Wednesday, 8 January 2025

HMPV

 

HMPV

మార్గశిరమాసం చలి మంటల్లో పడినా తగ్గదు.
పుష్యమాసం చలి పులిలా మీదబడుతుంది. ఇవి పాతకాలపు సామెతలు.

మార్గశిరం లోనే చలి,దగ్గు,రొంప,పులకరంతో ఆరోగ్యం చెడింది. ఏమీ చేయడానికి తోచదు,గదిలోంచి బయటకి కాలు పెట్టేందుకు లేదు. సూర్యుడు మబ్బులోంచి,మంచుతెరలోంచి కనపడింది లేదు.  ఇలా న డుస్తున్నాయి రోజులు, భారంగా. ముక్కులనుంచి శ్వాస ఆడితే పండగలా ఉంది. చలి పెరిగిందయ్యా! అంటే కాదు మీ ఓపిక తగ్గిందన్నాడో మిత్రుడు.

 ఇలా కాలం నడుస్తుండగా మొన్ననో రోజు పొగ రై కమ్మేసింది. ఊపిరాడదు,దగ్గు సతమతమయ్యాను. ఏంటని విచారిస్తే పొగ వాసన వల్లనితేలింది, టైర్లు చలిమంట వేసుకుంటున్నారని. ఆయ్యో!  అవి వద్దయ్యా అని చెబితే! అనిపించింది. చలిమంటేసుకోవడం మా హక్కు నువ్వేవడివి వద్దనడానికంటే ! సమాధానం లేదు గదా! చలిమంటేసుకోవద్దనటం లేదు, టైర్లు కాలిస్తే వచ్చే పొగ పీలిస్తే ప్రమాదమంటే! చలికి ఛస్తుంటే, ఆరోగ్యం మాట తరవాత,ముందు చలి అని వాదిస్తే చేయగలది లేదు గనక నోరు మూసుకుని ఉండి గౌరవం కాపాడుకోడం మచిదని చెప్పలేదు. మూడు గంటలు కిందా మీదాబడి బతికేను. సామాన్యుడు చెప్పబోతే ఇలా ఉంటది. అదే పెద్దోళ్ళకి కాలిందని తెలిస్తే చాలు  చలి,లేదు పులిలేదు,పుంజాలు తెంపుకుని పరిగెడతారు. లోకమింతే బాబూ! 


చైనాలో ఏదో రోగంతో ఆసుపత్రులు కాళీ లేవుట,శ్మశానాలూ కాళీ లేవని సోషల్ మీడియా కోడై కూస్తోందిట. చైనాలో ఉన్నది HMPV  అని ఇది సామాన్యమేనని అంటున్నారు కొందరు, ఐతే చైనా ఏమిటో చెప్పకపోవడంతో భారత్ ఐక్యరాజ్య సమితికి ఒక ఉత్తరం రాసింది,చైనాలో జరుగుతున్నదేంటో చెబితే మా దగ్గర కావలసిన జాగ్రత్తలు తీసుకుంటామని. దీని లచ్చనాలు చూస్తే కోవిడ్ లాగానే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నది HMPV  యా లేక HMPV రూపాంతరం చెందిన వైరస్సా! ఏమైతేనేం గాక ఆసుపత్రులకి డాక్టర్లకి పండగొచ్చింది,మళ్ళీ. మాస్కులు మళ్ళీ బయటికొచ్చాయి. ప్రతి ఐదేళ్ళకి ఒక సారి ఇలా డిసెంబరు 25 నుంచి జనవరి 25 దాకా రోగాల పండగ చేసుకుంటే బాగుంటుందేమో. ఈ పండగని ఐక్యరాజ్య సమితి  ప్రకటిస్తే బాగుంటుంది.   

మేరా భారత్ మహాన్,అప్పుడే దీనిమీద రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏది నిజం,తెలియదు. వస్తే అనుభవించడమే. దీని లక్ష్యం ప్రస్థుతానికి చిన్న పిల్లలు,వయసు మీదబడ్డవాళ్ళు.