31, ఆగస్టు 2020, సోమవారం

పిలవని పేరంటం



అవి ఒక పట్నంలో ఉండి పల్లెల ఉద్యోగం చేస్తున్న రోజులు. ఏరోజూ ఖాళీ ఉండేది కాదు.  టవున్ లో పని చేస్తున్నతను  ఔట్డోర్ పరిచయం తక్కువున్నవాడు. టవున్ కి కేబుల్ ప్లాన్ వేయాల్సివచ్చి వేసి పంపితే రెండు సార్లు తిరిగొచ్చిందని, సాయం చేయమని కోరేడు, టవున్ జె.యి. ఉండడం టవున్ లోనే ఉన్నా గాని పూర్తిగా టవున్ చూడలేదు. టవున్ ఒక సారి కాలి నడకనే తిరగాలి అని బయలుదేరి మూడు రోజులు సందులు గొందులు తిరిగేసేం. మూడో రోజు నడుస్తుండగా ఒక ఇంటి ముందు నా సహచరుడు నన్ను ఆపి నేం బోర్డ్ చూపించాడు. నా ఇంటి పేరు కనపడింది, చుట్టాలా? ప్రశ్నించాడు. ఒకే ఇంటి పేరు అనేకమందిలో ఉంటుందనీ, ఒకే ఇంటి పేరున్నవాళ్ళంతా చుట్టాలు కారని చెప్పి ముందుకు అడుగేయబోయా. మిత్రుడు మాత్రం వీళ్ళు మీ వాళ్ళే, ఈయన ఊళ్ళో కొంచం పెద్దవాడు కూడా. కలిసొద్దాం అని లోపలికి అడిగేశాడు. నేను అడుగు కలపక తప్పలేదు.

ఆయన హాల్ లోనే ఉన్నాడు, పెద్దవాడని బీరువాలూ పుస్తకాలూ వగైరా చెప్పకనే చెబుతున్నాయి. మా మిత్రుడు తనను తను పరిచయం చేసుకుని, నన్నూ వీరు ఫలానా, పల్లెటూళ్ళు చూస్తారు, మీ ఇంటి పేరువారే అని పరిచయం చేశాడు, తను ఆయన ముందున్న కుర్చీ లాక్కుని కూచుంటూ. ఆయన కనీసం కూచోమని కూడా అనలా.  కుర్చి లో కూచున్న ఆయన కొద్దిగా ముందుకు కూడా వంగలేదు, అంటే కనీసం కుతూహలం కూడా చూపించలేదు. మాటా లేదు, చూస్తూ ఉండిపోయాడు, కనీసం మంచి నీళ్ళు తీసుకుంటారా అని కూడా అడగలేదు.. నాకైతే ఏం మాటాడాలో కూడా తోచలేదు, నోరు పెగుల్చుకుని, నాపేరు చెప్పుకుని ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నా, టెలిఫోన్ జ్.యి గా,  మా ఇంటి పేరు కూడా మీ ఇంటి పేరే! మిత్రుడు చెబితే పెద్దవారిని కలుద్దామని వచ్చాము, వేరే ఏమీ పని లేదని, చూచి పోదామని వచ్చామని చెప్పేను. ఆయన చూడడం అయిందిగా ఇక దయచెయ్యమన్నట్టు ముఖం పెడితే చాలా ఇబ్బంది పడ్డాను, నన్ను చూసి మిత్రుడు ఇబ్బంది పడిపోయాడు, కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. నేను లేచి నమస్కారం, వస్తాం అని చెప్పి వెను తిరిగి చూడక వచ్చి బయటికి వచ్చేశాను. మిత్రునితో కూడా మాటాడాలనిపించలేదు. నన్ను చూసి మిత్రుడూ పలకరించలేదు. ఇంటి కొచ్చేశాం. 


ఇంటికొచ్చిన తరవాత ఇల్లాలికి విషయం చెప్పాను.ఇల్లాలు ''పిలవని పేరంటానికి వెళ్ళ కూడదు, జరిగిందేదో జరిగింది, మరచిపొండి'' అంది. నేను సద్దుకో లేకపోయా! అవమానంగానే తోచింది. మర్నాడు మిత్రుడు వచ్చి కలిసి, " సారీ! మిత్రమా, నిన్న సాయంత్రం నేను చేసినది తప్పు,మన్నించు" అన్నాడు. ఇల్లాలు నాకు చెప్పినమాట మిత్రునికి చెప్పాల్సివచ్చింది.

చుట్టాలకి దూరంగా నీటికి దగ్గరగా ఉండాలని సామెత. 

30, ఆగస్టు 2020, ఆదివారం

చిత్రం

 ఒక చిన్నారి, అభిమాని, పాతికేళ్ళ వయసుకే జీవిత సమస్యల సుడిలో చిక్కుకుంది.ఒడ్డు చేరుతున్నాననగా ఐదు నెలలకితం అనారోగ్యం, ప్రకృతి చికిత్సతో నిలదొక్కుకుని జీవితంలోకి మళ్ళీ దూకుతూ నాకో మెయిలిచ్చింది, నన్ను గుర్తుచేసుకుంటూ. ఈ కింది ఫోటో గురించిన కథ చెప్పమని. నాకైతే కథ తెలియదుగాని వివరం చెబుతానని ఇలా చెప్పా.. 




ఇక చిత్రం గురించి. ఈ చిత్రంలో చిత్రకారుడు ఇది చెప్పదలుచుకున్నాడు.

కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, మనసు. మనసు ఇంద్రియాలను శాసిస్తుంది కాని ఇంద్రియ సుఖాలకు లోబడిపోతుంది. మనసుకి మరొక ఆరుగురు మిత్రులలాటివారున్నారు. తెలిసినవారు వారిని అంతశ్శత్రువులు అంటారు. ఈ ఆరుగురు మనసును స్వాధీన పరచుకుంటూ ఉంటారు. వారే కామ,క్రోధ,మోహ,లోభ,మద, మాత్సర్యాలు. ఈ ఆరిటిని చిత్రంలో చూపించాడు. 

కామం:- నీరు, అంతులేని సముద్రంలాటిది, కోరికల అలలు పుడుతూనే ఉంటాయి. 
క్రోధం:- ఇది మనిషిని ఆవహించినపుడు మృగంలా మారతాడు. ఉచ్చనీచాలు,మంచిచెడ్డలు,పెద్ద చిన్న, పాపం పుణ్యం, ఇలా ఏవీ కనపడవు. దానిని సింహంలా చూపాడు. 
మోహం:-కనపడదుగాని మొసలిలా పట్టుకుంటుంది, మనసును. ఒక వస్తువు మీదనో,మనిషి, లేదా ప్రాంతం ఇలా ఒకదానిమీద మనసు నిలిచిపోయి ఉంటుంది, మోహం కమ్ముతుంది. దీనిని మొసలి రూపంలో చూపాడు.
లోభం:- సగంపైగా కొట్టి వేయబడ్డ చెట్టును చూపాడు. అది ఏక్షణంలో నైనా నీటిలో పడచ్చు, మరణం సంభవించవచ్చు. కాని దాని చిగురున ఉన్న పండుకోసం ఎక్కడమే లోభం. ఇది జీవితంలో కూడా చూస్తుంటాం. ప్రమాదమని తెలిసి కూడా తొందరపాటు పనులు చేస్తుంటాం.
మదం:- మదం నాకేంటి అనే ధోరణి. తెలివైనవారం,అందమైనవారం, బలమైనవారం, అధికారమున్నవారం అన్న మదం బుసలు కొడుతూ ఉంటుంది.అది ఎంతదాకా అన్నది మరచిపోతుంటారు. దీనిని పాములా చూపాడు. 
మాత్సర్యం:- విరిగిపోతున్న కొమ్మలాటిది. దీని మూలంగా తను నాశనమవుతున్నా వదలిపెట్టలేనిది. ఎదుటివారి గొప్పతనాన్ని మంచిని గుర్తించలేనిది. ఏం తెలివిలే,అబ్బో పెద్ద అందం, ఆ డిగ్రీలన్నీ బూటకంట. ఇలా రకరకాల చిత్ర చిత్ర భావనలతో తనను తాను దిగజార్చుకుంటూ పోయేది ఈ మత్సరం అనే అసూయ. 

