“ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః క్రోధనో నిత్యశంకితః
పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః”
ఇది నారాయణ పండితుని హితోపదేశం, మిత్రలాభం లోని శ్లోకం. ఒకరిని చూచి ఈర్ష్య పడేవాడు, అత్యాశాపరుడు, సంతృప్తి లేనివాడు, కోపస్వభావం కలవాడు, నిత్యశంకితుడు, ఇతరుల సంపదపై ఆధారపడి జీవించేవాడు – ఈ ఆరుగురు నిత్య దుఃఖితులని ఈ శ్లోకం చెప్తోంది.
ఇటువంటివారి గురించిన చర్చలో ఒక తల్లి బ్లాగర్లనుద్దేసించి చెప్పిన హితవచనాలు.
పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః”
ఇది నారాయణ పండితుని హితోపదేశం, మిత్రలాభం లోని శ్లోకం. ఒకరిని చూచి ఈర్ష్య పడేవాడు, అత్యాశాపరుడు, సంతృప్తి లేనివాడు, కోపస్వభావం కలవాడు, నిత్యశంకితుడు, ఇతరుల సంపదపై ఆధారపడి జీవించేవాడు – ఈ ఆరుగురు నిత్య దుఃఖితులని ఈ శ్లోకం చెప్తోంది.
ఈర్ష్యాళువు,జుగుప్సావంతుడు,క్రోధనుడు,నిత్య శంకితుడు,నిస్సంతోషి, పరభాగ్యోపజీవి అనువారరుగురు దుఃఖ భాగులు అన్నారు చిన్నయసూరి.
మానవులతో పుట్టి పెరిగేవి కామ,క్రోధ,మోహ,లోభ, మద, మాత్సర్యాలు.వీటినే అంతఃశ్శత్రువులూ అంటారు, ముద్దుగా. వీరు అందరిలోనూ ఉంటారు, నాలో లేరన్నవారిని అసలు నమ్మద్దు. వీరిలో ఏ ఒకరో ప్రకోపించడం మూలంగానే ఆ పై ఆరుగురూ తయారవుతారుట. ప్రతివారి జీవితంలోనూ వీరు తారసపడుతూనే ఉంటారు.కొంతమందిని గుర్తిస్తాం, కొంత మందిని గుర్తించి ఉపేక్షిస్తాం, అంటే చూసీ చూడనట్టు నటిస్తాం. ఇదీ ఒక గొప్ప కళ కదా!. కొంతమందిని గుర్తించలేం కూడా.
జీవితం లో అందరిని చూశానుగాని ఈ పరభాగ్యోపజీవిని చూడలే. అంటే ఉదాహరణ దొరకలేదు. పరభాగ్యోపజీవి ఎలా ఉంటాడూ తెలియలేదు.
ఇతరుల సొత్తును వారికి తెలియకుండా వారి అనుమతి లేక అనుభవించేవాడు,దొంగ. దత్తత వచ్చినవాడు పెంచుకున్నవారు ఇష్టపడి ఇచ్చిన దానిని అనుభవిస్తాడు. మరి పరభాగ్యోపజీవికి నిర్వచనం దొరకలేదు. జీవితంకదా అనుభవాలతో అన్నీ తెలిసొస్తాయి, కాలం తో.
బ్లాగులు మొదలు పెట్టిన కాలంలో ఎక్కడెక్కడ మంచి టపాలుంటే సేకరించుకుని దాచుకునేవారు కొందరు. ఆ తరవాత కాలంలో వారు మళ్ళీ ఆ టపా ముఖం చూసి ఉంటారనుకోను. వీరిది ఆశ, మంచి మంచివన్నీ వీరి దగ్గర ఉండాలని కోరిక. ఇది మొదటి తరం. కాలం గడిచింది.
