Friday, 18 February 2022

మనసు విరిగెనేని మరి అతుకగ రాదు

 


 మనసు విరిగెనేని మరి అతుకగరాదు


ఇనుము విరిగెనేని 

ఇనుమారు ముమ్మారు, కాచి అతుకవచ్చు కమ్మరీడు

మనసు విరిగెనేని మరి అతుకగ రాదు

విశ్వదాభిరామ వినుర వేమ!

ఇనుము విరిగితే రెండు మాడుసార్లు అతకచ్చు, వేడిచేసి. కాని మనసు విరిగితే మరి అతుక్కోదు.


తాతగారి మాట చద్దన్నం మూట. 

ఇనుము చాలాగట్టి లోహం. అది విరగాలంటే చాలా పెద్ద సమ్మెటపోట్లు బలంగా తగిలితేగాని విరగదు. అలా విరిగిన ఇనుమును కూడా కమ్మరీడు కాలేసి అతకగలడు, అది కూడా రెండు మూడు సార్లే, ఆ తరవాత అదీ అతుక్కోదు. ఇక మనసు గాజుకాయలాటిది, ఎంత సున్నితమో అంత కఠినం కూడా. అటువంటి మనసు విరిగితే మరి అతకడం ఎవరివల్లా కాదంటారు, ఇంతటి మనసు ఎలా విరుగుతుంది, మాటల తూటాలకి విరుగుతుంది,అంటారు, తాతగారు. 


దీనికి నిదర్శనంగా భారతంలో ఒక పద్యం ఉంది, పద్యం గుర్తు లేదు, భావం రాస్తున్నా! ఎవరేనా పద్యం గుర్తు చేస్తే సంతసం. ''పదునైన బాణం ములుకులతో ఐన గాయాలను కూడా మాన్చవచ్చు, కాని మాటలో ఐన గాయాలు, మాన్చటం ఎవరితరమూ కాదు!'' అందుచేత  ముందు ఆలోచించాలి,ఆలోచించి మాటాడాలి, నోటి నుంచి బయటికి వచ్చిన మాట రామబాణ సమానం, అది తన లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది, వెనక్కి తీసుకోలేం. అందుకే నోరు సంబాళించుకో అంటారు, పెద్దవాళ్ళు.మరో మాట కూడా నోరా వీపుకి దెబ్బలు తేకే అన్నది జాతీయం. కాలు జారితే తీసుకోగలం ,నోరు జారితే తీసుకోలేము, ఇది మరో జాతీయం.


పద్యం గుర్తొచ్చింది 

తనువున విరిగిన యలుగుల

ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!

13 comments:

  1. అవును సర్, అసాధ్యం.
    ఫెవికాల్ (Fevicol), అరల్డైట్ (araldite) కూడా తమ అడ్వర్టైజ్మెంట్లల్లో .... దేన్నయినా అతికిస్తుంది - విరిగిపోయిన మనసులు తప్ప .... అనేవారు.

    “మనసు తోటి ఆడకు మావా,
    ఇరిగిపోతే అతకదు మల్లా” అన్నాడు “మనసు కవి”ఆత్రేయ కూడా (మూగమనసులు చిత్రంలో).

    నోరు సంబాళించుకునే సంయమనం అందరు మనుషులకూ ఉంటే అంతకన్నా కావలసినదేముంది.

    ReplyDelete
    Replies
    1. పద్యం విన్నకోటవారు,

      మనసుతోటి ఆడకు మావా!ఇరిగిపోతె అతకదు మల్లా. ఒక పల్లెటూరి జాణతో అనిపించిన మనసుకవికి జోహారు.

      నోరు సంబాళించికోడమా? బలే వారే అది స్వేఛ్ఛండీ :)

      Delete
  2. ఎప్పుడో ఏ సినిమాలోనో ఒకపాట విన్నట్టు గుర్తు.
    "కాలు జారితే కలుగదు కష్టం నోరు జారితే ------- రా "

    ReplyDelete
    Replies
    1. లక్కరాజావారు,

      హరే హరే రామ్ సీతారామ్
      అంతా ఇంతే ఆత్మారామ్
      అంతు తెలియని మొండి ఘటాలకి
      ఎంత చెప్పినా అగోచరం
      అదె ఏమి చెప్పినా అగోచరం.
      ఇదో సినిమా పాటండి :)

      Delete
  3. మిత్రులు శ్యామలీయం వారు తలకట్టులో పద్యంలో సవరణ చెప్పేరు, అమలు చేస్తున్నా! నేను జిలేబి కాదుగా.....:)

    మరోమాట భారతంలో పద్యం నాకే గుతొచ్చింది. అది ఇదే

    తనువున విరిగిన యలుగుల
    ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
    మనమున నాటిన మాటలు
    విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!

    ReplyDelete
    Replies
    1. చిత్తం. ఈపద్యసారాన్నే సినీకవి ఇల్లా చెప్పాడండి:
      "తనువు కెన్ని గాయాలైనా - మాసిపోవు నేలాగైనా
      మనసుకొక్క గాయమైనా - మాసిపోదు చితిలో నైనా"

      వినండి మధురమైన పి.బీ. శ్రీనివాస్ గళంలో : తనువు కెన్ని గాయాలైనా ...

