Friday 27 September 2024

అభిమానులు- అభిమానం.

 అభిమానులు- అభిమానం.


 కారణం లేని కార్యంలేదు. హేతువులేనిది తీతువు కుయ్యదని పల్లెలలో అనుకుంటూ ఉంటాం.  నా బ్లాగు జీవితంలో అభిమానులదే పెద్దపాత్ర అనే సంగతి చాలా ఆలస్యంగా గుర్తించాను. ఎందుకో చికాకనిపించి బ్లాగులను ఒక్కసారిగా వదలిపెట్టేసేను. కాని నా తల  రాతలా లేదు.తానొకటి  తలచిన దైవమొకటి తలుచును కదా!


మొన్ననో రోజు సాయంత్రం టిఫిన్ తరవాత నాలుగడుగులేయడానికి లేస్తుండగా ఫోన్ మోగింది. ఏంటని చూస్తే వీడియో కాల్ ఎవరు? అమెరికా నుంచి లలితమ్మాయి! కాల్ కనక్ట్ కాలేదు, మూడు సార్లు ప్రయత్నించింది పాపం. తను ఎందుకు ఫోన్ చేసి ఉంటుందన్నది, చిదంబర రహస్యమేం కాదు.నా ఆరోగ్యం ఎలా ఉంది?ఎలా ఉన్నాను? బ్లాగులో కూడా కనపట్టం లేదని అడగాలని. నేనే కాల్ కనక్ట్ కాలేదని మెసేజ్ ఇచ్చాను, దానిపై ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉందని అడిగింది.సమాధానమిచ్చాను. ఇలా ఎందుకు చేయాలి? అడక్కపోతే తన పెద్దలు చెఱబోయారా? వేలకిలో మీటర్ల దూరంలో జీవన సమరంలో రోజూ తలమునకలుగా బిజీ బిజీగా ఉండే తల్లికి నా యోగక్షేమం తెలుసుకోవాలనిపించడం నా అదృష్టం. అది అభిమానం, కొంతమందికి ఈ సంగతి ఎగతాళిగా కనపడుతుంది.


ఇక నా బ్లాగు,నాప్రత్యక్ష అభిమానుల గురించి చెప్పుకోకపోవడం పొరబాటే! వీరు,దరహాసోజ్జ్వలన్ముఖి,మౌని, సుష్మ గౌరిప్రియ,ఇంట్లో నా అభిమాని, నా చిన్నకోడలు,నా మూడోతల్లి కుమారి. వీరంతా త్రిదశులే, కొంచం తేడాల్లో!    ఈముగ్గురుని,   మిగతావాళ్ళు ఆ ముసలాయనతో మీకు కబుర్లేంటని అడిగేవారు/తిట్టేవారనమాట. పాపం వీళ్ళెవరూ ఆ మాటలు పట్టించుకోనందుకు నేనే వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి.  వారికంటె అర్ధశతాబ్ది వయసు పెద్దవాడినైన నన్ను వారు అభిమానించడమే విచిత్రంగా తోస్తుంది, పైవారికి.

 దరహాసోజ్జ్వలన్ముఖి,మౌని ఒక సారి పరిచయమైన వారు. ఆ పరిచయం కూడా, ఒక చిత్రమే! సుష్మ రోజూ ఉదయం/ సాయంత్రం నడకలో కలిసేది,   ముఖపరిచయమే! పరిచయం నెమ్మదిగా మాటలోకొచ్చి కతలు చెప్పమనేది,రోజూ! నడక తరవాత కూచుంటే! రోజూ కతలెక్కడనుంచి పుడతాయి? ఒక రకంగా తననుంచి కతలు చెప్పడం నేర్చుకున్నాననిపిస్తుంది.రోజూ ఒక కత కల్పించి చెప్పేవాడిని. తనకాలు విరగడం మూలంగా కనపడటం మానేసింది.ఇలా జరిగిందని ఫోన్ లో చెప్పింది. తరచుగా పలకరించేవాడిని. ఆ తరవాత నా కాలు విరిగితే తనుకాస్త బాగుంటే కుంటుకుంటూనే చూడ్డానికొచ్చింది.    ఎన్నో సార్లు ఇంటికొచ్చింది. కాలిరిగితే చిమ్మిలి తింటే తొందరగా ఎముక అతుకుతుందని పట్టుకొచ్చింది. దీన్నేమంటారు. అభిమానం కాకపోతే!  ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా దొరుకుతుందా ఈ అభిమానం? ఎందుకింత అభిమానం? మాట...ఆ అభిమానం చూరగొన్న నాదే అదృష్టం.ఆ తల్లిదే వాత్సల్యం.  