ఈ ఆరుగురు శత్రువులను గెలవగలమా? అసాధ్యం.అంతశ్శత్రువులను గెలిచానన్నవారిని నమ్మను. అందరూ అంతో, ఇంతో, కొంతో వీటి బారిన పడేవారే. వాటిబారిన పడి ములిగిపోక బయటపడేవారే విజ్ఞులు.

26, ఆగస్టు 2020, బుధవారం

కర్ణుడు - భారతయుద్ధ మొదటి పదిరోజుల సేనా నాయకత్వం.

కర్ణుడు - భారతయుద్ధ మొదటి పదిరోజుల సేనా నాయకత్వం.

కురు సభ జరుగుతున్న సమయంలో దుర్యోధనుడు భీష్ముని చేరి తాతా! యుద్ధం రాబోతోంది. అటువైపు ఎవరెంతవారో చెప్పు, మా నాన్నకి పాండవులంటే భయం, అన్నాడు. విన్న భీష్ముడు పాండవ పక్షం వారి గురించి చెప్పాడు. మరి మా వైపు వారి గురించీ చెప్పూ అనగా, భీష్ముడు, నువ్వు అడుగుతావు నేను ఉన్నది ఉన్నట్లు చెబుతాను, అది నీకు, నీ స్నేహితులకి నచ్చదు, నాకెందుకొచ్చిన తలనొప్పి చెప్పు, మధ్యన, అన్నాడు. విన్న దుర్యోధనుడు చెప్పు తాతా అని బ్రతిమలాడేడు. భీష్ముడు, కౌరవుల గురించి ఎవరెంతవారో చెబుతూ, కర్ణుడు అర్ధ రధుడు అని చెప్పేరు. విన్న కర్ణుడు, ముసలితనంతో నీ మతిపోయి మాటాడుతున్నావని భీష్ముని పలురకాలుగా నిందించి, నువ్వు యుద్ధ రంగంలో నిలబడినంతకాలం నేను ఆయుధం పట్టి యుద్ధం చేయనని ప్రతిన చేసి సభ విడిచిపోయాడు. షరా మామూలుగానే దుర్యోధనుడు కర్ణుని అలక తీర్చడానికి వెనకపోయాడు.

ఈ సంఘటన జరిగేనాటికి భీష్ముడు సర్వసైన్యాధిపతీ కాదు, కర్ణుడు అక్షౌహిణి సైన్యాధిపతీ కాదు. ఆ తరవాత కాలంలోనే ముందు భీష్ముని సర్వసైన్యాధిపతిని చేసి ఆతరవాతే మిగిలిన సేనాపతులను దుర్యోధనుడు నియమించాడు, అందులో కర్ణుడొకడు. ఆ నియామకాలకి ఆక్షేపణ ఎవరినుంచీ లేదు. అంటే యుద్ధం చేయడం వేరు సైన్యాధిపత్యం వహించడం వేరు అని తెలుస్తోంది కదా! యుద్ధం చేయటం లేదు నేను సైన్యాధిపత్యం వహించడం ఏంటని కర్ణుడు అడగలేదు, యుద్ధం చెయ్యనివాడు సేనాధిపతా అని భీష్ముడు ఆక్షేపించలేదు. అన్నీ తెలిసిన దుర్యోధనుడు కర్ణునికి సేనాధిపత్యం ఇచ్చాడంటే, యుద్ధం చేయడం వేరు, సైన్యాధిపత్యం వహించడం వేరని తెలుస్తోంది కదా!

అంటే  భారత యుద్ధం మొదటి పదిరోజులు కర్ణుని అక్షౌహిణి సేనను కర్ణుడే నడిపాడు, యుద్ధం చేయలేదంతే!  


విన్నకోటవారి ,
భారతం మీద మరో ప్రశ్నకు చాలా కాలంగా జవాబీయలేదు. అది "అంపశయ్య మీద చేరేనాటికి భీష్ముని వయసెంత?"  ప్రశ్న మొత్తం భారతం తిరగెయ్యాలి, పెద్ద జవాబు అందుకే చెయ్యి చేసుకో లేదు.

24, ఆగస్టు 2020, సోమవారం

మంగళం జయ మంగళం.

మంగళం జయ మంగళం.
======================

మంగళం జయామంగళం
మా వియ్యపురాలి నడతలకి జయా మంగళం.

చింతమాను చిగురే చూడు,
వియ్యపురాలి మోము చూడు,
కనులు తిప్పుతు మాటచూడు,
వయ్యారంపు నడక చూడు...........Iమంగళం I

ప్రేమతోటి వియ్యపురాలికి
అరటిపండు చేతికిస్తే
తినుట ఎరుగని వియ్యపురాలు
తొక్కమింగి కక్కుకొనియె..........Iమంగళం I

పల్లెటూరి వియ్యపురాలు
పట్నవాసం పక్కకొస్తే
కారు చూచి హడలిపోయె
అన్నవచ్చి గుండె రాసే...............Iమంగళం I

భక్తి కొద్దీ వియ్యపురాలు
తులసిపూజకు తాను వెళితే
గాలి వీచి పైట ఒదిగే
అన్నవచ్చి సద్ది వెళ్ళె..........Iమంగళం I


జానపదం

21, ఆగస్టు 2020, శుక్రవారం

చేసుకున్న కర్మమోయ్


చేసుకున్న కర్మమోయ్ 
చెంబు (శంభు) లింగమా
అనుభవింపక తప్పదోయ్ 
ఆత్మలింగమా

కారుతో పాటు బతికి బయటపడే మార్గం చెప్పండి 

17, ఆగస్టు 2020, సోమవారం

మెక్కి మెక్కి తినకండోయ్!

మెక్కి మెక్కి తినకండోయ్!
ఎక్కసాలు పడకండోయ్!
ఒక్కసారి తినకండోయ్!
నొక్కి మేము చెబుతున్నాం!....Iమెక్కిI

మావారాని మేము 
మరీ మరీ అడుగుతుంటె
కావాలనే మాటేకాని 
మారుమాట లేదుగా!........Iమెక్కిI

వద్దు,వద్దు అంటారు,
పొద్దు చాలదంటారు
నేల మీద పడతారు, 
గోలపెట్టి దొర్లుతారు!........Iమెక్కిI

జానపదం

13, ఆగస్టు 2020, గురువారం

పెళ్ళిపాట.

