Sunday, 31 March 2024

రుద్ర పంచముఖధ్యానం- పూర్వ ముఖం.


రుద్ర పంచముఖధ్యానం- పూర్వ ముఖం.


ఓం నం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్ర ప్రచోదయాత్.


సంవర్తాగ్నితటిత్ప్రదీప్తకనకప్రస్పర్ధి తేజోమయం

గమ్భీరధ్వని సామవేదజనకం తామ్రాధరం సుందరం.


అర్ధేన్దుద్యుతిలోలపిజ్ఞ్గళ జటాధర ప్రబద్ధోరగం

వన్దే సిద్ధసురాసురేన్ద్రనమితం పూర్వం ముఖం శూలినః


ఓం నమో భగవతే రుద్రాయ,

 నం ఓం పూర్వముఖాయ నమః


(శ్రీ మార్తి వేంకట్రామ శర్మ గారి యాజుషస్మార్తగ్రన్థః నుండి)

-----------------------------------------------------

తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పడే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితమగుతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి  తూర్పున ఉన్న ముఖమున 

కు నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)

Courtesy:https://www.teluguone.com/devotional/amp/content/dhyana-slokas-943-24685.html

-----------------------------------------------------------

నామాట: తూర్పు ముఖ శూలికి రజోగుణప్రధానంగా చెబుతారు, అంతేకాదు, ఈ ముఖంశివుని దర్శిస్తే, పదే,పదే మాయలో పడేస్తూ ఉంటడంటారు. మనకి తూర్పు ముఖంగా ఉన్న శివాలయాలే హెచ్చు.

-----------------------------


నాసొద: నందుగారి ద్వారా ఇది శివాజ్ఞగా భావించడం జరిగింది. తప్పులు లేకుండా టైప్ చేయాలని కోరిక. అందుకు కొంచం సమయం తీసుకుంటుంది. ఎక్కువసేపు కూచోలేని ఇబ్బంది, అందుకుగాను ఒక్కో ముఖాని గురించి ఒకసారే చెబుతున్నాను, అసౌకర్యానికి మన్నించాలి.

Friday, 29 March 2024

నే నమ్మను.

నే నమ్మను. 






నే నమ్మను.

అవే అక్షరాలు! ఎన్ని అర్ధాలు?

Wednesday, 20 March 2024

అప్ప ఆర్భాటమేగాని.....

 అప్ప ఆర్భాటమేగాని బావ బతికేదిలేదు.


నన్ను ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చుకున్నామని చెప్పేడు మా సుబ్బరాజు.

 నేనెందుకయ్యా? అంటే 

మీరు నాన్ స్ట్రైకింగ్ ప్లేయర్ లెండి అనేసేడు. 

ఎలా వున్నారు అడిగేరు, మా సత్తిబాబు, సుబ్బరాజు జమిలిగా! 

బండి కుంటుతో నడుస్తోందంటే, ఆగేదాకా నడిపించాలి,అదేగదా మనం చెయ్యగలదనేసేడు సత్తిబాబు.

ఎప్పుడు ఓపెన్ చేసేరంటే నిన్న దశమి మంగళవారం మంచిదని అన్నాడు, సుబ్బరాజు.

దశమి మంగళవారం దగ్ధయోగమయ్యా! అంటే

 మనకి దగ్ధయోగమేంటి లెద్దురూ, అన్నాడు సత్తిబాబు.


అది సరేగాని తెనుగు రాజకీయాలగురించి చెప్పూ అడిగాడు సుబ్బరాజు.

అప్ప ఆర్భాటమేగాని బావ బతికేది లేదన్న నానుడిగా ఉంది తెనుగు రాజకీయం అన్నాడు సత్తిబాబు.

అదేంటో వివరంగా చెప్పరాదా అడిగాడు సుబ్బరాజు.

అర్ధం చేసుకోరూ! అంటూ వెళ్ళేడు సత్తిబాబు.

మీకేమైనా అర్ధమయిందా?

Friday, 8 March 2024

ఉత్తర ముఖంగా ఉన్న శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలి?

