చాలాకాలంగా నన్ను చూడడానికొచ్చిన అభిమానులగురించి చెప్పలేదు.నా బ్లాగు పుస్తకంలో అభిమానులది పెద్ద ప్రకరణమే! నిజం చెప్పాలంటే, అభిమానులే నన్ను బ్లాగులో ఇంతకాలం నిలబెట్టేరన్నది కాదనలేని సత్యం.ఐదేళ్ళకితం మాట. ఓ రోజో మెయిలొచ్చిందిలా!''నాపేరు చెఱువు సుబ్రహ్మణ్య శాస్త్రి గుడివాడ దగ్గర, ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నా! మీ బ్లాగు చూస్తాను. అభిమానిని,విశాఖ పెళ్ళికెళుతున్నా!వచ్చేటపుడు వస్తా!'' అంతకుముందు పరిచయమే లేదు. రమ్మని ఆహ్వానించా!ఎలా వస్తారు? ఎప్పుడొస్తారు. అడిగా! ''నాది గాంధీగారి టిక్కట్టు, ఎప్పుడొస్తానో చెప్పలేను, వచ్చి మిమ్మల్ని చూసి వెళతా!'' అన్నారు. మర్నాడు ఉదయం, ''ఇప్పుడు స్టేషన్లో ఉన్నాను,బండి ఏది దొరికితే అది ఎక్కేసివస్తా''ననంటే బండెక్కేకా చెప్పండి స్టేషన్ కొస్తా అంటే,''రావద్దు నేనే వస్తా! ఎలా రావాలో చెప్పండంటే'' చెప్పక తప్పలేదు. ఎదురుచూస్తూ కూచున్నా! మధ్యాహ్నం పన్నెండున్నర దాటింది. అప్పుడు ఒక పెద్దాయన వచ్చారు.వయసు ఎనభై అన్నారు. భోజనాలు చేసేం,చేస్తూ కబుర్లు చెప్పుకున్నాం. కాసేపు కూచోండన్నా! ''కూచోను, ఏ బండి దొరికితే అదెక్కేస్తాను. ఏరాత్రి కైనా హైదరాబాదు చేరతానని'' వచ్చినంత వేగంగానూ వెళ్ళేరు. వారిని కలిశాను,అదో ఆనందం! అంతే!!ఆ తరవాత కాలంలో శ్యామలీయం,శ్రీమతి శారద,తమ్ముడు రామంతో "వస్తున్నా "అన్నారు, కాకినాడనుంచి. రమ్మని ఆహ్వానించా!అప్పటికే ఇల్లాలు లేవటం లేదు,మంచాన ఉంది. ఎలా వస్తున్నారు? అడిగా! కార్ ఉంది చేతిలో ఏలారావాలో చెప్పండంటే, చెప్పేను. దురదృష్టం ఆ రోజు ఫ్లై ఓవర్ కట్టేసేరు, అక్కడికొచ్చి ఫోన్ చేసేరు, ఇలా జరిగిందని. అక్కడికెళ్ళి సందుగొందులగుండా ట్రేక్ దాటించి,ఇంటికి చేరేం! ఆ తరవాత అంతంత మాత్రమే అతిథి సత్కారం చేయగలిగేం. దానికేవారు చాలా ఆనందపడ్డారు. నిజానికి ఏమీ చేయలేకపోయేం అన్నది, నిజం.ఆ తర్వాత ఇల్లాలు కాలం చేయడంతో అన్నీ వెనకబట్టేయి. ఎవరిని రమ్మనటమూ లేదు. ఇలా జరుగుతుండగా ఒక రోజు లలితమ్మాయి ''దేశంలో కొచ్చా! వస్తున్నా'' అంది! రమ్మని ఆహ్వానించా! గౌరవం చేయలేనేమోనని భయం, అనుమానం. వచ్చింది,ఇంటి ఆడపడుచుకంటే ఎక్కువగా కలసిపోయిందంటే! అభిమానం ఇలా అని చెప్పలేను. ఇంతకు మించి చెప్పను. బంగారు తల్లికి దిష్టి తగులుతుంది. తను మాకోసం ఎవో ఏవో బహుమతులు తెచ్చింది. మంచినీళ్ళు కూడా తెచ్చుకుంది,పాపం. మా చిన్న సత్కారం పుచ్చుకుంది. వీటన్నిటికంటే నాకు మీ ఆశీర్వచనం కావాలనిపాదాభివందనం చేసి, కూచుంది. చిన్న ఆశీర్వచనం పనస చెప్పి ఆశీర్వదించా! కడుపు నిండింది, మీరు పిలవకపోయినా వచ్చానంది.అవునమ్మా! నిజమే నేనే ఎవరిని పిలవలేకపోతున్నా! ఇల్లాలు కాలం చేయడంతో అన్నా! అభిమానం ఉన్నపుడు పిలుపులు పట్టింపులు ఉండవు, అందుకే పిలవకపోయినా వచ్చాను, ఆశీర్వచనానికే వచ్చానని, సరిపెట్టుకుంది.. మీ అభిమానానికి కడుపు నిండిందని సంబరపడి వెళ్ళింది. నిజానికి తను నన్ను చూడ్డానికి వచ్చి నన్ను సంబరపెట్టింది. నన్ను మళ్ళీ లోకంలో పడేయడానికి తనరాక దోహదం చేసింది.
