అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
22, డిసెంబర్ 2020, మంగళవారం
మూడు తెనుగు ముక్కలున్న పద్యం./మూడు తెనుగు ముక్కలున్న తెనుగు పద్యం
20, డిసెంబర్ 2020, ఆదివారం
అదృష్టవంతుని చెరిపేవాడు
అదృష్టవంతుని చెరిపేవాడు
రాతిరి మూషికంబు వివరం బొనరించి కరండబద్ధమై
భీతిలి చిక్కి యాస చెడి వెద్దయు డస్సినపామువాత
సం పాతము జెందె దానిదిని పాము దొలంగె బిలంబుత్రోవనే
యేతఱి హానివృద్ధులకు నెక్కటి దైవము కారణం బగున్.
ఒకడు, ఒక తాచును పట్టుకుని బుట్టలో పెట్టి ఇంటవుంచాడు. పాము ఆకలితో నకనకలాడుతూ ఉంది. ఏమీ చేయలేక అసహాయoగా పడి ఉంది,ఆశ వదులుకుంది.ఆకలికి తోడు రేపేం జరుగుతుందో తెలీదు. ఇంతలో ఒక ఎలుక ఆహారం కోసం వెతుకుతూ, బుట్టకి కన్నం చేసి లోపలికి ప్రవేసించింది, ఆకలితో ఉన్న పాము ఎలుకను మింగి, ఆ ఎలుక చేసిన కన్నంలోంచి పారిపోయింది. ఇది దైవ వశాత్తు జరిగింది. అంటే అదృష్టవంతుని చెరిపేవాడు, దురదృష్టవంతుని బాగు చేయగలవారు లేరు, ఒక్క దైవం తప్పించి.అదృష్టవంతునికి అవకాశాలు కలసివస్తాయి.అననుకూల పరిస్థితులలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఆపద నుంచి బయట పడటం దైవయోగమే!దైవయోగం లేకనే ఎలుక బలైపోయింది, అన్న వస్త్రాలకి పోతే ఉన్నవస్త్రాలే పోయాయి, ప్రాణమే పోయింది. తనపై విసిరిన ఇటుకలతోనే కోట కట్టుకున్నవాడు అదృష్టవంతుడు.నేటి కాలానికి ఉదాహరణ చెప్పగలరా?
భగ్నాశస్య కరణ్డ పిణ్డితతనో ర్ల్మానేనిన్ద్రియస్య క్షుదా
కృత్వాఖు ర్వివరం స్వయం నిపతితీ నక్తం ముఖే భోగినః
తృప్తస్త త్పిశితేన సత్వర మసౌ తేనైన యాతః పధా
స్వస్థా స్తిష్ఠత దైవమేవ హి పరం వృద్దౌ క్షయే కారణమ్...
18, డిసెంబర్ 2020, శుక్రవారం
ధనం-పరిశేషన్యాయం
ధనం-పరిశేషన్యాయం
దానం భోగో నాశ స్తిప్రో గతయో భవంతి విత్తస్య
యన్న దదాతి న భుజ్త్కే తస్య తృతీయా గతి ర్భవతి
ధనమునకు దానము, భోగము, నాశము అనే మూడు గతులు చెప్పబడుచున్నవి. మొదటి రెండునూ లేని ధనము మూడవ గతినే పొందును.
దానము, ఈ పేరు చెబుతేనే చేతులు మోరలు దిగిపోయి వెనక్కి పోతాయి. చూస్తూ చూస్తూ ఒక్క రూపాయి దానం చెయ్యలేము. ఎండలో చెమటలు కక్కుకుంటూ మనల్ని ఎండ తగలకుండా తీసుకొచ్చిన రిక్షావానికి నాలుగు రూపాయలకి గీచి బేరమాడి, చిల్లరలేకపోతే దానికోసం పంపి రూపాయి మిగుల్చుకునే వాళ్ళం.ఇదే ఒక్కరినో ఉద్దేసించక్కరలేదు. నేడు అందరం ఇలాగే ఉన్నాం, ఎక్కడో ధర్మాత్ములు కొందరున్నారు, వారి గురించిన మాట కాదిది. దానం చేయగలిగి చేయకపోవడమెంత తప్పో దానం చేయడానికి తాహతు లేక దానం చేయడమూ పొరబాటే. అన్నిదానములకన్న అన్నదానము మిన్న, కాదననుగాని విద్యాదానం మరింత మంచిది. ఇలా వ్యయమైన సొమ్ము సద్గతి పొందినదే.
ఇక రెండవది భోగం. అనుభవమే భోగం, ఎంత తగినంత. అంటే సౌకర్యమైన ఇల్లు, భోజనము, ఇతర సౌకర్యాలకి తగినంత, ఆడంబరాలు కాదు. తనకు తనవారి కొరకు ఖర్చు పెట్టని సంపాదన వ్యర్ధం. మొన్ననీ మధ్య ఒకరితో మాటాడుతుంటే, ధనం సంపాదనకే సమయం పూర్తిగా వెచ్చిస్తే అనుభవానికి సమయం ఉండదంటే! సంపాదించలేక, సంపాదించే వారిని చూసి అసూయ కొద్దీ అంటున్న మాటన్నారు. ఏమో! నాకైతే అనుభవించలేని ధనం ఎందుకు? అంకెలలో చూసుకోడానికా? బంగారం,వెండిలలో చూసుకోడానికా? ఇళ్ళు పొలాలలో చూసుకోడానికో తెలీదు. ధనం, పాడె కొమ్ములకి కట్టరు, కూడా రాదు,తీసుకెళ్ళలేం. గోరెడు మట్టి కూడా రాదు, అలా ఒక్కొకరు తీసుకెళ్ళగలిగితే ఈ భూమండలం ఉండేది కాదు. ఒకప్పుడు శవం మీద పువ్వులు రూపాయలు జల్లేవారు, తీసుకెళ్ళేటపుడు. శవయాత్రకి ముందు మంగళవాద్యాలు కూడా ఉండేవి, నేటి వారు నమ్మలేరు, కాని ఇది నిజం..ఇప్పుడదీ మానేశారు.ఇలా ఖర్చైన ధనమూ సద్వినియోగమే..
మూడు రకాలు చెప్పి మొదటి రెండూ కాదంటే మూడవదనే అర్ధం. దీనే పరిశేషన్యాయం అంటారు.
పై రెండు విధాలా ఖర్చుకాని ధనం చివరికి దొంగలకిత్తురో దొరలకవునో... ఎవరికి తెలుసు?కడుపున పుట్టిన బిడ్డలే, తల్లి తండ్రులను, హింసించినా,పరిహసించినా,అవమానించినా, వారికే తమ సొమ్మును ఇచ్చి పోయేవారి ధనం కూడా మూడో కోవకే చెందుతుందేమో! కలిగినంతలో దానం, అనుభవం ఆనందాన్ని కలగజేస్తాయి.
ఇది తెలియనివారెవరు? కాని సమయానికి మాయ తెర కప్పేస్తుంది.
దానము భొగము నాశము
పూనికతో మూడు గతులు భువి ధనమునకున్
దానము భోగము నెఱుగని
దీనుని ధనమునకు గతి దృతీయమె పొసగున్.....లక్ష్మణకవి
16, డిసెంబర్ 2020, బుధవారం
నిద్ర
నిద్ర
ఆహార నిద్రా భయ మైధునాలు సర్వ జీవులకు సమానం అన్నారు, పెద్దలు.ఇవి ఎవరివి వారే అనుభవించాలి, మరొకరిని అనుభవించమనడం కుదరదు. ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం.నిద్ర గురించి చాలా కతలున్నాయి,భారతంలో,రామాయణంలో పాత చింతకాయ పచ్చడి చెప్పను.నేటి సినీ కవి మాట.
జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు
కర్తవ్యము నీవంతు కాపాడుట నావంతు
చెప్పడమే నాధర్మం వినకపోతె నీ ఖర్మం
నేటి కాలంలో నిద్ర లేనివారు,నిద్ర లేని రాత్రులే ఎక్కువవుతున్నాయి. కారణాలు చూస్తే,
ఇరవైనాలుగు గంటలలోనూ ఎక్కువ భాగం బ్లూ స్క్రీన్ చూడ్డం.అవసరం ఉన్నది లేనిది అనక అన్ని విషయాలనూ బుర్రలో కుక్కెయ్యడం.దాంతో పీతబుర్ర కాస్తా పిగిలిపోతోంది, పగిలిపోతోంది.పరిస్థితి ఎలా తయారయిందంటే ఈగ ఇల్లలుకుతూ పేరు మరచిన చందమయింది.నీ పేరేంటీ? అంటే ఆగు గూగుల్ ని అడిగి చెబుతా అంటున్నట్టు ఉంది.ఇక మరొకటి తినకూడనివి తినకూడని సమయాల్లో తినడం.దీనికి విరుగుడు లేదా? పాము విషానికే విరుగుడుందే!
నిద్దర పట్టటం లేదా? ఇది దీర్ఘరోగానికి సంకేతం కావచ్చు సుమా. ఈకింది విధం గా చేసి చూడండి, అవసరాన్ని బట్టి డాక్టర్ ని కలవండి.
చేతుల బొటన వేళ్ళు ముడవండి, ఆపై మిగినవేళ్ళు ముడవండి. ఇది అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మనం అందరం ఉపాసన చేసినదే. అందుకే దీనిని ఆదిముద్ర అంటారు. ఇలా ముడిచిన చేతులతో ఎడమవైపుకు తిరిగి పడుకోండి, ఎడమచేయి తలకింద పెట్టండి, కుడి చేయి కూడా అదే పోస్ లో పెట్టి పడుకోండి.ఊపిరి నెమ్మదిగా పీల్చి వదలండి. ఊపిరి తిత్తులు ఖాళీ చేయండి, నెమ్మదిగా నాలుగంకెలు లెక్కిస్తూ ఊపిరి పీల్చండి. ఏడంకెలు లెక్కించేదాకా ఊపిరి బిగబట్టండి, ఆ తరవాత ఎనిమిది అంకెలు లెక్కెట్టే టైమ్ దాకా ఊపిరి వదలండి. దీనిని నాలుగైదు సార్లు చేయండి. కళ్ళ మీదకి నిద్ర వస్తుంది. బుర్రలోంచి ఆలోచనలు తుడి చేయండి. అది మీవల్ల కాదు లెండి. ప్రయత్నించండి.నిద్రకి ఉపక్రమించండి. ఇది సింపుల్.
అబ్బే మేం ముదిరిపోయాం ఇలా కుదరదంటారా?