 ఉత్తర ముఖంగా ఉన్న శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలి?


సాధారణంగా ఆలయాలన్నీ తూర్పువైపు ముఖంగా ఉంటాయి.మరే వైపు ముఖంగా ఉన్నా ఇబ్బందులూ లేవనుకుంటాను. కాని శివాలయానికో చిన్న చిక్కుంది. శివునికి రూపులేదు లింగాకారుడు. కాని ఈ లింగం పానవట్టం మీద ఉంటుంది. సోమ సూత్రం ఎప్పుడూ ఉత్తరం వైపే ఉంటుంది. తూర్పు,దక్షిణ,పశ్చిమ ముఖ ఆలాయాలకు సోమసూత్రం ఉత్తరంగానే ఉంటుంది, మరి ఉత్తర ముఖంగా ఉన్న శివాలయానికి సోమసూత్రం ఎటు ఉంటుంది? 


శివాలయ ప్రదక్షిణ చేయాలంటే సోమసూత్రం దాటకుండా చేయాలి, అక్కడుండే చండీశ్వరుని దర్శనం ముందు చేసుకుని వెనక్కొచ్చి,  ఇలా ప్రదక్షణo చేయాలి. ఇది ఏ దిక్కుకి ముఖం ఉన్నదానిని బట్టి ప్రదక్షిణం తీరు ఆధారపడిఉంటుందికదా!   ఎటైనా చండీశ్వరుణ్ణి దాటకుండా ప్రదక్షిణం చేయ్యాలి.


సాధారణంగా మనతెనుగునాట చండీశ్వరుడే కనపడటం లేదు. 

కార్తీక మాసంలో మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళేను, పుట్టినరోజు.   ఆలయం చాలాచిన్నది కాని, గొప్పదని తెలుసుకోడమే ఆలస్యమయింది. సాధారణంగా ఆలయాలన్నీ తూర్పు ముఖంగా ఉంటాయి, ఈ ఆలయం పశ్చిమ ముఖంగా ఉంది. విశేషం పరిశీలిస్తే పశ్చిమ ముఖంగా ఉన్న ఈశ్వరుని సద్యోజాత ముఖాయైనమః అని నమస్కరించాలి, ఈముఖంగా ఉన్న ఈశ్వరుడు కోరికలను శీఘ్రంగా అనుగ్రహిస్తాడని అనూచానంగా చెప్పుకునేమాట. ఈశ్వరునికి ఐదు ముఖాలు ఐదు ముఖాలకీ పేర్లున్నాయి.

 ఓం సద్యోజాతా నమః

ప్రాలేయాచల చంద్రకుంద ధవళం గోక్షీరఫేన ప్రభం

భస్మాభ్యక్తమనంగదేహ దహన జ్వాలావళీ లోచనం

బ్రహ్మేంద్రాది మరుద్గుణై స్తుతిపరై రభ్యర్చితమ్ యోగిభి

వందేహం సకలం కళంకరహితమ్ స్థాణోర్ముఖం పశ్చిమం


హిమవత్పర్వతం,చంద్రుడు,మొల్లపువ్వు వీటివలె తెల్లనిది పాలనురుగువలె తెల్లని కాంతికలది విభూతిపూయబడినదీ,మన్మధుని శరీరాన్ని దహించు జ్వాలలపంక్తితో నిండిన కన్ను కలది స్తోత్రము చేయుచున్న బ్రాహ్మ,ఇంద్రాది దేవతలు,మరుత్తులచేత ,యోగులచేత స్తుతింపబడుచున్నదైన,నిర్మలమైన నిండువదనముతో నున్నదైన శివుని పశ్చిమ ముఖమునకు నమస్కరించు చున్నాను. 