Monday, 29 January 2024
అభిమానులు
Saturday, 27 January 2024
దోచుకో! దాచుకో!!
దోచుకో దాచుకో
దోచుకో! దాచుకో!! ఇదే నేటి నినాదమనిపిస్తూ ఉంది. దోచుకుని ఏమి అనుభవిస్తున్నట్లు? పొట్టకి తిండా మూడు పూటలకంటే ఎక్కువ తినలేము. కట్టుకునే గుడ్డా? ఏదైనా మానం కాపాడుకోడానికే! ఉండే ఇల్లా? ఎంతపెద్ద ఇల్లున్నా ఒకమంచంమీదే పడుకోగలం.స్త్రీ/పురుష అనుభవమా? మూడు నిమిషాల ముచ్చట. అంతే! ఇతర వైభవాలా? అర్ధం చేసుకుంటే కొరగానివే. ఇది ఐశ్వర్యంకాదు. రెండు పూటల తింటే ఆకలి వేయడం ఐశ్వర్యం.ఆరోగ్యం ఐశ్వర్యం. కట్టుకున్నవారితో మనసుకలిసుండడం ఐశ్వర్యం. ఎందుకు దోచుకుంటున్నట్లు?
నృసింహ శతకకర్త అన్నారిలా.
సీ. తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు - వెంటరాదు
లక్షాధికారైన - లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు - మ్రింగబోడు
విత్త మార్జనజేసి - విర్రవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము - తోడరాదు
పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి
దానధర్మము లేక - దాచి దాచి
తే. తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
సృష్టి మొదలు ఎందరు పుట్టేరు? ఎందరు పోయారు. పోయినవారెవరూ చిటికెడు మన్ను పట్టుకుపోలేదు. నిన్న మొన్నటి ఉదాహరణలు స్టీవ్ జాబ్స్, రాకేష్ ఝున్ ఝున్ వాలా! కదలలేని స్థితిలో నిస్సహాయంగా ప్రాణాలు వదలినవారు. ఆఖరికి తాను అనుకున్న శరీరం కూడా ఇక్కడే వదిలేసిపోతున్నారు. ఎవరూ నిన్ను గుర్తుపెట్టుకోరు. ఈవేళ చస్తే రేపటికి రెండు. దోచుకోకు!
కడుపాకలికి కక్కుర్తి పడితే అదో అందం. అంతే!!!!
నోరున్నవారూ, బలమున్నవారూ;దోచుకుంటున్నారు,దాచుకుంటున్నారు. ఎవరి వీలున్నంతవారు, వ్యాపారస్థులనుంచి, బలమైన వృత్తి వారలనుంచి,రాజకీయులదాకా! ఎందుకో!!!
ఎంత కళ్ళు మూసుకుందామనుకున్నా చూడక తప్పటం లేదు. బాధపడకా తప్పటం లేదు . ఏమీ చేయలేని అసహాయ స్థితి. ఇదింతే!!!!
Thursday, 25 January 2024
రహస్యం దాగదు.
రహస్యం దాగదు.
