Sunday 25 September 2022

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానంది.

 ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానంది.




సాధారణంగా ఉట్టి ఎత్తుగానే కడతారు. రోజూ వాడుకునేదైతే కొంచం తక్కువ ఎత్తులో అంటే ఆ ఇంటి ఇల్లాలు నిలబడి చేతులెత్తితే అందేలా కట్టుకుంటారు. ఇందులో పాలు,పెరుగు దాచుకుంటారు, పిల్లి నుంచి రక్షించుకోడానికి.

ఇక స్వర్గమన్నది ఉందో లేదో తెలీదు, ఉంటే ఎక్కడుందంటే ఆకాశం వైపు చూపుతారు, ఎంత దూరమంటే తెలీదు.ఎగిరి వెళితే ఎంత కాలం పడుతుందంటే తెలీదు. ఇటువంటి ఏమీ తెలియని స్వర్గానికి, నిలబడి చేతులెత్తి ఉట్టి అందుకో లేని ఇల్లాలు, ఎగిరి వెళ్ళిపోతానందిట, ఆంటే హాస్యాస్పదంగా ఉందని అంటారు గిరీశం భాషలో గోతాలు కొయ్యడం. 


ఇదే మరోలా కూడా చెబుతారు, కూచుని లేవలేనమ్మ ఒంగుని తీర్థం వెళతానంది, అని. 


ఒక అత్తా ,కోడలు. అత్త ముసలిదై కూచుంటే లేవలేక లేస్తే కూచో లేక తిప్పలు పడుతోంది. నడుం ఒంగిపోవడంతో తిన్నగా నిలబడలేక, నడవలేక ఉన్నది, లేస్తే ఒంగుని నడుస్తుంది,కఱ్ఱపోటుతో.

 ఒక రోజు కోడలితో తీర్థం వెళతానంది. అత్తా! కూచుంటే లేవలేకున్నారు, ఎలా వెళ్ళగలరు తీర్థానికి? అక్కడ జన సమ్మర్దం, తోసుకుంటారు, మీకంత ఓపిక ఉందా? నడవగలరా? అడిగింది. దానికి అత్త, కూచుని లేవలేకపోవచ్చుగాని , ఒంగుని నడిచి తీర్థం వెళతానూ అందిట. విన్న కోడలు ముసి ముసి నవ్వులు నవ్వుకుందిట, పగలబడి నవ్వలేదు? ఎందుకూ?   



పంచాయతి ప్రెసిడెంట్ గా నెగ్గలేనివాడు ప్రధాన మంత్రి పదవికి పోటీ చేస్తానన్నట్టు.

ఇవి రెండూ తెనుగునాట చెప్పుకునే నానుడిలే సుమా!

1 comment:

  1. చంద్రశేఖర్ చేసినట్టున్నారండి

    ReplyDelete