రెంటికీ చెడ్డ ఱేవడు/రేవడు/వఱడు
''రెంటికీ చెడ్డ ఱేవడు'' అన్నది జన సామాన్యంలోని మాట, కాని ''రెంటికీ చెడ్డ వఱడు'' అన్నది అసలు మాటేమోనని నా అనుమానం.
ఇదొక నానుడి. దీనికో చిన్నకత.
రేవడు/ఱేవడు అనే పదాలికి రజకుడు అని అర్ధం. రెంటికీ చెడడం ఏమనేదే మిమాంస.
రెంటికీ చెడ్డ ఱేవడు/రేవడు
ఒక రజకుడు బట్టలుతికేందుకు ఒక ఏటి దగ్గరకు పోయి, బట్టలు తడిపి గూనలో వేసి ఉడకబెట్టేడు. ఉడికిన బట్టలని తీసి ఉతకేడు, వాటిని ఆరేశాడు, ఏటి గట్టు పైన. మిగిలినబట్టలు ఉతుకుతున్నాడు. ఎండ మిటమిటలాడుతోంది. ఉన్నట్టుండి, గాలి చల్లగా వీచింది. అంటే దూరంలో వర్షం పడుతోందని సూచన కలిగింది. వర్షం పడితే కొన్ని ఏర్లు క్షణాలలో ఉధృతంగా ప్రవహిస్తాయి, అదీ రజకునికి తెలుసు. కాని అంత తొందరగా ఏరుకి నీరు వస్తుందని ఊహించక ఉపేక్ష చేసి బట్టలు ఉతుకుతూనే ఉన్నాడు. ఈ లోగా గాలి పెరిగింది,సుడిగాలయింది. ఆరేసిన బట్టలు ఎగిరిపోనారంభించాయి. వాటికోసం పరుగెట్టేడు, ఏటి గట్టు పైకి. ఈ లోగా ఏరు గలగలమంటు ఉధృతంగా వచ్చి పడిపోయింది. చూస్తుండగానే సుడిగాలి ఆరేసిన బట్టలెత్తుకుపోయింది, ఉతుకుతున్న బట్టల్ని ఏరు పట్టుకుపోయింది. పాపం! ఉత్తి చేతులతో రేవడు మిగిలిపోయాడు. అలా ఆరేసిన బట్టలకీ చెడ్డాడు, ఉతుకుతున్న బట్టలకీ చెడ్డాడు, అదేరెండిటికీ చెడడం.
రెంటికీ చెడ్డ వఱడు
మరో కత. రేవడు అంటే రజకుడు, వఱడు అంటే నక్క అని అర్ధం.వరుడు అంటే పెళ్ళి కొడుకు. కత పంచతంత్ర కథలలోదని గుర్తు.
ఒక వేటగాడు, వేట కోసం పొంచి ఉన్నది, ఒక నక్క చూచింది. వేటగాడికి వేట పడితే ఏమైనా కొద్దిగా తనకి ఆహారం దొరక్కపోతుందా! అని, నక్క దాపునే పొంచి ఉంది. వేటగాడు విల్లు ఎక్కుపెట్టుకుని ఉండగా అనుకోకుండా పులి తారసపడింది. బాణం వదలకపోతే పులి మీదబడి చంపుతుంది, తప్పక బాణం వదిలేడు, పులికి ఆయుస్థానం లో ములుకు తగిలింది. కాని పులి ముందుకు దూకి వేటగాడిని ఓ పెట్టు పెట్టి కూలిపోయింది. పులి పెట్టుకి వేటగాడూ కూలిపోయాడు, పులీ కూలిపోయింది. జరిగిన హటాత్ సంఘటనకి నక్క నివ్వెరపోయి తేరుకుని,తన అదృష్టాన్ని అభినందించుకుంది. పులి శరీరాన్ని ఒక వారం తినచ్చు,వేటగాడి శరీరాన్ని మరో వారం తినచ్చు అని లెక్కలేసుకుంది. ఎవరి నుంచి మొదలు పెట్టాలీ అనేది తేల్చుకోలేకపొయింది. వేటగాని విల్లు కనపడింది. దానికున్న నారి బలంగా కనపడింది. ఈపూటకి ఈ నారిని భోంచేస్తాననుకుని, ఎక్కుపెట్టి ఉన్న వింటి నారిని కొరికింది. నారిని కొరకడంతోనే ఎక్కుపెట్టిన విల్లు కొన విసురుగా తగిలి నక్క కూడా చనిపోయింది. లోభత్వంతో రెంటికీ చెడి నక్క ప్రాణాలే కోల్పోయింది. అదే రెంటికీ చెడ్డ వరడు కత.
రెండవ కధ జీవితానికి దగ్గరగా ఉంది.
ReplyDeleteRao S Lakkaraju గారు
Deleteనాకూ అలాగే అనిపించిందండి. ధన్యవాదాలు.