వెల్లకిలా పడుకోండి. ఆది ముద్రపట్టండి రెండు చేతులా, ఈ చేతుల్ని బొడ్డు కింద ఉంచండి, ఒక దాని గుప్పెళ్ళు మరొక దానికి తగిలేలా. చివర వేళ్ళు రెండు చేతులవీ వదలండి. ఒక చేతి రెండు వేళ్ళని రెండవ చేతి వేళ్ళ దగ్గరగా ఉంచండి. నెమ్మదిగా ఊపిరి పీల్చి వదులుతూ ఉండండి.దీన్ని శక్తి ముద్ర,మాతంగి ముద్ర అంటారు. కళ్ళు మూసుకోండి, ఊపిరి ఎక్సర్సైజ్ చేయండి, ఆలోచన తుడి చెయ్యండి. నెమ్మదిగా నిద్ర వస్తుంది.
అబ్బే మేమింకా ముదురు అంటారా? చారెడు జీలకర్ర తీసుకోండి, చిన్న స్పూన్ చక్కెర తీసుకోంది. రెండిని కలిపి నమలండి, పై చెప్పినవి చేయండి, నిద్ర వస్తుంది. అబ్బే మేము మరీ ముదురు
ఐతే పై చెప్పినవి ఆచరిస్తూ పడుక్కోడనికి ఒక గంట ముందు, వేడిగా పాలు తాగండి. పైవి చేయండి కమ్మటి నిద్ర మీ సొంతం. ఇవన్నీ ఎప్పుడో అమలు పరచేసేం, ఏం పని చేయలేదంటారా? మీకు మాత్రలేగతి డాక్టర్ని చూడండి...ఇక చెప్పను.
ఒక్కటి గుర్తుంచుకోండి,రోజులో,కనీసం రెండు గంటల పాటైనా మీ శరీరానికి సూర్య రశ్మి తగలాలి, ఎప్పుడూ ఏ.సి లో కూచుని ఉంటే ఇంతే సంగతులు. రాత్రి తీసుకున్న ఆహారం జీర్ణమై ఉండాలి,అప్పుడే మీ శరీరం విశ్రాంతిని కోరుతుంది. తిన్న వెంటనే పడుకుంటే రోగమొస్తుంది. అంటే తిన్న తరవాత కనీసం రెండు గంటలదాకా నిద్రకి ఉపక్రమించద్దు. ఆ పై మీ ఇష్టం శరీరం మీది కదా!
నిదురా రావమ్మా
రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నుల్లో
నిదురా రావమ్మా
రావే నిండారా రావే
నిద్ర జీవులకు నిత్య ప్రళయం
14, డిసెంబర్ 2020, సోమవారం
తాడిచెట్టు నీడా కాదు
తాడిచెట్టు నీడా కాదు
ధర ఖర్వాటు డొకండు సూర్యకర సంతప్త ప్రధనాంగుడై
త్వరతోడవ బరువెత్తి చేరి నిలిచెవ దాళద్రుమఛ్ఛాయ ద
చ్చిరముం దత్ఫలపాతవేగమున విచ్చెవ శబ్దయోగంబుగా
బొరి దైపోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్.....లక్ష్మణకవి
అసలే బట్టతల ఆ పై మధ్యాహ్న ఎండకి తల మాడుతుండగా నీడకోసం తాడిచెట్టు మొదలుకి చేరాడు..
అప్పుడే తాటి పండు ఒకటి రాలి, బట్టతలపై పడింది. తల పగిలింది. ”తాడిచెట్టు నీడా కాదు,ఉంచుకున్నోడు మొగుడూ కాదని ” సామెత. తాడి చెట్టు నీడెంత? చాలా తొందరగా నీడ జరిగిపోతుంది.అటువంటి నీడ కోసం పోతే తాటి పండు రాలి తలపగిలింది, దీన్నే ”దరిద్రుడు తలగడిగితే వడగళ్ళవాన ఎదురొచ్చిందని” సామెత చెబుతారు. అలాగే ”దరిద్రుడు ఏ రేవు కెళ్ళినా ముళ్ళపరిగే పడిందన్నదీ” సామెత. దైవబలం చాలకపోతే అన్నీ బాధలే,చుట్టు ముడతాయి."అన్న వస్త్రాలకోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు"సామెత. నేటి కాలానికి సరిపోయే పోలిక చెప్పండి.
మానవ ప్రయత్నం ఒకటే సరిపోదు దైవబలం లేనపుడు ఆపదలు చుట్టు ముడతాయి
ఖర్వాటో దివసేశ్వరస్య సంతాపితే మస్తకే
వాఞ్చన్దేశ మనాతపం విధివశా త్తాలస్య మూలంగతే
తత్రవ్యస్య మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిరః
ప్రాయోగఛ్ఛతి యత్ర దైవహతకస్త త్రైవ యా న్త్యాపదః
12, డిసెంబర్ 2020, శనివారం
ఆరో వేలు.
ఆరో వేలు.
భగవంతుని సృష్టి విచిత్రం. సాధారణంగా మనం అంతా చేతులకి కాళ్ళకి ఐదేసి వేళ్ళు కలిగి ఉంటాం. కాని కొంతమందికి ఒక్కో చేతికి ఆరేసి వేళ్ళుంటాయి. అదో చిత్రం. చేతి ఐదు వేళ్ళూ ముడిస్తే గుప్పెట,మరి ఆరో వేలెందుకూ? అలంకారమా? కాదు కాని ఉంది.ఇది చాలా వాటికి వర్తిస్తుంది.అజాగళ స్తనం తెలుసు కదా! అదే మేక మెడ చన్ను. అది మేకపోతుకి ఎందుకు ఉపయోగం? అటువంటిదే మనిషికి ఆరో వేలు.ఇలాగే కొంతమంది అజాగళస్తనాలూ ఉంటారు.
నాకో మిత్రుడు రెండు చేతులకి ఆరేసి వేళ్ళుండేవి, ఇతనిని ఆరేళ్ళ ఆచారిగారనే వాళ్ళం. ఆయన్నో సారడిగా ఆరో వేలు ఇబ్బంది కాదా అని, దానికాయన పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అరచేతి ఎడమ పక్క వేలాడుతూ ఉంటాయి. నాకా ఉపయోగం అనిపించలేదు, అలాగనిఇబ్బందీ అనిపించలేదన్నారు. ఇదే సృష్టి చిత్రం. సమాజం లో ఆరో వేలు లాటి మనుషులూ ఉంటారు.
10, డిసెంబర్ 2020, గురువారం
నాకూడా రాకురా!
నాకూడా రాకురా! కత
”ఆరున్నర దాటింది లేవచ్చు, ఏంటో మరీ బద్ధకం పెరిగిపోతోంది,మీకు” అరిచింది సతి, కిచెన్ లోంచి
”రిటయిర్ అయి వచ్చిన తరవాత కూడా ఈ నసేంటీ?”..పతి వాపోయాడు, దుప్పటిలో ముణగ దీసుకుంటూ .
”చూడరాదూ! పక్కింటి ముసలాయన, మీ కంటే పెద్దాడు కదా, ఆరయేటప్పటికి టంచనుగా కర్ర పుచ్చుకుని నడకకి వెళిపోతాడు రోజూ” సాగదీసింది, జాయ.
”ఒకరితో మనకి పోలికేంటోయ్, చలేస్తోంది కాసేపు పడుకోనిద్దూ”గొణిగాడు పతి
”అవును లెండి మనకి మంచిపోలికలెలా వస్తాయీ..లేవడమే ఆలస్యం, ఇంక నడకెప్పుడూ”....విసుక్కుంది జాయ.
”లేస్తాను లేవే పొద్దుటే చలీ”...అంటూ మంచందిగాడు, పతి.
”మీరు పొద్దుటే లేచి, నాలుగడుగులేసి ఆరోగ్యం సాధించుకుని మమ్మల్ని ఉద్ధరిస్తారనీ,ఈ గోల. రేపు ఏకాశి సోమవారం, మంచిది నడక మొదలెట్టండి,” సూచన చేసింది.... జాయ.
”రేపు ఏకాశి సోమవారమా? ఐతే దగ్ధయోగం, రేపొద్దుగాని ఎల్లుండి నుంచి మొదలెడతాలే”..వాయిదా వేసేడు పతి.
నడవడానికి ఒప్పుకున్నాడు, అంతే చాలు అని సంబరపడింది.ఇలా ఊరుకుంటే మానేస్తాడు,రేపు రేపు అని జరిపేస్తాడు. ఏం చేయడం అని ఆలోచించి, 'పక్క ముసలాయన ఉదయమే నడుస్తున్నాడు కదా, ఆయన కప్పజెపితే' ఆలోచన చేసింది. 'ఆ( మంచి ఐడియా' అని నడకకెళ్ళిన ముసలాయన తిరిగిరావడాన్ని వేచి చూస్తూ, కన్ను వీధి వైపు వేసుంచింది. ఇంతలో ముసలాయన కర్ర బోటుతో వస్తూ కనపడ్డాడు. చేతిలో పనొదిలేసి చేతులు తుడుచుకుంటూ వీధిలోకి పరుగెట్టింది.
ముసలాయన్ని పలకరిస్తూ
”నమస్తే బాబాయ్!” అని నిలిచింది.
”కులాసానా అమ్మా!” అంటూ పలకరించాడు ముసలాయన.
”మంచి అలవాటు బాబాయ్! ఉదయమే నడకకి వెళతారు,ఇంత వయసులో కూడా క్రమం తప్పకుండా, ఈయనకితగని బద్ధకం, లేపితే లేవరు,మీరు నడకకి వెళ్ళేప్పుడు ఒక్క కేక వేస్తే, రోజూ ఈయనా నడకకి వస్తారు”, విషయం చెప్పేసింది.
”అలాగేనమ్మా! నువ్వేం మడులు, మాన్యాలూ అడిగావా, నేనేమన్నా రాళ్ళూ గుళ్ళూ ఎత్తుకోవాలా? అతని నడక అతను నడుస్తాడు, అలాగే, రేపు ఉదయం పిలుస్తా” అన్నాడు.
”కాదు బాబాయ్, రేపు ఈయనకేదో పనుందిట, ఎల్లుండి నుంచీ” అని నాన్చేసింది.
''అలాగేనమ్మా'' ఆని ముందుకు సాగిపోయాడు, ముసలాయన.
