కాటరాక్ట్ ఆపరేషన్
సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇది పెద్దలమాట. కాని బాగా అశ్రద్ధ చేయబడేదీ కన్నే!
నేటి రోజుల్లో ముఫై ఏళ్ళకే సుగర్ వ్యాధి కలుగుతోంది, దీని వల్ల వచ్చే అవకరాల్లో కాటరాక్ట్ ఒకటి. ఇది నెమ్మదిగా సంవత్సరాల తరబడి పెరుగుతుంది, నెమ్మదిగా దృష్టిని అడ్డుకుంటుంది. ఒకసారి కాటరాక్ట్ అని తేలితే ఆపరేషన్ తప్పదు, నేడో !రేపో!నాకు ఆరేళ్ళగా ఉన్నట్టు తెలిసింది,కాని అశ్రద్ధ చేసేను, కారణాలనేకం, అందులో భయం ముఖ్యమైనది.
నా అనుభవాలు రాస్తున్నా!
ఒకసారి ఆపరేషన్ కి నిర్ణయించుకున్న తరవాత డాక్టర్ గారితో తారీకు నిర్ణయం చేసుకున్నా! నిర్ణయమైన తారీకుకు ముందు నాలుగు రోజులు కంటిలో మందు చుక్కలు రోజూ నాలుగు సార్లు వేసుకోమన్నారు. రోజుకొక కాప్శూల్ వేసుకుని నాలుగో రోజు మూడు గంటలకి రమ్మన్నారు. అలాచేసి నాలుగో రోజు మధ్యాహ్నం మూడుకు చేరేం.ఒక రూం ఇచ్చారు. విశ్రాంతి తీసుకున్నా, ఆ తరవాత బి.పి,సుగర్,కారోనా టెస్టులయ్యాయి. వాటి ఫలితాలు చూసి కంటికి పరీక్ష చేసి అన్నీ బాగున్నాయి రేపు ఉదయం ఆరుగంటలి రండి, రోజూ వేసుకునే మందులు సమయం ప్రకారం వేసుకోండి, టిఫిన్ సమయానికి చేయండి. అని చెప్పి ఇంటి కెళ్ళి మరునాడు ఉదయమే రమ్మన్నారు.(లోకల్ కనక) ఆపరేషన్ లో ఉపయోగించే ఐ.ఒ.ఎల్ కొనమని రాసిచ్చారు, దాని ఖరీదు పదివేలు,అక్కడే పక్కన కొన్నాం.
మరునాడు ఉదయమే స్నానం అన్నీ పూర్తి చేసుకుని రోజువారీ మందులేసుని టిఫిన్ చేసి ఉదయం ఆరుకి రూంలో చేరాం.ఏడుకి కంటిలో మందు వేసింది, నర్సు.ఎనిమిది తరవాత ఆపరేషన్ చెప్పింది.కంటి రెప్పలపై ఉన్న వెంట్రుకలు తొలగించింది.ఎనిమిదికి ఆపరేషన్ థియేటర్ ఎదురుగా ఉన్న సీనియర్ సర్జన్ రూంలో కూచో బెట్టేరు. నాకు ముందు ఒకరున్నారు.ఎనిమిదికి సీనియర్ సర్జన్ మళ్ళీ టెస్ట్ చేశారు, ఒకె ముందుకెళ్ళమంటే నా ముందున్నతన్ని ఆపరేషన్ కి తీసుకెళ్ళారు.
ఆ తరవాత పది నిమిషాల్లో నాకు పిలుపొచ్చింది. ఒక నర్స్ నన్ను డిసానిజేషన్ రూంలోంచి నడిపించి తీసుకెళ్ళింది. మరో సానిటజెడ్ వరండాలో పీట మీద కూచోమంది.నాకు రెండు మాత్రలిచ్చి వేసుకోమంది. వేసుకున్నా! ఐదు నిమిషాల్లో కొద్దిగా మత్తనిపించింది,(ముందుగానే నాకు ఆపరేషన్ భయం ఎక్కువని, ఆతృతరోగం ఉందని, వినపడదని,రాసిచ్చి విన్నవించుకున్నా, డాక్టర్ గారికి.)