దుష్యంతుడు వేటకి వెళ్ళి, కణ్వుడు లేనప్పుడు కణ్వాశ్రమంలో శకుంతలని చూసి మోహించి, గాంధర్వం అని పెళ్ళి చేసుకుని, ఆమెను తల్లిని చేసి వెళ్ళాడు.నిన్ను తీసుకువెళతానని వాగ్దానమూ చేసాడు. అడగొచ్చిందా? అనుకున్నాడు. శకుంతల కొడుకుని కన్నది. కొడుకు పెద్దవాడవుతున్నాడు, రాజు దగ్గరనుంచి ఎన్నాళ్ళకి కబురులేకపోతే తనే బయలుదేరిందీసారి,కణ్వునికి చెప్పి. రాజసభలో కొడుకుని చూపించి, వీడు మన కొడుకు అని చెప్పింది. దుష్యంతుడు ఎవరినో కుర్రాణ్ణి తీసుకొచ్చి వీడు నీకొడుకు అనడం బాగుందా? అసలు నువ్వెవరు? నాకు తెలియదే అనేసాడు. దానికి శకుంతల చాలా చెబుతూ, ఇలా అంటుంది
విమల యశోనిధీ పురుషవృత్త మెరుంగుచు నుండు జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా
ర్థము లివి యుండగా నరుడు దక్కొన నేర్చునె తన్ను మ్రుచ్చిలన్.
తెల్లనిదైన యసస్సు కలిగినవాడా! మానవుల చర్యలను చూస్తున్నవారున్నారు సుమా! వారు
ధర్మం-1
యముడు-1
అంతరాత్మ-1
సూర్యుడు,చంద్రుడు-2
పగలు,రాత్రి-2
సంధ్యలు-3
వేదములు-4
పంచభూతాలు-5.
వీరిలో ఎవరో ఒకరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. మానవుడు రహస్యంగా, ఎవరికి తెలియకుండా ఏమీ చేయలేడు. అందుచేత నువ్వు చేసిన పని ఎవరికీ తెలియదనుకోకు. అని చెప్పింది.అబ్బే అలాగా వినలేదు, తరవాత కత చాలానే జరిగి చివరికి ఒప్పుకున్నాడు.
నేటికీ ఈ మహా పదార్ధాలు ఏదో ఒకటి మనం చేసేపని చూస్తూనే ఉంటాయి. నేటికాలం లో మరొకదాన్ని ఈ మహాపదార్ధాలలో చేర్చుకోవలసి వస్తూంది :) అదే గూగుల్. ఎలాగని అడగచ్చు. మీరు ఏం చదువుతున్నారు, ఏ రకపు వార్తలను చూస్తారు, ఏవస్తువులు కొనాలనుకుంటున్నారు, ఏవి మీకిష్టం, ఎక్కడ ఎమి దొరుకుతాయి,వాటిఖరీదులెంత,ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు,అక్కడకి దగ్గరలో చూడవలసినవేంటి? ఏమి తింటారు?
మీ ఆలోచనేంటి? కల్పితమేధస్సుతో మీరెలా ఆలోచిస్తారో కూడా చెప్పేస్తున్న సంఘటనలున్నాయి. మీరెక్కడున్నారు,ఎంతసేపున్నారు, ఏ దిశగా కదిలేరు, ఇలా సర్వం జి.పి.ఎస్ లో దొరుకుతుంది. ఆధునికత పేరుతో బందీలైపోతున్నారు సుమా! బహుపారాక్! ఒక రోజు మీ చర్యలే మీ కాళ్ళకి,చేతులకి బంధాలు కావచ్చు సుమా!
ఇలా మీసర్వస్వమూ గూగుల్ గుప్పెట్లో ఉంది. ఇది మహా పదార్ధం కాదా?
Tuesday, 23 January 2024
కల్లు తాగె.
కల్లు తాగె.
స్థల,కాల,పరిమితులు లేనిదేది?
అసలే కోతి,నిప్పులు తొక్కె,
ముల్లు గుచ్చుకునె,కల్లు తాగె,
పిచ్చి పట్టె, ఆపై దయ్యం పట్టె,
ఏమని చెప్పుదు గురువరా!
Monday, 22 January 2024
జననీ జన్మ భూమిశ్చ
జననీ జన్మ భూమిశ్చ
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి
తల్లి,జన్మ భూమి స్వర్గం కంటే గొప్పవి.
రాముడు నేడు జన్మ భూమికి చేరుతున్నాడు.
