Sunday 3 October 2021

అందితే జుట్టు లేకపోతే కాళ్ళు .

 అందితే జుట్టు లేకపోతే కాళ్ళు .

ఇదొక నానుడి. తరచుగానే చెబుతుంటారు. దీని గురించి చూస్తే చిన్న కత భాగవతంనుంచి.
బహుశః ఈ సంఘటన నుంచే ఈ నానుడి పుట్టిందేమో!

శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు హస్తినాపురం వెళ్ళి, దుర్యోధనుని కూతురైన లక్షణ అనే కన్యను, రాక్షస వివాహం చేసుకోడానికి తీసుకొస్తుంటే కౌరవులు అడ్డుకున్నారు. (రాక్షస వివాహం అంటే కన్యను, కన్య బంధువుల ఇష్టానికి వ్యతిరేకంగా తీసుతెచ్చుకుని వివాహం చేసుకోవడం.భారతం, నాటి సమాజం ఎనిమిది రకాల వివాహాలను అనుమతించినట్లు చెబుతోంది)


“కోరి సుయోధను కూతురి సర్వలక్షణములు గల్గి లక్షణ యనంగ
మహినొప్పు కన్యకామణి వివాహంబున జక్రహస్తుని తనూజాతు డైన
సాంబుడు బలసాహసమున నెత్తుకపోవ గౌరవు లీక్షించి కడగి క్రొవ్వి
పడుచువాడొక డదె బాలిక గొనిపోవుచున్నాడు గైకొన కుక్కు మిగిలి

ఇట్టి దుర్మదు గయిముట్టి పట్టి తెచ్చి
జనులు వెఱగంద జెఱబెట్టి యుంతుమేని
యదువులు మనల నేమి సేయంగ గలరొ
యనుచు గురు వృద్దజనముల యనుమతమున….భాగవతం….స్కం. ౧౦ ఉత్తర భా….౫౫౬

దుర్యోధనుడి కూతురు లక్షణ అనే పేరుగల కన్యను శ్రీ కృష్ణుని కొడుకైన సాంబుడు వివాహం చేసుకోడానికి తీసుకొస్తూ ఉంటే, కౌరవులు చూసి, కుఱ్ఱాడొకడు పిల్లని తీసుకుపోతున్నాడు, ఇటువంటి వాణ్ణి పట్టుకుని, పెద్దల అనుమతితో, బంధిస్తే యాదవులేమి చెయగలరో చూద్దామనుకున్నారు.”

ఇలా అనుకుని “దుర్యోధనుడు, కర్ణుడు,శల్యుడు, భూరిశ్రవ, యజ్ఞకేతులు బయలుదేరి సాంబుడిని అడ్డుకున్నారు. సాంబుడు వీరత్వంతో యుద్ధం చేసేడు అందరితో, వీణ్ణి ఇలా గెలవలేమని అందరూ కలిసి ఒక్క సారిగా దాడి చేసి లక్షణతో సహా పట్టుకున్నారు.” “ఈ సంగతి నారదుని ద్వారా యాదవులకి తెలిసింది.రాజు ఉగ్రసేనుని అనుజ్ఞతో యుద్ధాని బయలుదేరుదామన్నారు యాదవులు. అంతలో బలరాముడు అడ్డుపడి కౌరవులు మనకు బంధువులు వాళ్ళతో గొడవ వద్దు అని ఆపేడు. అప్పుడు యుద్ధం చేద్దామన్నావాళ్ళతో కూడా కలిసి కరిపురం చేరి, కోట బయట విడిసి ఉద్ధవుడిని దూతగా పంపేడు, బలరాముడే వచ్చేడని కౌరవులు బయలుదేరి వెళ్ళి అర్ఘ్య, పాద్యాలిచ్చి గౌరవించారు. ఆప్పుడు బలరాముడు దుర్యోధనుని చూసి, మా రాజు ఆజ్ఞ ప్రకారం వచ్చేం, మీరందరూ కలిసి, ఒక్కణ్ణి చేసి సాంబుడిని బంధించడం తప్పు, ఐనా సరే మా రాజు బంధుత్వం తలచి ఆ తప్పు సైరించేడని చెప్పేడు. అందుకు సుయోధనుడు,

అనుమాటలు విని కౌరవ జననాయకుడాత్మ గలగి చాలు బురే! యే
మనగలదు కాలగతి చక్కన గాలం దొడుగు పాదుకలు దలకెక్కెన్…..భాగ…దశ స్కం.ఉత్తర…౫౭౨

ఆ మాటలకి సుయోధనుడు కోపించి కాళ్ళకి తొడుక్కునే చెప్పులు తలమీదపెట్టుకున్నట్లుంది, కాలం, ఏం చెప్పను, యాదవులతో సంబంధం సఖ్యం చాలు,భీష్ముడు, ద్రోణుడు,కర్ణుని లాటి వీరులకు దొరికినవాణ్ణి, దేవేంద్రుడయినా విడిపించగలడా, వృధా మాటలెందుకు అంటూ దుర్భాషలాడుతూ దిగ్గునలేచి మందిరానికి వెళ్ళిపోయాడు.”

