అల్పజీవి-అర్ధనారి.
అంచిత కావ్య కంఠ బిరుదాంకు, అమోఘ వచస్కు,అంబికా
చంచల కింకిణీ నినద సౌమ్య సుసంస్కృత వాగ్విలాసు,ని
శ్చంచల యోగి పుంగవుని, జ్ఞాన విశోధిత లబ్ధ తత్త్వ భా
సాంచిత రాజహంసు,రమణాశ్రమ వాసు నుతింతు "నాయనన్".....6
తెప్పున గారె ముక్కలను తేనెల ముంచుక తిన్న రీతిగా
గొప్పలు కాదుగాని కవికోటి శిరంబుల నూచి మెచ్చగా,
చప్పున నాదు పల్కులకు శంకరుడే విని నవ్వునట్లు; నే
చెప్పెద పద్దెముల్ రసిక శేఖరు లెల్లరు బాగు బాగనన్.....7
చొక్కపు పిల్ల తెమ్మెరల సోకుకు కోయిల కూసినట్లుగన్
చక్కని నాదు భావముల సౌరభమెంచి ప్రశంస చేయగా
నొక్కడు చాలు; లోతెఱుగ కూరక త్రిప్పగ నేల శీర్షముల్
రక్కెస తుప్పలున్ మరియు రావులు తా తలలూపవా! శివా!....8
తూరుపు దిగ్గజంబైన ధూర్జటి తోటి సాటి యౌదనన్
కోరిక నాకు లేదు, మరి కోరెద నాతని చెంత నిల్వగా;
దూరపు చుట్టమై ప్రజకు తోచిన చాలును సంతసించెదన్
సారమ సారమున్ తెలియ సర్వగతుండవు నీవెగా! శివా!........9
సరగున పూర్ణిమా విమల చారుతరోజ్వల చంద్రకాంతికిన్
కరగును చంద్రకాంతములు, కాక ద్రవించున గండ శైలముల్
వరకవి మాధురీగుణ విభాసిత కోమల వాక్యరీతులన్
సరసుడు సంతసించి నటు ఛాందసు డాదర మొందునా! శివా!....10
నింగిని తోచినట్టి నెల నిండిన జాబిలిజూచి సంద్రము
ప్పొంగును, బావి నీళ్ళకును పొంగులు కల్గునె? బిడ్డ ముద్దుమో
ముంగని పాలచే పాదువ మోదము బిడ్డల తల్లి చెందెడిన్
తొంగుడు నాకు చాలనెడి తొత్తుకు పాపడు తీపియా! శివా!.......11
బంగరు సుద్దు లయ్యమరవాణిని గైకొని చెప్పినాడ నే
పొంగుచు కొన్ని పద్దెముల,పూర్వులొసంగిన యాస్తిగాన నీ
వెంగిలి ముక్కలంచు మది నెంచకు, కీరము ముట్టినట్టి యా
రంగగు దోరకాయ ధర రాలిన రుచ్యము గాదటో! శివా....12
అప్పయ శంకరాది ఘనులాత్మ విచారణ దక్షు లందముల్
కుప్పలు గాగ పోసి నిను గొల్చిరి కైతల, వారి ముందు నే
చప్పన యౌదుగాక,విను చక్కెర మెక్కియు పండు చీకుచో
చప్పన గాక ఎప్పుడు రసాలము మెప్పును పొందునా! శివా!....13
లలిత కవిత్వ సంపద ధరాస్థలి నెంతటి భూరి పుణ్యమూ
ర్తులకు లభించు? దాన సరితూగునె రాజ్యము గీజ్య మీ క్షితిన్!
నిలుచును నిత్యుడై కవి మనీషను,తక్కిన వారు మట్టిలో
కలిసెడు వారె, నిల్చు నొక కావ్యము నందిన భర్తయున్ శివా....14
ఒకపద్యము చెప్పువాడె కవియౌ యూరేగు ఈ రోజులం
దొక కావ్యంబు గూర్ప,వాడికను నర్హుండే గదా కాళిదా
సుకు తా పెద్దకుమారుడంచు సకల సర్వజ్ఞుండంచు విద్వాంసులం
దొక లెక్కుంచక నిందసేయ, కలిలో నూహింప వింతల్ శివా!...15
*”నాయన”..కావ్యకంఠ గణపతి ముని.
No comments:
Post a Comment