18, జూన్ 2026, గురువారం

చినుకు భాగోతం

 చినుకు భాగోతం


చిందు భాగవతం కాదు సుమా! ఇది చినుకు భాగోతమే! జూన్ నెల సగం గడిచినా చినుకు కనపడలేదు,మా దగ్గర. మా వాట్సాప్ గ్రూప్లో దీనిమీద మహాపుణ్యాత్ములున్నచోట చినుకు పడుతుందయ్యా! వగైరా,వగైరా చెణుకులు నడుస్తున్నాయి. 


బుధవారం మధ్యాహ్నం భోజనం తరవాత పడకేసాను ఒంటిగంటకి.  రెండు గంటలకి టక్కున లేవడం రోజూ అలవాటు. కాని మూడుదాకా మెలకువరాలేదు, ఇంత సేపు నిద్రా అనుకున్నాగాని,ఇది రాబోయే కష్టానికి సూచన అనుకోలా! . మెలకువొచ్చేకా అల్పాచమానానికి బయట పాయఖానాకి వెళ్ళాను. వేడి,ఎండ తోడు వడగాలి చుర్రు మనిపించాయి. వెళ్ళిన పని పూర్తిచేసుకుని రయమున లోపలకొచ్చిపడ్డా! మరో పావుగంటలో కోడలమ్మాయి,మబ్బేసింది, గాలిచల్లబడింది వార్త చెప్పింది,గాలేస్తోందని కూడా చెప్పింది. ఇంకేం అనుకుంటూ లేవబోయే లోగా కరంటు పోయింది. బయటి కొస్తే గాలి వేస్తోంది,చల్లగా ఉందిగాలి. అరే! ఇప్పటిదాకా ఉన్న వేడి ఏమయిందబ్బా అనుకునే లోగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఎలా? మొన్న తమ అల్లుడు జిలేబీని ఆశీర్వదిస్తూ శ్యామలీయంగారు చల్లిన స్వాతి చినుకుల్లా! గాలి ఆగిపోయింది, ఇక చూడురాజా! మా బతుకు! కుమ్ములో పెట్టిన చిలకడ దుంప చందమైపోయింది. లోపల వేడి బయట కాంక్రీట్ జంగిల్ మీద పడ్డ చినుకులకి లోపనుంచి,భూమి నుంచి వేడి తన్నుకొచ్చింది. ఇంకేం చెప్పీది?చినుకు భగోతం? ఇది ఒక అరగంట సాగింది. వేడి తగ్గలేదు. కరంటు రాలేదు. షరా మామూలుగానే రాత్రి 8.30 కి వచ్చింది,మళ్ళీ పోయినా వచ్చేసి స్థిరంగా ఉంది, అదొక్కటే సంతోషం.


ఈ సందర్భంగా కొన్ని సంభాషణలు గుర్తొచ్చేయి. కితం ఎన్నికలరోజు ఎండలు మండుతున్నాయని ఒకాయనంటే మరొకరు బాబొస్తాడుగా, బాబొస్తే కరువొస్తుందని ఆ పార్టీవాళ్ళె అనుకుంటున్నారని చెప్పేడు,అది నిజమా? ఏమో!  కరువుకి ఆయన ఎన్నికకి సంబంధం ఏంటబ్బా !


నిన్నఒకరు నేరేడు పళ్ళు ఎక్కువ కాస్తే కరువొస్తుందని చెప్పేరు. అది నిజమే, నిరుడు నేరేడు పళ్ళు కేజి.400 నుంచి 600 అమ్మింది. నేడు 200 నుంచి 300 లో దొరుకుతున్నాయి. నేరేడు పళ్ళు ఎక్కువకాయడానికి కరువుకి లింకేంటండీ అంటే , నేరేడు చెట్టు రాబోయే కాలంలో నీరు లేక తనజాతి నశిస్తుందని ఎక్కువ బీజాలు ఎక్కువ ఉత్పత్తి చేస్తుందట. ఇది ప్రకౄతి సూత్రమన్నారు.నిజమా! మనవారి ప్రకౄతి పరిశీలన ఇంతా నిశితంగా ఉండేదా! 


వారంకితం శ్యామలీయంగారితో మాటలో చినుకులేదనివాపోతే మాకు వర్షం పడుతోందండీ, మీకూ పడుతుందని ఆశీర్వదించారు. మొన్న శోధిని శ్రీనవాస్ గారితో మాటలో ఇలా వాపోతే మాకు వర్షం ఉందిగాని వేడి తగ్గలేదు,మీకూ వర్షం పడుతుందిలెండన్నారు. పుణ్యాత్ముల ఆశీర్వచన ఫలితం కావచ్చు నిన్నటి చినుకు భాగోతం. నేడు ఎండలేదు, వేడి,వడగాలి షరా మామూలే! ఇదండీ బాబూ,మా చినుకు గోల.      

2 కామెంట్‌లు:

  1. దీని కతాకమామీ షే మిటండి తాతగారూ ~?
    మొన్న తమ అల్లుడు జిలేబీని ఆశీర్వదిస్తూ శ్యామలీయంగారు చల్లిన స్వాతి చినుకుల్లా!

    రిప్లయితొలగించండి
  2. "అల్లుడు జిలేబీ" అంటున్నారు ..?

    బాబొస్తే కరువొస్తుందని అందరూ చెప్పేది విన్న విషయమే అయినా... నేరేడు పళ్ళు ఎక్కువ కాస్తే కరువొస్తుందన్న క్రొత్త విషయం తెలిపినందుకు సంతోషం..

    రిప్లయితొలగించండి