ఇక రెండవ తరంలో ఎక్కడెక్కడి మంచి మంచి టపాలు తస్కరించుకుని అదే సేకరించుకుని, రాసిన వేరు వగైరా కనపడనీయక తమవిగా ప్రచురించుకునే వారు. వీరితో ఎన్ని వన్నెలో చిన్నెలో, అడిగితే కోపాలూ....లేదూ వీడి బ్లాగులో కామెంట్లు పెట్టిన వాళ్ళని శిక్షిస్తాను అనే స్థాయికి పిచ్చి లేచిన సoదర్భాలూ......ఎన్నని చెప్పేది, వీరినీ చూశా....
వీరిది అసూయ, కీర్తి కాంక్ష. వారి బ్లాగులో వారు రాసినదానిని మూచూసేవారు లేక, పలకరించేవారు లేక పడేది నరక యాతన. పాపం, ఈ కీర్తి కాంక్షను అణుచుకునేందుకు ఈ పని చేసేవారు. కాలం ఆగదుగా..
ఇక వాట్సాప్ కాలం. వాట్సాప్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ ఎవరో స్టూడెంట్ ఎవరో తెలీదు. సర్వం జగన్నాధం. బాగున్న టపాలను పట్టుకుపోయి, ముక్కలు చెక్కలూ చేసి బాగున్నవాటిని వాట్సాప్ లో పెట్టడం. ఎవరు పెట్టేరు? తెలీదు. ఇలా నా టపాలు చాలానే నాకు తిరిగొచ్చాయి. ఇలా పెట్టే వారికి కీర్తి కాంక్షగాని, కనకం కాంక్షగాని లేనిదే! బాగున్నది పది మందికి చేరాలి అంతే! వీరిది మూడో తరం.... ఈ తరమూ చెల్లిపోయేకాలం దగ్గర పడినట్టే!
ఇప్పుడు నడుస్తున్నది దృశ్య,శ్రవణ యుగం. నాలుగో యుగం,తరం. ఈ తరంవారికి కీర్తి, కనకాల కాంక్ష. బాగున్నవాటిని సేకరించడం, అనగా తస్కరించడం. దానికి ఆడియో వీడియో జతచేయడం. ఒక యు ట్యూబ్ ఛానల్లో ప్రచురించడం. ఈ ఛానల్ ని ప్రోత్సాహకుల సంఖ్య,వీక్షణాల సంఖ్యతో కనకం చేరుతుంది. వీరిది కీర్తి,కనకాల అపేక్ష. అసలు బంగారమెవరిదీ? ఎవరిదో! వీరు సేకరించుకొచ్చి దానికి కొత్త తొడుగుతొడిగి మార్కెట్ లో పెట్టి డబ్బు సంపాదించుకోవడం చేస్తున్న పని కదా! సొమ్మొకరిది సోకొకరిది! ఇతరుల సొమ్మును దర్జాగా తెచ్చేసుకుని వాడెసుకోడం. . వీరిని నిర్మొహమాటంగా పరభాగ్యోపజీవి అనచ్చు కదా!
ఇటువంటివారి గురించిన చర్చలో ఒక తల్లి బ్లాగర్లనుద్దేసించి చెప్పిన హితవచనాలు.
''ఒక్కమాట చెప్పనా...ఇటువంటి తప్పులు జరగడానికి కారణం మీ బ్లాగర్స్ ఉదాసీనతే. చిన్న చిన్న తప్పులను పట్టుకొని మీలో మీరే పొట్లాడుకుంటారు గానీ, ఇటువంటి పెద్ద పెద్ద తప్పులను పట్టించుకోరు ప్రశ్నించరు''. ''మీలో మీకు ఐక్యమత్యముండదు.మీరంతా ఉత్తమోత్తమ ఉదాసీనులు. దీనికి మీరంతా మంచితనమని పేరు పెట్టుకుంటారు మీరంతా ఇలా ఉండబట్టే అలాంటి తస్కరులు తయారౌతున్నారు.'' '' మీలో సంఘటితశక్తి రానంతవరకు అలాంటివారు ఉండనే ఉంటారు. తప్పు మీదే మీదే మీదే ...."