చిత్రంగా నాలో భయం,ఆలోచన ఏమీలేని శూన్యస్థితి ఏర్పడింది.కుడికాలుపెట్టి థియేటర్ లో అడుగుపెట్టా. నన్ను నర్స్ ఆపరేషన్ టేబుల్ దగ్గరకి నడిపించింది. టేబుల్ మీద పడుకోమన్నారు. టేబుల్ మీద బుట్టలా ఉన్నచోట తలపెట్టి పడుకున్నా. కంటిలో మందు చుక్కలేశారు, కళ్ళమీద గుడ్డలాటిది వేశారు, కళ్ళు కనపడుతున్నాయి.కంటి పైరెప్ప కింది రెప్పల దగ్గర నొప్పిగా అనిపించి అబ్బా అన్నా! చేతులు పక్కన పెట్టుకోండన్నారు,ఈ లోగా కంటి మీద లేజర్ ఫోకస్ చేశారు, ఒక బొమ్మ కనపడింది,(ఈ బొమ్మ కితంరోజు సాయంత్రం టెస్ట్ చేసినప్పుడు కనపడింది)మరుక్షణం లేజర్ తొలగించారు, ఏమీ కనపడలేదు, మరుక్షణం ఏదో పెట్టినట్టయింది, కన్ను కనపడింది.మందు చుక్కలేశారు. దూది ఉండ కంటి మీద పెట్టి టేప్ వేశారు నిలువుగా అడ్డంగా కదలకుండా.( దీనికి తీసుకున్న సమయం పది నిమిషాల లోపు ఉండి ఉంటుందని ఊహించా)కొంచం పైరెప్ప కింది రెప్పల దగ్గర నొప్పి ఉంది. లేవమన్నారు, నర్స్ నన్ను థియేటర్ నుంచి నడిపించి తీసుకొచ్చి మా వాళ్ళకి అప్పజెప్పింది.
నన్ను రూం కి తీసుకెళ్ళి పడుకోమన్నారు. టైం ఎంతన్నా! తొమ్మిది దాటిందన్నారు. మరి కాసేపటిలో ఇంటికెళ్ళిపోమన్నారు, మర్నాడు ఉదయం రమ్మన్నారు. విశ్రాంతి తీసుకోమన్నారు, రాత్రికి నిద్ర పట్టదేమో అని సంశయం చెప్పా,నిద్ర పడుతుందని చెప్పేరు.లిఫ్ట్ లో కిందకి తీసుకొచ్చారు. ఆటోలో ఇంటికొచ్చాం! పదయింది. ఆటో వాళ్ళకి అలవాటనుకుంటా ఎవరూ చెప్పకనే నెమ్మదిగా గతుకుల రోడ్ లో తీసుకొచ్చాడు.ఇంట్లో విశ్రాంతి తీసుకున్నా, మామూలుగా భోజనం చేసాను.సాయంత్రానికి కంటి నొప్పీ తగ్గింది, హాయిగా నిద్ర పట్టింది.
మర్నాడు ఉదయం ముఖాన్ని తడి దూదితో తుడుచుకున్నా! స్నానం మామూలుగా చేసాను.హాస్పిటల్ కి చేరాం. నాలాటివారు మరో పది మంది, ఒక హాల్ లో కూచున్నాం,నర్స్ లు కంటి కట్టు తీసేశారు.కంట్లో మందు చుక్కలేశారు, కన్ను కనపడుతోంది.కళ్ళు మూసుకు కూచున్నా! ఈ లోగా నల్లకళ్ళజోడిచ్చి పెట్టుకుని చూడచ్చన్నారు. నల్ల కళ్ళజోడులోంచి లోకం అందంగా కనపడింది.
ఆనందమానందమాయె!మరి ఆశల నందనమాయె! మాటలు చాలని చోట పాటగ మారిన మాయే!
డాక్టర్ పరీక్ష చేశారు, బాగుందన్నారు. ఈ కింది జాగ్రత్తలూ తీసుకుంటూ నల్లకళ్ళజోడు వాడుతూ ఇరవైరోజుల తర్వాత రమ్మన్నారు.