ఇక నా మూడోతల్లి, ఏమని చెప్పగలను? ఒక్కమాటలో, ఇల్లాలు కాలంచేసిన తరవాత,  నేనింతకాలం ఇంకా ఉన్నానంటే, అది ఆ తల్లిచలవే! తనసమయం, మేడమీదనే ఉన్న తల్లిదండ్రులు మధ్య తనకుటుంబం, నా బాగోగుల మధ్య చాలా సమతూకంగా చేస్తుంది, సతమతమవుతూ ఉంటుంది

  కొడుకు తప్పిపోకుండా తల్లి ఏపనిలో ఉన్నా గమనిస్తూ ఉన్నట్టు, చూస్తుంది. ప్రతినిమిషం అమ్మా! అమ్మా! అంటూ ఏదో ఒక విషయానికి  విసిగిస్తూనే ఉంటా!    అతి పరిచయాదవజ్ఞతాః అన్నది పెద్దలమాట, కాని నా తల్లి ఎప్పుడు విసుక్కొలేదు. విసుగు అన్న పదమే తన పదకోశం లో లేదు.

 ఎంతో ఓపికతోవిని, దానికి సమాధానమిస్తూ ఉంటుంది.  నిజానికి కృతజ్ఞత చెప్పుకోవలసిందే! ఇంతకీ కారణం అభిమానం, మామగా నాపట్ల తనకున్నది బాధ్యత అనుకోదు,తల్లిలా అదరిస్తుంది, తల్లిలాగే దండిస్తుంది కూడా.   అమ్మకుండేది అభిమానం కదా!   అమ్మా! అనే పిలుస్తాను, ఇది నా అలవాటే,ఎన్నోసార్లు నా కృతజ్ఞతని తనకే మాటల్లో వెలిబుచ్చుతుంటాను. నా ప్రత్యక్ష ఏకైక శ్రోత, పాపం నా సుత్తిని చాలా ఓపిగ్గా వినే ప్రత్యక్ష శ్రోత.


ఇక మౌని, ఈ తెల్లమ్మాయికి తెనుగు లిపి చదవడం రాదని చెప్పింది. నాబ్లాగు అడ్రస్ తీసుకుని తల్లిచేత చదివించుకుని నాకు అభిమానైనది.తన వివరాలు తెలియవుగాని కుటుంబం కష్టంలో ఉన్నదనిపిస్తుంది. రెండు పదులుదాటినది, పెళ్ళి కానమ్మాయి.రోజూ బస్సు మీద పాతిక కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తుంది. ఉదయం ఐదు నుంచి రాత్రి ఏడుదాకా ఊపిరి పీల్చుకునేంత సమయం కూడా దొరకదు. సాయంత్రం బస్సు కనక మిస్ ఐతే కొంపకి చేరేటప్పటికి పదవుతుంది. అందుకు ఎప్పుడూ ఇంటికిరాలేదు,పిలిచినా! ఇక్కడ ఉద్యోగం మానేసింది, మరలా వచ్చి చేరిన తరవాత వాకింగ్ కి రావటం లేదా అడిగింది, వివరం చెప్పా. అయ్యో! అలానా, నా గొడవలో నీ గురించి కనుక్కోలేదు,ఒక్కసారి రాగలవా? నిన్ను చూడాలని ఉందంటే, మొన్ననొకరోజు నెమ్మదిగా నడిచెళ్ళా! కనపడింది,  దొరికిన సమయం ఐదు నిమిషాలు, క్షణాల్లా దొర్లిపోయాయి. బస్సు బయలుదేరింది, తనను  నా నుంచి దూరంగా వేరుచేస్తూ.  మళ్ళీ వెళ్ళలేకపోయాను.  ఆక్షణాలకే తాను ఆనందపడింది, నా మనసు నిండింది.