Friday, 19 January 2024
రెటమత శాస్త్రం :
రెటమత శాస్త్రం :
Tuesday, 16 January 2024
చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి పడుతుంది
చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి పడుతుంది
అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.
ఇదొక నానుడి అమ్మ తరచు చెప్పేది. ఏమిటి ఇలా చెబుతుందనుకునీ వాడిని. నిజమే కదా! అన్నీ వడ్డించిన విస్తరి బరువుకి అణిగి ఉంటుంది, పుల్లాకు(పులివిస్తరి) ఏమీ బరువు లేక ఎగిరెగిరి పడుతుంది. జీవితం లో అనుభవాలతో గాని దీని అర్ధం తెలియలేదు. సంపద కలిగినవాడు సంపాదన ఉన్నవాడు ఎప్పుడూ నెమ్మదిగానే ఉంటాడు,ఎగిరెగిరి పడడు. ఏవిషయానికి ఉద్రేకపడిపోడు. సంపాదన లేనివాడు సంపద లేనివాడే ఎగిరెగిరి పడుతుంటాడు. అలాగే జీవితం లో కష్టసుఖాలు చూసినవాడు ఉద్రేకపడిపోడు, సమస్యను పరిష్కరించుకోడానికే చూస్తాడు. జీవితానుభవం లేనివాడు మరికొన్ని చిక్కులు తెచ్చుకుంటాడు. అలాగే చదువుకున్నా, అణుకువ కలిగి వున్నవాడు, తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు విద్యాభారంతో అణుకువగా ఉంటాడు. నోటికొచ్చినదంతా మాటాడడు. నాకింకా తెలియదు అనుకున్నవాడు వృద్ధిలో కొస్తాడు,ఎగిరి పడడు. మిడిమిడి జ్ఞానం వారు చెప్పక్కరలేదు. మొన్నటి పద్యభాగమే మరోసారి.
చమురున్న పెంకు నిలిచి కాలుతుంది, చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి పడుతుంది , అనేవారు నాటి కాలంలో. ఇదీ ఒక నానుడే!
Sunday, 14 January 2024
మా పల్లెలో సంక్రాంతి
ఎల్లరకు శోభకృత్నామసంవత్సర సంక్రాంతి శుభకామనలు.
మా పల్లెలో సంక్రాంతి
Friday, 12 January 2024
Wednesday, 10 January 2024
చెట్టు మొదలు పైకి చిగుళ్ళు కిందికి ఉన్నది.
మొదలు పైకి చిగుళ్ళు కిందికి ఉన్న చెట్టు
చెట్టు మొదలు కిందికి చిగుళ్ళు పైకి ఉన్నది,మన కంటి పటలం మీద(రెటీనా)ఆ చెట్టుయొక్క బొమ్మ (image formed on retina is real and inverted ) తలకిందుగా ఉంటుంది. కాని మనకు చెట్టు మొదలుకిందికే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు?
*****
ఊర్ధ్వమూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయం
ఛన్దాంసి యస్య పర్ణాని యన్తం వేద స వేదవిత్
భగవద్గీత.15-1
అధశ్చోర్ధం ప్రసృతా స్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయ ప్రవాలాః
అధశ్చ మూలన్యనుసంతతాని కర్మానుబన్ధీని మనుష్యలోకే
భగవద్గీత.15-2
వృక్షశాఖలు ప్రకృతి యొక్క త్రిగుణములచే పోషింపబడి కిందికిని మీదికిని వ్యాపించును. చిగురాకులు ఇంద్రియార్ధములు. ఈ వృక్షమునకు కిందికిపోవు వేళ్ళు కూడా నున్నవి. ఇది లోకముయొక్క సకామ కర్మలచే బద్ధములై యుండును.
Monday, 8 January 2024
Friday, 5 January 2024
కవులు-మసాగత్తు /మశాగత్తు.
కవులు-కదపా-మంద-మసాగత్తు/మశాగత్తు.