నాకు తోచినది ముఖ్యంగా కంటికి శ్రమ వద్దు.ఇన్ఫెక్షన్ కి దూరంగాఉండాలి.ఎక్కువ వెలుగు చూడద్దు.హాస్పిటల్ నుంచి ఇంటి కొచ్చాకా మొదటిరోజు ఇంట్లో కూడా నల్ల కళ్ళజోడు పెట్టుకున్నా, మర్నాటి నుంచి బయటికెళ్ళినప్పుడు మాత్రం నల్ల కళ్ళజోడు వాడేను.మొదటి మూడు రోజులూ దూదితో కళ్ళు ముఖం శుభ్రం చేసున్నా. నాలుగో రోజునుంచి చల్లని నీళ్ళతో ముఖం కడుక్కున్నా. ఇరవైరోజుల తరవాత షాంపూతో తలంటుకున్నా! క్షవరం చేయించుకున్నా. గడ్డం మామూలుగానే చేసుకున్నా. టివి.ఫోన్ వగైరాలన్నీ ఇరవై రోజులు వదిలేశా.మొదటి పది రోజులు బాగుందిగాని తరవాత కాలం గడవడం కష్టం అనిపించింది. ధ్యానం చేయడం నేర్చుకున్నా. కాలం గడచిపోయింది, తెలియకనే.ఇక అవసరమైన మైల్స్,మెసేజిలకి రోజూ మనవరాలు సాయంత్రం ఒక గంట సాయపడేది. సమాధానాలివ్వవలసిన చోట నేను చెప్పినట్టు టైప్ చేసి పంపేది, అలా గడిపేశా.
ఇరవైరోజుల తరవాత హాస్పిటల్ కి వెళ్ళా. రెండు కళ్ళు టెస్ట్ చేశారు. కళ్ళ జోడు రాసిచ్చారు.ఇరవై రోజుల తరవాత వెళ్ళినపుడు ఒక చుక్కల మందు రాసిచ్చారు. అది రోజు ఆపరేషన్ ఐన కంటిలో ఒక చుక్క ఉదయం సాయంత్రం వేయమన్నారు, అది వచ్చినంత కాలం, వేసుకుంటున్నా! రేపో, మాపో ఐపోతుంది. మూడో రోజు కళ్ళ జోడుతో జీవితం గాటిలో పడింది.రెండు కళ్ళకి జోడి కుదరడానికి కొంత కాలం పడుతుంది. ఆపరేషన్ కన్ను చురుగ్గాను, అప్పటిదాక పని చేసిన కన్ను మందంగా ఉంటాయి.మొదటి మూడు రోజులు నడక మానేశా. ఆ తరవాత నడిచాను. ఆపరేషన్ ఐన రోజునుంచి యోగా మానేశాను. ఆరు వారాల తరవాత మొదలెట్టాను.
Total cost of operation.Rs24,500.
I.O.L 10,000.
Doctor fees 10,000
Medicines 2,200
Transport 3days 300
karona test 500
Spectacles 1500
డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు. |
“బి.పి,సుగర్,కారోనా” పరీక్షలు మాత్రమేనా, శర్మ గారూ? మా హైదరాబాద్ లో అయితే కొందరు డాక్టర్లు HIV test కూడా చేయించుకు రమ్మంటారు (నా కజిన్ యొక్క స్వీయానుభవం) . అదెందుకండీ అంటే viral picture (ట) అది తెలుసుకోవాలి అన్నారు. సందట్లో సడేమియా 😉.
ReplyDeleteఆపరేషన్ కు తయారీ రోజున మాత్రలు వగైరాయేనా, కంటి ప్రక్కన ఇంజక్షన్ కూడా ఏమన్నా పొడిచారా (మత్తుకి) ? 50 యేళ్ళ క్రిందట మా తండ్రి గారి అనుభవం అది - బహుశః అప్పటి టెక్నాలజీ అదేనేమో, తరువాత తరువాత రోజుల్లో మెడికల్ సైన్స్ చాలా ప్రగతి సాధించింది కదా?
