవ్వించి తరవాత ఏడిపిస్తే, ద్వేషం ఎప్పుడూ ఏడిపించేదే! ఇంతే తేడా!!

Friday, 17 January 2025

మనసు--సమస్య

మనసు--సమస్య


మనసు సమస్యను సృష్టించుకుంటుంది.  సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది. సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. 


ఎలా? అన్నది ప్రశ్న.


ఒక పని కావాలని తలపెట్టేవు,కావటం లేదు. సమస్య అనుకున్నావు, సమస్య పరిష్కారం కావటం లేదని బాధపడుతున్నావు. మనసును కట్టడి చేస్తే సమస్యలేదు కాదు పుట్టదు.నువు బాధ పడినంతలో సమస్య పరిష్కారం అవుతుందా? కాదు, కానేకాదు. ఆ పని పరిష్కారానికి నీవు చేయవలసినది చేయి, అదే పురుష ప్రయత్నం. ఫలితం పరమాత్మకి వదలిపెట్టు.  అప్పుడు నీ మనసుకు బాధ లేదు. నీకు అనుకూలంగా పరిష్కారం కావాలని దైవం (అదే విధి)తలిస్తే అలాగే జరుతుంది. శంకరులు చెప్పినట్టు ''మూకం కరోతి వాచలం'',''పంగుం లంఘయతే గిరిం'' (మూగవాడు ధారాళంగా మాటాడగలడు, కుంటివాడు పర్వతాలు దాటేస్తాడు.)   అనుకూలంగా పరిష్కారం కాలేదు,బాధపడవు, అది దైవ నిర్ణయం కనుక.  మనం బాధపడినంతలో దైవ నిర్ణయం మారదు. జరగవలసినది జరిగి తీరుతుంది. దానిని మనం మార్చలేం.


Monday, 13 January 2025

శ్రీ మాత్రేనమః

 శ్రీ మాత్రేనమః   వీరుళ్ళమ్మ అమ్మవారు.



ఇంటి వద్ద వేసిన భోగిమంట


అమ్మకానికొచ్చిన భోగిపిడకలు.


t



Saturday, 11 January 2025

తెనుగువారి పండగలు.

 తెనుగువారి పండగలు.


మన పండగలు తిథి ప్రకారం చేసుకుంటాం. తిథి చంద్ర గమనాన్ని లెక్కించేది. కొన్ని పండగలు సూర్యుని గమనాన్ని బట్టి చేసుకుంటాం. అందుకే అవి అదే నెల అదే తేదీలలో వస్తుంటాయి,సంక్రాంతి,తమిళుల ఉగాదిలాగా!


పాడ్యమి సంవత్సరాది పాడ్యమి.  

విదియ భాను విదియ.

తదియ ఉమాచంద్రోదయామా వ్రతం అనే అట్లతద్ది.

చవితి వినాయక చవితి.

పంచమి ఋషి పంచమి.

షష్టి సుబ్బారాయుడు షష్టి

సప్తమి రథ సప్తమి.

అష్టమి కృష్ణాష్టమి

నవమి శ్రీరామ నవమి

దశమి విజయ దశమి.

ఏకాదశి భీష్మైకాదశి.

ద్వాదశి చిలుకు ద్వాదశి.

త్రయోదశి శని త్రయోదశి.

చతుర్దశి నరక చతుర్దశి, అనంత పద్మనాభ చతుర్దశి  

అమావాస్య దీపావళి అమావాస్య.

పున్నమి కార్తీక పున్నమి.


Wednesday, 8 January 2025

HMPV

 

HMPV

మార్గశిరమాసం చలి మంటల్లో పడినా తగ్గదు.
పుష్యమాసం చలి పులిలా మీదబడుతుంది. ఇవి పాతకాలపు సామెతలు.

మార్గశిరం లోనే చలి,దగ్గు,రొంప,పులకరంతో ఆరోగ్యం చెడింది. ఏమీ చేయడానికి తోచదు,గదిలోంచి బయటకి కాలు పెట్టేందుకు లేదు. సూర్యుడు మబ్బులోంచి,మంచుతెరలోంచి కనపడింది లేదు.  ఇలా న డుస్తున్నాయి రోజులు, భారంగా. ముక్కులనుంచి శ్వాస ఆడితే పండగలా ఉంది. చలి పెరిగిందయ్యా! అంటే కాదు మీ ఓపిక తగ్గిందన్నాడో మిత్రుడు.

 ఇలా కాలం నడుస్తుండగా మొన్ననో రోజు పొగ రై కమ్మేసింది. ఊపిరాడదు,దగ్గు సతమతమయ్యాను. ఏంటని విచారిస్తే పొగ వాసన వల్లనితేలింది, టైర్లు చలిమంట వేసుకుంటున్నారని. ఆయ్యో!  అవి వద్దయ్యా అని చెబితే! అనిపించింది. చలిమంటేసుకోవడం మా హక్కు నువ్వేవడివి వద్దనడానికంటే ! సమాధానం లేదు గదా! చలిమంటేసుకోవద్దనటం లేదు, టైర్లు కాలిస్తే వచ్చే పొగ పీలిస్తే ప్రమాదమంటే! చలికి ఛస్తుంటే, ఆరోగ్యం మాట తరవాత,ముందు చలి అని వాదిస్తే చేయగలది లేదు గనక నోరు మూసుకుని ఉండి గౌరవం కాపాడుకోడం మచిదని చెప్పలేదు. మూడు గంటలు కిందా మీదాబడి బతికేను. సామాన్యుడు చెప్పబోతే ఇలా ఉంటది. అదే పెద్దోళ్ళకి కాలిందని తెలిస్తే చాలు  చలి,లేదు పులిలేదు,పుంజాలు తెంపుకుని పరిగెడతారు. లోకమింతే బాబూ! 


చైనాలో ఏదో రోగంతో ఆసుపత్రులు కాళీ లేవుట,శ్మశానాలూ కాళీ లేవని సోషల్ మీడియా కోడై కూస్తోందిట. చైనాలో ఉన్నది HMPV  అని ఇది సామాన్యమేనని అంటున్నారు కొందరు, ఐతే చైనా ఏమిటో చెప్పకపోవడంతో భారత్ ఐక్యరాజ్య సమితికి ఒక ఉత్తరం రాసింది,చైనాలో జరుగుతున్నదేంటో చెబితే మా దగ్గర కావలసిన జాగ్రత్తలు తీసుకుంటామని. దీని లచ్చనాలు చూస్తే కోవిడ్ లాగానే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నది HMPV  యా లేక HMPV రూపాంతరం చెందిన వైరస్సా! ఏమైతేనేం గాక ఆసుపత్రులకి డాక్టర్లకి పండగొచ్చింది,మళ్ళీ. మాస్కులు మళ్ళీ బయటికొచ్చాయి. ప్రతి ఐదేళ్ళకి ఒక సారి ఇలా డిసెంబరు 25 నుంచి జనవరి 25 దాకా రోగాల పండగ చేసుకుంటే బాగుంటుందేమో. ఈ పండగని ఐక్యరాజ్య సమితి  ప్రకటిస్తే బాగుంటుంది.   

మేరా భారత్ మహాన్,అప్పుడే దీనిమీద రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏది నిజం,తెలియదు. వస్తే అనుభవించడమే. దీని లక్ష్యం ప్రస్థుతానికి చిన్న పిల్లలు,వయసు మీదబడ్డవాళ్ళు.