Friday, 6 December 2019

కాలంలో కన్న బిడ్డ

కాలంలో కన్న బిడ్డలేనా ఉండాలి కాలంలో గడించిన డబ్బేనా ఉండాలంటారు, ఇదొక సామెత, జీవిత సత్యం.

పెద్దవయసులో జీవితం గడవాలంటే కాలంలో కన్న బిడ్డలేనా ఉండాలి కాలంలో సంపాదించిన సొమ్మేనా ఉండాలంటారు,

ముందుగా చెప్పినది కాలంలో కన్నపిల్లలు. కాలంలో కన్నపిల్లలంటే యుక్తవయసు ఇరవై, ముఫై సంవత్సరాల మధ్య కలిగిన పిల్లలు. అదేం. వీరు ఆ కాలంలో కలిగితే స్త్రీ బిడ్డని కనడానికి,పెంచడానికి తగిన శారీరిక, మానసిక శక్తులు కలిగి ఉంటుంది. మగవాడికి ఏభై సంవత్సరాలొచ్చేటప్పటికి బిడ్డ చేతికందొస్తాడు.బిడ్డలు, తల్లి తండ్రులకి ఏమీ చేయకపోయినా తన కాళ్ళమీద తను నిలబడగలడు/దు. అతని బతుకు/ఆమె బతుకు వారు బతకగలరు. వారిని సాకాల్సిన అవసరం ఉండదు. వారే తల్లితండ్రులను చూడగలరు. ఈ కాలంలో చూస్తున్నారా అని అడగచ్చు, అందరూ చూడనివాళ్ళే ఉండరు. స్త్రీకి వయసు ముదిరిన తరవాత బిడ్డ బరువే, కనడానికి పెంచడానికి కూడా. ఇప్పటి రోజుల్లో నలభై దగ్గరగా కాని మగ ఆడ వివాహం గురించే తలపెట్టటం లేదు. మరి వీరికి బిడ్డలు పుడితే! అమ్మో ఊహించడమే కష్టం. కొంతమంది సహజీవనం చాలు,బిడ్డలక్కరలేదు అన్నవారూ కనపడుతున్నారు. వీరిలో స్త్రీల శాతం హెచ్చుగా ఉందనుకుంటా. ఇక బిడ్డలు లేనివారు, తమ్ముళ్ళో,చెల్లెళ్ళో చూడకపోతారా అనుకోవచ్చు, స్త్రీ పురుషులిద్దరూ కూడా.. పొరబాటు. ఎవరూ చూడరు, కడుపున కన్నవాళ్ళే చూడని రోజులు. ఎవరిగోలవారిదే! వీరు డబ్బున్నంతకాలమే చుట్టూ ఉంటారు. ఈ విషయంలో శంకరుల మాట గుర్తుంచుకోవాలసినదే, యావద్విత్తో పార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః, డబ్బు ఉన్నవరకు,డబ్బు సంపాదించే వరకు నిజపరివారం కూడా ఉంటుంది. 

అందుకుగాను చేయవలసినది వయసులో డబ్బు సంపాదించడం కూడా తప్పక చేయాలి, సొమ్ము కూడ బెట్టాలి, తప్పక. ఎంత? ఇది తెలుసుకోవడమే విజ్ఞత. ఒక సారి సంపాదన కూడ బెట్టడం మొదలైతే ఈ దాహం తీరేదికాదు, అవగాహన లేకపోతే. తనకు తన భార్య కు తగిన అనగా అవసరాలకు తగిన సొమ్ముండాలి. జరలో బాధించేది రుజ. ఏదో రోజు అందరూ చెల్లిపోయేవారే. చెల్లిపోవడం లో బాధ పడక లేదా తక్కువ బాధతో చెల్లిపోవడమే కావలసినది. ఎంత సొమ్మున్నా ఆయువును కొనలేదు కదా. అందు చేత కాలంలో సంపాదించిన సొమ్ము కావాలి.వయసుడిగిన తరవాత సంపాదన కష్టం.

కాలంలో కన్నబిడ్డలు కాలంలో సంపాదించిన సొమ్మూ రెండూ ఉండి జీన సమతూకం కావాలి.అనాయాసేన మరణం అదృష్టం, అది అందితే..... అలా దాటిపోయినవారే అదృష్టవంతులు



No comments:

Post a Comment