Saturday, 19 July 2025

పేకాట పేకాటే పెద్దన్నయ్య....

 పేకాట పేకాటే పెద్దన్నయ్య....

పేకాట పేకాటే, పెద్దన్నయ్య పెద్దన్నాయే. ఈ నానుడిని తెనుగునాట విరివిగానే చెబుతారు.దీన్నే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనీ చెబుతారు. పేకాటలో కూచున్నాకా ఓడిపోతే ఓకులు లెక్కపెట్టి డబ్బులివ్వను, నేను అన్ననురా/తమ్ముణ్ణి అనడానికి లేదు. ఇచ్చి తీరవలసిందే. అదేదో పేకాటలో కూచునే ముందే తేల్చుకోవాలి. దీన్నే మరో ముతక సామెతగా చెబుతారు మా పల్లెటూరివాళ్ళు 'మంచం ఎక్కేదాకానే వరస, మంచం ఎక్కేకా వరసేంటి?' అంచేత పేకాటకి బంధుత్వానికి లింక్ పెట్టద్దు.


 ఇదీ భారతం నుంచి వచ్చిందే! జూదానికి పిలిచినప్పుడు వెళ్ళక తప్పదు, వెళ్ళి జూదం లో కూచున్నాకా అన్నీ ఓడిపోయాడు. జరగవలసినవన్నీ జరిగిపోయాకా, గుడ్డి రాజుగారు ఇదంతా తూచ్! అనేసి వరాలిచ్చేసి పంపించేసేడు. మళ్ళీ జూదంలోనూ ఓడిపోయిన పాండవులు అడవులకు పోయారు. రాజ్య భాగం గురించిన మాట షరతుల్లో లేదు. వనవాసం తరవాత రాజ్య భాగమడిగితే సూది మొన మోపినంత కూడా ఇవ్వనన్నాడు,దుర్యోధనుడు. 'రాజ్యం వీర భోజ్యం' కనక యుద్ధం జరిగింది. గెలిచినవాళ్ళు రాజ్యం చేసుకున్నారు. ఇదిప్పటికిన్నీ జరుగుతున్నదే!  

నేటికాలానికి ఈ నానుడిని వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారమే అని చెబుతుంటారు. రష్యాతో వ్యాపారం చేసేవాళ్ళకి పన్నులు పెంచేస్తామని అమెరికా,యూరోపియన్ యూనియన్ దేశాలు చెబుతున్నాయి. ఇదేంటి మీరు రష్యాతో వ్యాపారం చేస్తున్నారు,మమ్మలిని వద్దనడం,కాదని చేసిన వాళ్ళకి పన్నులు పెంచుతాం. ఇదేం వ్యాపారం? ఇది వ్యాపారం కాదు, వ్యవహారానికి లింకు. రష్యాని యూక్రెయిన్ తో యుద్ధం మానుకోమని చెప్పండి మేమూ చెబుతాం. కాదు మేము రష్యాతో వ్యాపారం చేసినవాళ్ళకి పన్నులు పెంచుతామని బెదిరించి రుబాబులు చేసి రోజులు గడుపుకునే కాలం చెల్లింది. రుబాబులు చెయ్యకండి వ్యాపారం వ్యాపారం లా చేయండి,వ్యవహారం వ్యవహారం లా చేయండి, రెండిటిని కలిపి ఆధిపత్యం వెలగబెట్టె రోజులు చెల్లేయని గుర్తించండని  భారత్ యూరోపియన్ యూనియన్ కి తెగేసి చెప్పింది. వార్నీ!  మన పేకాట సామెత అంతర్జ్యాతీయంగా వెలిగిపోతోంది.    

12 comments:

  1. పేకాట సామెతని నేటి సందర్భానికి తగ్గట్టు బలే లింకేసారు...

    ReplyDelete
    Replies
    1. srinivasrjy19 July 2025 at 12:15
      గత పది రోజులుగా టపా రాసేందుకు ఓపిక,ప్రేరణ కూడా లేకపోయాయి. ఇది కనపడేటప్పటికి నానుడి గుర్తొచ్చిందండి,అంతే టపా ఉరికిందండి, లింక్ పడిందండి.
      ధన్యవాదాలు.

      Delete
    2. ఓపిక ప్రేరణ గట్రా బిల డప్పులేల తాతగారండీ బు.లో.గు తగ్గింపయిందేమో నని చెప్పరాదూ :)


      నారదా!

      Delete
    3. Zilebi21 July 2025 at 05:45
      ఈ మాత్రం దానికి నారదుడెందుకూ? తమరు చాలరూ? అన్నమాటేదో తెలిసేలా అనరాదూ! భయం! భయం!! కోడి గుండెకాయ!

      Delete
    4. అబ్బే ! ఏదో మీ మీదున్న అభిమాన మంటే :( భయం లా :)

      Delete
    5. Zilebi21 July 2025 at 18:30
      పదునాలుగేళ్ళ అభిమాన మంటే :)🤣
      బు లో గు అంటే లేట్ గా బల్బెలిగింది. నీ బుర్రలో గుంజు ఎండిపోయి చాలా కాలమే అయిందని ఎప్పుడో చెప్పిన మాటగదా! నాదంటావా! ఎనిమీదో దశకం పశ్చిమార్ధానికి చేరుతున్నా! ఇంక కూచుంటుందా! నా బుర్రలో గుంజు అప్పుడప్పుడేనా మెరుస్తోందిగా 🤣

      Delete
  2. https://bonagiri.wordpress.com/2025/07/20/%e0%b0%a7%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%b8%e0%b0%82%e0%b0%a6%e0%b1%87%e0%b0%b9%e0%b0%82/

    ReplyDelete
    Replies

    1. bonagiri20 July 2025 at 17:13
      చూసానండోయ్!

      Delete
  3. చాలా కాలానికి ఒక పోస్ట్ వ్రాసాను, అందరికీ తెలుస్తుందో లేదో అని లింక్ ఇక్కడ ఇస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. సెల్ఫు మార్కెటింగు :)

      Delete
    2. Zilebi21 July 2025 at 05:44
      సరుకుంటెనే మార్కెటింగు,సరుకు లేని నీకు మార్కెటింగ్ ఎందుకూ? టాక్సులేస్తాననడం ఉండదులే!

      Delete
    3. bonagiri20 July 2025 at 17:14
      ఈ మధ్య టపాలు రాసేవాళ్ళు లేరు,చదివేవాళ్ళూ లేరు, సరే ఇక కామెంటేవాళ్ళకి కరువు వచ్చి పడుండ్లా! ఏం చేస్తాం కాలం!! ''ఎద్దుప్పు ఎప్పుడూ ఒక పక్కే పడుకోదు ' అంటుంటారు మా పల్లెటూరోళ్ళు, మంచి రోజులొస్తాయని చెప్పడానికీ నానుడి వాడతారు.

      Delete