అమ్మయ్య, ఒక ఆధారం దొరికిందనుకుంటూ లోపలికొచ్చిన ఆమెకు పతి బాత్ రూం నుంచి వస్తూ కనపడ్డాడు.ముసలాయనతో మాటాడిన సంగతి చెప్పి 'ఎల్లుండి నుంచి నడవండని' పతికి హుకుం జారీ చేసింది జాయ.
ఎల్లుండి రానే వచ్చింది, ఉదయమే ముసలాయన కర్రతో నడకకి వచ్చేసేటప్పటికి,వాకిట్లో పతికి బూట్లు తొడుగుతూ, ”ఐపోయింది బాబాయ్ వచ్చేస్తున్నారూ” అంటూ పతిని బయటికి పంపించింది. ముసలాయన, పతి ఇద్దరూ నమస్కార ప్రతి నమస్కారాలు చేసుకుంటుండగా తాను నిష్క్రమించింది. కొత్త మిత్రు లిద్దరూ కబుర్లలో పడి, నడక సారించారు.
కబుర్లలో ఇద్దరికీ శంఖ చక్రాలున్నట్టు తేలింది, నడక అవసరమేననీ తేలింది.నడక కొనసాగిస్తుండగా, రోజూ ఎవరు ముందు బయలుదేరితే, వారు రెండవవారిని పిలవాలని ఒక ఒప్పందం. సరే! ఏరోజూ పతి ముసలాయన్ని పిలిచిన పాపాన పోలేదు. ప్రతిరోజూ ముసలాయన వచ్చే సమయానికి పతికి నడక బూట్లు తొడుగుతూ ఉంటుంది జాయ. మధ్యలో ఆదివారమొస్తే శలవు ప్రకటించాడు, పతి. ''ఆదివారమని ఏపని చేయడం మానేస్తున్నావు మగడా, నడకకి శలవెందుకూ?" పోరింది సతి.
''నువ్వేమన్నా ఆదివారం నడకకి శలవే భీష్మించాడు'' పతి.అదేదో తేల్చుకోండని వెళ్ళాడు ముసలాయన.ఇలా తంపులతో నడక నడుస్తూ ఉంది.
ఇంతలో వచ్చింది కరోనా, బయటకి కాలు కదపడానికి లేదంటే ఇద్దరూ ఇళ్ళలో బందీ ఐ పోయారు. ముసలాయన తన పెరటిలోనూ పతి తన డాబా మీదా నడుస్తూ వచ్చారు, కాని ఇద్దరికీ శంఖ,చక్రాలు పెరిగినట్టే అనిపించింది, ఆరు నెలలయేటప్పటికి. ఇద్దరూ ఒకే డాక్టర్ ని చూస్తే ఇద్దరికి ఉండవలసిన దానికంటే చక్కెర ఉత్పత్తి రెట్టింపే ఉన్నట్టు తేలింది. నడక తప్పని సరీ అయింది, మళ్ళీ ఒప్పందమూ అమలులోకొచ్చి, నడక మొదలెట్టేరు.ము.మూ గుడ్డలు కట్టుకుని దూరం పాటిస్తూ నడక కొనసాగించారు. నెలపాటు నడక సాగినట్టే సాగింది,
ఇంతలో ఒక రోజు ఉదయమే, పతి ముసలయ్య ఇంటికొచ్చి ''బయటికి రావద్దు ఊళ్ళో బాగో లేదు,మన మిత్రుడు డాక్టర్ పెద్దరెడ్డి గారు కాలం చేసేడు, పెరటిలోనే నడక'' అన్నాడు. దానికి ముసలయ్య ''దూరం పాటిస్తున్నాం, ముమూ గుడ్డలు కట్టుకుంటున్నాం కదా! ప్రభుత్వమూ బయటి రావడానికి నిషేధమూ ప్రకటించలేదు, మరెందుకు నడక మానేయాలని'' ఆరాతీశాడు. ''వద్దూ బయటికి రావద్దూ, ఇంట్లోనే ఉండండీ'' అనేసి మాటకి దొరక్కుండా పోయాడు పతి. ముసలయ్య ఇంట్లో వాళ్ళు కూడా ఆయన్ని నడకకై బయటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఏం చేయాలో తోచని ముసలయ్య ఇంట్లో చిక్కుకుపోయాడు. నడకా ఆరోగ్యమూ కొద్దిగా దారిలో పడుతున్న ముసలయ్యకి ఇది బాధే అనిపించింది.
మళ్ళీ మొదలు కొచ్చేసినట్టుందే నడక వ్యవహారం అనుకుంటూ ఉండిపోయాడు,ఇంట్లో. వారం తరవాత కాళ్ళు గుదులెక్కిపోతే నడుద్దామని బయలుదేరి, అలవాటుగానే పతి కోసం ఇంటి కెళ్ళేడు. ఎంత పిలచినా పతి ఇంటినుంచి జవాబు రాలేదు. ఇంటికా తాళం లేదు, బయటికెళ్ళేరేమో, ఏమయి ఉంటుందీ అని అనుకుంటూ ముందుకు సాగిపోయాడు ముసలయ్య. పతి ఆ రోజు ముసలయ్యకి అందుబాటులోకి రాలేదు. మర్నాడు ఉదయమే వెళితే పతి కనపడలేదుగాని అతని భార్య, తాము కట్టించుకుంటున్న అపార్ట్మెంట్ దగ్గరకెళ్ళేడని చెప్పింది. కాని, ఎదురుగా ఉన్న చెప్పుల స్టాండ్ లో పతి నడక బూట్ల తో సహా మిగిలిన చెప్పులూ కనపడుతూనే ఉన్నాయి. పతి ఇంట్లోనే ఉన్నాడని అర్ధమైపోయింది, ముసలయ్యకి.అంటే పతి ఇంట్లోనే ఉండి ముసలయ్యతో మాటాడటానికే ఇష్టపడటం లేదని అర్ధమయింది. సాలోచనగా ముసలయ్య చూసేటప్పటికి సిగ్గు పడింది, జాయ, తను అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు. తన అసౌకర్య పరిస్థితి నుంచి తప్పించుకోడానికి మాట పొడిగిస్తూ, సతి
” బాబాయ్! డాక్టర్ పెద్దరెడ్డి గారు కాలం చేసేరు తెలిసిందా? ఆయన మీ స్నేహితుడట కదా!” వాకబు చేసింది. ”అవునమ్మా! ఆయనకి ఎనిమిది పదులు నిండేయి, నాకంటే వారం పది రోజులు పెద్దవాడు, నేనీ వూరు వచ్చిన రోజునుంచి స్నేహితుడు,గుండె జబ్బు కి ఆపరేషనయింది, డయాబెటీస్ ఉన్నవాడు, ఎలాపోయాడో”? అడిగాడు ముసలయ్య.
”అదేం కాదు బాబాయ్! కొత్తమ్మోరే ఎత్తుకుపోయిందంది”, కరోనా పేరు చెప్పకుండా.
”అయ్యో” నిట్టూర్చాడు, ముసలయ్య.
”బాబాయ్! నడక్కి వెళ్ళద్దు,ఈయన బయటకి రావడానికి భయపడుతున్నారు, తప్పక అపార్ట్మెంట్ దగ్గరకెళ్ళేరు. నిన్నూ నడకకి వెళ్ళద్దన్నారు. అదీగాక నిన్ను తను కూడా నడక్కి తిప్పుతుంటే ఏం మాట పడిపోతానోనని మధన పడిపోతున్నారు, నీకా మాట చెప్పలేకపోతున్నారు, ఏమీ జరగదనుకో, ఏదీ మన చేతులో లేదు కదా! ఇలా అన్నానని ఏమనుకోకు బాబాయ్! ఇంటికెళిపో” అంది చివరగా. తనకూడా నడకకి రావద్దని చెప్పలేక భార్యతో చెప్పించాడనమాట. తను నా కూడా నడకలో ఉంటుంటే, నాకేమైనా ఐతే తను మాట పడిపోతానేమోననుకుంటున్నాడనమాట, అనుకుంటూ ముసలయ్య నడకకి సాగిపోయాడు.
”నాకూడా రాకురా అంటే నన్నెత్తుకోరా” అని వెనకపడినట్టు, పతి వెనక పడటం తెలివి తక్కువేమో అనుకున్నాడు, ముసలయ్య. ఉదయమే మంచు,దానికి తోడు చలి, మంచులో సూర్యుడు కనపడ్డు. ఇన్ని కష్టాలతో ఉదయం నడకెందుకని సాయంత్రానికి మార్చుకున్నాడు, ముసలయ్య.
''కానున్నది కాక మానదుగదా! ఒకప్పుడు పతి నా కూడాపడి నడకకి వచ్చినవాడు, ఇప్పుడు తన కూడా నడకకి రావద్దంటున్నాడు.చూడరాదూ చిత్రం'',అనుకున్నాడు ముసలయ్య .
లోకం ఎంత చిత్రమైనదీ
9, డిసెంబర్ 2020, బుధవారం
మూర్ఖుని మనసు రంజింపరాదు
పిబేఛ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్ధితః
కదాచిదపి పర్యటన్ శశివిషాణమాసాదయే
న్నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాదయేత్….భర్తృహరి
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
జేరి మూర్ఖుని మనసు రంజింపరాదు……..లక్ష్మణ కవి.
8, డిసెంబర్ 2020, మంగళవారం
సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడు.
సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడు.
సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడనిగాని సొడ్డిస్తూ బావగారు అడ్డెడూ చెల్లించాడనిగాని అంటుంటారు.
సొడ్డు అంటే చాలా చాలా అర్ధాలిచ్చింది ఆంధ్ర భారతి, లేవిడీ కొట్టడం, పేర్లు పెట్టడం, ఏదో తక్కువైందనడం,తప్పుపట్టడం అని చెప్పుకోవచ్చు, మరి కతేంటో చూదాం :)
ఒక అల్లుడు అత్తింటికొచ్చాడు, సాయంత్రానికి, మరునాడు గారెలు వండుదామని అనుకుంటూ ''శేరు పప్పు పోయానా?'' అడిగింది అత్త పక్కనే ఉన్న కోడలిని.
''కాదత్తా మూడు తవ్వలుపోయండి మనం అల్లుడుతో కలిపి ఆరుగురం కదా! ఇంట్లో పనివాళ్ళు పాలేళ్ళు, వీళ్ళందరికి పెట్టాలిగా'' అంది కోడలు.
అక్కడేఉన్న ఆడపడుచు ''అమ్మా అడ్డెడూ పోసెయ్యవే,సరిపోదేమో, లేకపోతే ''అంది.
