పొరుగింటి పుల్లకూర......
తెనుగు భాషా దినోత్సవ శుభకామనలు.
తెనుగు భాషా దినోత్సవ శుభకామనలు అని సందేశం పంపిందో మనవరాలు తెనుగుపంతులమ్మ. మొన్ననో సారి మాటల్లో గురువుగారు అనడం మొదలెట్టింది,తాతా అనేమాట మోటనుకుందో....ఏం వరస మార్చావన్నా! పెద్ద స్థానం ఇచ్చేనంది,తెలివైనది కదూ,అందుకు.
గురు శబ్దస్యంధకారస్య,రుశబ్దతన్నిరోధకః. ఇదీ గురు శబ్దానికి అర్ధం. గురువు లెక్కడ. నేటి కాలంలో గురువులు లేరు,అంతా టీచర్లే నువ్వు ఏంచేస్తావంటే తెనుగు టీచర్ని అంటున్నారు. కలగలుపైనా పొరుగింటి పుల్లకూర కలుపుకుంటున్నారు.
మొన్న ఒకసారి లోక్ సభలో చర్చలో ఒక ప్రశ్నకు తక్షణం స్పందిoచి, శ్రీ రామ్మోహన్ నాయుడు సమాధానమిస్తూ నేను తెనుగువాడిని, తెనుగు మాటాడగలను,అరవం,మలయాలం,హిందీ మాటాడ్తా! ఏది,నువ్వు తెనుగు మాటాడగలవా? అడిగేటప్పటికి ఆ నాయకుడే కాదు,మొత్తం లోక్ సభ నిశ్శబ్దమైపోయింది. అదీ తెనుగు భాష శక్తి,తెనుగువాడి శక్తి.
నేటి కాలంలో ముద్దొస్తే కిస్స్ పెడుతున్నారు తెనుగువారు. ఇక రాసేటప్పుడు అపశబ్దాలకి లోటే లేదు. ఆపై, ఒత్తులు పొల్లులు పోయాయి,ఇది సెల్ఫోన్ సౌడభ్యం! చిన్న ఆశ తెనుగులో రాయాలనే కోరికతో చేస్తున్నపొరబాటు, ఎంత చెప్పుకుని ఏమి ఉపయోగం. ఇద్దరు తెనుగువాళ్ళు కలిస్తే ఇంగ్లీషులో మాటాడుకుంటున్నారు,మరి తెనుగెక్కడ? వాడుకభాషలో ఇంగ్లీష్ మాటలేక మాటాడలేకపోతున్నారు,తెనుగు పంతుళ్ళూ,పంతులమ్మలూ కూడా!
ఇదేమి పుల్లకూరని మొదలెట్టి ఇలా చెండాడుతున్నవనకండి. మనసులో బాధ (అదే బాద) చెప్పుకుంటున్నానంతే! పుల్లకూర అంటే గోంగూర అని కూడా కొన్ని చోట్ల వాడుక.
పొరుగింటి పుల్లకూర రుచి అనేది ఒక తెనుగు నానుడి.
నిజమే పక్కింటి కూర పుల్లగా రుచిగానే ఉంటుంది. నిత్యం దాన్నే వాడితే అనారోగ్యం చేస్తుంది. అందుచేత పక్కింటి పుల్లకూర అవసరం మటుకు వాడుకోవాలి, భాషతో సహా. కష్టం వచ్చిన ప్రతి సారి అమెరికాను నిషేధించు,చైనాను నిషేధించు అనడం కాదు. జీవితం లో దేనినీ నిషేధించకు,నిషేధించలేవు, ఇదీ సత్యం. ఎంత అవసరమో అంత వాడుకో నీదగ్గర దొరికే వస్తువులని అమ్మీజాన్ లోనూ,జొమొటో లోను ఎందుకు తెప్పించుకోవాలి? నీదైనదాన్ని వదులుకోడమేం? తనది పాలుకిచ్చి తను కూలికి వెళితే బాగోదు. బద్ధకం,కావలసినవాటిని జాబితా రాసుకుని, బజారుకి సంచీ కూడా పట్టుకుపోయి,ఒక్కొకటే కొనుక్కుని రావచ్చు, ఒక శలవురోజు. అబ్బే కాలు కదలదు,బిళ్ళలేసుకుని కూచో! అంటే ఆనందం. ఇందులోనూ మనదైన వైద్యం గచ్చాకు,పుచ్చాకు వైద్యం అంటే వెగటు. నిజం చెప్పాలంటే గచ్చ,పుచ్చ గొప్ప మందులు తెలుసా! తెలుసుకో! బిళ్ళలు చాలు అనుకుoటే మన బతుకింతే. అందుకే రక్త పోటు 120/80 ని 115/70 గా మార్చేసారు,అమెరికా వారు. ఇప్పుడందరూ రక్తపోటు బాధితులే, వేసుకోండి బిళ్ళలు. పొరుగింటి పుల్లకూర రుచి మహాత్మ్యం.
అందరినీ మారు అంటున్నవు, నువ్వు మారచ్చుగా అడగచ్చు. నిజం,మారాలనే ఉంది,మారలేను కారణం జీవిత చరమాంకానికొచ్చేసేను,నేడో,రేపో. ఇప్పుడున్న బాధలు చాలు,మారి కొత్త బాధలు తెచ్చుకోలేను.
గిడుగువారిని మొదటగా తలుచుకోకపోవడం నా తప్పే