అత్తా! అత్తా!!
ఎవరదీ? లలితా! రా! రా!! ఈవేళప్పుడొచ్చావ్, కాలేజీ లేదూ?చదువెలా సాగుతోంది? ప్రశ్నించింది సావిత్రమ్మ.
నాచదువుకేం అత్తా! బాగానే సాగుతోంది. ఇటువంటి వేళయితే నీతో తీరుబడిగా మాట్టాడటానికి కుదురుతుందని, కాలేజి డుమా కొట్టేసేను.
ఎవరే అదీ? పక్కగదిలోంచి ప్రశ్నించింది, సావిత్రమ్మ అత్తగారు.
మన పక్కింటి వాళ్ళమ్మాయి లలిత. సమాధానమిచ్చింది సావిత్రమ్మ.
దా కూచో! నాతో అంత ప్రత్యేకంగా మాటాడే రాచకార్యం ఏంటే?
అత్తా! డొంకతిరుళ్ళొద్దుగాని,నీ పెద్దకొడుకు ఆగేలా లేడు, మీద మీద పడుతున్నాడు,నాకూ ఆగాలని లేదు, పెళ్ళి చేసుకునే దాకా ఆగుదామన్నా వినేలా లేడు, అని ఆగింది.
అయ్యో! అయ్యొ!! అవేం పనులే! నీకు సిగ్గు లేదుటే? పరువు మర్యాద లేదుటే?
అత్తా! పెళ్ళి చేసి నీ కొడుకునూ నన్నూ గదిలోకి పంపి నువ్వు తలుపులేస్తే పరువు మర్యాద. పెళ్ళి కాకుండానే నీ కొడుకు నన్ను గదిలోకి తీసుకుపోయి తలుపులేస్తే మర్యాద అవుతుందా?
ఇంతకీ ఏంటంటావ్?
నాలుగు రోజుల్లో ప్రేమ సమాజంలో నాకు నీ పెద్ద కొడుక్కీ పెళ్ళి. చెప్పిపోదామని వచ్చా!
ఎంతకి తెగించేవే!కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఎగరేసుకుపోతావుటే?
అత్తా! అవసరం నాది, రేపు నీ కొడుకు దులుపుకుని వెళితే, నాకు కడుపో కాలో వస్తే, భరించేది నేనేగా! అందుకే ఈ జాగర్త. ఎర్రగా బుర్రగా ఉన్నాడని కదూ అంటున్నావు. ఏముంది నీ కొడుకు దగ్గర? చదువా? డిగ్రీలో రెండు సబ్జక్టులు తన్నేసేడు, తెలివా? కిరాణా చీటీ కూడా తిన్నగా తప్పులు లేకుండా రాయలేడు. మొన్న చీటిలో వెల్లుల్లి రాయమంటే వెళ్ళుళ్ళి అని రాశాడు. ఇక డబ్బా! ఇది అయ్యవార్లంగారి నట్టిల్లని తెలుసు. ఇంక ఎగరేసుకుపోడానికేం ఉంది?
అంత పనికి రానివాడెందుకే నీకూ?
మంచి ప్రశ్న వేసేవత్తా! నిజమే పిచ్చిదాన్ని, పడిపోయా! తన ప్రేమలో.
పెళ్ళి చేసుకుంటే ఏం తిని బతుకుతారే?
ఈ మాత్రం చదువులకి ఇక్కడేం గొప్ప ఉద్యోగాలు రావు. నీ కొడుకేం సైంటిస్ట్ కాడు. నాకైతే జీవితం మీద ఒక ప్లాన్ ఉంది. పల్లెటూరుకి పోయి, కూలీ చేసుకు బతుకుతాం.
సినిమాలు చూసి చెడిపోయారే!
నీ కొడుకే కూలీ నెంబర్.1, అనీ ముఠామేస్త్రీ ననీ అనుకుంటూ ఉంటాడు.
పెళ్ళి ఆగదుటే?
నీ చేతనైతే ఆపు.నేను పిలిస్తే నీకొడుకు కుక్కపిల్లలా తోక ఊపుకుంటూ వస్తాడు.నువ్వు బలవంతంగా ఆపితే పోలీసులొచ్చి తీసుకొస్తారు,నీ కొడుకుని. నా వెనక పడ్తుంటే, మీద పడుతుంటే,నీకు చెప్పినప్పుడు నువ్వు ఆపగలిగేవా? ఇప్పుడాపగలగడానికి, అంటూ, వస్తానత్తా! అని లేచి వెళ్ళింది.
పక్క గదిలోంచి బయటికొచ్చిన సావిత్రమ్మ అత్తగారు. ఏంటే అదీ అడిగింది.
చెప్పడానికేముందీ, మీ మనవడి నిరవాకం, అంది చేతులు తిప్పుకుంటూ, సావిత్రమ్మ.
అయ్యో! అయ్యొ!! ఎంతన్యాయం, ఎంతన్యాయం.వాడికేమే మగ మహరాజు. ఆడపిల్లలు బరి తెగించేస్తున్నారే! నువ్వేంటి దానికి సమాధానం చెప్పక నసుగుతావూ?
వాడికేం మగమహరాజని వెనకేసుకొచ్చే ఇలా కొంప మీదకి తెచ్చేరు.నా పెళ్ళయి పాతికేళ్ళయింది. ఏ విషయంలోనూ, నీకేం తెలీదు, నీకేం తెలీదూ అంటూ మీరూ,మీ కొడుకూ నా నోరు నొక్కేసేరుగా! ఇప్పుడు నేను నసుగుతున్నాననడమేం?
ఏమవుతుందంటావే?
ఏమో నాకు మాత్రం ఏo తెలుసూ! అది చెప్పిందిగా నాలుగు రోజుల్లో పెళ్ళీ అని. కానున్నది కాక మానదు! అని ముక్కు చీదుతూ పెరట్లోకెళ్ళింది సావిత్రమ్మ.