ఇదివిన్న తల్లి అడ్డెడు పప్పూ నానబోస్తూ ''అమ్మాయీ మీ ఆయన గారెలు ఎలా ఐతే బాగ తింటాడే'' అడిగింది.
దానికా ఇంటి ఆడపడుచు ''అమ్మా! నీ అల్లుడుకి, నేతిగారెలంటే మక్కువ, పాకం గారెలంటే ఇష్టం, ఆవడలు, మామూలు గారెలు, చిట్టి గారెలు, కారపు గారెలు, తోటకూర గారెలు అంటే బాగా ఇష్టం'' అంది.అల్లుడు కొద్ది తిండి పుష్టి వున్నవాడని తెలిసిన అత్త అడ్డెడూ పప్పూ నానబోసింది, రాత్రికి.
ఉదయం లేవడంతోనే ఆ ఇంటికోడలు నానబోసిన పొట్టు మినపపప్పుని కడగడానికి పట్టుకుపోయింది, నూతి దగ్గరకి. పొట్టు మినప్పప్పు కడగడానికి నడుములు పడిపోతాయి. ఎన్ని నీళ్ళు పడతాయో చెప్పలేం. నీళ్ళు తోడాలి, పప్పుగాలించాలి,పొట్టు తీయాలి. ఇంటికోడలుకదా, తప్పదు. మొత్తం పప్పుని నాలు భాగాలు చేసి ఒక భాగం కడిగి, రుబ్బురోల్లో వేసి రుబ్బడం ప్రారంభించింది, ఈ లోగా అత్త పొయ్యి వెలిగించి, నెయ్యి ఎసరు పెట్టి అరటాకు ముక్క కోసి తెచ్చుకుని కోడలు రుబ్బి ఇచ్చిన పిండితో గారెలు వెయ్యడం మొదలెట్టింది. ఈ లోగా ఇంటాడపడుచు రెండో వాయి పప్పు కడిగి వదినగారికిస్తే అదీ రుబ్బి అత్తకిచ్చింది. ఈ రెండు వాయిల్లోనూ ఉప్పెయ్య పోవడంతో గారెలేసి బెల్లంపాకంలో కొన్ని,పోపు పెట్టిన పెరుగులో కొన్ని వేసింది, ఆవడలుగా.ఆ తరవాత రుబ్బిచ్చిన పిండితో చిట్టి గారెలు, మామూలు గారెలు వేసింది. పొయ్యి దగ్గర కూచుని గారెలు వేసే ఆమెకూ నడుం లాగుతోంది. ఇంటికోడలు చెప్పే పనిలేదు తోట కూర కాడలా వేలాడిపోయింది. సరే ఇంటాడపడుచుకి తప్పదు భర్త కోసం కదా! పుట్టింట గౌరవం. పాపం ఆ కోడలు నడుం పడిపోతున్నా మూడో వాయి కూడా రుబ్బిచ్చింది, ఆడపడుచు పప్పు కడిగివ్వగా. ఈ వాయ మామూలుగారెలుగానూ, చిట్టిగారెలు గానూ వేసింది ఆ ఇంటి ఇల్లాలు.
ఇంటికోడలు ''నాలుగో వాయి ఇంక రుబ్బలేనత్తా నావల్ల కాదూ'' అనేసింది. దానికి అత్త ''అమ్మ కదూ కచ్చా పచ్చాగా రుబ్బి ఇచ్చెయ్యి చాలు, మెత్తగా రుబ్బక్కర లేదు, కారపుగారెలు, వడలుగా వేస్తాను, ఆ చేత్తోనే కొంచం పచ్చి మిరపకాయలు రుబ్బి ఇచ్చెయ్యి'' అని పురమాయించింది. కోడలు కాదనలేకపోయింది. మొత్తనికి అడ్డెడు పప్పూ గారెలయ్యాయి, పాకం గారెలుగా,ఆవడలుగా, గారెలుగా, వడలుగా, కారపు గారెలుగా. వీటిని వేరువేరుగా నిలవచేసింది.అల్లుడిని భోజనానికి లేవమని ఆహ్వానించారు.
భోజనానికి కూచున్నాడు అల్లుడు. వడ్డిస్తున్న అత్తగారు, పాకం గారెలు వడ్డించింది, ''ఎలా ఉన్నాయల్లుడు గారూ'' అని అడిగింది, ''అత్తా గారెలు బాగున్నాయిగాని పాకం లేత పాకం ఐనట్టుం''దన్నాడు, మళ్ళీ వడ్డిస్తే మాటాడక తిన్నాడు. ఇక ఆవడలు వడ్డిస్తే మెత్తమెత్తగా తింటూ ''పెరుగు చిక్కగా లేదత్తా, గారెలు కొంచం గట్టిగా ఉన్నాయని'' అంటూనే మొత్తం పుచ్చుకున్నాడు. మామూలుగారెలు తింటు ''మెత్తగా లేవు మరికొంచం రుబ్బాలిసింది'' అని తిన్నాడు. మిగిలిన వడలు, కారపు గారెలు తింటూ ''కొంచం కారం వెయ్యాలిసిందని'' మొత్తం తినేసేడు. ఇలా వండిన వాటికి ఏదో ఒక వంక చెబుతూనే మొత్తం వేసిన గారెలన్నీ అల్లుడు చెల్లించాడు. ఇది చూసిన ఆ ఇంటి కోడలు కొయ్యబారిపోయింది,ఇంటి ఇల్లాలు అల్లుడు చర్యకి ఆశ్చర్యపడింది, ఇంటాడపడుచు మాటాడలేకపోయింది. ఎవరికి ఒక్క గారె కూడా మిగల్చకుండా తిన్న అల్లుని తిండి పుష్టికి అత్త ఆనందపడింది. మనకి ఈ నానుడి మిగిలిపోయింది...
7, డిసెంబర్ 2020, సోమవారం
మొహమాటం లేదు.
కశ్చిచ్చండ కోపానా మాత్మీయో నామ భూభుజామ్
హో తారమపి జుహ్వానం,స్పష్టో దహతి పావకః
మనుజులలో నెవ్వడు దగ
దనవాడనువాడు దుష్టధరణీశునకున్?
దనకయి వ్రేలిమి వ్రేల్చెడు
జనునితనువు గాల్చు వాయు సఖు డదయుండై...లక్ష్మణ కవి
దుష్టుడైన రాజుకు తనవాడనే వాడు ఎవడూ ఉండడు. అలాగే తనని అర్చిస్తున్న వానిని కూడా, పొరబాటుగా ముట్టుకున్నా అగ్ని మొహమాటం కూడా లేక కాలుస్తాడు.
రాజుకి అనగా పరిపాలకునకు తనవాడు పెరవాడనే భేదం లేక న్యాయం చేయాలి, కాని దుష్టుడైన రాజుతనవాడినైనా చంపిస్తాడు, కోపంతో. ఇదెలాగంటే నిత్యమూ కొలిచేవానిని సహితం అగ్ని పొరబాటుగా ముట్టుకున్నా కాల్చేస్తాడు. రాజకీయ పార్టీలు,రాజకీయనాయకులు, నటులు,నటీమణులు,ఆటగాళ్ళ అభిమానులుగా ఎన్ని సంవత్సరాలు వీధుల్లోబడి కొట్టుకున్నా, ఎన్ని సంవత్సరాలు నిద్ర హారాలు మానుకుని కీ బోర్డ్ మీద పోరాడినా, కీ బోర్డ్ వారియర్లు గా మారినా, పరస్పరం తిట్టిపోసుకున్నా, ఎవరిగురించి ఇంత బాధపడ్డారో, వారు కనుపించినపుడు రాజకీయ నాయకుడు, తన అభిమానులు, కీ బోర్డ్ వారియర్లను,కనీసం కన్నెత్తి చూడడు, పన్నెత్తి పలకరించడు . సరికదా! సెక్యూరిటీ వాళ్ళు ఈడ్చి పారేస్తారు,గింజుకుంటే పోలీస్ పట్టుకుపోతుంది.
ఇంటి దీపమేకదానని ముద్దు పెట్టుకున్నా మీసాలు కాలతాయి/మూతి కాలుతుంది సామెత
6, డిసెంబర్ 2020, ఆదివారం
ధైర్యగుణం
కవర్ధిత స్యాపి హి ధైర్యవృత్తే
ర్న శక్యతేధైర్యగుణఃప్రమార్షుమ్
అధోముఖ స్యాపి కృతస్యవహ్నే
ర్నాధః శిఖా యాతి కదాచి దేవ
నియతిచేత గదర్దితుం డయిన ధైర్య
వరుని ధైర్యగుణంబు మాన్పదరమె?
క్రింది సేయంగబడినట్టి కృప్మపధుని
కీల యెందైన మీదుగా గెరలుగాదె!
ధైర్యవంతునికి ఎట్టి దుఃఖము సాంభవించినను అతని ధైర్యము పోగొట్టుట సాధ్యము. అగ్నిని తలకిందులు చేసినను అగ్ని జ్వాల ఊర్ద్వముగానే ప్రసరించును కాని అధో ముఖముగా ప్రసరించదు.
ధైర్యవంతుని ఎన్ని కష్టాలు వచ్చినా, తెచ్చి పెట్టినా ధైర్యము చెడగొట్టలేరు. తను చేయదలచుకున్న పనిని చేసి తీరుతాడు.కష్టాలు నీటి అలలలాటివి వచ్చిపోతుంటాయి. కష్టాలు కలకాలం కాపురం ఉండవని సామెత, అలాగే సుఖాలూ కాపురం ఉండవని తెలుసుకోవాలి.అగ్ని జ్వాల ఎప్పుడూ పైకే ఉంటుంది, అగ్నిని తలకిందుకుచేసినా ఏం చేసినా జ్వాల పైకే ఉన్నట్టు ధైరవంతుని ధైర్యం కూడా ఎప్పుడూ నిలచి ఉంటుంది, ఎప్పుడూ ఎవరూ చెడగొట్టలేరు.
1, డిసెంబర్ 2020, మంగళవారం
మూర్ఖత్వానికి మందు లేదు.
జగత్సర్వం శివమయం
నిన్న సాయంత్రం నడకకు వెళుతుంటే ఒక ఇంట కనిపించిన దృశ్యం. నమశ్శివాయ.
