Friday, 19 July 2019

ఏం పని కావాలి?

 ఇల్లు మారాలా?
సామాను పేక్ చేయడం దగ్గరనుంచి ఇల్లు చూసి పెట్టడం దగ్గరనుంచి, సామాను కొత్తింటికి చేర్చి సద్ది పెట్టడం దాకా అన్ని పనులు చేసి పెడతాం.

పండగలకి ఫంక్షన్ లకి ఇల్లు దులపాలా? రంగులేయాలా? కడగాలా? తుడవాలా? మాకు చెప్పండి, చేసి పెడతాం.

ఇంటిలో కరంటు పనులు చిన్నచిన్నవైనా చేయాలా? నీళ్ళ కుళాయిలు బాగు చెయ్యాలా? అలంకరణ చేయాలా? మొక్కలు అలంకరించాలా? మాకు చెప్పండి. 

పెళ్ళి చేయించాలా? భోజనాలు పెట్టాలా? ఇంటి దగ్గరే వంట చేయించాలా? ఏ ఆచారంలో పెళ్ళి, భోజనాలు కావాలో చెప్పండి, ఒక గంటలో పెళ్ళి నుంచి ఐదురోజుల పెళ్ళి దాకా అన్ని ఏర్పాట్లూ చేస్తాం. కావాలంటే ఫంక్షన్ హాల్ తో సహా బుక్ చేసి పెడతాం.

అంతెందుకు మీ ఇంట్లో పని ఏదైనా సరే మీకు నచ్చినట్లు చేసి పెడతాం. మిమ్మల్ని చీపురు కావాలి,బ్రష్ కావాలి, ఎత్తు పీట కావాలి అని దేని గురించి అడగం. మాకు ఫోన్ చేయండి. మా సూపర్వైసర్ వచ్చి చూసి పని చూసి సొమ్ము ఎంతవుతుందో చెబుతారు. ఎప్పటిలోగా పని పూర్తి చేయగలమో చెబుతాం. మీ ఇంటిలో సామానుకు మాది పూచీ! ముందుగా వీడియో తీసి మీకిచ్చి దులిపి, కడిగిన తరవాత ఎప్పటిలా సద్ది మళ్ళీ వీడియో మీకిస్తాం. ఏ వస్తువూ బీరు పోదు. మరో ముఖ్యమైన సంగతి, మీ కిచ్చిన తరవాత వీడియో మాదగ్గరుండదు, మళ్ళీ మీరు కావాలన్నా దొరకదు, అంత ప్రైవసీ మెయెంటైన్ చేస్తాం. మీ ఇంటి గురించి మరొక చోట మాట్లాడం.

ఇదివరకు పట్టణాలలో ఈ రకం సర్వీసులున్నట్టు విడ్డూరంగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు పల్లెలలో కూడా ఇవి మొలుచుకొచ్చాయి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇదే సందడి.  

ఏమాటకామాటే చెప్పుకోవాలి, శుభ్రంగా చేసిపెడుతున్నారు.    

10 comments:

  1. ఉత్తరభారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఎవరింట్లోనైనా ఎవరైనా చనిపోతే గట్టిగా ఏడవడానికి కూడా స్త్రీలు అద్దెకు దొరుకుతారట. వారిని "రుడాలి" అంటారట.

    మనవైపు కరెంటు బిల్లులు వగైరా ఆ ఆఫీసులకు వెళ్ళి కట్టిపెడతాం అంటూ మొదలైనట్లున్నాయి ఇటువంటి 'సేవలు' (ఆన్-లైన్ చెల్లింపుల సౌకర్యం రాక ముందు కాలంలో). తర్వాత కాంట్రాక్ట్ పెళ్ళిభోజనాలు వచ్చాయి కేటరింగ్ పేరుతో .... ఇప్పుడు పెళ్ళే కాదు, ఏ సందర్భానికైనా కేటరింగులు చేస్తున్నారు. పైన మీరు చెప్పినవన్నీ మరిన్ని విస్తృతమైన సేవలన్నమాట. చిన్న ఊళ్ళల్లో కూడా లభ్యమా? బాగుంది. ఈనాటి ఉరుకులు పరుగుల రోజుల్లో, చిన్నచిన్న పనులకు మనుషులు దొరకడం కష్టంగా తయారైన రోజుల్లో ఇటువంటి 'సేవలు' గృహస్థుకు సౌకర్యంగానే ఉంటాయి కదా, మంచిదే లెండి.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఎక్కడైనా భారతీయుల మనస్తత్త్వం ఒకటే. మన పక్కనే తమిల నాడు లో ఈ రకపు సర్వీసు వున్నట్టుంది. మా దగ్గర ఆ అవుసరం కలుగచ్చేమో చెప్పలేను.