ఇంకేమి? ఈ ఆలయం పొందికగా ఉంది, గణపతి,సుబ్రహ్మణ్యుడు,  అమ్మవారు,  అంతేకాదు సోమసూత్రం దగ్గర చండుడు, అంతా లెక్కప్రకారంగా ఉండటంతో బాగా నచ్చేసింది. దానికితోడు ఆలయం నడక ట్రేక్ ఎంత దూరమో, అంత దూరంలోనే ఉంది. దీనితో పుణ్యం పురుషార్ధం అన్నారుకదా! ట్రేక్, చుట్టూ  అప్రదక్షణాలకంటే  గుడి దగ్గర మేలుకదా అని గుడికే రాకపోకలు సాగిస్తున్నా, ఉదయమే!  ప్రదక్షిణాలు శివాలయం లో చేయవలసినట్టు చేస్తున్నా! ఇదొక అదనపు మాట. దీంతో భక్తి పెరిగింది మరి చాదస్తమూ పెరిగింది,చెప్పిందే మళ్ళీమళ్ళీ చెబుతున్నా!  


'దరిద్రుడు తలగడిగితే వడగళ్ళవాన ఎదురైనట్టు', అన్న సామెతగా, పెద్దపండగ దాటేకా ఇదీ చెట్టెక్కేసింది, కారణాలనేకం. ఈ అనుమానం మాత్రం ఉండిపోయింది.  ఈ రోజు దర్శనానికి వెళ్ళాలి,స్వామి దయతో!

Tuesday, 5 March 2024

తనకి లేదని ఏడిస్తే

తనకి లేదనిఏడిస్తే


తనకి లేదనిఏడిస్తే ఒక కన్ను ఎదుటివాడికి ఉందనిఏడిస్తే రెండో కన్ను పోయాయి.   ఇదొక నానుడి.


ఎలక్టరల్ బాండ్లు లో సొమ్ములిచ్చేవారెవరో తెలియాలి,తెలియకపోవడం సరికాదు అని సుప్రీం కోర్టుకుపోయారు, కొందరు. కోర్టు విచారించి,బాండ్లు చెల్లవు,సొమ్ములు వెనక్కిచ్చేయాలని తీర్పిచ్చింది. అంతా సంతోషం వెలిబుచ్చారు.


రాహుల్ జీ మాటాడుతూ క్రవుడ్ ఫండింగ్ చేస్తామన్నారు, మంచిమాటే! ఏమయిందో తెలీదు,దాని ఊసేలేదు మళ్ళీ. ఎన్నికలు తరుముకొస్తున్నాయి. నిన్న మోడీజీ భాజపా కి పార్టీ ఫండ్ గా రెండు వేలిస్తూ నిధికోసం పిలుపిచ్చారు. ఇచ్చే సొమ్ము నమో ఆప్ ద్వారా ఇవ్వచ్చనీ చెప్పేరు. పార్టీ వివరాలిస్తూ ఐదు రూపాయలనుంచి సొమ్మివ్వచ్చుననీ బహుమతులూ ప్రకటించింది. సామాన్యుడు కూడా ఇప్పుడు నిధికి సొమ్మిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతి పక్షాలకి, ఇది ముల్లుతీసి కొఱ్ఱు కొట్టుకున్న చందమయిందా? ఏమో కాలమే చెప్పాలి.


అన్ని పార్టీలకి చేతిదాకా వచ్చిన సొమ్ములు వెనక్కిపోయాయి. ఇప్పుడన్నీ ఏం చేయాలో దిక్కుతోచకున్నట్టే ఉంది. 


దీనిపైన కూడా కోర్టుకుపోతారేమో! చూడాల్సిందే!!!


తనకు లేదని ఏడిస్తే ఒకకన్ను ఎదుటివాడికి ఉందని ఏడిస్తే మరో కన్నుపోయినచందమైపోయిందా? అనుకుంటున్నారు ప్రజలు.

https://www.hindustantimes.com/india-news/pm-modi-contributes-rs-2-000-to-bjp-urges-donations-for-nationbuilding-101709458181903.html


Sunday, 3 March 2024

కమ్మటి రోగాలు తీయటి మందులు ఉండవు.

 కమ్మటి రోగాలు తీయటి మందులు ఉండవు.


ఇదొక నానుడి. రోగం చమ్మగా,కమ్మగా సుఖాన్నివ్వదని, వచ్చే రోగాలకి వేసుకునే మందులు తియ్యగా ఉండవు,చేదుగానే ఉంటాయి, కష్టాలే పడాలని సూచన!!!!



