కార్లు బాబోయ్ కార్లు.
ఒకప్పుడు ఊరికో కారుంటే గొప్ప. అదిన్నీ అంబాసిడరే. కారంటే అంబాసిడర్ మాత్రమే అనుకున్నరోజులూ ఉన్నాయి. ఆ తరవాత పడవంత కారు ప్లిమత్ చూడ్డం జరిగింది. ఆ తరవాత బుల్లికారున్న షోకిలా అబ్బాయి అన్నట్టు ఫియట్ చూసాను. ఎప్పుడూ కార్లు నాచుట్టూ ఉన్నాయిగాని కారెక్కిందే బహు తక్కువ. ఇప్పుడు చెప్పెదేలేదు ఇంటి చుట్టూ కార్లే. ఇంటి ముందు మూడు కార్లు ఎప్పుడూ నిలబడి ఉంటాయి. బయటికి లోపలికి తిరిగేందుకు జాగా ఉండదు ఒక్కో సారి.ఇంటి ముందు, ఒక కార్ పార్క్ స్థలం ఖాళీ చేయించుకోడానికి కష్టపడ్డాము.
మాది పెద్దపల్లెటూరనే చెప్పాలి.మా చుట్టూ 20 దాకా గేటెడ్ కమ్యూనిటీ లు ఉన్నాయి. అంటే తక్కువలో తక్కువ 400 కార్లు లెక్క. ఇక బయటవాటితో లెక్కేస్తే 500 ఉండచ్చు,మా ఏరియాలోనే . ఊరు మొత్తం మీద 100 పైన గేటెడ్ కమ్యూనిటీ లున్నాయి. ఎన్ని కార్లున్నట్టు? ఏ గేటెడ్లో కూడా కార్ పార్క్లు ఖాళీగా ఉండవు.ఒంటరి ఇళ్ళలో కార్లు లెక్కేయ లేదు. ఊళ్ళో అద్దెకు కార్ పార్కులు వెలిసాయి. నెలకు 3000 అద్దె ఒక కార్ పార్క్ కి. మల్టీ స్టోరీ కార్ పార్క్ లు తొందరలోనే వచ్చే సావకాశం ఉందనుకుంటున్నాను. ఒక్కొక ఇంట్లో మనుషులకంటే కార్ల సంఖ్య ఎక్కువున్నటే ఉంది. ఒకాయన పక్క కాళీ స్థలంలో కార్ పార్క్ కట్టరాదా అని అడిగితే వేసిన లెక్కిది.
1. 50 లక్షల విలువైన 400చ.గ స్థలంలో మరో 50 లక్షలు ఖర్చుచేసి ఇల్లు కట్టి అద్దెకిస్తే నెలకు వచ్చే అద్దె 10వేలు మించదు.
2. 50 లక్షల విలువైన 400 చ.గ ల స్థలంలో ఒక కార్ పార్క్ కడితే అయే కర్చు 3నుంచి 4 లక్షలు. ఒక తాళం వేసే కార్ పార్క్ లో 8 కార్లు నిలపచ్చు.కరంటు ఖర్చు నెలకు 500.పంచాయతి పన్ను సం.కి 5 వేలు మించదు.
3. పై స్థలంలో,రెండంగుళాల బోర్ కొట్టి, (300 అడుగుల్లోగాని నీరు దొరకదు,నాలుగు లక్షలవుతుంది). కార్ వాష్ షెడ్ కు,ఉన్న చెట్లు వగైరా కదల్చకుండా ఉంచి, సంవత్సరానికి 12వేలు అద్దె ఇస్తూ, నాలుగేళ్ళ తరవాత బోర్,సబ్మెరిస్బుల్ మోటార్లను పనిచేసే స్థితిలో వదిలేసి వెళ్ళడానికి అద్దెకివ్వడం. 3ఫేస్ కరంటు ఇవ్వాలి,బిల్లులు కట్టుకుంటాడు. పై షరతులతో అద్దెకివ్వడం.
ఏది తెలివైన పెట్టుబడి?