 పెళ్ళిపాట.
============

ఏ దేశాన్నించొచ్చేరయ్యా మా దేశానికి

మేడలు మిద్దెలు కలవారనీ మీవారు చెబితిరి
ఇంత అద్దె ఇళ్ళల్లో వున్నారని ఎరక్కపోతిమి  IIఏ దేశాన్నించిII

ఇశాపట్నం కలకటేరని పిల్లనిస్తిమి
ఇంత కన్నం వేసేవాడని ఎరక్కపోతిమి.             IIఏ దేశాన్నించిII

చెన్నపట్నం జమీన్దార్లని పిల్లనిస్తిమి
ఇంత చెప్పులు మోసేవాళ్ళని ఎరక్కపోతిమి         IIఏ దేశాన్నించిII     

కంటెలు కాసులు పెడతారని మీవారు చెప్పిరి
ఇంత,ఇంత, ఒక్క పుస్తెముక్క కడతాడని ఎరక్కపోతిమి    IIఏ దేశాన్నించిII       
జానపదం

11, ఆగస్టు 2020, మంగళవారం

మావగారు వినండి.

మావగారు వినండి.
==================
కన్యాదాతలైన మావగారు వినండి.
చెలిమితోడ మీ అల్లుడి కోర్కెలు చెప్పెద వినండి.

మాటిమాటికి వచ్చేలా మారుతి ఇవ్వండి.
ఫస్ట్ క్లాస్ గోల్డ్ చైన్ మా బ్రదర్ కి ఇవ్వండి.

కాలేజీ దూరం స్కూటర్ ఇవ్వండి.
ఫస్ట్ క్లాస్ బ్రాస్లెట్ మా బ్రదర్ కి ఇవ్వండి.

చాలినంత కట్నం చదువుకి ఇవ్వండి.
ఇంతకు మించి కోర్కెలు మరి ఏమీ లేవండి.




9, ఆగస్టు 2020, ఆదివారం

ఓ!వియ్యపూరాలా



ఓ!వియ్యపూరాలా
ఓ!వయ్యారీలోలా
నీ వయ్యారామూలే........Iఓ!I

కయ్యాలామారీవీ
గయ్యాళీ గంపావూ
కయ్యంబూ నీకేలా.........Iఓ!I

 వధువుతల్లి  వరుడితల్లినుద్దేసించి పాడేపాట.ఇంకా ఉందేమో తెలియదు. వియ్యపురాళ్ళని వీరకత్తిలని అనడం కూడా ఉత్తరాంధ్రలో అలవాటు.పాట వినడానికి సొంపుగా ఉండి. ఏదో ఛందస్సుకు చెందేదిలాగానూ కనపడుతోంది.జానపదులలో ఎంత గొప్ప కళ దాగిఉన్నదో కదా!

6, ఆగస్టు 2020, గురువారం

విందు చేసినారు వియ్యాల వారింట పాట

"విందు చేసినారు వియ్యాల వారింట
విందు మాట చెబితే వింతగా తోచును ||విందు||(2)

-------

(1). పప్పూ ఉడకలేదు , చారూ కాగలేదు

అరటికాయ కూర ఊసే అందలేదు ||విందు||
----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేము ఏలాగు భోంచేతుమో
ఈ విందు మేమేలాగు భోంచేతుమో
------------
(2). వియ్యపురాలొచ్చి నెయ్య వడ్డించింది
నెయ్యి వేయ మన్న చెయ్యి తడవలేదు ||విందు||


(3). విస్తళ్ళు వేశారు, చారెడేసి వెడల్పు లేవండీ
హస్తంబు కదుపుటకు ఔరౌర చోటు లేదు ||ఏలాగు||

(4). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||

(5). కూరే వంకాయ కూర, దానితోపాటే పచ్చడి లేదు

కలహంబులా కారం గుచ్చెత్తీనారూ   ||ఏలాగు||

(6). ముక్కాబియ్యము వండిరి, దానిలోకి ముద్దపప్పే వేసిరి
చెప్పుకుంటే సిగ్గవుతుంది, చెయ్యికడిగే వీలు లేదు ||ఏలాగు||


(7). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు

గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||

(8). లడ్డూ, జిలేబీలా పాకములో వడ్డించెరంట
వడ్డించే వదినె గారి వడ్డాణం జారిపోయె ||ఏలాగు||
-----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేముఏలాగు భోంచేతుమో

ఈ విందు మేమేలాగు భోంచేతుమో

29, జులై 2020, బుధవారం

విందుచేసినారు వియ్యాలవారింట

Courtesy:Whats app

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన ''విందుచేసినారు వియ్యాలవారింట'' పాట,ఇది తరతరాల మన వారసత్వ సంపద, ఇప్పటి వరకు మరుగున పడిపోయింది, ఎవరో మహానుభావులు దీన్ని వాట్సాప్లో పెట్టేరు.వారికి వందనం.  పాటపాడిన శ్రీరంగం గోపాలరత్నం గారికి ఇతర గాయకిలకు వందనం.వాద్య సహకారులకు వందనం.దీన్ని బ్లాగులో పెట్టడానికి సహకరించిన విన్నకోటవారికి నా అభినందనలు.

27, జులై 2020, సోమవారం

ఈ పాపం ఎవరిది రాజా

ఈ పాపం ఎవరిది రాజా

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టెక్కి భేతాళుణ్ణి భుజాన వేసుకు చెట్టు దిగి నడక ప్రారంభించాడు. రాజా నీకు శ్రమ తెలియకుందికిగాను కత చెబుతా సమస్యకి పరిష్కారం తెలిసి చెప్పకపోతే నీ బుర్ర వెయ్యి ముక్కలవుతుంది. సమస్యకి నిజమైన పరిష్కారం చెబితే నేను చెట్టెక్కుతాను.నీవు చెప్పిన పరిష్కారం తప్పైతే నీతో వస్తానన్నాడు. చెప్పడం ప్రాంభించాడిలా.

అనగా అనగా కరోనా రోజులు. అదో పల్లెటూరు. ఒకామెకి ఆయాసం రోగం ఉంది. గత పదిరోజులుగా వర్షం ఎడతెరపిలేక కురుస్తోంది. రాత్రికి రోగం ఎక్కువైతే, ఉదయమే వర్షంలో ఆటో లో పక్క పట్నానికి వైద్యానికి తీసుకు బయలుదేరారు.కరోనా కు ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా వైద్యం చేస్తాయంటే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళేరు, ఏ వైద్యమైనా అక్కడే చేయించచ్చని.

 హాస్పిటల్ వారు చూసి కరోనా టెస్ట్ చేయించుకురమ్మని ఒక లేబ్ పేరిచ్చారు. అక్కడకి పేషంటుని తీసుకుపోతే టెస్ట్ చేసి పాతిక వందలు పుచ్చుకుని, కరోనా ఉంది, నాలుగో స్టేజిలో ఉంది అని చెప్పేరు.హాస్పిటల్ కి టెస్ట్ తో తిరిగొచ్చేరు. పేషంటును చూసిన వైద్యులు వీరి చికిత్సకు తగిన పరికరాలు మా దగ్గర లేవు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుపొమ్మన్నారు. వర్షం ఆగదు. 

అలాగే గర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళితే, వారు వివరాలడిగి, మీరు ఇక్కడికి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళండి. అక్కడ వైద్యం చేస్తారని చెప్పి పంపేరు.