శక్యోవారయితుం జలేన హుతభుక్చత్రేణ సూర్యాతపో
నాగేన్ద్రో నిశితాజ్క శేన సమదో దణ్ణేన గార్ధభః
వ్యాధి ర్భేషజనజ్గ్రహైశ్చ వివిధైర్మన్త్ర ప్రయోగైర్విషం
సర్వస్యౌషధమస్తి శాస్త్రవిహితం మూర్ఖస్య నాస్త్యౌషధమ్
జలముల నగ్ని ఛత్రమున జండమయూఖుని దండతాడనం
బుల వృషగర్ధభంబులును బొల్పగుమత్తకరీంద్రమున్ సృణిం
జెలగెడురోగ మౌషధముచే విషముం దగుమంత్రయుక్తి ని
మ్ముల దగ జక్కజేయనగు మూర్ఖుని మూర్ఖతమాన్పవచ్చునే......లక్ష్మణ కవి
అగ్నికి నీరు,ఎండకు గొడుగు, మదగజమునకు అంకుశము, ఎద్దు గాడిద మొదలగు జంతువులకు కఱ్ఱ, రోగమునకు మందులు, సర్వవిషంబులకును పలు విధములగు మంత్రములు నివారకములుగా చెప్పబడుచున్నవి కాని మూర్ఖుని మూర్ఖత్వమును పోగొట్టే మందు ఎక్కడా చెప్పబడలేదు.
”నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు”. మరీ మూర్ఖంగా ఉందా? కొంచం సున్నితమైనది చెప్పుకుందాం "తా వలచింది రంభ, తా మునిగింది గంగ" ''నైజగుణానికి లొట్టకంటికి మందు లేదని'' సామెత,అలాగే మూర్ఖతను తొలగించే మందు లేదు
30, నవంబర్ 2020, సోమవారం
జీర్ణతృణంబు మేయునే?
తిరుమల ఘాట్ రోడ్డు
జీర్ణతృణంబు మేయునే?
క్షుత్సామో ఽ పి జరాకృశో ఽ పి శిధిలప్రాయో ఽ పి కష్టాం దశా
మా పన్నో ఽ విపిన్న దీధితిరసి ప్రాణేషు నశ్యత్స్వపి
మత్తేభేన్ద్ర విభిన్న కుమృపిశితగ్రాసైకబద్ధస్పృహః
కిం జీర్ణం తృణమత్తి మానమహతామగ్రేసరః కేసరీ
గ్రాసము లేక స్రుక్కిల జ రాకృశమైన విశర్ణ మైన సా
యాసము నైన నష్టరుచి యైనను బ్రాణభయార్తయైన ని
స్త్రాన మదేభకుంభ పిశి తగ్రహలాలసశీలసాగ్రహా
గ్రేసరభాసమాన మగు కేసరి జీర్ణతృణంబు మేయునే?.....లక్ష్మణకవి
శూరాగ్రణియగు సింహము ఆకలిచే డస్సినను,ముదిమిచే జిక్కినను, కష్ట స్థితిబొందినను, కాంతి విహీనమైనను, ప్రాణములు పోవుచున్నను,మదించి ఏనుగు కుంభస్థలము చీల్చి అందలి మాంసము భుజించునే కాని, ఎండుగడ్డి మేయునా?
సింహం ముసలిదైనా అంటే గోళ్ళు కోరలు ఊడిపోయినా,,ఆకలిచేత డస్సినా,కష్టంలో పడినా, ప్రాణం పోతున్నా ఎండు గడ్డి తినదు కాదు తినలేదు. సింహం ఉండే చోట చాలా ఎత్తుగా గడ్డి పెరుగుతుంది. సింహం తినదు, తినే జంతువులు సింగానికి భయపడి తినడానికిరావు. సింహం శరీర నిర్మాణం ఎండుగడ్డి తినడానికి అనువుగా సృష్టింపబడలేదు. అందుచేత సింగం మాంసమే తింటుంది, కాదు మాంసపు ముద్దలు మింగుతుంది. సింగం వేటాడుకుంటే గాని ఆహారం దొరకదు, ఎవరూ పిలిచి ఆహారం పెట్టరు. సింగం పడుకుని నిద్రపోతే జంతువులు వచ్చి సింహం నోట్లో జొరబడవు. సింహం వేట చేయాల్సిందే. అందుకే గోళ్ళు కోరలు ఇచ్చాడు. గోళ్ళు కోరలు పోతే ఎవరూ సింగాన్ని లెక్క చేయరు, అందు చేత తన ఆయుధాలైన గోళ్ళు కోరలు రక్షించుకోవాల్సిందే!వేటాడుతుంటేనే, వాడుకలో ఉంటేనే బాగుంటాయి.
28, నవంబర్ 2020, శనివారం
చిరునవ్వే చాలే .....
సామీ!
26, నవంబర్ 2020, గురువారం
రామాయ స్వస్తి.....
రామాయ స్వస్తి....
రామాయ స్వస్తి రావణాయ స్వస్తి అనే మాట అంటుంటారు. ఏంటి దీని అర్ధం? రామునికి శుభం, రావణునికీ శుభం. ఇదెలా సాధ్యం?
రామునికి నమస్కారం పెడితే శుభం కలగజేస్తాడు. నమస్కారం పెట్టకపోయినా ఏమీ అనుకోడు, అశుభం కలగజేయడు. రావణునికి నమస్కారం పెట్టకపోతే కోపం తెచ్చుకోవచ్చు,అశుభం కలగజేయచ్చు (భయం).
అంచేత రామాయ స్వస్తి రావణాయ స్వస్తి అనేవారే ఎక్కువ :)
24, నవంబర్ 2020, మంగళవారం
పొన్నగంటి కూర పచ్చడి
![]() |
| పొన్నగంటి కూర |
ఆకు కూరలంటే గోంగూర,తోటకూర, గుర్తొచ్చినట్టు మిగిలిన కూరలు గుర్తురావు. బచ్చలి,కరివేపాకు,పొన్నగంటికూర,చింతచిగురు,షీకాయాకు, తూటి కూర,నెల్లి కూర ఇలాటివి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సి ఉంటాయి. ఇక గల్జేరులాటివైతే ప్రత్యేకంగానే గుర్తు చేయాలి. ఇది తినడానికేం ఇదేమన్నా విషమా గల్జేరా అని అడిగేవారు. గల్జేరు వేళ్ళు పచ్చడి చేస్తారట. నిజంగానే బహు చేదుగా ఉంటుందిట, నేనెప్పుడూ తినలేదు.కాని గొప్ప ఔషధంగా చెబుతారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి ఇటువంటివే. నిత్య జీవితంలో వాడుకుంటుంటే వ్యాధి నిరోధక శక్తి, వ్యవస్థ బలపడుతుంది. దానికేంగాని అదంతా ఎవరిష్టం వారిది. ఈ పొన్నగంటి కూర పచ్చడి బాగుంటుంది. పొన్నగంటి కూరని బాగుచేసుకుని మూకుడులో వేసి వేయించి తీసి ఉంచుకుని తగిని పసుపు ఉప్పు చింతపండు వేసి, పోపుతో రోటిలో రుబ్బుకుంటే బహు బాగుంటుంది. ఈ కూర పప్పులో కూడా వేసుకుంటారు. కంటికి మేలు చేస్తుంది.తోటకూర కూడా పచ్చడి చేస్తారు. ఆ పై మీ చిత్తం, మా భాగ్యం
20, నవంబర్ 2020, శుక్రవారం
దుంపల పచ్చడి.
దుంపల పచ్చడి.
దుంపలంటారుగాని నేలలోపల పండేవన్నీ దుంపలే. వీటి అసలు పేరు చిలకడ దుంపలు. ఇవి రెండు రకాలు, తెల్ల దుంపలు, ఎర్ర దుంపలు. ఎర్ర దుంపలు కొంచం తియ్యగా ఉంటాయి, తెల్ల దుంపలకంటే. వీటిని తియ్య దుంపలని కూడా అంటారు.
ఈ దుంపల్ని తెచ్చుకుని నీళ్ళలో పడేసి శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు చేసుకుని వాటికి తగిన ఉప్పు, పసుపు చేర్చి, తగిన పోపు కూడా చేర్చి రోటిలో రుబ్బుకోవాలి. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా ఐపోయి రుచిపోతుంది. అందుకే హోటళ్ళలో ఇప్పుడు రోటి పచ్చడి హోటల్ అనేదో క్రేజ్. ఈ పచ్చడి సరిగా కనక చేసుకుంటే కొబ్బరికాయ పచ్చడిలా ఉంటుంది.
ఈ దుంపలని సుగర్ ఉన్నవాళ్ళు నిరభ్యంతరంగా తినచ్చు. ఎందుకంటే వీటిల్లో కార్బ్ ఎక్కువగానే ఉన్నా, గ్లైసిమిక్స్ ఇండెక్స్ తక్కువ, రక్తంలో చక్కెర విడుదల జేయడానికి చాలా కాలం పడుతుంది, పీచు ఉంటుంది, కడుపు నిండినట్టూ ఉంటుంది. ఆధునికులు ఛీ దుంపలా అని ఈసడిస్తారు గాని గొప్ప ఆహారం.
కొస మాట:- ఈ దుంపని తరుక్కుని బెల్లం పాకంలో ఉడకబెట్టుకుని నాలుగు ముక్కలు సుగర్ వాళ్ళు కూడా తినచ్చు, అలా నోట్లో వేసుకుంటే రంగనారాజా! ఆహా ఏమిరుచి అనరా మైమరచి.
మరో చిత్రం మన శరీరంలో ఉండే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే వృకం అనే పాంక్రియాసిస్ చిలకడ దుంపలా ఉంటుందిట. :)
దుంపలొచ్చే టైమ్ ఇదే
15, నవంబర్ 2020, ఆదివారం
చేతకానమ్మకి
చేతకానమ్మకి చేష్టలెక్కువ.
చెల్లని రూపాయికి గీతలెక్కువ.
చెల్లే రూపాయైతే ఆ ఊళ్ళోనే చెల్లేది.
చేతకానమ్మకి రోసమెక్కువ.
14, నవంబర్ 2020, శనివారం
మొండివాడు
మొండివాడు రాజు కంటే బలవంతుడు
ఊరుకున్నవాడిని ఊరేమీ చేయలేదు.
ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదు.
కచ్చలో నిప్పుపడ్డా కచేరీలో కాయితంపడ్డా నష్టం జరిగి తీరుతుంది
.
13, నవంబర్ 2020, శుక్రవారం
ఎంచుకుంటే.....
ఎంచుకుంటే మంచమంతా కంతలే
జంతిక చక్కిలాన్ని ఎక్కిరించినట్టు
తనదిపాలికిచ్చి తను కూలికెళ్ళినట్టు.
చేతకాని మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు.
12, నవంబర్ 2020, గురువారం
వామన చింతకాయ పచ్చడి.