అవునండీ, ఆ మాత్రలేవో మీకు ఇవ్వడానికి “పీట” మీద కూర్చోబెట్టడం ఏమిటి, అర్థం కాలేదు.
కంటి రెప్పల మీద వెంట్రుకలు తొలగించిందా? కత్తెర తోనా? అయ్యబాబోయ్ . ఆ నర్సమ్మ చేతికి వణుకుడు గట్టా లేదని ప్రార్థించుకోవాలేమో మనం ?
IOL మన దేశపు తయరీయేనా?
అవునూ, “మర్నాటి నుంచి బయటికెళ్ళినప్పుడు …” అంటున్నారు, రెండోరోజు నుంచే బయట తిరగడం ఏమిటి? డాక్టర్ ను సంప్రదించే?
ఏమైనప్పటికీ మీ కంటాపరేషన్ సంతృప్తికరంగా ముగిసినందుకు అభినందనలు.
మీ ఊరి డాక్టర్ గారు బహు రీజనబుల్ మనిషిలా ఉన్నారే, ఫీజులు వగైరా చాలా సబబుగా ఉన్నాయి. May his tribe increase🙏. మీరు లోకల్ కాబట్టి ఇంటి నుండే తిరిగారు. మరి వేరే ఊళ్ళ నుంచి వచ్చే పేషెంట్లకు హాస్పిటల్ లోనే గది వసతి కలిపిస్తారా? దాని రేట్లు ఎంతలో ఉంటాయో?
(నా ప్రశ్నలు / సందేహాలు మరీ ఎక్కువైనట్లున్నాయి, ఏమనుకోకండి. ఏదో ఫ్యూచర్ కస్టమర్ గా వివరాలు తెలుసుకుందామని 😊.)
విన్నకోటవారు,
Deleteమీ సందేహాలకి జవాబు.
అవునండి, బి.పి,సుగర్,కరోనా టెస్టులే మరేమీ అక్కర లేదు. మా డాక్టర్ గారు అనవసరంగా ఖర్చు చేయనివ్వరు, తాను ఆశించరు.
ఆపరేషన్ ముందునుంచి తరవాత కూడా బిళ్ళలు,గొట్టాలు, కళ్ళలో మందు చుక్కలేనండి, సూది అవసరం ఎక్కడా,ఎప్పుడు కనపడదు.మత్తు ఇవ్వడానికి పొడిచిందేలేదు :)
నర్స్ నన్ను పీట మీద కూచో బెట్టి తలకి తొడుగేసింది, మాత్రలేసుకోమంది, అక్కడ అది వేచి ఉన్న కాలం. ఆపరేషన్ థియేటర్ తలుపు తీస్తే నా ముందువాడు ఆపరేషన్ టేబుల్ మీంచి దిగుతున్నాడు.
నా కను రెప్పల పై వెంట్రుకలు పొడుగ్గా ఉంటాయి, అందుకు కత్తెరతో తొలకించింది, చాలా సున్నితంగా కత్తిరించింది. భయం వేయలా:)
ఐ.ఒ.ఎల్ మన దేశానిదే.
మరుసటి రోజునుంచి నల్లకళ్ళజోడుతో బయట హాయిగా తిరిగాను. చాలా ఆహ్లాదంగా ఉంటుంది, కళ్ళజోడుతో, డాక్టర్ అనుమతి తోనే.నల్ల కళ్ళజోడు జ్ఞాపికగా దాచుకున్నా:)
అనుమానాలుంటే అడగండి.ఆపరేషన్ ఆలస్యం చెయ్యడం,అనవసర భయమే!
రండి! రండీ!! ఇదే ఆహ్వానం.