ఈ నానుడి అర్ధం కాలేదు చాలాకాలంగా, ఒక అనుభవంతో అర్ధమయిందా? ఏమో!

   

    పదిహేను రోజులకితం డాక్టర్ గారి దగ్గరికిపోయా. డాక్టర్ గారు బి.పి చూసి ''డబల్ సెంచరీ తగ్గనంటోందే, కిందది సెంచరీ తగ్గనంటోంది ఉప్పు తింటున్నారా''? అడిగారు. ''మీ పేస్టులో ఉప్పుందా? ప్రకటన గుర్తొచ్చి, దానిపై డాక్టర్ల జోక్ గుర్తొచ్చి నవ్వుకున్నా''!  ''అయ్యో! ఉప్పు,తీపి మరిచిపోయి ఏళ్ళయిందండీ అన్నా''! ''తగ్గిస్తాగా!! అని మందులు మార్చారు, వేసుకుంటున్నా, పదిరోజులుగా.      నిన్న డాక్టర్ గారి దగ్గరకెళ్ళా! మళ్ళీ!! "నెలకాకుండానే వచ్చారేం మళ్ళీ?'' అన్నట్టు చూసి, బి.పి  చూస్తే, అది కాస్త తగ్గి మూడర్ధ సెంచరీల దగ్గరాగింది, కిందదో పది తగ్గింది.  చూసి డాక్టర్ గారు నవ్వుకుని "ఏమిటి సమస్య?" అన్నట్టు చూసారు. ''అదివరకు మరో తెగులుకు రాత్రి వేసుకుంటున్నమందు, మధ్యాహ్నం దాకా మత్తు వదలటం లేదు. ఇప్పుడు ఉదయం వేసుకుంటున్న బి.పి మందుతో, ఆ కొద్ది సేపుకూడా కిక్  లేకపోవడం లేదు, ఇప్పుడు ఇరవైనాలగు గంటలూ మత్తే'' అని వాపోయా!  ''ఎప్పుడూ మత్తుగానే ఉంటోందండీ,బద్ధకం,నిద్ర,'' అని డాక్టర్ గారికి చెప్పుకున్నా! ఆయన నవ్వి, ''అంతా కిక్ కావాలి,కిక్ కావాలంటుంటే మీరేంటీ? రోజంత కిక్ ఉంటే''? అని, ''మీరు వేసుకునేమందులన్నీ సాధారణంగా, నెల,రెండు నెలలకి అలవాటై మత్తు కనపడదు, అందరికీ  . మీరు స్పెషల్ కదా! అందుకు ఇలా వుంటోంది. మీరు హైపర్ సెన్సిటివ్, అలవాటు పడండి,  ఈ మందులు తప్పవు, మరో కంపెనీది మార్చినా అదీ అంతే'', అని చెప్పి పంపేరు.  

మొన్న రథసప్తమి నాడే చురుక్కుమన్నాడు, భాస్కరుడు. ఆవేళ మొదలు కదా వెచ్చగా ఉన్నాడని సంబరపడ్డా. నిన్న బయటికే రాలేకపోయాను. ఏంటబ్బా! అని చూస్తే వేడి 39 కి చేరిపోయిందిట, నాలుగు రోజుల్లో వేడి 40 కి చేరబోతోందని, సూచనలందుతున్నాయి. పదిహేనురోజులకే ఇంత మార్పా అనుకున్నా! నేను నడవటం లేదని ఆయన నడవటం మానెయ్యలేదుగా, నడుస్తూనే ఉన్నాడు అనంతకాలంలో, నా లాటి భాస్కరులనెంతమందిని చూసుంటాడు, నేనాయనఒక్కణ్ణే చూసాను తప్పించి. :) అలవాటు పడాలయ్యా! అలవాటు పడాలని చెప్పుకున్నా!! నవ్వుకుంటూ. 

  కమ్మటి రోగాలు తీయటి మందులు ఉండవు, 

అంటే అర్ధమయినట్టుందా?