Tuesday 10 December 2019

పీతల మంగం

పీతల మంగం

అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చెరువులో చేపలు పడుతున్నాడో జాలరి. వల వేసి పట్టిన వాటిలో చేపలు,పీతలు, నత్తలు ఇలా చాలా రకాలున్నాయి. చేపల్లో కొన్ని వలలో పడి కూడా ఎగిరి ఎగిరి పడుతున్నాయి. అలా ఎగిరిపడుతున్న, చచ్చినట్టు పడున్న చేపలన్నిటినీ ఒక బుట్టలో వేసి బుట్ట మూతకి ఉన్న తాడు దగ్గరకి లాగేస్తున్నాడు, చేపలు ఎగిరెగిరి పడుతున్నాయిగాని తప్పించుకోలేకపోతున్నాయి. ఇక మిగిలిన పీతల్ని తీసి ఒక మంగం అంటే వెడల్పైన మూతిగల బుట్టలో వేస్తున్నాడు. మిగిలిన నత్తలు వగైరాలని నీటిలోకి విసిరేసేడు. వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ వల వేయడానికి వెళుతున్నాడు. 

ఇదంతా పరీక్షగా చూస్తున్న ఓ పని లేని పోలయ్య జాలరిని ఆపి, ''చేపల్ని బుట్టలో వేసి బుట్ట మూత దగ్గరకి నొక్కేసేవు, మరి పీతల్ని అలాగే మంగంలో వదిలేసేవే, అవి తప్పించుకుపోవా?'' అని అడిగాడు. దానికి జాలరి, ''ఇక్కడే ఉండి చూడు,ఏం జరుగుతుందో, కుక్కగాని రాగలదు జాగ్రత'' అని వలపుచ్చుకుని చెరువులో దిగేడు. వల విసిరి మళ్ళీ చేపల్ని పట్టేడు, గట్టుకొచ్చి చేపల్ని బుట్టలో వేసి బుట్ట మూత దగ్గరకి నొక్కేడు, పీతల్ని మంగంలో పడేసేడు. 

అప్పుడు పనిలేనిపోలయ్యని ''నేను వలపట్టుకుని చెరువులో దిగిన తరవాతేం జరిగిందో చెప్పు'' అన్నాడు. దానికి పోలయ్య ''చేపలు తప్పించుకోలేకపోయినా బుట్టలో ఎగిరెగిరి పడుతూనే ఉన్నాయి.  ఇక పీతలు మంగంలో నుంచి తప్పించుకోడానికి మంగం అంచుకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి, నాలుగు వైపులనుంచీ. ఒక పీత పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే మరో పీత దాని కాళ్ళు పట్టుకుని కిందకి లాగేస్తోంది. ఇలా ఒకరి కాళ్ళొకరు పట్టుకుని లాగేసుకుంటున్నందున పీతలన్నీ మంగంలోనే ఉండిపోయాయి. ఒక్కటీ తప్పించుకోలేదు. ఏంటీ చిత్రం'' అని ఆశ్చర్యపోయాడు.

''పోలయ్యా! ఇంత చూసిన తరవాత కూడా నీకు అర్ధం కాలేదా? ఇవి తెనుగు పీతలయ్యా'' అనేసి మంగంలో వలని చేపల బుట్టని సద్దుకుని వెళిపోయాడు. 

కత కంచికి మనం ఇంటికి. 

No comments:

Post a Comment