విన్నకోటవారు,
ReplyDeleteనారాయణ రెడ్డి కంటి ఆసుపత్రి అనపర్తికి గత నలభై ఏళ్ళ గొప్ప చరిత్ర ఉందండి. మా డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి గారు ఎన్ని వేల ఆపరేషన్లు చేసి ఉంటారో చెప్పడం కష్టం. ఆసుపత్రి ఒక పెద్ద కాంప్లెక్స్. జనరల్ వార్డ్ ౪౦ పడకలు,౪౦స్పెషల్ రూంలు అక్కడే కళ్ళజోళ్ళ షాపు,లతో పేషంట్లు తాలూకువారు వండుకోడానికి గేస్ సౌకర్యం నాలుగైదు రోజులు ఉండానికి సర్వ సౌకర్యాలతో ఉండేది. ఆ రోజుల్లో కబురు తెలిసేందుకు కష్టం అయ్యేది. అందుకుగాను నేనొక ఎస్.టి.డి పి.టి ఇచ్చా అక్కడ.ఆరోజుల్లో రాజమండ్రి, కాకినాడ, అనపర్తికిమాత్రమే ఎస్.టి.డి ఉండేది
(౧౯౮౬).
చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు ఇతర వూళ్ళనుంచి వచ్చేవాళ్ళకి రూంలు ఉన్నాయి. సింగిల్ రూం ఒక బెడ్, ఒక పొడుగు బెంచ్ ( కూడా వచ్చిన వారికి)అటాచ్డ్ బాత్,లెట్రిన్. సౌకర్యం,ఏ.సి. అద్దె రోజుకు ౩౦౦ రోజుకి అనుకుంటున్నా అక్కడ కాంప్లెక్స్ లోనే మందుల షాపు, కళ్ళజోళ్ళ షాపు, ఐ.ఒ.ఎల్ అమ్మకం అన్నీ దొరుకుతాయి.ఒక రోజు ఉండటం కనక పెద్ద ఇబ్బందులుండవు. దగ్గర్లోనే హోటలు, కాంప్లెక్స్ లోనే బేంకు,ఎ.టి.ఎం.హాస్పిటల్ బయటనే రకరకాల పళ్ళు ఇలా సకల సౌకర్యాలతో ఉంటుంది.
ఇక్కడ “పీట” అంటే స్టూల్ లాంటిది అనుకుంటున్నాను. ఎందుకంటే మీవంటి పొడుగు మనిషిని, వృద్ధుడిని (ఏమనుకోకండి 😉) కింద పీట వేసి దాని మీద కూర్చోమంటారా ?
ReplyDeleteఆ హాస్పిటల్ కు ఎస్.టి.డి. పిటి ఇచ్చారా మీరు? అందరూ బాగా వినియోగించుకుని ఉంటారు. గుడ్, సర్ 👌.
ఆ హాస్పిటల్ ఒక సమగ్ర కాంప్లెక్స్ లా ఉందే మీరు వర్ణించిన దాని బట్టి చూస్తే. చిన్న ఊళ్ళల్లోనే అటువంటి సౌకర్యాలు ఉంటే పట్టణాలకు పరుగులు పెట్టనక్కర లేదు కదా. ఆ డాక్టర్ గారు కూడా అతిగా ధనాపేక్ష లేకుండా తన వృత్తి చేస్తున్నట్లున్నారు, అటువంటి వారు అరుదు.
నేను వేచి చూస్తున్నది భయం వల్ల కాదు, సర్. రోజులు బాగా లేవు కదా. మూడేళ్ళ క్రితం చేయించిన రొటీన్ చెకప్ లో కేటరాక్ట్ ఉంది కానీ ఇంకా పరిపక్వత చెందలేదు ఇంకా టైముంది అన్నారు. ఆ తరువాత కరోనా మహమ్మారి వచ్చింది. అందువల్ల మళ్ళీ చెకప్ కు వెళ్ళలేదు.
రండని మీ ఆహ్వానం … ఎంత మాట. ధన్యవాదాలు, శర్మ గారు 🙏.
విన్నకోటవారు,
Deleteస్టూల్ కి ఎత్తుపీట అన్నది వెంఠనే స్ఫురించక పీటని వాడేసేను :)
నేనూ ఇలాగే వాయిదాలేస్తూ పోయాను, అంతలో కరోనా తో వాయిదా! మొన్న సెప్టెంబర్ లో చేయించుకుదా మనుకుంటే అనుకోని ఇబ్బందులతో మళ్ళీ వాయిదా పడి చివరికి నవంబర్ లో ముడిపడిందండి.