 ఆ హాస్పిటల్ కి తీసుకెళితే కరోన టెస్ట్ చేయించండి. ఇక్కడికి రెండు కీలో మీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ లేబ్ లో చేస్తారన్నారు. కరోన టెస్ట్ ఫలాన చోట చేయించామని కాయితం చూపించారు. ఇది కుదరదు, మళ్ళీ చేయించండన్నారు. పేషంటుని అలాగే లేబ్ కి తీసుకెళితే టెస్ట్ చేసి రేపుగాని రిసల్ట్ ఇవ్వలేమన్నారు. 

ఏం చెయ్యాలో తోచనివారు, పేషంటును తీసుకుని ఇంటికి బయలుదేరి ముఫై కిలో మీటర్లు దూరం పోయాకా హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, పేషంటుకి కరోన ఉంది, తీసుకురండి వెనక్కి, అని ఫోన్ చేశారు. ఫోన్ చేసిన మొదటి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళితే, ఇక్కడకాదు, ఇక్కడి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళమన్నారు. 

అలాగే తీసుకెళ్ళేరు. పేషంట్ తడిపొడి బట్టలతో ఉండగా స్ట్రెచర్ మీదకి చేర్చారు. అంతే లోపలికి తీసుకుపోవలసిన అవసరం కలగలేదు.మార్చురీకి శవాన్ని తీసుకుపోయారు. ఇప్పుడు బంధువులు శవం కోసం పడిగాపులు పడుతున్నారు. ఉదయం తొమ్మిది మొదలైన తిరుగుడు రాత్రి తొమ్మిదికి పేషంట్ ఊపిరి అనంతవాయువుల్లో కలవడంతో పూర్తయ్యింది . ఈ పేషంట్ ప్రాణం పోవడానికి ఎవరు కారణం చెప్పు రాజా! 


26, జులై 2020, ఆదివారం

.మదికదిలినవేళ

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సంఘటనగా చెబుతున్నారు.

భార్యభర్త కీచులాడుకున్నారు. అది పెరిగి పెద్దదీ అయింది. జీవితం లో నీ మొహం చూడను,నీతో కలిసిబతకను. విడాకులేకావాలి అమ్మాయి పట్టు. నీవు లేక నా జీవితం లేదు, వ్యర్ధం అబ్బాయి మాట. ఎవరిపంతం వాళ్ళు వదలలేదు. చివరికి కేసు పోలీసులకి ఫేమిలీ కోర్టుకు చేరింది. అమ్మాయిని పోలీసులు కన్విన్స్ చేయడానికి విశ్వప్రయత్నం చేశారు. సరిపడలా. అప్పుడు అబ్బాయికి వచ్చిన చిన్న ఆలోచనే ఈపాట. నా భార్య మనస్సు నాకు తెలియదా? నేనే నా భార్యను సముదాయించుకుంటానని ఈ పాట పాడి ఆమె మనసు మళ్ళీ గెలుచుకున్నాడు.ఆ పాట అర్ధం ఎవరేనా చెబితే ఆనందం.మాటకున్న పవరెంత? కవికి నమస్కారం.


https://youtu.be/GiYsvyMWnAk

మధురం మధురం ఈ సమయం 
ఇక జీవితమే ఆనందమయం.
తొలగిపోయె పెను చీకటి తెరలూ
లగిపోయె అనుమానపు తెరలు
పొంగి పొరలె మనకోర్కెల అలలు
భావియే మనకు నందనవనముగ.
మధురం మధురం ఈ సమయం 
ఇక జీవితమే ఆనందమయం.

Coutesy:పాత చినిమా పాట. కవిగారికి వందనం.
Courtesy:Whats app

25, జులై 2020, శనివారం

ప్రయత్నం.




ఈ చిన్నారి నేర్పుతున్న జీవిత పాఠం ఏమిటి? ఓడిపోతానని,పడిపోతానని, దెబ్బ తగులుతుందని తెలిసినా  ప్రయత్నించు. గెలుపు నీదే,అంతిమ విజయం నీదే! నిరాశలో కూరుకుపోకు.

24, జులై 2020, శుక్రవారం

దధ్యోదనం

దధ్యోదనం

అసలు పేరు దధ్యోదనం కాని అలవాటుగా దధ్యోజనం అని వాడేస్తున్నాం. ఈ మాటే బాగుందా? దధ్యోదనం అంటే పెరుగన్నం అని అర్ధం. దధి+ఓనమా ఏసంధి? ఏ సమాసం, ఏది విగ్రహ వాక్యం, శలవీయాలి .. సరే ఇక ముందుకెళదాం. కొంచం తెలివి తక్కువవారిని ఎగతాళీ చేయడానికి వాడే మాటలలో ఇదొహటి. ఆ ఎగతాళీ మాటలు, పప్పూ, ముద్దపప్పూ,పప్పు సుద్దా, చలిమిడి ముద్ద, దద్దోజనం. కాని ఇవన్నీ గొప్పవి, శక్తినిచ్చేవి అదేగాక వ్యాధి నిరోధాకాలు కూడా, ఉదయాన్నే మంచి ఉపాహారం. దీనికేంగాని అలాముoదుకుపోదాం :) 

రాత్రి తోడు పెట్టిన పెరుగు తీసుకోండి, గిలక్కొట్టండి, కొంచం నీరు పోసి.అందులో చిటికెడు పసుపు వేయండి, తగిన ఉప్పు వేసి కలపండి. బాణలి లో కొంచం నెయ్యి వేయండి దానిలో శనగపప్పు,వేసి కొంచం వేగనివ్వండి, ఆతరవాత చీల్చిన పచ్చి మిర్చి,కొంచం ఎండు మిర్చి చేర్చండి, వేగుతుండగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలేయండి,జీలకర్ర, కరివేపాకు వేయండి, ఆ తరవాత వాము చేర్చండి, చివరగా ఆవాలు వేయండి. వేగిన పోపును మజ్జిగలో చేర్చండి, పోపు వేయించడానికి ఇనపమూకుడు వాడండి.ఇష్టమైతే చిన్న ఇంగువముక్క పోపులోవేయండి. 
 ఇప్పుడు ఈ మజ్జిగలో వేడిగా వండుకున్న అన్నం చేర్చండి.పైన కొత్తిమీరి వేయండి. బలెబలే దధ్యోదనం తయారు.

ఇది మంచి రుచికరమైన ఆహారము మరియు మందు కూడా ఎలా?ఇందులో మజ్జిగ మందు, పసుపు,ఇంగువ,ఉప్పు,అల్లం ,జీలకర్ర, ఆవాలు,కరివేపాకు,కొత్తి మీరి అన్నీ ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే వ్యాధి నిరోధకాలే...ఆ పై తమ చిత్తం 

23, జులై 2020, గురువారం

ఏమి సేతురా లింగా ఏమి చేతు

ఏమి సేతురా లింగా ఏమి చేతు   
ఏమి సేతురా లింగా ఏమి చేతు   

కరోనా కాలమాయె!
దారి కానదౌను లింగా!!
ఏమి సేతురా లింగా ఏమి చేతు! మాహానుభావా!!  
 ఏమి సేతురా లింగా ఏమి చేతు!   

చీనా పుట్టిల్లాయే !
ప్రపంచమంతపాకె లింగా!!
ఏమి సేతురా లింగా ఏమి చేతు!   మాలింగమూర్తీ!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!   

తగులుకుంటే వదలదాయె!
 తేల్చునాయె చావొ రేవో లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!  మాదేవ శంభో!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!

మందేమో లేదాయె!
వేక్సిన్ రాదాయె  లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! మాలింగ మూర్తీ!!
 ఏమి చేతురా లింగా ఏమి చేతు!   