కవులుని, కౌలు అని కూడా అంటుంటారు, కవులు శబ్దానికి నానార్ధాలూ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది రైతు,భూయజమాని మధ్య ఒడంబడిక గురించి. ఇది రైతు భూయజమానికి రాసిచ్చేది. కవులును ఉయలు అనికూడా కొంతమంది లేకరులు నాటికాలం రాయగా చూసిన అనుభవం ఉంది. ఇక కదపా అన్నది భూయజమాని రైతుకు రాసిచ్చే హామీ. ఈ రెండిటిలో వచ్చే పదాలే మంద,మశాగత్తు/మసాగత్తు. నేను వీటితో పరిచయం వదిలేసి చాలాకాలమే అయింది, నాకు తెలిసిన కాలంలో కవులు ఎలా ఉండేది? రాస్తాను.
దివి..... .....నామ సంవత్సర,...మాస బహుళ/శుక్ల.... ...వాసరాన,......జిల్లా......తాలూకా.......గ్రామ కాపురస్థులు........గారి కుమారుడు..........గారికి.
......జిల్లా......తాలూకా..........గ్రామ కాపురస్థుడు.........గారి కుమారుడు........వ్రాయించి ఇచ్చిన కవులు.
మీకు ....గ్రామంలో ఉండుకున్న సర్వేనెం.......రి.సర్వేనెం.......లోని య........సెం.....భూమిని ఈ రోజు కొలతవేయించి వ్యవసాయం నిమిత్తంగా నాకు అప్పగించినారు. సదరు భూమిపై కవులుగా సంవత్సరం ఒక్కంటికి, యకరానికి ....... 3 గుళ్ళ /75 కే.జిల కాటాబస్తాలు మొదటిపంట ధాన్యం , మొత్తం య........సెం.....భూమి కి .....బస్తాల నెంబు,తప్ప,తాలు,పొల్లు, తుక్కు,దూగర లేని మొదటిపంట ధాన్యం, మీగాదివద్ద కొలగారంవారిచే తూకం వేయించి అప్పగించగలవాడను. ఈ కవులు కాలం ఐదు సంవత్సరములు. ఈ కాలంలో మొదటిపంటగా వరిని,రెండవపంటగా నువ్వు,మినుము,పెసర,కంది, జొన్న లాటి మెట్టపైరులు పండించుకునే నిర్ణయం. రెండవపంట ఫలసాయంలో మీకు సంబంధము లేదు. ఈ భూమికి ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు యావత్తూ మీరే చెల్లించుకోవలెను. ఈ భూమికి ఉన్న నీటివనరులు పాడుచేయక రక్షిస్తాను, ఉన్న ఈజుమెంటు హక్కుల్ని రద్దు చేయను,కొత్తవాటిని కలగజేయను. సరిహద్దురాళ్ళను జాగ్రత్తగా కాపాడతాను. చివరి సంవత్సరంలో నువ్వు పంట వేయకుండా ఉండే నిర్ణయం. చివరి సంవత్సరం రెండవపంట తరవాత మంద,మశాగత్తులు జరిపించి, మీ భూమిని మీకు అప్పగించగలవాడను. ఇది సమ్మతిని వ్రాయించి ఇచ్చిన కవులు.
సంతకం....................
ఇందుకు సాక్షులు....
౧.
౨.
దస్తూరి..............
ఇక కదపా అనేది, కవులులో చెప్పబడిన షరతులు అన్నీ ఇందులోనూ ఉంటాయి. ఫలానా,ఫలానా షరతులు రైతు అమలు చేయాలనీ,వివరాలుంటాయి. చివరలో ఈ కవులు కాలంలో ఇవ్వవలసిన కవులు బకాయిలు పెట్టకుంటే కవులు రద్దు చేయనని కదపా ఇస్తున్నాను, ఇది సమ్మతిని వ్రాయించి ఇచ్చిన కదపా.
అనగా రైతుకు యజమాని చ్చే భరోసా,గేరంటీ,హామీ. చెవికదపా ఇస్తానోయ్! అన్నమాట వింటుంటాం, అంటే చెవిని హామీ ఇచ్చాడనమాట. :)
మంద అనేది మందగట్టడం. ఏభై ఏళ్ళ కితం రసాయన ఎరువులు లేవు, ఎరువుగా పెంటతోలడం,పశువులు,మేకలు,గొర్రెలని మందగా భూమిలో ఉంచడం చేసేవారు.