ఆ రోజుల్లో రాజమంద్రి, కాకినాడ, ఆ తరవాత అనపర్తికి మాత్రమే ఎస్.టి.డి ఉండేది. హాస్పిటల్కి ఎస్.టి.డి పి.టి నేనే ఇచ్చాను 1986, అది చాలా మందికి ఉపయోగపడిందండి ఆ రోజుల్లో
పల్లె ప్రజలు పట్టణాలకి పోయి తిప్పలు పడలేరని నాటి రోజుల్లో ఇవన్నీ ఏర్పాటు చేస్తే చాలా ఊళ్ళ నుంచి మా వూరు కంటి వైద్యానికి వచ్చేవారు. పొరుగు రాష్ట్రాలనుంచి కూడా వచ్చేవారు.
ఒకప్పుడు ఊళ్ళో వారికి కన్సల్టేషన్ ప్రీ,కాంప్లెక్స్ నిర్వహణా భారం పెరగడంతో ఇప్పుడు కళ్ళజోడు ప్రిస్క్రిప్షన్ దాకా రూ.౧౦౦. ఇప్పటికి స్కూల్ పిల్లలందరికి చెక్ అప్ ఫ్రీ, కళ్ళజోడు ప్రిస్క్రిప్షన్ ఫ్రీ.ఒకప్పుడు డాక్టర్ సత్యనారాయణ రెడ్డిగారొకరే సర్జన్. ఇప్పుడు వారబ్బాయి రామిరెడ్డి, కోడలు సంధ్యా రెడ్డి కూడా తోడయ్యారు. రోజుకు పది కాటరాక్ట్ ఆపరేషన్లు అంటే తక్కువ మాట. ప్రి అండ్ పోస్ట్ ఆపరేటివ్ చెక్ అప్ సంధ్యారెడ్డి, సర్జన్ నిర్వహిస్తారు. ఔట్ పేషంట్లు కూడా సంధ్య గారు చూస్తారు. రామిరెడ్డి గారు సర్జన్ ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఛీఫ్ సర్జన్ సత్యనారాయణ రెడ్డిగారు. వారు చూడక ఏ ఆపరేషన్ కేసూ నడవదు.ధన సంపాదనే ధ్యేయం కాదు వారిది, పల్లె ప్రజల సేవ వారికి అలవాటు.
ఉన్న సావకాశం ఉపయోగించుకోమన్నానండి, అంతే.
🙏
Deleteఅనపర్తి అయినా అమెరికా అయినా కంటి ఆపరేషన్ ఒకవిధంగానే ఉంది ఒక విషయంలో తప్ప. నన్ను ఆరోజే ఒక గంట తరువాత ఇంటికి వెళ్ళ మన్నారు.
ReplyDeleteలక్కరాజు గారు,
Deleteనన్నూ గంటలోనే ఇంటికెళ్ళమన్నారు, ఇక్కడ కొంచం జాగర్తలు ఎక్కువ తీసుకుంటున్నారు, మంచిదే అది.
"ఒకె ముందుకెళ్ళమంటే నా ముందున్నతన్ని ఆపరేషన్ కి తీసుకెళ్ళారు." ఇది నాకు "నా ముందున్నతన్ని తన్ని ఆపరేషన్‌కి తీసుకెళ్ళారు" అని కనబడింది :-)
ReplyDeleteనా సర్జరీ (అమెరికాలో ఆపరేషన్ కంటే, సర్జరీ అని ఎక్కువ వాడతారు. ఆపరేషన్ ఎవరైనా చేస్తారు. సర్జరీ ఒక్క సర్జనే చేస్తాడని కాబోలు. అతను/ఆవిడ దుర్జన్ అవకూడదు మరి) గురించి కూడా రాసేను. వీలున్నప్పుడొక "లుక్కే"సుకొండి.
https://srisugandh.blogspot.com/2010/08/blog-post_10.html
కెకె గారు,
Deleteఒక నిమిషం కంగారు పడ్డాను, తప్పు గినా రాశానా అని,టపా మళ్ళీ చదువుకున్నా! ఒక సారి భళ్ళున నవ్వొచ్చింది. పొద్దొటే ఒక్కణ్ణీ అలా నవ్వుకుంటే ఏమైందోనని కంగారు పడతారు మా వాళ్ళంతా ని బలవంతాన ఆపుకున్నా!