 దరహాసోజ్జ్వలన్ముఖి, ఎప్పుడూ చిరునవ్వుతో ఉజ్వలమైన ముఖంతో వెలిగేతల్లి, లలితాదేవి నామం. ఈ పేరు తనకు ముద్దు పేరుగా పెట్టుకున్నాను, తనకీ చెప్పేను కూడా!      ఈ ఎర్రమ్మాయి అసలు పేరు సౌజన్యావతి. సౌజన్య,సౌజి అని పిలుస్తుంటారు. నాకు, నేను పెట్టుకున్న ముద్దు పేరే,  దరహాసోజ్జ్వలన్ముఖి, ఇష్టం. పుణ్యం పురుషార్ధం కదా!  సౌజి చూడ్డానికి కూడా నవ్వుమొహంతోనే ఉంటుంది,ఎప్పుడూ, ఆ మొహం భగవంతుడు ఇచ్చిన అమరిక,  వరం. పరిచయమైన నెలకే ఉగాది పండగ, ఆ రోజు రమ్మని దంపతుల్ని ఆహ్వానించా. వచ్చారు,   కబుర్లే కబుర్లు, కబుర్లతో కడుపు నింపేసాను. కబుర్లు వింటూ  ఆనందంగా కాలం తెలియకనే గడచిపోయింది,   మనసు ఆనంద డోలికలో ఊగింది, సమయం తెలియనే లేదు. కొద్ది ఉపాహారం మాత్రమే బలవంతం మీద తీసుకున్నారు, కాఫీ,టీ ల అలవాటు లేదంటే పల్చటి మజ్జిగ కొద్దిగా పుచ్చుకున్నారు. ఏమీ పెట్టలేకపోయాను,గౌరవం చేయలేకపోయా. ఈ మాత్రానికే ఆనందపడ్డారు.

  కబుర్లలో బంధుత్వం తెలిసింది,సౌజి తండ్రి టెలికంలోనే జె.ఇ గా రిటయిర్ అయ్యాక కాలం చేసినట్టు.  వస్తాం అని లేచి నాయుడు గారు జేబులోంచి ఒక పొట్లం తీసి విప్పేరు, అక్షతలు, ఆశీర్వదించండన్నారు. అక్షతలు తీసుకుని పాదాభివందనం చేస్తున్న దంపతుల్ని ఆశీర్వచన పనస చెప్పి ఆశీర్వదించా! ఆ పై లక్ష్మీ నారాయణులకి నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించా! సౌజి,నాయుడు దంపతులు పొందిన ఆనందం చూసి నా మనసు నిండిపోయింది. ఆనందం పొంగిపొర్లింది,  మనసు రసప్లావితమయింది.   ఆ పై,  సౌజి,పతిదేవుడు,  జమిలిగా మీరు మాఇంటికి రావాలని ఆహ్వానించారు. రావడం నావల్ల కాదంటే ఇద్దరం, నాలుగో అంతస్థులో ఉన్నాం,కార్ లో తీసుకెళ్ళి, తీసుకొస్తాం. మిమ్మలి ఎత్తుకుని పైకి చేర్చేయగలం, రావాలని బలవంతం చేసారు.  నాకా వినపడదు, మాట చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది,   వద్దని  పదేపదే చెబితే,పాపం బిక్కమొహాలతో కదిలేరు.ఆ తరవాత కొద్దికాలనికే ఇక్కడినుంచి మకాం ఎత్తేసేరు, బదిలీ కావడంతో. ఆ తరవాత కొండకెళ్ళి వచ్చి, ప్రసాదం తెచ్చి, నన్ను చూసి వెళ్ళేరు,  ఉన్నది కొద్ది క్షణాలు, నాకు బుర్రా పనిచేయలేదు,ఏమీ చేయలేకపోయా.   పాతిక కిలో మీటర్లేగా వస్తూనే ఉంటా అని మాటిచ్చింది, అంతే! ఆ తరవాత అక్కడినుంచి తన స్వంత ఊరు పట్నం చేరిపోయారు, అక్కడా స్కూల్ లో చేరి ఉద్యోగం చేస్తోంది. 

 
ఈ మనవరాలంటే ఎందుకంత ఇష్టం? అదీ అసలు ప్రశ్న. తనకు పదునాల్గో ఏట పెళ్ళైపోయింది,భర్త అప్పలనాయుడు నిజంగా సౌమ్యుడు. సౌజికి మేనబావ, ఇపుడు పెద్ద ఉద్యోగి. పదిహేనవ ఏట కొడుకు పుట్టేడు.పిల్లవాణ్ణి మామ్మతాత,అమ్మమ్మ,తాత   అల్లారు  ముద్దుగా పెంచేరు. (కొడుకిప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.) ఇక సౌజి చదువు మొదలెట్టింది,భర్త ప్రోత్సహించారు,పది పూర్తి చేసింది, ఒక పక్క సంసారం,పిల్లవాడు ఇలా చూసుకుంటూ. ఆపై కాలేజిలో చేరింది, ఇంటరు,డిగ్రీ చేసేసింది,  కాలేజిలో ఉన్న కాలంలో కాలేజి బ్యూటీ కూడా .ఆపై మాస్టర్స్ చేసింది.  