      Delete
    2. శ్యామలీయం వారు,
      అసలు మాట పాట్లా బంగారం, దానిని ఎవరు కావలసినట్టుగా వారు మలచుకున్నరంతే కదండీ!

      Delete
  4. ఎవరు ఎవరితో ఏ సందర్భంలో చెప్పిన పద్యం ఇది, శర్మ గారు? 
    నిన్న మీ టపా చూసిన తరువాత ఏ పద్యం  అయ్యుంటుందా  అని చాలాసేపు ఆలోచించాను గానీ గుర్తుకు రాలేదు. అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు పాండవులకు వాళ్ళ పురోహితుడు ధౌమ్యుడు చెప్పిన హితవా అని ఓ క్షణం అనిపించింది గానీ మళ్ళీ ఆయన చెప్పింది సేవాధర్మం / రాజుల దగ్గర కొలువు విధానం గురించి కదా అనిపించింది. అయితే దాంట్లో భాగంగానే ఈ మాట కూడా చెప్పాడేమో తెలియదు. “కవిత్రయం” తిరగేసే ఓపిక లేక విరమించుకున్నాను. 

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఈ పద్య భావం గుర్తుండి పోయిందండి. పద్యమూ గుర్తే! కాలంతో మరపొచ్చింది, కొంచం శ్రమ పడితే పద్యం గుర్తొచ్చింది, అప్పుడే ఇది ౩ఎవరు ఏ సందర్భంలో ఎవరితో అన్నమాట అన్నది తెలుసుకోవాలనిపించింది కాని అశ్రద్ధ చేశాను. భారతం తిరగెయ్యాలండి, నా ఉద్దేశంలో ఈ మాట సంజయుడు పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళి వచ్చిన తరవాత ధ్రుతరాష్ట్రునికి చెప్పిన మాటగా తలుస్తాను.

      Delete
    2. మీ జ్ఞాపకశక్తికి జోహారులండీ, శర్మ గారు 🙏.
      సంజయ రాయబారం అన్నారు కాబట్టి సరాసరి ఉద్యోగ పర్వం లోనే వెదికాను ఇందాక. ఈ పద్యం “కవిత్రయం” వారి ఆంధ్ర మహాభారతంలో ఉద్యోగ పర్వం ద్వితీయాశ్వాసంలో పద్యం నెంబర్ 62 వది గా 290వ పేజీలో కనిపించింది.

      మీరన్నదానికి ఒక చిన్న సవరణ. ఈ మాటలు అన్నది సంజయుడు కాదు. రాయబారం నుండి తిరిగి వచ్చి విశేషాలు క్లుప్తంగా థృతరాష్ట్రుడికి నివేదించి ఇంటికి వెళ్ళిపోతాడు సంజయుడు. ఆ తరువాత రాజు గారికి విదురుడు హితోపవాక్యాలు పలుకుతాడు. వాటిలోని భాగమే ఈ పద్యం 🙏.

      Delete

    3. విన్నకోటవారు,
      పెద్దపుస్తకాలు, రామాయణం,భారతం లాటివాటిని కావిడి పెట్టిలో సద్దేశాను, మూడేళ్ళ కితం. వాటిని తీయడానికి బద్ధకమేసింది. సంఘటన గుర్తుంది లీలగా, సవరణ చేసినందులకు ధన్యవాదాలు.పుస్తకాలో సారి తీసి దులపాలి, ఎ౩లా ఉన్నాయో చూడాలి.

      Delete
    4. మిత్రులు శర్మగారు,
      చదవటం నేనూ తగ్గించేసననే చెప్పాలండీ. ఏదన్నా చదువుదామని బుధ్ధిపుట్టినా అది నిలవటం లెదు - ఈవిరామంలో భగవన్నామం చేసుకోవచ్చును కదా అనిపించి పుస్తకం ప్రక్కనపెట్టటం‌ జరుగుతుంది. అలాగని చూస్తూచూస్తూ ఆపుస్తకాలను మరెవరికీ‌ ఇవ్వలేకున్నాను. ఇచ్చినా ఎవరు చదువుతారు లెండి. ఆమధ్యన ఆరేళ్ళక్రిందట మాతోడల్లుడు గారు పరమపదించారు. వారి దగ్గర చాలా పుస్తకాలుండేవి. అవన్నీ ఎవరికైనా ఇచ్చారోలేదో‌ కూడా తెలియదు - ఏ చిత్తుకాగితాలవాడికో ఇచ్చి ఉన్నా ఆశ్చర్యం లేదు. విదేశాల్లో ఉన్న కొడుకూ కూతురూ వాటిని తీసుకొని వెళ్ళలేరు కదా.

      ఇకపోతే వృత్తిపరంగా నిత్యం‌ ఎన్నోవిషాయలను చదవటం తప్పదు. అది వేరే సంగతి.

      Delete
    5. శ్యామలీయం వారు,
      ఆలోచించవలసిన సంగతే సుమీ!

      Delete