      Current bill ఇప్పటికి అందరికి ఆన్లైన్ కట్టుకోడం తెలీదు. వసూలు చేసి పెట్టేందుకు కరంట్ వారు కొంతమందిని ఏర్పరచుకున్నట్టు ఉంది. మొత్తం అందరూ ఆన్లైన్ కట్టవలసిందే! బిల్లు వసూలు చేసేవారు లేరు. కాంట్రాక్ట్ భోజనాలొకరు,పెళ్ళి మరొకరు, మిగతా ఏర్పాట్లు మరొహరు అక్కరలేదండి. ఏదైనా సరే ఎంతమంది అవుసరమైనా ఆ ఒక్కరికి చెబితే చాలు. అందరిని వాళ్ళే చూసుకుంటున్నారు. ఒకప్పుడు తాపీ మేస్త్రి వడ్రం మేస్త్రి ఒక సారి పనికి కావలసి రావచ్చు. ఒకళ్ళు పని చేసిన తరవాత మరొకరు చెయ్యవలసి రావచ్చు. ఇద్దరిని పట్టుకుని పని కోసం అవస్థ పడక్కర లేదు, వారి చుట్టూ తిరగక్కరలేదు. ఈ ఒక్కరితో చెబితే ఇద్దరిని ఏర్పాటు చేయడం లేదా రెండు పనులు ఒకరే చేసేయడం, మొత్తానికి పనైపోతుంది,చెప్పిన సమయంలో.

      ఇక వీరెవరో తెలీదనే భయమూ లేదు. ఒక పేరున్నవారు పంపిస్తారు వీళ్ళని, తేడాపాడాలు వచ్చే సావకాశమే లేదు, ఒక సారి పని ఒప్పుకుంటే! పల్లెలలో కూడా ఇది నడుస్తోంది. ఇలా పనులు చేయించేవారి దగ్గర అన్ని రకాల పనివారూ ఉంటున్నారు. వృత్తి పనివారెవరూ ఖాళీ ఉన్నది లేదు. రోజుకు ఐదువందలనుంచి వెయ్యి రూపాయల సంపాదన వుంటోంది.

      పని నికరంగా ఉంటోంది, ఇల్లు మొత్తం వారికి అప్పగించిపోయినా ఇబ్బందీ కనపడటం లేదు. గృహస్థుకీ సులువుగానే ఉందండి.

      Delete
  2. నమస్తే బాబాయ్ గారూ

    ReplyDelete
    Replies
    1. ranivani

      అమ్మాయ్!
      దీర్ఘాయుష్మాన్భవ
      దీర్ఘసుమంగళీభవ
      చాలా కాలం తరవాత కనపడ్డవమ్మా! అంతా కుశలమేకదా!

      Delete
    2. అంతా కుశలమే బాబాయ్ గారూ! అందరమూ బాగున్నామండీ!మీరు కూడా బాగున్నారు కదా!

      Delete
    3. అమ్మాయి!
      ఒంటివాణ్ణి చేసి మీ పిన్ని వెళ్ళిపోయింది, దగ్గరగా సంవత్సరం కితం. బతుకు బండి ఈడుస్తున్నా!

      Delete
    4. అయ్యయ్యో! నేను ఈ మధ్య బ్లాగులు చూడటం లేదండీ! iPad లో problem వలన. అబ్బాయి ఈ మధ్యన దాన్ని సరిచేయడం వలన ,మళ్లీ మిమ్మల్ని పలకరించగలిగాను. పెద్దలు, ఏం మాట్లాడాలో నాకు తోచడంలేదు, మీరు మీ పిల్లల సంరక్షణలో , ఆరోగ్యంగా ఉండాలి. ఇట్లా మాకు నాలుగు మంచి మాటలు చెప్తూ ఉండాలి.

      Delete
    5. అమ్మాయ్!

      అలా జరిగిపోయిందమ్మా! ఒంటరినైపోయాను. బండి ఈడుస్తున్నా!

      Delete
  3. శర్మ గారు నమస్కారమండి. చాలా రోజులకు మిమ్మల్ని ఈ సందర్భముగా పలుకరించినందుకు బాధగా వుంది.భగవంతుడు మీకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కొరుకుంటూ...

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ'స్ మయూఖ
      అలా జరిగిపోయిందండి.

      Delete