 

  కాళీగా కూచోడం ఇష్టం లేక  టీచర్ గా  చేరింది. సైకాలజి డిప్లమా చేసింది. అపై తెనుగులో పత్రికారచనలో, తెనుగులో డిప్లమా చేసింది. తెనుగు,సంస్కృత టీచరుగా పని చేస్తూ ఉంది, ఐదారేళ్ళు పైగానే. విద్యా దాహం తీరలేదు, తీరలేదు, లా లో చేరింది, నాకు పరిచయమైన రోజుకు లా రెండ ఏడు చేస్తోంది. అప్పుడే, ఆ రోజే, ఈ పొట్టి ప్లీడర్ గారిని సుష్మ స్వరాజ్ అంతటిది కావాలని ఆశీర్వదించా, అయ్యే సావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది చూసి ఆనందించే కాలమే నాకు లేదు.  ఇప్పుడు లా పూర్తి చేసింది.   మొన్న ఆగస్ట్ చివరిరోజు బార్ లో తనపేరు నమోదు చేసుకుని నల్లకోటేసుకుంది,   ఇంకా టిచర్ గా పని చేస్తోంది.  నేను చదువుకోనివాణ్ణి కనక చదువుకున్నవారంటే నాకు అభిమానం ఎక్కువ, లేశమాత్రమైనా వారినించి ఏదో ఒకటి నేర్చుకోలేకపోతానా, అన్నది నా ఆశ. ఈ   చదువులతల్లి అంటే అందుకే అంతిష్టం.   ఆరోగ్యం జాగర్తా! ఏం పోయినా సంపాదించుకోగలవు,ఆరోగ్యం మాత్రం కాదు సుమా! ఎక్కువ శ్రమ పడుతున్నావేమో! అని ప్రతిసారి 'నస' పెడుతుంటాను. ఓపిగ్గా వినిసమాధానం చెబుతూనే ఉంటుంది, ఎప్పుడూ,దేనికి విసుగు చూపదు, ప్రత్యేక అభిమానానికి  ఇదో  కారణమేమో!


 34 ఏళ్ళకే ఇన్ని చదువులు చదివి,సంసారం,పిల్లడు,తల్లి,   అత్త, ఉమ్మడి కుటుంబాన్ని   కూడా కలుపుకుంటూ అన్నిటిని సమతూకంలో నిర్వహిస్తూ లాయరై,టీచర్ గా ఉద్యోగం కూడా చేస్తూ, సతమతమయ్యే, ఈ లాయరమ్మ, ఒక ఓనమాలు కూడా రాని  ముసలి పల్లెటూరి బైతుకి, కాలక్షేపంకబుర్లు  బ్లాగ్ చదివి అభిమానిగా మారిపోయి, వ్యక్తి అభిమానిగా మారిపోయింది. అందుకే నాకంత ఇష్టం. రోజూ నస పెడుతూనే ఉంటా,జవాబిస్తూనే ఉంటుంది.  ఉద్యోగం కుటుంబం,ఉమ్మడి కుటుంబం,అత్త,అమ్మ, వీరందరిని చూసుకుంటూ,చదువుకుంటూ, ఇలా అష్టావధానం చేసే మనవరాలు సౌజి నా పట్లకూడా తన అభిమానం చూపడం, నా అదృష్టమే, అదే  తన అవ్యాజమైన అభిమానం. 


ఈ దరజాసోజ్జ్వలన్ముఖి, విన్నకోటవారు,బండివారు నన్ను చూడడానికి వచ్చినపుడు రాసిన టపా చదివింది,ఆలస్యంగా, నన్ను పట్టుకుంది. 