గోటి దనే దొకడాయె!
 గొడ్డలనే దొకడాయెలింగా!!
 ఏమి చేతురా లింగా ఏమి చేతు! త్రిశూల పాణీ !! 
 ఏమి చేతురా లింగా ఏమి చేతు !

గాల్లో నిలవదనే దొకడాయె!
 కాదనుదొకడాయెలింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! హాలాహలధరా!!  
ఏమి చేతురా లింగా ఏమి చేతు!

కన్ను చాలానే దొకడాయె!
 కాదు కాదనే దొకడాయెలింగా!!
 ఏమి చేతురా లింగా ఏమిచేతు! మహా శివా!!
ఏమి చేతురా లింగా ఏమిచేతు!

ఏది నికరమొ తెలియదాయె!
 తిరమాయె చావు లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! త్రిపురాంతక శివా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! 

భయమేమో లావాయె! 
ఆకలి తప్పదాయె లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! అన్నపూర్ణాపతే!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!  

చాకిరేమో తప్పదాయె!
 మనుజులంటె భయమాయెలింగా!! 
ఏమి చేతురా లింగా ఏమి చేతు! గజచర్మధారీ!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు !


 బాలమురళిగారికి అపరాధ శత పరిహార నమస్సులు అర్పిస్తూ


22, జులై 2020, బుధవారం

కొత్తిమీరి కారం

కొత్తిమీరి కారం

కరోనా వచ్చినారికి మందుగానూ, రాని వారికి రోగ నిరోధకంగానూ నిమ్మకాయ వాడమంటున్నారు విటమిన్ సి కోసం. ఇలాటిదే మరొకటి ఉసిరికాయ. ఉసిరి కాయంటే రాచ ఉసిరి లేదా పెద్ద ఉసిరి. దీని నిలవ పచ్చడి నల్లగా ఉంటుంది అందుకు దీన్ని నల్ల పచ్చడి అంటారు, ఇది అణువణువూ విటమిన్ సి. కాని దానిని ఇప్పుడు వాడ కూడదన్నారు. అది వాడే సమయం వేరు. ఈ నిమ్మకాయ రసాన్ని తాగమంటున్నారు. దానితో పాటు కొత్తి మీర చేర్చి పచ్చిమిర్చి,ఉప్పు చేర్చి కొత్తిమీరి కారం చేసుకు తింటే బలే రుచి. వ్యాధినిరోధానికి మరొకటి కొత్తిమీరి చేర్చినట్లవుతుంది. కొత్తిమీరి అంటే మరేంకాదు ధనియాలే :)

కొత్తిమీరి తీసుకోండి నీటిలో ఝాడించండి. ముక్కలుగా తరగండి. స్తీలు పాత్రలో వేయండి. నిమ్మకాయ రసం పిండండి,చిటికెడు పసుపు వేయండి, తగిన ఉప్పు చేర్చండి, పచ్చి మిర్చి తొక్కి కలపండి. దీనిలో కొత్తిమీరి చేర్చండి, కలిపేయండి,బాగా. రుచికరమైన మందు కొత్తిమీరి కారం రెడీ :)


నిమ్మరసంతో పచ్చి బీరకాయముక్కలు.


నిమ్మ రసం పిండుకోండి. తగిన ఉప్పు జత చేయండి. లేత బీరకాయ ముక్కలు, లేత దొండకాయ ముక్కలు, మరీ ముదురుకాని పచ్చి మిర్చి ముక్కలు, చిన్నవిగా తరుక్కోండి. ఒక స్టీల్ పాతర్లో వీటిని కలిపే ఉంచండి, చిటికెడు పసుపు వేయండి.రెండు మూడు గంటలు తరవాత అన్నంలో కలుపుకు తినండి, అద్భుతం. పప్పు అన్నం ఐతే చెప్పేదే లేదు.


నిమ్మకాయ కారం.


పైన చెప్పినవి బాగానే ఉన్నాయి కాని చేసుకోవడం తలనొప్పి అంటారా! మరో చిన్న చిటకా.నిమ్మకాయ ను పిండి రసం తీయండి. తగినంత ఉప్పు వేయండి చిటికెడు పసుపు వేయండి. వేయించిన్ జీలకర్ర కారం కలిపేయండి బలే ఉంటుంది. నోటికి బలే రుచిగా ఉంటాయి,ఆహారం తీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంటే చెప్పక్కర లేదు.


21, జులై 2020, మంగళవారం

చలిమిడి

చలిమిడి

పుట్టింటికెడితే ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా చలిమిడి తెచ్చుకోని ఆడపడుచు వుండదు, తెలుగునాట. కలిగినవారు మడులు మాన్యాలూ కూతురికివ్వచ్చు గాని ఏమీ లేనివారైనా చలిమిడి పెట్టకుండా పసుపు,కుంకుమ ఇవ్వకుండా మాత్రం పంపరు. పుట్టింటి కెళ్ళొచ్చిన ఆడకూతురు భర్తకు మొదటగా పెట్టేదీ చలిమిడే. :) 

ఇక తెలివి తక్కువ వాళ్ళని చలిమిడి ముద్దా, ముద్దపప్పూ,పప్పూ  అనడం అలవాటే :)కాని చలిమిడి చాలా మంచిది,బలవర్ధకమేకాదు, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందిట. 

చలిమిడి ఎలా తయారు చేస్తారు? ఇది రెండు రకాలు, చలిమిడి,పచ్చి చలిమిడి. చలిమిడికి కొట్టుపిండి కావాలి. కొట్టు పిండంటే, బియ్యం నానబోసి, ఆరబెట్టి దంపాలి. పిండి జల్లించుకోవాలి. మెత్తగా ఉంటుంది, పిండి.దీన్ని పంచదారతోనూ,బెల్లంతోనూ చేస్తారు. బెల్లంతో చేయడం శ్రేష్టం. బెల్లం కోరుకుని పాకం పట్టాలి, ఈ పాకం పట్టడమే టెక్నిక్. తీగపాకం రావాలి, అందులో కొట్టుపిండి పోయాలి కలియ బెట్టాలి. ఆపైన అందులో ఎండుకొబ్బరి ముక్కలు చిన్నగా తరుక్కున్నవి వేయాలి.కలిగిన వారు జీడిపప్పు,యాలకులు,పచ్చకర్పూరం కూడా వేస్తారు.

 మరోమాట ఈ చలిమిడినే చిన్నచిన్న ఉండలులా తయారు చేసి వత్తి నూనెలో బంగారం రంగు వచ్చేదాకా వేయిస్తే అదే అరిసె. అరిసెల వంట చెప్పినంత తేలికకాదు సుమా.

ఇక పచ్చి చలిమిడి. బియ్యపు పిండిని కోరిన బెల్లంలో కలిపి, కొబ్బరిముక్కలేసి, కొద్ది నీటితో ముద్దలా చేస్తారు.ఇది నాగులచవితికి చేస్తారు. 

