Friday 8 March 2024

ఉత్తర ముఖంగా ఉన్న శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలి?

 ఉత్తర ముఖంగా ఉన్న శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలి?


సాధారణంగా ఆలయాలన్నీ తూర్పువైపు ముఖంగా ఉంటాయి.మరే వైపు ముఖంగా ఉన్నా ఇబ్బందులూ లేవనుకుంటాను. కాని శివాలయానికో చిన్న చిక్కుంది. శివునికి రూపులేదు లింగాకారుడు. కాని ఈ లింగం పానవట్టం మీద ఉంటుంది. సోమ సూత్రం ఎప్పుడూ ఉత్తరం వైపే ఉంటుంది. తూర్పు,దక్షిణ,పశ్చిమ ముఖ ఆలాయాలకు సోమసూత్రం ఉత్తరంగానే ఉంటుంది, మరి ఉత్తర ముఖంగా ఉన్న శివాలయానికి సోమసూత్రం ఎటు ఉంటుంది? 


శివాలయ ప్రదక్షిణ చేయాలంటే సోమసూత్రం దాటకుండా చేయాలి, అక్కడుండే చండీశ్వరుని దర్శనం ముందు చేసుకుని వెనక్కొచ్చి,  ఇలా ప్రదక్షణo చేయాలి. ఇది ఏ దిక్కుకి ముఖం ఉన్నదానిని బట్టి ప్రదక్షిణం తీరు ఆధారపడిఉంటుందికదా!   ఎటైనా చండీశ్వరుణ్ణి దాటకుండా ప్రదక్షిణం చేయ్యాలి.


సాధారణంగా మనతెనుగునాట చండీశ్వరుడే కనపడటం లేదు. 

కార్తీక మాసంలో మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళేను, పుట్టినరోజు.   ఆలయం చాలాచిన్నది కాని, గొప్పదని తెలుసుకోడమే ఆలస్యమయింది. సాధారణంగా ఆలయాలన్నీ తూర్పు ముఖంగా ఉంటాయి, ఈ ఆలయం పశ్చిమ ముఖంగా ఉంది. విశేషం పరిశీలిస్తే పశ్చిమ ముఖంగా ఉన్న ఈశ్వరుని సద్యోజాత ముఖాయైనమః అని నమస్కరించాలి, ఈముఖంగా ఉన్న ఈశ్వరుడు కోరికలను శీఘ్రంగా అనుగ్రహిస్తాడని అనూచానంగా చెప్పుకునేమాట. ఈశ్వరునికి ఐదు ముఖాలు ఐదు ముఖాలకీ పేర్లున్నాయి.

 ఓం సద్యోజాతా నమః

ప్రాలేయాచల చంద్రకుంద ధవళం గోక్షీరఫేన ప్రభం

భస్మాభ్యక్తమనంగదేహ దహన జ్వాలావళీ లోచనం

బ్రహ్మేంద్రాది మరుద్గుణై స్తుతిపరై రభ్యర్చితమ్ యోగిభి

వందేహం సకలం కళంకరహితమ్ స్థాణోర్ముఖం పశ్చిమం


హిమవత్పర్వతం,చంద్రుడు,మొల్లపువ్వు వీటివలె తెల్లనిది పాలనురుగువలె తెల్లని కాంతికలది విభూతిపూయబడినదీ,మన్మధుని శరీరాన్ని దహించు జ్వాలలపంక్తితో నిండిన కన్ను కలది స్తోత్రము చేయుచున్న బ్రాహ్మ,ఇంద్రాది దేవతలు,మరుత్తులచేత ,యోగులచేత స్తుతింపబడుచున్నదైన,నిర్మలమైన నిండువదనముతో నున్నదైన శివుని పశ్చిమ ముఖమునకు నమస్కరించు చున్నాను. 