బలే పరిచయం. మీ బ్లాగ్ మొత్తం చదివేశా. పొదుపుగా పదేళ్ళలో పది టపాలు రాసి చాప చుట్టేశారు, ఆ కిటుకేదో చెప్పరాదూ, పుణ్యం ఉంటుంది లెండి :)
మా దేశం సర్జన్ పదం ఇంకా గోడ మీది నామ ఫలకాల్లోనే (name board) ఉండిపోయింది, కిందికి దిగి మా నోళ్ళలో పడలేదు, పల్లెటూరోళ్ళమ్ కదుండీ, ఏమార్పు జరుతుందోనని
కిటుకేం లేదండీ. తీరిక లేక, కొత్తవి రాయడానికి ఆసక్తి పోయి, రాయడం మానేసాను. అంతే.
Deleteభలేవారే శర్మ గారు, జనబాహుళ్యంలోకి వెళ్ళక పోవడమేమిటి, సర్? ఈ రోజుల్లో వివిధ తరగతుల వారూ చాలా మంది “సర్జరీ” యే అంటున్నారు, “ఆపరేషన్” అనడం గణనీయంగా తగ్గిపోయినట్లు తోస్తోంది. మన బోంట్లు “ఆపరేషన్” అని పలికినా అటువంటి వారికి అర్థం కాకపోవచ్చు కూడా. అమెరికా వాడి బిసా మజాకానా ! గ్లోబలైజేషన్ వలన అమెరికా వాడి పదాలే చెల్లుబాటుగా తయారవుతున్నాయి. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా “అమెరికా” అనడం కన్నా “యుఎస్” అనడమే ఎక్కువైందన్నది మరో ఉదాహరణ. బ్రిటిష్ లిఫ్ట్ కాస్తా అమెరికా ఎలివేటర్ అయింది. ఫ్యాషనండీ ఫ్యాషన్. అలా పలక్కపోతే అనాగరికులు అనుకుంటారేమోనని భయమేమో? లేదా అమెరికా వాళ్ళకు అర్థం కాదనేమో? వాళ్ళే కదా పెద్ద కష్టమర్లు.
Deleteఅమెరికా వాళ్ళేదే వింత వింత పదాలు కనిపెడుతుంటారు. అందుకేగా “My Fair Lady” (based on Bernard Shaw’s Pygmalion) సినిమాలో బ్రిటిష్ ప్రొఫెసర్ హెన్రీ హిగ్గిన్స్ అమెరికాలో ఇంగ్లీషు వాడకం గురించి “In America, they haven’t used it for years!” అంటాడు 😃.
విన్నకోటవారు,
Deleteఒకప్పుడు మా డాక్టర్ గారికి నామ ఫలకం కూడా లేదు. ఆసుపత్రిలో ప్రతి చోటూ ఆయన కనపడేవారు. టెస్టింగ్ రూం లు రెండు మూడుండేవి.ఆ తరవాత కాలంలో ముగ్గురు డాకటర్లయ్యారు కదా అందుకుగాను నామఫలకాలు వెలిసాయి, దాన్లో సర్జన్, ఛీఫ్ సర్జన్ అని రాసున్నాయి. అవి ఇక మా నోటికి చేరలేదు. ఇంకా డాక్టర్ గారనే అంటున్నాము, సర్జరీ అనటం లేదు, ఇంకా ఆపరేషన్ అనే అంటున్నాం, లిఫ్ట్ అంటున్నాం. పల్లెవాళ్ళం కదండీ అంత తొందరగా మారలేము :)
for gov employees some hospital in mehedipatnam, hyd is doing it for all free. they take patients from districts to hospital, 2 days in patient service, operation, medicines, return transport all they look after.
ReplyDeleteGood information sir.
DeleteThe hospital in which I got operated is in my village and I don't worry for money. Thank you sir