20, జులై 2020, సోమవారం

మునగ ఆకు పచ్చడి

మునగ ఆకు పచ్చడి

మునగ/ములగ ఎలగైనా వాడతారు. ములగ పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్నదే.ములగ నీటిని శుద్ధి చేస్తుంది.  ములగ కాడ వాడకం తెలిసినదే. కూర చారు వగైరాలలో ఎక్కువగా వాడేదే. బలవర్ధక ఆహారం. ములగ లో ఇనుము ధాతువు ఎక్కువ. ఆషాఢ మాసం లో ములగ కూర తినాలని అంటారు. ములగ ఆకు కొంచం వాసన ఉంటుంది, ఎక్కువ మంది ఆకును ఇష్టపడలేకపోవచ్చు, పప్పులో కలగలుపుగా వాడుకున్నా. అందుకు పచ్చడి చేసి చూడండి ఇలా. గుప్పెడు ములగ రెమ్మలు విరవండి. కొన్ని లేతవి కొన్ని ముదురువి. చీడ పీడ చూడండి. నీటిలో జాడించంది. ఆపైన ఆకుకోయండి. తడిగా ఉంటే ఆరబెట్టండి. కొద్దిగా చమురు వేసి మూకుడులో వేయించండి. ఆపైన గోంగూర పచ్చడిలా చేసుకోండి. కొద్దిగా చింతపండు ఎక్కువ వేస్తే బాగోవచ్చు. ఖర్చులేని బలమైన వంటకం,సులువుగా అరుగుతుంది. ఇప్పుడి మినగాకు కూడా ఎగుమతి చేస్తున్నారట.ఇలాటిదే మరొకటి పొన్నగంటి కూర, ఇది కళ్ళకి మంచిదిట, పచ్చడి చేసుకుంటే బాగుంది పైన చెప్పినట్టే.  

18, జులై 2020, శనివారం

కరోనా తో వ్యవసాయం

18.4.2020
ముంజలగెలలు తో తాడి

18.6.2020
నారుమడి సిద్ధం చేస్తున్న రైతు

11.7.2020

కాలవ. పచ్చని చేలు
11.7.2020
ఊడ్చిన చేలు
11.7.2020
ఊడ్చడానికి నారు కట్టలు పడేసిన చేను
11.7.2020
వెదజల్లిన చేను

11.7.2020
ఊడ్పుకు వెళుతున్న కూలీలు

కాలవ. 11.7.2020
11.7.2020
కూలీల మోటార్ సైకిళ్ళు
  

6, జులై 2020, సోమవారం

గడ్డి గుడిసెలు-గూన పెంకలు




గడ్డి గుడిసెలు గూన పెంకలు
మట్టి గోడలు మాయమాయే

మోటబావులు పూడిపోయే
ఊటబావుల ఊసె లేదే

వరికల్లం కానరాదే
వడ్లు ఇంటికి చేరవాయే

బండిఎడ్లు ఏడబోయే
బర్రె తలుగు కానరాదే

ఒడ్ల గుమ్ములు ఒరిగిపోయే
కుడితి గోలెం ఇరిగిపాయే

మొక్కజొన్న చేనలల్ల
మంచెలన్నీ కూలిపోయే

పొద్దు తిరుగుడు చేనులన్నీ
ఆ పొద్దుకోసం ఎదురుచూసే

వెదురు షాటలు పెండ్ల తట్టలు
పెంటకుప్పల కూలిపోయే

బడికిపోయేబత్త సంచీ
బుక్కులెయ్యని ఎక్కి ఏడ్చే

చెక్కపలక సుద్దముక్కా
సూద్దమన్నా లేకపోయే

మర్రి చెట్టు ఉయ్యాలలేవీ
ఈత పండ్ల జాడలేవీ

మోదుగు పూల హోళీ రంగు
ఎరుపు తగ్గీ ఎలిసిపోయే

సిర్రగోనెలు సెదలుపట్టే
శిలుక్కొయ్యలు శిధిలమాయే

మంచినీళ్ళ మట్టికుండలు
మట్టిలోనే కలిసిపోయే

తేనెటీగల గోండ్రు కప్పల
రాగమేదీ తాలమేదీ

నింగిలోన పిల్లలకోడి
నిద్రపోయి లేవదాయే

గడ్డిగుడిసెల గూండ్లు కట్టిన
బుర్రు పిట్ట ఎగిరిపోయే

మనిషి ఆడిన కోతికొమ్మ
ఇపుడు కోతులొచ్చీ ఆడబట్టే

రచ్చబండ రంది తోటి
మంది ఏరని ఎదురు చూసే

తిరిగిరానీ రోజులన్నీ
తలుసుకుంటూ తల్లడిల్లే

జ్ఞాపకాలను మది మందిరంలో
దాచుకుంటూ సాగిపోతూ.....

జానపద అజ్ఞాత కవి కి నమస్కారం.

ఇది తెలంగాణా ప్రాంతంలోని జానపద గీతంగా తలుస్తాను, కొన్ని పలుకుబడులకు అర్ధం చెప్ప గలను. 
Courtesy Whats app







1, జులై 2020, బుధవారం

వద్దురా చిన్నయ్యా!




వద్దురా చిన్నయ్యా!వద్దురా చిన్నయ్యా!!
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా!
వద్దురా చిన్నయ్యా!!
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా!
వద్దురా చిన్నయ్యా!!


కరోన ఇళ్ళకి కదలివచ్చేవేళ ముదిపాపలను చూసి పట్టుకెళ్ళేవేళ
వద్దురా చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!

కట్టిన మాస్కేమో దగ్గుకే మాసేను పాలుగారే మోము తుమ్ముకే వాడేను
వద్దురా వద్దురా కన్నయ్యా!
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!

కరోన తగిలిన  కానివాళ్ళేనని చీలివాళ్ళంతా అల్లరి చేసేరు
వద్దురా చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!

ఆడుకోవలెనన్న,పాడుకోవలెనన్న
ఆదటను నేనున్నా,అన్నిటను నీదాన (సెల్ఫోన్)
వద్దురా! వద్దురా!!వద్దురా!!!చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!అయ్యా!!!
వద్దురా చిన్నయ్య!చిన్నయ్య!!



తొలి ఏకాదశి సందర్భంగా,శుభకామనలతో!
కంటైన్మెంట్ జోన్ లో గడుపుతున్న సందర్భంగా!!
బ్లాగు మరల ఓపెన్ ఐన సందర్భంగా!!!

With due respects to all concerned.

1, జూన్ 2020, సోమవారం

చిత్రం భళారే ఔచిత్యం






చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం

మానవజాతిని పరాన్నజీవి  శాసించుటే 
విచిత్రం 
కరోనా ను వదిలించుకోలేకపోవుటే 
విచిత్రం
చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం
కనపడని కరోనాకు మానవజాతి ఇళ్ళలో దాగొనుటే
 విచిత్రం
లాక్డవున్ సమయంలో మదనుడు సందడి చేయుటె 
విచిత్రం
చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం
రోకటి పోటులా మిడత దాడి 
విచిత్రం
చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం
కాకి మూక మిడతపై దాడి మరీ 
విచిత్రం
చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం
తుఫాను,భూకంపం, యుద్ధం రానున్నవన్న వార్త 
నమ్మలేని  విచిత్రం
చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం



30, మే 2020, శనివారం

కాదేదీ





కాదేదీ   కవితకనర్హం
కుక్కపిల్లా,సబ్బు బిళ్ళా, అగ్గిపుల్లా
మహాకవి శ్రీశ్రీ


పేరడీ

తెనుగులో   పేరడీ కవితలకు ఆది గురువు శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. వీరు జరుక్ శాస్త్రిగానే ప్రసిద్ధులు. ఆదిగురువుకు నమస్కరిస్తూ

కాదేదీ  తినుట కనర్హం
కుక్కా,నక్కా,పిల్లీ,బల్లీ
నేటి అవుసరం ఉడతా మిడతా
తింటేనే ఉనికి లేకుంటే లేదు మనికి
కడుపుకాలితే సర్వం సమానం
కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం.