వామన చింతకాయ పచ్చడి.
చితకమతక చింతకాయ పచ్చడిలా కొట్టేసేరు బాబూ అంటుంటారు.చింతకాయ పచ్చడి చేయడమంటే ఊరికే బాదెయ్యడమేంకాదు. చింతకాయ పచ్చడి చెయ్యడమే కష్టం. ఎందుకనీ:) కాయ చితకాలి, గింజ చితక్కూడదు, అంటే దెబ్బ తగలాలి, కనపడకూడదు, పోలీస్ దెబ్బలాగనమాట. అదీ అసలు పాయింటు.
నిలవ పచ్చడి పెట్టుకునీ చింతకాయలు అటుపండూ కాకూడదు, ఇటు పచ్చిగానూ ఉండకూడదు, దోరగా ఉండాలి. వీటిని రోటిలో వేసి చితకా ముతకాగా కొట్టాలి, చితకా మతకా కానే కాదు. అంటే కాయ చితకాలి, గింజ చితక్కూడదు. గింజ కనక చితికి పచ్చడిలో కలిసిపోతే పచ్చడి బాగోదు, వగరుగా ఉంటుంది. అందుకు చితకా, ముతకాగా తొక్కాలి. అప్పటికే ఐపోలేదు. ఈముద్దలో కాయమీద ఉన్న దొప్పలొస్తాయి వాటిని ఏరాలి తీసెయ్యాలి, గింజలు ఏరెయ్యాలి, ఉట్లు ఏరెయ్యాలి, ఇప్పూడు ఈ చింతకాయ ముద్దకి పసుపు చేర్చాలి, తగిన ఉప్పెయ్యాలి, మళ్ళీ తొక్కాలి మెత్తగా. చింతకాయ తొక్కు తయారయింది. దీనికి తగిన కారంతో పోపును చేర్చి మళ్ళీ తొక్కాలి. పచ్చిమిర్చీ వేసుకోవచ్చూ. ఈ తొక్కిన పచ్చడిని ఒక రాచ్చిప్పలో పెట్టాలి, దానిలో గుంట చెయ్యాలి, నూనె కాచి అందులో ఇంగువ వేసి మంచి వాసనొచ్చిన తరవాత దానిని రాచ్చిప్పలో ఉన్న పచ్చడి గుంటలో పొయ్యాలి, కొంచం పచ్చడితో గుంత మూసెయ్యాలి. రాచ్చిప్ప పైన గట్టి మూత పెట్టాలి. ఇప్పుడు చింతకాయ పచ్చడి రెడీ వాడుకోడానికి.
ఇదేంటి వామనచింతకాయ పచ్చడి చెబుతానని. వామన చింతకాయంటే మరేంకాదు, ముదరని గింజపట్టని చింతకాయని వామన చింతకాయ అంటారు. ఇవి చిన్నగానూ,పల్చగానూ ఉంటాయి. వీటిని మెత్తగా రోట్లో పచ్చడి చేయాలి, మిక్సీల లో పచ్చడి బాగోదు రుచిరాదు.చింతకాయ పచ్చడిలాగనే వామన చింతకాయ పచ్చడిన్నూ, ఇందులో తుక్కులు,ఉట్టిలు, పెచ్చులు,గింజలురావు, ఆ అవస్థ తప్పుతుందంతే. :)
పాత చింతకాయ పచ్చడి పథ్యానికి పనికొస్తుంది.పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకు అంటారు. అంటే పథ్యమైనమాట చెప్పకు అని కదా! లోకమింతే!పాతచింతకాయపచ్చడి పాత గుడ్డముక్క దొరకవు. అదేంటీ పాతగుడ్డముక్కా..అబ్బో దీని గురించి మరోసారి.
11, నవంబర్ 2020, బుధవారం
ఎగిరి ఎగిరి దంచినా
ఎగిరి ఎగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి :)
వంక దొరకనమ్మ డొంక పట్టుకుందని ఏడ్చింది.
పనివాడు పందిరేస్తే పిచికిలొచ్చి పడగొట్టేసేయి.
కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడింది
10, నవంబర్ 2020, మంగళవారం
చింతకాయ-గోంగూర.
చింతకాయ-గోంగూర.
వాళ్ళిద్దరూ చింతకాయ,గోంగూరలాటివాళ్ళండి బాబూ అంటుంటారు. ఏంటి తిరకాసు? :)
చింతకాయ పుల్లటిది, గోంగూరా పుల్లటిదే!రెండిటికీ ఉప్పూ కారాలతోనే స్నేహం.రెండిటినీ పచ్చడీ చేస్తారు ఎక్కువగా! రెండూ నిలవా ఉంటాయి. రెండూ రుచిగానే ఉంటాయి, కాని రెండిటికీ పడదు. అందుకే చింతకాయ గోంగూర అంటారు. ఇన్ని పోలికలున్నవి రెండూ కలిసి ఎందుకుండవూ? తిరకాసదే కదా!!!
చింతకాయ పచ్చడి నిలవున్నకొద్దీ పథ్యం. గోంగూర పచ్చడి సంవత్సరం దాటి నిలవుండదు.అసలు తిరకాసు చింతకాయ చలవ చేస్తుంది, గోంగూర వేడి చేస్తుంది. అంచేత చింతకాయ గోంగూరలకి ఎన్నిపోలికలున్నా, కలిసుండలేవంతే!!! అర్ధమయితే !!!Like poles repel :)
9, నవంబర్ 2020, సోమవారం
8, నవంబర్ 2020, ఆదివారం
దున్నబోతేదూడలలోకి...
దున్నబోతేదూడలలోకి...
దున్నబోతే దూడలలోకి మెయ్యబోతే ఎడ్లలోకి అని సామెత. రైతులు పశువుల మందలనే మేపేవారు. పశువులు 4 రకాలు. చూలుగట్టి పాలిచ్చేవి,పనిజేసేవి, ఒట్టిపోయినవి,దూడలు.
చూలుగట్టి పాలిచ్చేవాటికి, పచ్చిగడ్డి, తెలగపిండి,జనపకట్ట, పిల్లిపెసర, ఇలా పుష్టికరమైన ఆహారం పెడతారు, పాలు బాగా ఇస్తాయి.
పని జేసే పశువులకి, పచ్చగడ్డి,ఎండుగడ్డి,జనప,పిల్లిపెసర,తెలగపిండి,కుడితి,పెడతారు. కొంచం ఇంచుమించు చూలుగట్టి పాలిచ్చేవాటికి, పనిజేసేవాటికి సమానమైన తిండి పెడతారు.
ఇక ఒట్టిపోయిన పశువులు. ఒకప్పుడు మహరాజభోగం వెళ్ళదీసినవే ఐనా వీటికి తిండి తక్కువ పెడ్తారు,ఇవి రిటయిర్ అయినవారి లాటివి ఎండుగడ్డిపడేస్తారు,ఇక దూడలు.
దూడలు, లేగదూడలైతే పాలు, కొంచం పచ్చగడ్డిపెడతారు, పెయ్యదూడలు, కోడెదూడలకీ. వయసుపెరుగుతున్నకొద్దీ కోడెదూడలు తలగరేస్తాయి, చెప్పిన మాట వినవు.వీటికి పనిజేసేపశువులతో సమానంగా తిండి పెడతారు, ఎందుకంటే రేపన్న రోజు పనిజేసేవి ఇవేగనక.పెయ్యదూడలకి పాలిచ్చే పశువులతో సమానంగా తిండి పెడతారు, రాబోయే కాలంలో చూలుగట్టి పాలిచ్చేవిగనక. కోడెదూడలు మెయ్యబోయినపుడు ఎడ్లలోకి జమవుతాయి, కాని పనికి మలిపేటపుడు దూడలలోనే జమవుతాయి,ఎడ్లతో సమానంగా పని చేయలేవుగనక.అందుకే ఈ సామెత పుట్టింది.
లోకంలో,మనుషులు పలురకాలు.ఎవరిటువంటివారో ప్రత్యేకంగా చెప్పాలా?
7, నవంబర్ 2020, శనివారం
6, నవంబర్ 2020, శుక్రవారం
5, నవంబర్ 2020, గురువారం
ఉపనయనం
ఉపనయనం
ఒక రాజుగారి కొలువు,కొలువులో ఒక కవిగారు, కవిగారికి రాజుగారికి మంచిదోస్తీ. కవిగారికి కావలసినదేదైనా రాజుగారు కాదనరు, అంతటి స్నేహం. కవి దోచుకు తినేస్తున్నాడని దివాన్ గారి బాధ. దివాన్ గారికి కన్నుకుట్టింది, కాని ఏం చేయలేడు, సావకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఇలా ఉండగా ఒక వేసవిలో కవిగారు నొక వినతి పంపుతూ అందులో ఇలా రాశారు, ''నా కుమారునికి మరియు నాకున్నూ ఉపనయనముల నిమిత్తంగా ఏలినవారు సొమ్ము మంజూరు వేడుతున్నాను'' , అది సారాంశం. చూసిన దివాన్ మా బలేగా దొరికాడు కవి అనుకుని, రాజుగారికి కవిగారి వినతి పత్రం పంపుతూ, కూడా వెళ్ళేరు.
కవిగారు కాకమ్మ కతలు వినిపించి, ఖజానానుంచి సొమ్ము ఎలా దోచుకుంటున్నాడో వైన వైనాలుగా చెప్పాలనుకున్నాడు,నిలబడ్డాడు. కాని రాజుగారు వినతిని శ్రద్ధగా చదివి, తలపంకించి, దివాన్ గారి వైపు సాలోచనగా చూసి, రాజుగారు ''సొమ్ము పంపండి, విషయం కనుక్కోండి'' అన్నారు. కవిగారి గురించి వివరించే సావకాశం చిక్కక పోవడంతో దివాన్జీ నీరుగారిపోయాడు.
ఇది దివాన్జీకి విషయం కనుక్కుని సొమ్ము పంపండి అన్నట్టు అర్ధమయింది. అవసరం కవిది, అతనే వస్తాడులే, అని సొమ్ము పంపక కూచున్నాడు దివాన్, విషయం కూడా కనుక్కోకుండా. కవిగారి కుమారుడి ఉపనయన సమయం దగ్గరపడుతోంది, పనులే కాలేదని, సంగతేంటో కోటలో తన మనుషులను వాకబు చేశాడు, కవిగారు. దివాన్ చేసిన మతలబు తెలిసింది చూచాయగా.