ఇంకేమి? ఈ ఆలయం పొందికగా ఉంది, గణపతి,సుబ్రహ్మణ్యుడు,  అమ్మవారు,  అంతేకాదు సోమసూత్రం దగ్గర చండుడు, అంతా లెక్కప్రకారంగా ఉండటంతో బాగా నచ్చేసింది. దానికితోడు ఆలయం నడక ట్రేక్ ఎంత దూరమో, అంత దూరంలోనే ఉంది. దీనితో పుణ్యం పురుషార్ధం అన్నారుకదా! ట్రేక్, చుట్టూ  అప్రదక్షణాలకంటే  గుడి దగ్గర మేలుకదా అని గుడికే రాకపోకలు సాగిస్తున్నా, ఉదయమే!  ప్రదక్షిణాలు శివాలయం లో చేయవలసినట్టు చేస్తున్నా! ఇదొక అదనపు మాట. దీంతో భక్తి పెరిగింది మరి చాదస్తమూ పెరిగింది,చెప్పిందే మళ్ళీమళ్ళీ చెబుతున్నా!  


'దరిద్రుడు తలగడిగితే వడగళ్ళవాన ఎదురైనట్టు', అన్న సామెతగా, పెద్దపండగ దాటేకా ఇదీ చెట్టెక్కేసింది, కారణాలనేకం. ఈ అనుమానం మాత్రం ఉండిపోయింది.  ఈ రోజు దర్శనానికి వెళ్ళాలి,స్వామి దయతో!

4 comments:

  1. బోధన్ పట్టణం లోని చక్రేశ్వరాలయం ప్రసిద్ధం. ఈ ఆలయం లో చక్రేశ్వరుని బృహత్ లింగం పశ్చిమ ముఖం గా ప్రతిష్టితం అయి ఉన్నది. ఓం నమశ్శివాయ🙏

    ReplyDelete
    Replies
    1. బుచికి8 March 2024 at 21:03
      సాధారణంగా శివాలయాలన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. మిగిలిన దిశలలో శివాలయాలు అరుదు. పశ్చిమముఖ ఈశ్వరుణ్ణి సత్యోజాతం అంటారట. కోరికల్ని తొందరగా నెరవేరుస్తాడని ప్రతీతి. బోధన్ లో ఉన్న ఆలయం పశ్చిమ ముఖంగా ఉన్నదని తెలియదు. తూర్పు మూఖంగా కాక మిగిలిన దిశలుగా ఉన్న శివాలయాలని దర్శించడం శ్రేష్టం. వీలు కుదిరితే దర్శించడం మంచిది.
      ధన్యవాదాలు

      Delete
  2. పరమేశ్వరుని సజ్యోజాత ముఖం గురించి అందమైన స్తోత్రం అందించారు, దయజేసి మిగతా ముఖాలగురించి కూడా స్తోత్రాలు అందించి వాటి విషయాలు కూడా తెలియజేయగలరు.

    కృతఙ్ఞతలు
    ఆనంద్ శర్మ

    ReplyDelete
  3. నందు26 March 2024 at 19:04
    ఇది మహాన్యాసంలోనిది. మహాన్యాసంలో శివుని పంచముఖ స్తోత్రం లోనిది. మహాన్యాస పూర్వక రుద్రాభీషేకం అంటేనే అందం. యుజుర్వేదం లో మానవులకి అందింపబడిన గొప్ప అవకాశం.
    --------------------------------
    మీ ఆజ్ఞను అమలు చేయాలనే కోరిక ఉన్నది. "నేను"అనుకునే ఈ శరీరం మీద జర,రుజ,ఔషధాలు,
    బద్ధకం జమిలి జమిలిగా దాడిచేసాయి. ఇదిచాలదనుకుని భాస్కరుడు మార్చ్ నెలలోనే బందీ చేసేసేడు! నెమ్మదిగా జారుకోవాలనే అనుకున్నా! శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని నానుడి! ఇది శివుని ఆజ్ఞగా భావిస్తాను,ప్రయత్నిస్తానండి.

    ReplyDelete