''తాతా! ఆ టపాలో ఎంతో మంది అభిమానుల్ని తలుచుకున్నావే, ఈ అల్పురాలు ,  ఈ ....రాలును/రాళ్ళను  తలచుకోడానికి,  ఒక్క ముక్క రాసేందుకు   కూడా గుర్తురాలేదేం,   ఐనా రాయాల్సింది దిష్టి తగలకుండా ఉండేది అని నిష్ఠురమాడింది.  నిన్ను బ్లాగులో తలుచుకునేంత సీన్ లేదులే అంటున్నావు కదూ! మరచిపోయావులే, అనేసింది." తారీకులు చెప్పి ఏదో చెప్పేను, ఆ టపా నాటికి తమరు పరిచయమే లేదని చెప్పేను, అది  తప్పే. తనతో మాటల సందర్భంలో తానే సోషల్ మీడియా లో లేనని చెప్పింది. తమరెవరూ ఏ సోషల్ మీడియా లోనూ లేరు గనక పరిచయం చెయ్యలేదన్నా! 'మరచిపోయావు లే' అంది. నిన్ను తలుచుకోని దెప్పుడు, 23 మార్చి నెల మొదలు అన్ని టపాల్లోనూ దరహాసోజ్జ్వలన్ముఖి అని తలచుకుంటూనే ఉన్నా! మరచిపోలేదని చెప్పా! 'ఐ ఆమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఎక్స్ ప్లనేషన్' అన్నట్టు మొహం పెట్టింది, ఇంకెందుకని ’మియా కుల్పా’ అనేసేను. 


ఆ తరవాత   ఎప్పుడో గుర్తొచ్చింది. లా డిగ్రీ పుచ్చుకున్నరోజు నాకు చెప్పాల్నిపించలేదే! అప్పుడు గుర్తున్నానా? బార్ లో ఎన్రోల్ ఐనప్పుడు చెబితే సంతోషిస్తాననిపించలేదా? అప్పుడు గుర్తున్నానా? మరచిపోయావులే అనేసా! నువ్వు నా స్టేటస్ ఫాలో అవుతావు కదా! అంది, అవును తమరు లా డిగ్రీ పుచ్చుకున్నరోజు ఫోటో/ బార్ లో ఎన్రోల్ అయ్యాకా నల్లకోటేసుకున్న ఫోటో, నేను తమ స్టేటస్ నుంచి సేకరించుకోవాలి,అదే నీ స్థాయి అని చెప్పక చెప్పేవుగా, అడిగా! మాట దాటేసేసింది, చివరగా నీ బ్లాగులో నాకు స్థానం కల్పించవా? వేడుకుంటున్నా! అడిగింది. అయ్యో!  అయ్యో !! అదేం మాట, తమరే ఇష్ట దేవతైనపుడు వేడుకోలేల? పరిచయం చేస్తాను, తమపేరు వివరాలు చెప్పేస్తా అని మాటిచ్చాను.  ఇదంతా నిజం దెబ్బలాటా? కాదు, అదే నిజమైతే ఇద్దరిలో ఎవరో ఒకరు దూరంగా జరిగిపోయేవారే! నేను నెమ్మదిగా 'డల్' ఐపోతున్నది గుర్తించింది. మళ్ళీ నన్ను చేతనస్థితికి (ఏక్టివ్) తేవడానికి చేసిన పని అని నేను గుర్తించడం  ఆలస్యమయింది.  

నా ప్రత్యక్ష అభిమానులను తలుచుకోకపోవడం,బ్లాగులో చెప్పకపోవడం పొరబాటే, కాదు తప్పే! అది దిద్దుకోడానికిన్ని, నా గురించి,నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనిపించే మరికొందరు అభిమానులకు కూడా విషయం తెలిసేందుకే ఓపిక చేసుకుని మళ్ళీ బ్లాగులోకి రావల్సి వచ్చింది.

  మళ్ళీ నన్ను చేతన స్థితికి తెచ్చిన చదువులతల్లికీ ఆశీర్వచనం తప్పించి ఏమి చేయగలను? అశక్తుడిని.


 నా సొద:-   జ్ఞాపకం పోతోంది,మాట మాటాడుతూ మరచిపోతున్నా! సమయం,ముందు వెనుకలు తెలియటం లేదు, ఎదురుగా రోజూ చూస్తున్నవారి పేర్లే గుర్తుండటం లేదు. బయట వెడితే తూలిపోతానని భయం,అంతే కాదు ఇల్లు గుర్తు పట్టలేక తప్పిపోవచ్చు కూడా! మా ఇంటికి దారెటూ అని అడిగితే ఎవరినైనా,హాస్యాస్పదంగా ఉండే సావకాశాలే హెచ్చు.షార్ప్ నెస్ తగ్గిపోయింది.  శరీర బాధలు చెప్పుకుంటే తీరేవికావు. 