ఇక మశాగత్తు/మసాగత్తు అనే పదానికి అర్ధంలేదు. మసాహత్ అనే ఉర్దూ/హిందీ పదం మన తెనుగునోటబడి మశాగత్తు/మసాగత్తు అయింది. దీనికి అర్ధం, భూమి కొలత,సర్వే అని అర్ధం. రైతు భూమి తీసుకునేటపుడు కొలతవేయించి అప్పజెప్పుకుంటాడు, మళ్ళీ కొలత వేయించి అప్పజెపుతాడు. ఇక మసాహత్ అనగా కొలత ఎందుకని సందేహం కదా! సర్వేరాళ్ళు జరిపేసేవారు,గట్లు జరిపేసేవారు, ఇలా చాలాచాలా అపభ్రంశాలు జరిగేవి,దీనితో తగవులూ చాలా ఉండేవి, వీటిని మొదటిలోనే పరిహరించడానికి చేసే ప్రయత్నమే ఇది. మాస్టర్ రాయి అని ఒక పెద్ద సర్వేరాయి ఉంటుంది. మొత్తం గ్రామ సర్వే అంతా ఆ రాయి ఆధారంగా నడుస్తుంది. ఇది ఎంతుంటుందంటే, పైన రెండ డుగుల పొడవు వెడల్పులతో దగ్గరగా పది అడుగుల పొడవుంటుంది. కిందికిపోను లావుగా ఉంటుంది. ఏడు,ఎనిమిదడుగులలోతుపాతిపెట్టి,ఒకడుగు పైకి ఉంచేటట్టు చేస్తారు. ఈ మాస్టర్ రాయిని రైతులంతా గమనిస్తుంటారు. దీనినే రాత్రికి రాత్రి తవ్వితీసి మరోచోట పాతిపెట్టిన ఘనులూ ఉన్నారు,నాడే! ఆ తరవాత కాలంలో రివెన్యూవారు సరిచేసిన సందర్భాలు కోకొల్లలు.
గ్రామానికో డిగ్లాటు ఉంటుంది. ఇది కరణం దగ్గరఒకటి,తాసిల్దారు దగ్గరొకటి, కలక్టర్ దగ్గర కాపీలుంటాయి. ప్రతి సర్వే నెంబరు భూమి పరిమితం,కొలతలు,భూమి ఆకారపు చిత్రం స్కేలుకి వేసి ఉంటుంది, సర్వేరాళ్ళు ఎక్కడ ఉన్నదీ నమోదయి ఉంటుంది. మనభూమి తాలూకు డిగ్లాట్ కావాలంటే కరణం అచ్చుగుద్దినట్టు వేసి ఇచ్చేవాడు, అసలును చూసి. ఈ డిగ్లాటును సర్వే,రిసర్వేలలో సర్వే చేసినవారు, వేస్తారు. సర్వే చేసి డిగ్లాటు వేసిన వారి పేరు హోదా కూడా నమోదయి ఉంటుంది. చాలాచాలా మార్పులొచ్చాయి, ఇప్పుడెలా ఉన్నది తెలియదు.
Wednesday, 3 January 2024
నీళ్ళుకొడితే ఒకటవుతాయి....
నీళ్ళుకొడితే ఒకటవుతాయి...
నీళ్ళుకొడితే ఒకటవుతాయి! పాలు కొడితే ఒకటవుతాయా?
అనికాని
నీళ్ళుకొడితే ఒకటవుతాయిగాని, పాలు కొడితే ఒకటి
కావు.
అంటూ ఈ నానుడిని వాడుతుంటారు. ఎంటి దీని విశేషం? ఇది మానవ సంబంధాలను నిర్ణయించడానికి తరచుగా చెప్పే మాట.
ఈ నానుడి నిక్కచ్చి నిజం. జీవిత సత్యాన్ని చిన్న మాటలలో ఇమిడ్చి చెప్పేరు,ఎంతో అనుభవం మీద పెద్దలు. అది ఇప్పటికి సత్యమే! ఎప్పుడూ నిత్య నూతనమే!! నీళ్ళని ఎంత చిలికినా నీళ్ళుగానే ఉంటాయి. కాచినా ఆవిరైపోతాయేమోగాని నీళ్ళుగానే అవుతాయా తరవాత కూడా, మార్పు చెందవు. కాని పాలు చిలికితే వెన్నొస్తుంది. దీన్ని పచ్చిపాల వెన్న అంటారు. కాస్తే నెయ్యవుతుంది, కాని కొవ్వు వాసనుంటుంది. కాచి తోడు వేస్తే పెరుగవుతుంది. చిలికితే మజ్జిగవుతుంది,వెన్నొస్తుంది. వెన్న కాస్తే నెయ్యొస్తుంది. పాలు ఎన్ని రూపాంతరాలు చెందాయి? మరి నీళ్ళు మారాయా? లేదే!!