మర్నాడు రాజావారిని దర్శించాడు, కవిగారు తిన్నగా. చాలా కాలం తరవాత కనపడ్డ కవిగారిని సాదరంగా ఆహ్వానించిన అనంతరం, సాహిత్య చర్చలో ములిగిపోయారిద్దరూ. చివరగా రాజుగారు ఉపనయనాల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. కవిగారికి విషయం అర్ధమయింది, రాజు గారు కవిగారికి సొమ్ము చేరిందనుకుంటున్నారని. విషయం విన్నవించారు కవిగారు, రాజుగారికి, లక్ష్మీ కటాక్షం లేక పనులు సాగలేదని.. విన్న రాజావారు, వెంటనే కోటనుంచి సర్వ సంభారాలు పంపమని ఉత్తరువిస్తూ, తమ కుమారునికి ఉపనయనం సహజం,తమకైతే షష్టి పూర్తి, ఉగ్రరధ శాంతిగాని సహజం కాని ఈ ఉపనయనం ఏంటో అర్ధం కాలేదని సమస్య చెప్పేసేరు, రాజుగారు. కవిగారికి విషయం అర్ధమయింది. అప్పుడు కవిగారు చెప్పేరిలా.
నాకుమారునికి నాకున్నూ ఉపనయనములనిమిత్తం అనికదా నా వినతి. కుమారుని ఉపనయనం అంటే తమకు తెలిసినదే, నాకు ఉపనయనాల గురించి కదా! వయసా పెరిగింది, చత్వారం పెరిగింది, రచన సాగటం లేదు, వైద్యుని వద్దకెళితే ఉపనయనాలు పెట్టుకోమని రాసిచ్చాడు మహరాజా, అని వివరించారు. విన్న రాజుగారు కవిగారి చమత్కారానికి భళ్ళున నవ్వేరు,దివాన్ గారి ముఖం వంక చూస్తూ. దివాన్ గారి ముఖం ఆరిపోయిన చిచ్చు బుడ్డిలా ఉంది.
ఇది ఎక్కడో చదివినదే
2, నవంబర్ 2020, సోమవారం
కరోనా నడక
కరోనా నడక
కరోనా తగ్గిందా? పోయిందా? తగ్గిపోయిందా??ఏమోగాని వాళ్ళని తీసుకెళ్ళేరు,వీళ్ళని తీసుకెళ్ళేరు, నలుగురు హౌస్ క్వారంటైన్ వార్తలు లేవు.మా ఊళ్ళో ఒక కరోన ప్రైవేట్ హాస్పిటల్ ఖాళీగానే ఉందని వార్త.పల్లెటూళ్ళలో పెద్దగా అలజడి లేదు. వర్షాలు వెనకబట్టేయి ఒక వారం నుంచి, చలి తిరిగింది కొద్దిగా. బడి తీస్తారట, కార్పొరేట్ల సంబరమేమో! ఏమో పిల్లలు కదా, భయంగానే ఉంది. ఒక తరం జారిపోతోంది, మారిపోతోంది.
కరోన వార్తలకి లోటు లేదు. వారాలు, టెస్టులు, కరోన తెలియడం, ఏం లేదు మూడు రోజుల్లో అంతా ఫినిష్ ఒక వార్త, గుండెలవిసేలా, అదేం ఆనందమో. మరోవార్త ఇదంతా హంబగ్ చైనాను ఒంటరి చెయ్యాలనే ప్రయత్నం, అందులో మోడిగారు కూడా ఉన్నారు. పాపం చైనా ఎన్ని కష్టాలలో ఉందీ ఇది మరో వార్త. జర్మనీ,బ్రిటన్, ఇటలీ, France మళ్ళీ లాక్డవున్ అంటున్నాయి, మనమేమో ఓపెన్ అంటున్నాం, ఇదేంటీ. అదుగో వాక్సీన్ ఇదిగో, వాక్సీన్, అన్నీ సిద్ధం చేసుకోండి మరో వార్త. ఏదో ఒకటి అమ్మేసుకుని సొమ్ము చేసుకోవాలి, కొంతమంది తాపత్రయం.
కరోనాకీ వలపక్షమే.ఎ బ్లడ్ గ్రూప్ వాళ్ళమీద పిలవకపోయినా వాలిపోతుందిట. బి గ్రూపంటే మొహమాటంట. ఎబి వాళ్ళంటే ముట్టదుట, ఒ గ్రూపంటే భయమేనట. సరే ఆడాళ్ళంటే మొదలే భయంకదా కరోన కి. ఇక కరోన వచ్చి తగ్గినవాళ్ళ గురించి ప్రచారమూ లేదు, వాళ్ళ సంగతీ తెలీదు. మరోమాట కరోన వచ్చి తగ్గిన పదిమందిలో ముగ్గురికి మాత్రం మానసికరోగం చిరస్థాయిగా ఉంటుందిట. కొంతమందికి దీర్ఘకాలానికి కొన్ని వ్యాధులు బయట పడతాయని కొందరి ఉవాచ. ఏంటో! అంతా విష్ణు మాయ.! ఏది నిజం పరమాత్మకీ తెలియదేమో!
ఏదొచ్చినా బాలీ ఉడ్ వారికి వింతే. పోయేవాళ్ళు పోతున్నారు.పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పుట్టేవాళ్ళు పుడుతున్నారు. బాలీవుడ్ కి చెడ్డకాలం సెలిబ్రిటీలు రాలిపోతున్నారు. కష్టజీవులకి, మురికివాడలవారికి కరోన రాదు, ఇదో రిసెర్చ్ రిజల్ట్, మరో వార్త, ఎందుకంటే వారి వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంది, అశుభ్రమైన ప్రదేశంలో బతుకుతున్నారు కనక, ఎవరిష్టం వారిది, ఎవరివార్త వారిది. బలమైన జీవులే బతుకుతాయన్నది సైన్స్ వారి వార్త అంతేకాదు, ఇది ప్రకృతి చెప్పేమాట. Survival of the fittest. దీనికి కావలసింది రోగ నిరోధక శక్తి, అదెలా వస్తుందిబాబూ, ఎక్కడ దొరుకుతుంది,మార్కెట్లో దొరుకుతుందా? డాక్టర్లని ఆశ్రయిస్తే విటమిన్ డి మాత్రలేసుకో అంటున్నారు.రోజూ నడవండోయ్! ఉదయంచిన సూర్యుణ్ణి చూడండొయ్! డి విటమిన్ చేరుతుంది, రోగ నిరోధక శక్తి అదేవస్తుందంటే, ఎండోపతీ అని నవ్వినవారున్నారు.పోనిద్దురూ ఎవరిష్టం వారిది కదా,లోకో భిన్నరుచిః. ఏడెనిమిది నెలనుంచి కాలు బయట పెట్టలేదు, నడకలేదు, ఇంట్లోనే మిడుకుతున్నామని నడక మొదలెడదామనుకున్నా, విజదశమిరోజు. ఆలోచనొచ్చేటప్పటికే సాయంత్రమయింది,మర్నాడనుకుంటే ఏకాదశీ సోమవారం, దగ్ధయోగమని మానేశా :) మంగళవారం మొదలెట్టేను.
30, అక్టోబర్ 2020, శుక్రవారం
28, అక్టోబర్ 2020, బుధవారం
దురాశ
Coutesy|Whats app
Award winning short film of Canes festival.
26, అక్టోబర్ 2020, సోమవారం
దుందుభి
దుందుభి
దుందుభి రామాయణ కాలం నాటి వీరుడు. ఇతనికి యుద్ధం అంటే బహు మక్కువ. చాలా కాలంగా యుద్ధం ఎవరితోనూ చేయక చికాకుపడ్డ దుందుభి సాగరుని దగ్గరకెళ్ళి, యుద్ధం చేదాం రమ్మన్నాడు. దానికి సాగరుడు, నాలో అనంతకోటి జీవరాసి బతుకుతోంది. వాటిని నిత్యం రక్షించే పని నాది, నీతో యుద్ధం చేయలేనని సౌమ్యంగా చెప్పాడు. ”పెట్టకపోతే పెట్టకపోయావు, పెట్టే ఇల్లైనా చూపమనట్టు, నాతో” యుద్ధం చేయగలవారెవరో చెప్పమన్నాడు. హింవంతుడు బలశాలి ఆయన దగ్గరకెళ్ళు అని సలహా చెప్పాడు,సాగరుడు.
విన్న దుందుభి, హిమవంతుని దగ్గరకెళ్ళి యుద్ధం చేద్దామంటే ఆయన, ''నా పైన అనేక జంతుజాలం, వృక్షజాలం బతుకుతోంది. నానుండి అనేక నదులు పుట్టి ప్రవహిస్తున్నాయి. ఆ నీటితో ప్రజలు బతుకుతున్నారు. వీరందరిని వదిలేసి వచ్చి నీతో యుద్ధం చేయలేనని'' బ్రతిమలాడాడు.
విన్న దుందుభి ''ఛస్! మీరంతా పిరికినాయాళ్ళు. యుద్ధం అంటే భయపడి ఛస్తున్నారు, పోనీ, నాతో యుద్ధం చేయగలవాడెవరో చెప్ప''మన్నాడు. హిమవంతుడు ఆలోచించి, వాలి కిష్కింధాపురి రాజు, మహా బలవంతుడు, నీలాగే యుద్ధం అంటే బాహు మక్కువ చూపేవాడు. నీ కోరిక తనే తీర్చగలడని చెప్పి పంపాడు.
ఇప్పుడు దుందుభి వాలి దగ్గరకొచ్చి యుద్ధం చేద్దాం రమ్మన్నాడు. ''ఓరీ, నీవో బక్క ప్రాణివి. ఒక్క గుద్దుకు చచ్చేలా ఉన్నావు. నీకు నాతో యుద్ధమేంటి ఫో పొ''మ్మన్నాడు. అబ్బే దుందుభి వినలేదు. అంతట వాలి ''నేనెవరో తెలుసునా? నా బలమేంటో తెలుసుకునే నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావా?'' అని అడిగాడు. ''నువ్వు ఎవరైనా నాకు భయం లేదు యుద్ధం చెయ్యమని రంకెలేశాడు'' దుందుభి.
నీ మంచి కోసమే చెబుతున్నా, నేనెవరో విను.
''రావణుడు తెలుసునా?''
''ఆయన రాక్షసరాజు, మా నాయకుడు''
''రావణుడికి నాతో తగని వైరం, నన్ను గెలవడానికి చేయని ప్రయత్నం లేదు.