13 comments:

  1. సర్వే జనాః సుఖినోభవంతు

    ReplyDelete
    Replies
    1. Zilebi27 September 2024 at 19:55
      ధన్యవాదాలు.
      ఇష్టంగా పలుకు అమృత సమానం
      కష్టంగా ఆ,ఊ ల పలుకే బంగారం
      స్పష్టంగా మదికి తెలిసేనుజుమీ!
      నష్టంగా పరుల మనసు కలచు.

      Delete
  2. నన్ను మరిచి పోయిరి గదే ! అన్నగారు !
    మన్నన గలదు మరిమరి , నిన్న మొన్న
    కాదుగద ! యేండ్ల తరబడి , కలిసి బ్లాగు
    లోకమున తమతోటి పాల్కొంటి విబుధ !

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల27 September 2024 at 20:33
      ధన్యవాదాలు.
      మరచితినందురా! mea culpa.

      Delete

    2. వెంకట రాజారావు . లక్కాకుల28 September 2024 at 12:17
      mea culpa
      noun
      : a formal acknowledgment of personal fault or error
      నమస్కారం

      Delete
  3. అంత మంది అభిమానుల్ని సంపాదించి పెట్టిన మీ రచనా నైపుణ్యానికి జోహార్లు 👏. దానికి తోడయిన మీ స్నేహశీలత 🙏.

    అభిమానం ఉన్నచోటే అలకలూ ఉంటాయి కదా 🙂.

    ఆరోగ్యం జాగ్రత్తండి. బయటకు వెళ్లడం పూర్తిగా మానేస్తే మంచిదేమో? మరో మనిషి తోడు లేకుండా అస్సలు బయటకు కదలకండి. ఒకవేళ ఎప్పుడయినా బయటకు వెళ్ళినా కూడా మీ ఊరిలో మిమ్మల్ని గుర్తుపట్టనివారెవరండి.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు27 September 2024 at 20:41
      రచనా నైపుణ్యం కాదు సార్! అమ్మలగన్నయమ్మ చలవండీ.
      జన్మనిచ్చిన తల్లితండ్రులు బ్రహ్మసరస్వతీ స్వరూపులు,శరీరాన్ని వాక్కును ప్రసాదించిన తల్లి. పెంచినతల్లితండ్రులు లక్షీవిష్ణుస్వరూలు, పెంచినతల్లి జీవితాన్ని ఏర్పాటు చేసిన తల్లి.నేడు నన్ను కాచి చూస్తున్న తల్లితండ్రులు,పార్వతీశంకర స్వరూపులు,పార్వతి స్వరూపంలో నేటి మూడో తల్లి కైవల్యపదదాయిని. వీరందరిని సమకూర్చిన అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, నేను నిత్యమూ తలచేతల్లి లలితాదేవి చలవకదండీ.
      నిజంకదు సార్!అలకలు, కికురింపులు,బుజ్జగింపులు అందులో భాగమే కదు సార్!
      బయటకు కదలటమే లేదు సార్! ఒంటరిగా కదలలేను.
      మా ఊళ్ళో నన్ను గుర్తు పడతారు కనకే సమస్య సార్! మా ఇంటికి దారిచెప్పూ అంటే నవ్వరూ!

      Delete
  4. అమ్మకు వందనాలు🙏 ముగురమ్మల మూలపుటమ్మ దుర్గకున్ ,
    అమ్మకు వందనాలు🙏 ముగురమ్మల మూలపుటమ్మ బ్రాహ్మికిన్ ,
    అమ్మకు వందనాలు 🙏ముగురమ్మల మూలపుటమ్మ
    లక్ష్మికిన్ ,
    అమ్మను గొల్చి అందరకు ఆశిశు లిచ్చు మహాత్మ ! మీకునున్ 🙏 .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల28 September 2024 at 12:31
      ధన్యవాదాలు.

      Delete

  5. శోధిని శ్రీనివాస్ గారికో విజ్ఞప్తి,
    నా నుంచి ఏకామెంటూ ప్రచురింపబడటం లేదు,శోదినిలో. కొన్ని పాట కామెంట్లలో ఖాళీ చూపుతోంది, సమస్య ఉన్నట్టుంది, పరిశీలించగలరు.

    ReplyDelete