Wednesday, 30 July 2025

లా వొక్కింతయు/ లావొక్కింతయు



లా వొక్కింతయు/ లావొక్కింతయు


 లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబుల్ 

ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే దప్ప యితఃపరంబెఱుగ మన్నింపందగున్ దీనునిన్

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!


”లా” వొక్కింతయు లేదు’  అని వాపోయారు పోతన నాటి కాలంలోనే! ఆయన రాసిన భాగవతాన్ని అంకితమివ్వలేదని రాజు దండించబూనడం వగైరా చెబుతారు, ఆ తరవాత ఇమ్మనుజేశ్వరాధముల...కంటూ భాగవతంలోనే రాసెయ్యడంతో మన దాకా వచ్చేసింది. 

మరి నేటి కాలానికొస్తే లా లేదోయ్ మా దేశంలో అని ఎలుగెత్తి చాటుతున్నారో పక్క, మరో పక్క సుప్రీం కోర్ట్ అర్ధరాత్రి తలుపులుదీసి మరీ న్యాయం చెబుతోంది. అంతే కాదు సమయం దాటిన తరవాత కూడా బెంచీలు అప్పటికప్పుడు కూర్చి, కుదరకపోతే మార్చి న్యాయం చెప్పేస్తున్నారు.నేనే చంపేను,ఇదీ కారణం,ఇదిగో వీడియో అని చెప్పి సోషల్ మీడియాలో వీడియో పెట్టినవారిని తగు సాక్షాలు చూపడంలో పోలీస్ విఫలం, అంజెప్పి కేసులు కొట్టేసెతే, పీక తీసినవాడు జల్సాగా బోరవిరుచుకు తిరుగుతున్నాడు, న్యాయం, ఉన్నట్టా? లేనట్టా? న్యాయం ఉన్నట్టా? లేనట్టా? మాన్యులకేగాని సామాన్యులకు కాదనేవారూ ఉన్నారు. ఏమో ఇది విష్ణుమాయా?

దీనికేంగాని ఎంతజెప్పుకున్నా తరిగేదీ కాదు... పోతనగారి లావొక్కింతయు లేదు దగ్గరకుపోదాం.
లావొక్కింతయు లేదు అని వాపోయినవాడు గజేంద్రుడు, ఎక్కడా? మడుగులో! ఎప్పుడూ? మొసలి పట్టినపుడు, పోరాడి,పోరాడి ఇక లాభం లేదనుకుని సంపూర్ణ శరణాగతి చేసిన సమయంలో . అసలీ మొసలేంటి మడుగేంటి అనుమానం రాలేదేం!!! మనమే ఈ గజేంద్రుడు, మడుగే ఈ సంసారం, మొసలే కోరికలు. 

గజేంద్రుడు కరిణీ సంఘంతో బయలుదేరేడు. కొంతదూరంపోయేటప్పటికి ఒక మడుగు కనపడింది, అది చాలా ఆకర్షణీయంగా ఉంది. దాంతో జలకాలాటలకి దిగేడు పత్నులతో ఇంకేంటి మడుగు కలచేసి దున్నేసేరు, అంతా కలిసి. ఇప్పుడు అందులో ఉన్న మొసలి గజేంద్రుడి కాలు పట్టుకుంది, దాంతో పోరాటం మొదలెట్టేడు. కరిణీ సంఘం గట్టెక్కేసి చూస్తూ నిలబడింది. గజేంద్రుడు పోరాడి పోరాడి అలసిపోయి, తన బలం పూర్తిగా నశించిందని గుర్తించి, ఇది దైవ కృపతో జరిగేదని తలచి,లావొక్కింతయు లేదు అన్నాడు .... 

ఈ గజేంద్రుడు మనమే! అమ్మా బాబూ, కడుపు కట్టుకుని చదివిస్తే చదివేసుకున్నాం! ఆ తరవాత జేరబడింది సిరితల్లి,ఇల్లాలు. ఇంకేం కోరికలు మొలుచుకొచ్చేయి. కోరికలు తీర్చడానికి పడ్డ పుర్రాకులకి కొదవే లేదు. సంపాదనే ధ్యేయంగా సాగిపోయింది, ఇక మనకి ఎదురు లేదు అనుకుని కాలం గడుపుతున్న కాలంలో మొసలిలాటి బలవత్తరమైన కోరికేదో పట్టింది,దానికోసం ప్రయత్నంలో పోరాటం తప్పలేదు. కాలం చెల్లిందిగాని కోరిక తీరలేదు,మొసలి వదల లేదు.వయసూ మీద పడింది.  కాని ఒంట్లో రోగం మాత్రం ప్రవేసించింది. అది పెరిగి పెద్దదయింది. కదలలేని రోజొస్తే ఆసుపత్రిలో పారేసేరు. ఐ.సి.యు బయట ఇల్లాలు,కొడుకులు,కోడళ్ళు;కూతుళ్ళు అల్లుళ్ళు ఎదురు చూస్తున్నారు, డాక్టర్ చెప్పే కబురు కోసం.  ఎవరి గోల వారిదే! డాక్టరు ఇంకా వీళ్ళ దగ్గర ఎంత గుంజచ్చు అంచనా వేస్తున్నాడు. పెళ్ళాం ఏదో సంపాదించాడు,విల్లు రాసేనన్నాడు ,నాకూ చెప్పలేదు. ఏమి రాసేడో! నాకేమైనా ఇచ్చాడా ? ఇక కొడుకులు ఇక్కడ కొంప,గోడు అంటాడు, అమ్మేసి వచ్చెయ్యంటే వినడు. విల్లులో ఏం రాసేడో!!! ఇక కూతుళ్ళు అల్లుళ్ళు, మనకి ఎందుకీ జాగరం? విల్లులో ఏంరాసేడో! కొడుకులకే ఇచ్చుకుని ఉంటాడు, మీకేం ఉండదు, అని అల్లుళ్ళ సతాయింపు కూతుళ్ళని సన్నగా! ఇలా బయట గుంపుచింపులు పడుతుండగా లోపల బెడ్ మీద మానవునికి గడచిన జీవితం రీలు తిరిగి, అయ్యో! ఈ పెళ్ళము పిల్లల కోసమా నేను ఇన్ని నాళ్ళూ తిప్పలు పడినది? నా ఆరోగ్యం కూడా చెడగొట్టుకుని సంపాదించినది? గజేంద్రుడి భార్యలు గట్టెక్కి చూస్తూ నిలబడినట్టు, నేడూ నావాళ్ళన్నవాళ్ళంతా బయట నా చావుకోసం ఎదురు చూస్తున్నారు. పరమాత్మా జీవితంలో తప్పు చేసాను, ఇక వ్యాధులతో పోరాడ లేను, త్వరగా తీసుకుపో అని ప్రార్ధిస్తున్నాడు.
అదే
లా ఒక్కింతయు లేదు..... 

No comments:

Post a Comment