ఇప్పుడు బలరాముడికి కోపం వచ్చి “రాజ్యవైభవ మధాంధుల మాటలు విన్నారు కదా అని కూడా వచ్చిన వారితో అని” ఇంకా ఇలా అన్నాడు.

“శ్రీ మధాందులు సామముచేత జక్క
బడుదురే యెందు బోయడు పసుల దోలు
పగిది నుగ్ర భుజావిజృంభణ సమగ్ర
సుమహితాటోప మనిలోన జూపకున్న….భాగ…..దశ.స్కం.ఉత్తర.భా….౫౭౬

డబ్బు మదంతో కొట్టుకుంటున్నవాళ్ళకి మంచిమాటలు పనికిరావు, బోయవాడు పసువుల్ని తోలినట్లు, యుద్ధంలో బుద్ధి చెప్పాలిసిందే, అని, కృష్ణుడు, మిగిలినవారిని రావద్దని వారించి వచ్చాను,దేవ దేవుడయిన కృష్ణుని కాదంటారా” అంటూ,ఇంకా

“తామట తలపగ దలలట యేమట పాదుకలమట గణింప రాజ్య
శ్రీ ముదమున నిట్లాడిన, యీ మనుజాధముల మాటలేమనవచ్చున్….భాగ…దశ.స్కం. ఉత్తర….౫౮౧

తమరేమో తలలా మేమేమో చెప్పులమా! రాజ్యమదం తో మాట్లాడే వాళ్ళని ఏమనగలమని, భూమి మీద కౌరవులను లేకుండా చేస్తానని, చేతిలో నాగలి హస్తినాపురానికి సంధించి గంగలో కలిపేసే ప్రయత్నం చేస్తూంటే నగరం అతలాకుతలమై పోయింది.” అప్పుడు …” దానికి ప్రతీకారంబు లేమిని గలవళంబున భయాకుల మానసులయి, పుత్ర మిత్ర కళత్ర, బంధు, భృత్య, పౌరజన సమేతంబుగా భీష్మ సుయోధనాది కౌరవ్యులు, వేగంబున నతని చరణంబులు శరణంబుగా దలంచి, సాంబునిం గన్యకాయుక్తంబుగా ననేక మణిమయ భూషణాంబర జాలంబులతో దోడుకవచ్చి దండప్రణామంబులాచరించి, కరకమలంబులు మోడ్చి, యిట్లనిరి…..”..భాగ..దశ.స్కం.ఉత్తర….౫౮౪

బంధు,మిత్ర, భార్యలతో సహా అందరూ చీని చీనాంబరాలూ పట్టుకుని సాంబుని లక్షణను తీసుకువచ్చి బలరాముని కాళ్ళు పట్టుకుని రక్షించమని వేడుకుని, సాంబుని, లక్షణ సహితంగా లక్షణంగా అప్పజెప్పి శరణు వేడేరు. బలరాముడు కొడుకుని, కోడలిని తీసుకుని తమ రాజ్యం చేరుకుని, అక్కడి వారికి జరిగిన కధ చెప్పేడు”. అందుకే ఇప్పటికీ హస్తినాపురం దక్షణం వైపు కొద్ది ఎత్తుగా ఉంటుంది, బలరాముడు నాగలితో పెళ్ళగించడానికి ప్రయత్నించడం చేత.

బాజాభజంత్రీలతో పెళ్ళికి విందుభోజనానికి పిలిస్తే, కాదని, మూకుడు పట్టుకుని పెళ్ళివారింటికి పులుసుకి వెళ్ళిందని సామెత.బలరాముడు సౌమ్యంగా సాంబుని, లక్షణను వదిలిపెట్టమంటే కాదని టెక్కుపోయి, చెప్పులలాటివారని హేళనచేసిన నోటితోనే, కొద్ది సేపటిలోనే, రక్షించమని కాళ్ళు పట్టుకోవడం ఏమంటారు? దీన్ని అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకోడమే అంటారుగా, నిజంగా జరిగింది కూడా ఆదే కదా.

3 comments:

  1. అదంతే.. వేరుశెనగకాయలు, మొక్కజొన్నపొత్తు, మామిడికాయ.. ఇవంత అంతే అంతంతే.. ఆచార్య

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      అమ్మణ్ణి కనపడి ఐదు నెలలైంది.

      వేరు శనగలకి బెల్లమ్ముక్క, జొన్నపొత్తులుకి ఉప్పు నిమ్మకాయ,పుల్ల మామిడికి ఉప్పూ కారం తోడు కదా :)

      Delete
    2. ఔనౌనౌ శర్మచార్య.. నిజమే.. బిజిలే అమ్మణ్ గారు ఎలా ఉన్నారో, ఏమో..! ఏదేమైనా కులాసాగ ఉంటే మంచిదే కదా..!!

      హ్మ్.. ఆ కాంబినేషన్ కరెక్టే.. ఐతే వాటి వాటి పొజిషన్స్ కూడా మారుతాయి కదా.. వేరు శెనగ భూమి లోపల, జొన్న పొత్తులు మధ్యలో, మామిడి చెట్టుకి పైన..

      Delete