ఒక సారి నేను సముద్రతీరంలో ఉదయ సంధ్యవారుస్తుండగా నన్ను గెలవడానికి నన్ను వెనకనుంచి పట్టుకున్నాడు. నేను నా బాహు మూలాల్లో తన చేతులు ఇరికించేటప్పటికి మూర్ఛపోయాడు. నేను తనని అలాగే పట్టుకుని సప్త సముద్రాలలో ములిగి సంధ్య వార్చేటప్పటికి చచ్చిన పురుగులా నా వీపున వేలాడేడు.. అలాగే బాహు మూలల్లో ఇరికించి తీసుకొచ్చి కోట ముందు చేతులు పైకెత్తా. పది తలల పురుగులా కిందపడ్డాడు. చాలా సేపటికి తెలివి తెచ్చుకుని, నా కాలికింద దూరి సంధి చేసుకుపోయాడు” అని చెప్పాడు. ”ఇప్పుడూ ఇంకా యుద్ధం చేయాలని ఉందా నాతో” అనీ అడిగాడు. విన్న దుందుభి పట్టు విడవక ”మా నాయకుణ్ణి గెలిచి ఉండచ్చు, నన్ను గెలవలేదుగా, అంచేత యుద్ధం చేద్దాం” అన్నాడు. సరేనని యుద్ధానికి తయారయ్యారు. వాలి పిడికిటి పోట్లతో రక్తం కక్కుకున్న దుందుభిని కాళ్ళు పట్టుకు విసిరితే ఋష్యమూక
పర్వతం మీద పడింది దుంధుభి శరీరం. కోపించిన మతంగ మహాముని ఆ శరీరాన్ని విసిరినవాడుగాని, వాని స్థానీయులుగాని ఆ చోటుకి నాలుగు కోశాల దూరంలో అడుగుపెడితే చస్తారని శపించారు. అలా దుందుభి చరిత్ర ముగిసింది.
దుందుభి కొడుకు పేరు మాయావి. ఇతనికి వాలికి మధ్య ఒక స్త్రీగురించిన తగువు. ఒక రోజు వాలి కోట ముందు అల్లరి చేస్తుంటే శిక్షించేందుకు వాలి బయలుదేరాడు. వెనక వాలి తమ్ముడూ నడచాడు. వీరిని చూచి మాయావి పరుగుపెట్టేడు.
పరుగెట్టిన మాయావి ఒక గుహలో దూరాడు.వాలి తమ్ముని గుహ ముందు కాపుంచి లోపలికి దూరాడు. లోపలి నుంచి అలికిడి లేదు. చాలా కాలం తర్వాత లోపలనుంచి భీకర ధ్వనులు రక్తపుటేరులు రావడం, సుగ్రీవుడు నిగ్రహించుకోలేకపోయాడు, అన్న బలం తెలిసినా. ఒక బండరాతిని గుహకి అడ్డంగా పెట్టి రాజధాని కొచ్చేశాడు. వాలి మాట తెలియలేదు. మంత్రులు రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని బలవంత పెట్టి పట్టాభిషేకం చేశారు. కొంత కాలానికి వాలి తిరిగొచ్చి తమ్ముణ్ణి తరిమేసి రాజ్యం ఆక్రమించుకున్నాడు. బలశాలి వాలి, దుందుభిని అతని కొడుకునీ కడతేర్చాడు,రాముని చేతిలో మరణించాడు, రావణునిలాగే.
నదీనాం సాగరో గతిః
22, అక్టోబర్ 2020, గురువారం
వాక్కాయ పప్పు.
వాక్కాయ పప్పు.
వాక్కాయ రేగుకాయకంటే పెద్దదిగా ఉంటుంది,కోలగా ఉంటుంది, ఊదారంగు,ఆకుపచ్చరంగులో కాని ఉంటుంది. ఒక కాయ మీద రెండు రంగులూ ఉండచ్చు. ఇది బహు పుల్లగా ఉంటుంది. కొస్తే గింజలుంటాయి, వాటిని తీసేసి నీటిలో ఉడకబెట్టి, తగిన ఉప్పేసి, చిటికెడు పసుపేసి, ఉడికిన పప్పులో కలిపేస్తే, తగిన పోపు పెట్టుకుంటే ఇంగువ వేసుకుని, మామిడి కాయ పప్పు కి సరిసమానం అనిపిస్తుంది.
ఈ కాయను ముక్కలుగా తరిగి ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు.
ఈ కాయ ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు దొరుకుతుంది. ఈ కాయ అంటే ఎక్కువ మందికి భయం, దగ్గు వస్తుందని. ఈ కాయ కోసినపుడు తెల్లగా పాలు వస్తాయి. ఆ పాలలో దగ్గును కలగజేసే గుణం ఉందంటారు, తెలిసినవారు. ఇంత చెబుతున్న ఈ వాక్కాయలో ఉన్నదేమిటి?
ఐరన్
విటమిన్ సి
విటమిన్ ఎ
మెగ్నీసియం
పొటాసియం.
శరీరానికి కావలసిన వన్నీ ఇందులో ఉన్నాయి, ముఖ్యంగా ఐరన్. ఇది ఇనపగని. మా దగ్గర ఒక ఊరుంది వాకతిప్ప దాని పేరు, బహుశః వాక తుప్పలతో ఆ వూరికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. ఇది పల్లెటూరివారి ఆహారం :) పిజ్జాలు, బర్గర్లు తినేవారికి వీటి గురించి ఏం తెలుస్తుంది? సహజంగా శరీరానికి కావలసిన పోషకాలను రుచికరమైన ఆహారం లా ఉన్నవాటిని తినడం మానేసామా? ఎమో! కాలమే చెప్పాలి.
17, అక్టోబర్ 2020, శనివారం
పొణక-పాతర.
ఇప్పుడు ఆహార ధాన్యాలు దాచుకోడానికి పెద్ద పెద్ద గొదాములు, వాటిలో పెద్దపెద్ద ప్లాట్ఫారాలు, వాటి మీద బస్తాలలో పట్టి కుట్టి బస్తాబందీ చేసిన వాటిని నెట్టు కట్టి, వాటి మీద టార్పాలిన్ లు పరుస్తున్నారు. పాత రోజుల్లో ఇవన్నీ లేవుగా, అప్పుడు ఆహార ధాన్యాలు దాచుకో లేదా? ఎలా చూదాం.
ఒకప్పుడు పల్లెలలో ఏ ఇంటికెళ్ళినా ముందు వసారాలో,ముందు దొడ్డిలో ఒక పొణక అనే జల్ల కనపడేది. పొణకేంటని అనుమానం కదా!. వెదురుతో ఏడు, ఎనిమిదడుగుల ఎత్తున నాలుగైదు అడుగుల కైవారంలో బుట్టలా అల్లేవారు. దీనిని రెండడుగుల ఎత్తున్న నాలుగు బండరాళ్ళ మీద పెట్టేవారు. బంకమట్టి బయట మేగేవారు. ఆతరవాత పేడతో అలికేవారు. ఇందులో వేపరొట్ట వేసేవారు, ఆపైన గడ్డి వేసేవారు, ధాన్యం పోసేవారు. పైన మళ్ళీ వేపరొట్ట వేసి, ఆపై గడ్డి వేసి మెత్తటి మట్టిమేగేవారు. దీని చుట్టూ ఖాళీ ఉండేలా చూసుకునేవారు, రోజూ చూసేవారు. అవసరం వచ్చినపుడు తీసుకునేవారు. ఇలా సంవత్సరమూ ధాన్యం నిలవ ఉండేవి.ఇలా పాతిక కాటాల దాకా నిలవ చేసుకునేవారు, ఇంతకంటే ఎక్కువ నిలవ కావాలంటే?
పాతర...దొడ్డిలో మెరక ప్రాంతంలో, నీరు చేరని చోట, నీరు ఊరని చోట ఎనిమిదడుగులలోతు వరకు గొయ్యి తీసేవారు. గోతి వ్యాసం పైకొచ్చేకొలదీ ఎక్కువ ఉండేలా చేసుకునేవారు.గోతిని ఆరనిచ్చేవారు, ఆపై వేపరొట్ట పైదాకా పెర్చేవారు, కింద, పక్కల. ఆపై గడ్డి వేసేవారు పక్కల, కింద. గడ్డి మీద కుదిరితే పాత గోనె సంచులు కలిపి కుట్టిన బరకం వేసేవారు పైదాకా. దీనిలో ధాన్యం పోసేవారు. బరకం అంచులు ధాన్యం మీద కి మధ్యలోకి చేర్చేవారు. పైన వేపరొట్ట వేసేవారు,గడ్డి పరచేవారు. ఆపైన మట్టిని ముద్దలుగా చేర్చి పేర్చేవారు. దీనిమీద పక్కలా కూడా పేడ నీళ్ళు జల్లేవారు. ఈ గోతి చుట్టు పక్కల నిత్యం చూసేవారు, పందికొక్కు తవ్వుతోందేమోనని. చినుకులొస్తే నీరు నిలవకుండా చూసుకునేవారు. అవసరమనిపిస్తే తాటాకులు పరచేవారు. సంవత్సరంలో అవసరాన్ని బట్టి తవ్వి తీసుకుని మళ్ళీ కప్పేసేవారు. ధాన్యం మిలమిలామెరుస్తూ బాగుండేవి.ఇలా దాచుకోడాన్ని పాతర వేయడం అంటారు. మనదేశం లో మానేసారుగాని ఇదింకా అఫ్రికా దేశాలలో అమలు లో ఉంది. ఈ ధాన్యం బియ్యం రుచిగా ఉండేవి.
ఒకప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలుండేవి. బియ్యం ఏరుకోవడం ఓ పెద్ద పనిగా ఉండేది, ఆడవారికి. కాలం మారింది ఆ తరవాత పలుకురాళ్ళు వచ్చేవి బియ్యంలో. వీటిని ఏరుకోవడం కష్టంగా ఉండేది. తరవాత కాలంలో నూటికి ఐదు బస్తాల మట్టిబెడ్డలు కపలడానికి బెడ్డల ఫేక్టరీలు పుట్టేయి, సరే పలుకు రాళ్ళ కి కూడా ఫేకటరీలుండేవి. కాలం మారింది, మట్టి బెడ్డలుండటం లేదుగాని ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారట, నేడు. ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం ఎలా వేరు చేసుకోవాలో తెలియక ప్రజలు తలలు పట్టుకునే రోజులు ముందున్నాయిట. కలికాలం.
తక్కువ ఖర్చుతో ఆహారం నిలవచేసుకునే అలవాట్లు వెనకబట్టేయి.




