ఆది పేరడీ గురువును స్మరించుకున్న సందర్భంగా చిన్న కవిత :)

పేరడీ కవిత్వానికి
ఆది గురువు  జరుక్కు
దీనికి కావాలి   చమక్కు
అనిపించాలి     చురుక్కు
నవ్వు రావాలి   భళుక్కు

ఇది ఇంతకు   ముందే  ఎవరేనా చెప్పేసేరేమో కూడా :)

29, మే 2020, శుక్రవారం

మిడతల దండు


మిడతల దండు



మిడుత చాలా చిన్న జీవి.పతంగం అంటే కూడా మిడత అని అర్ధం ఉంది. దీనికున్న బలం ఎగురగలగడం. దీని బలహీనత నిప్పు. మిడుతలు ఎడారుల్లో గుడ్లు పెడతాయి. అవి ఒకటి రెండు మూడు ఆపై అసంఖ్యాకంగా పెరిగి ఆహారానికి బయలు దేరాతాయి. వీటికి దేశాలు సరిహద్దులు లేవు. పచ్చదనం ఎక్కడవుంటే అక్కడ వాలతాయి. అన్నీ తినేస్తాయి, లేచి వెళతాయి, అక్కడేం మిగలదు. ఇది కూడా కొన్ని అత్యాశాపరులైన దేశాల వారి సృష్టి కావచ్చు. ప్రపంచాన్ని శాసించాలనే ఎత్తుగడ కావచ్చు.జీవ జంతువులతో విలయం సృష్టి కావచ్చు. ఇవి దండుగా ఎగురుతోంటే ఆకాశం లో సూర్యుడే కనపడకపోవచ్చు. ఏమవుతుంది ఇవొస్తే ముందు పచ్చని ఆకు కనపడదు. ఉన్న ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆ తరవాత ఆహారానికి కరువొస్తుంది. అదుపు చేయండి, ఎలా చిన్న చిన్న మంటలేయండి, అందులో దూకి చస్తాయి. పైర్లమీద పచ్చదనం మీద వేప కషాయం చల్లండి, అవి వేప కషాయం చల్లిన వాటిని తినలేవు. ఒక వేళ తింటే చనిపోతాయి, పునరుత్పత్తీ చేయలేవు. బహుపరాక్, మనదేశంలో మహా రాష్ట్ర,రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ మొదలైన ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోంది, ఈ మిడత, రేపు మనదీ అదే పరిస్థితి కావచ్చు.... 

ఇక్కడొక పెద్ద కథ చదవండి...మిడత మూలంగా
https://kastephale.wordpress.com/2013/06/11/  ఈ రోజు రెండు టపాలున్నాయి, గమనించగలరు.
https://kastephale.wordpress.com/2013/06/14/

https://kastephale.wordpress.com/2013/06/17

24, మే 2020, ఆదివారం

కొమ్ములు తిరిగిన దేశాలే

https://youtu.be/OV3Hvq5L5Eg
పాట1960లో విడుదలైన భట్టి విక్రమార్క చిత్రంలోది
కొమ్ములు తిరిగిన మగవారూ కొంగు తగిలితే పోలేరు నాకొంగు తగిలితే పోలేరు ని అనుసరించిన పారడీ పాట 




కొమ్ములు తిరిగిన దేశాలే కంటి చూపుకే మాడేయి
కడగంటి చూపుకే మాసేయి


కత్తులు దూసే దేశాలే ఎత్తులు మార్చే దాదాలే
                          లాకు డవున్ లో చేరేరు,లాకు డవునులో చేరేరు,                           II  కొమ్ములు తిరిగినII

మందుకోసమే మూగేరు, చేతులు, మూతులు కడిగేరు,దెబ్బకి భయపడిపోయారూ, ముక్కూ నోరూ మూసేరు,                                               .                                                          II  కొమ్ములు తిరిగినII

చేతులు కలిపే మొనగాళ్ళే చేతులు జోడించేరూ.దూరం పాటించేరు                            II  కొమ్ములు తిరిగినII

తగిలిన కరోన కౌగిలిలో ప్రభువైనా వసివాడును లే
                         ఇదే నీతి ఈ జగతి.                                                          II  కొమ్ములు తిరిగినII


With regards to all concerned

20, మే 2020, బుధవారం

అయ్యయ్యో చేతిలో డబ్బులు ఐపోయనే

అయ్యయ్యో చేతిలో డబ్బులు ఐపోయనే
అమ్మయ్యో జేబులు ఖాళీ ఆయనే!

లాక్డవున్ లో తిని కూచుంటే సొమ్మయిపోయిందీ.
పులిమీద పుట్రలా రిలయన్స్ రైట్స్ వచ్చిపడిందే 

దీకి కట్టడానికి సొమ్మెక్కడనుంచి వచ్చు?

ధాన్యం అమ్మితేనో?
అమ్మినదానికే సొమ్మురాలేదు భాయీ

బంగారం కుదవబెడితే
ఇదే చచ్చు సలాహాభాయీ
అప్పుచేసి పప్పు కూడంటే ఇదేనోయీ

ఎవరినేనా చేబదులడిగితే
అందరిదీ ఇదే పరిస్థితైతే అప్పెవరిచ్చేనూ

రిలయన్స్ రైట్స్ కి అప్పుచేసి కొనే సీనుందా?
నాలుగేళ్ళలో షేర్ రేటు రెట్టింపయ్యిందే

గోవిందా! గోవిందా!!

మరిప్పుడు దారేదీ?
ఆలోచన తెగటం లేదోయీ
అప్పుడే ఒక రోజైపోయిందీ!!!!

RIL-RIGHTS ISSUE
This company deals in oil and Telecom sectors,primarily.
The last benefit from the company was a 1:1 bonus in 2017.
Now this company is offering one share for every fifteen shares held by a shareholder, at a premium of Rs.1247 per share. The market value of this share is around Rs.1500 as on date. The share value of this company was  Rs.780.90 in sep 2017 and now it is around Rs.1500/-   Yellow metal  GOLD is trending high and the rate may increase up to Rs.82000/-per ten grams by next year  end, a good short term investment. Be careful about GOLD control Rules.

Disclaimer: This is not an encouragement to invest in stock or to buy gold. Consult financial experts before investment.

8, మే 2020, శుక్రవారం

బాధగా ఉంది.



కష్టం కలిగినపుడే బాధ తప్పదు. ధైర్యం కోల్పోవద్దు.వదంతులు నమ్మద్దు

7, మే 2020, గురువారం

6, మే 2020, బుధవారం

ఆత్రం

Courtesy Whats app
ఆహారధాన్యాలకంటే మందుకే కరువొచ్చేలా ఉంది

5, మే 2020, మంగళవారం

తెలగపిండి వడియం

తెలగపిండి వడియం

కరోనా పేద గొప్ప దేశాలని పెద ధనిక వర్గాలని చూడకుండా జనాల్ని చిత్తు చేస్తోంది. అదేమో తెలియదుగాని మగవాళ్ళనే ఎక్కువ మందిని పొట్టన పెట్టుకుంటోందిట. దీని మొహం తగలెయ్య! దీనికి మగాళ్ళంటే అంత ఇష్టమా? అందులోనూ పెద్దాళ్ళంటే మరీనుట, దీని ప్రేమ తగలెయ్య!!

ఆంధ్రాలో విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలో అడుగు పెట్టలేకపోయిందిట. ఈ జిల్లాలలో అడుగు పెట్టలేకపోడానికి కారణం ఏంటీ? అని వాట్సాప్ యూనివర్సిటీ వారు పరిశోధన చేశారట. :)  హా! తెలిసెన్ కారణం అన్నారు. :)  ఏంటీటా?

ఏంటదీ?  తెలగపిండి వడియం. ఎలా తయారు చేస్తారు? ఆ ప్రాంతంలో విరివిగా పండేవి ఎర్ర నువ్వులు. నూనె తీయగా మిగిలిన తెలగపిండిలో ఉప్పు,వాము, పచ్చి మిర్చి కలిపి కుమ్మి, ముద్దకి దబ్బకాయ రసం కలిపి వడియాల్లా ఎండ బెడతారట. దానిని నంజుకుంటూ ఉదయమే గంజి తాగుతారట. అదీ రహస్యం అని బయట పడింది. తెలగపిండి వడియం తినిచూస్తారా?

3, మే 2020, ఆదివారం

Lock Down



వాట్స్ ఆప్ లో ఒక యువకుని మాట.
లాక్ ఆప్ పోలీస్ కస్టడీ
లాక్డవున్ పెళ్ళాం కస్టడీ








All videos Courtesy Whats app.


2, మే 2020, శనివారం

కుండల్లోకి గుర్రాలని తోలుకుంటూ


Courtesy:Whats app


ఏంటీ పుణుక్కుంటున్నారక్కడా?? సణిగిందో ఇల్లాలు.
ఏం లేదూ బీరువా సద్దుదామనీ..సాచేశాడా మగమహారాజు.
చూస్తూనే ఉన్నాలెండి మీ సద్దుడు అంది సద్దుడు మాట మీద నొక్కి మూతి విరుస్తూ!
నలభై రోజుల్నించీ కుండల్లోకి గుర్రాలని తోలుకుంటూ మీరు చేస్తున్న పనులివేగా, మురిపెంగా విసుక్కుంది.
ఖాళీగా కూచుంటే ఏం తోచటం లేదోయ్
సరేగాని, ఏంటా మాసిపోయిన బనీనూ మీరూనూ, చెమట వాసనతో చిరాకేయటం లేదూ? విప్పేయండి, వాష్ లో వేస్తాను అంటే ఓహో అనుకున్న మగమహారాజు బనీను విప్పేసేడు,గొప్పగా.  లోపల దాచుకున్నవి మరచిపోయి బనీను విప్పడంతో కాయితాలు జలజలా రాలేయి. ఆ ఇల్లాలు కాగితాలన్నీ ఏరి బీరువాలో జాగ్రత్త చేసుకుని తాళమేసి, మగమహారాజుని చూస్తూ...
అవును కదా! ఉదయం నాలుగునుంచి ఎనిమిది మధ్యాహ్నం ఒకటినుంచి రెండు, రాత్రి ఏడునుంచి ఎనిమిది దాకా రసోయి,కిచెన్,వంటిల్లు తీసి ఉంచితేనే, చిరుబొజ్జలు, బాన పొట్టలు వచ్చేసేయి. వచ్చినవేమైనా పోతాయేమోగాని ఇవి పోవులెండి అని సాగతీసిందా ఇల్లాలు, బొజ్జ నిమురుకుంటూ బయటికెళ్ళేడా మగమహారాజు :)




Courtesy:Whats app

28, ఏప్రిల్ 2020, మంగళవారం

పల్లె సీమలు.

పల్లె సీమలు.
కితం వారం లాక్ డవున్ ను పల్లెలలో సడలించారు. రెండవపంట బాగానే పండింది.దిగుబడి కూడా బాగుంది.ఎకరానికి రెండున్నర టన్నులు కావచ్చు. ఇది రెండవపంట కనక యంత్రాలు ఉపయోగించి కోతనుంచి మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. యంత్రాలకి అయ్యే ఖర్చు డబ్బులొచ్చాకా ఇస్తారు. ఇది అలవాటే. ఎఫ్.సి.ఐ రంగంలోకి దిగి కొనుగోళ్ళు చేస్తోంది. సరకు కూడా గొదాములకు చేరుతోంది. నెల లోగా సొమ్ములు రైతు చేతికి రావడం మామూలే.ఏమైనా సరుకు ఒబ్బిడి అవుతోంది సంతోషం.   పంట పండించిన రైతు గిట్టుబాటు ధర  కోసం చూస్తాడు అలాగే సరుకు పాడవకుండా ఒబ్బిడి ఐతే సంతోషిస్తాడు,చేసిన శ్రమ ఫలించినందుకు.
    

  ఇంకా   సగం  పైగా మాసూళ్ళు కావాలి,మొత్తం పూర్తి కావాలంటే మరో రెండు వారాలు తప్పదు. కాని ఈ లోగానే 27,28 తారీకులలో తుఫాను తాక నుందని  వార్త. ఇదెంత నిజమో తెలియదు.   ఇటువంటి అసత్యాలు ప్రచారంలో ఉన్నాయి.నిన్న ఉదయమే గాలివాన తో మామిడి రాలిపోయింది, వరికి కొంత నష్టం.  ఏమైనా పల్లెసీమలు పని పుంజుకున్నాయి. పల్లెలకు సంబంధించిన అన్నీ పని చేస్తున్నాయి. ఈ లోగా ప్రధాని నుంచి వచ్చే సహాయం ప్రతి ఒక్కరి కాతాలోనూ పడుతోంది.  (2000+2000) ఇది సమయానికి రైతుకు ఉపయోగకరంగానే ఉంది. మరొక విడత సొమ్ములు మాత్రం రావాలి. మొత్తం గోజిలలో పన్నెండున్నర లక్షల టన్నులాఅహారధాన్యాలు ఒబ్బిడి అవుతున్నాయి. కరోనా పల్లెలనేం చెయ్యలేకపోయింది.  మందులేక ఇబ్బంది పడుతున్న మాట నిజం.  బియ్యం ఇత్ర నిత్యావసరాలు ఇంటికే చేరుస్తున్నారు, బాధ లేదు. 



ఒక రైతు మాట
''మూడో తారీకు తరవాత ఎలా వుంటుంది? కంగారు పడద్దు. నెమ్మది నెమ్మదిగా అంతా సద్దుకుంటుంది,  కరోనా, తుఫానులూ ఏం చేయలేవు. పనులు పూర్తైనా రైతన్నలు మిగిలినవారికి సహాయం చెయ్యండి. తొలకరికి కావాల్సిన విత్తనాలు,ఎరువులు సరఫరా అవుతాయి, భయపడద్దు. ఆరోగ్యంగా ఉండండి, ఇంట్లోనే ఉండంది, పనులు పూర్తయితే
  పల్లెలను  అలవాట్లే రక్షిస్తున్నాయి. లాక్ డవున్ ఎత్తేసినా,ఉన్నా మంచి అలవాటలు మానకండి.అనవసర ప్రయాణాలొద్దు. అవసర ప్రయాణాలు మానొద్దు.బయట తిరగద్దు.గాలి వార్తలు నమ్మద్దు.


గొప్ప మార్పు వచ్చేస్తుందని అనుకోనుగానిమార్పు మంచికే జరుగుతుందని ఆశిద్దాం."