అసందర్భపు మాటే గాని అవసరమైనమాట. మజ్జిగ చుక్క వెయ్యనిది,వేలు ముంచనిది పాలు పెరుగుకావు. మరి మొదటిసారి పాలు పెరుగెలా అయ్యాయి,అవుతాయి? గోరు వెచ్చని పాలలో ఒక ముచికున్న ఎండు మిరపకాయ పడెయ్యండి, చాలు,పాలు తోడుకుపోతాయి,పెరుగవుతుంది. పాలు పెరుగవడానికి కావలసిన బేక్టీరియా ఆ ఎండు మిరిరపకాయ తొడిమలో ఉంది.
పాలుకాస్తే అందులో నీరు ఆవిరై పొడిలా మిగుల్తుంది. అంటే ఏం చేసినా నీరు ఒకటిగానే ఉంది, పాలు మాత్రం రూపాంతరం చెందిపోయింది. అలాగే కావలసినవారి మానవ సంబంధాలూ అలాగే ఉoటాయని ఈ నానుడి మాట.
ఒక ఉదాహరణ చెబుతా స్వానుభవం....
నా మిత్రుడు భార్యకి, తల్లికి, సరిపడక, తల్లిని వేరుంచాడు. మిత్రుని తల్లి ఓ రోజు వచ్చి కూచుని, తన కొడుకు కోడలి మీద చెప్పిన నేరం చెప్పకుండా చెప్పి, కళ్ళనీళ్ళు తుడవకుండా ఏడ్చి, ముక్కులు చీది గోడలు ఖరాబు చేసి వెళ్ళింది. ఆ తరవాత ఇల్లాలు నెమ్మదిగా 'మనకెందుకొచ్చిన గొడవ' అని ఊరుకుంది. నేను ఊరుకోలేక మర్నాడు మిత్రుడు కనపడితే ఒంటరిగా చూసి 'ఏం బాగోలేదురా!
నీతల్లి అలా బాధపడుతుంటే' అని క్లాసు పీకేను,
చెప్పిన సంగతీమరచాను కూడా! ఆ తరవాత వారంలో ఒకరోజు ఇంటికొచ్చేసరికి, ఇల్లాలు మొన్ననొచ్చినావిడ మధ్యాహ్నం నుంచి రెండుసార్లొచ్చింది మీకోసం, అని చెప్పింది. ఏమయిందిట,అనేలోగానే ఆవిడొచ్చి కూచుంది. ఏదో మంచిమాట చెబుతుందిగాబోలనుకున్నా! ఆవిడ,"ఔరౌరా! ఏం పెద్దమనిషివయ్యా నువ్వూ! వాళ్ళు నా కొడుకు, నా కోడలు,
పైవాళ్ళేం కాదు. ఏదో! నా కడుపులో మాట నీ చెవినేసేనో అనుకో! వాళ్ళనిలా వీధిని పడేస్తావా!" అంటూ చింతచెట్టును దులిపినట్టు దులిపి, నేను చెప్పేమాట కూడా వినక వెళ్ళింది. ఇది జరుగుతున్నంత సేపు ఇల్లాలు నవ్వు బిగబట్టుకుని ఉన్నట్టే అనిపించింది. ఆవిడెళ్ళిన తరవాత, ఇక ఈవిడ దులుపుతుంది కాబోలురా దేవుడా! అనుకుంటూ 'రోటిలో తలదూర్చి రోకటిపోటునకు వెరువనేర్తునా' అనే నానుడి గుర్తుచేసుకుని ఇల్లాలికేసి చూసాను. కాని చిత్రంగా స్వీటు,స్వీటుగా ''పాలుకొడితే ఒకటిగావు,నీళ్ళు కొడితే ఒకటే'' అని చెప్పలేదూ! అని ఊరుకుంది. ఇంత స్వీటుగా చెప్పి ఊరుకున్నందుకు ఏదో చెయ్యబోతే చాలు!చాలు!! పిల్లలెదురుగా పోకిరీ వేషాలంటూ స్నానం చెయ్యండని బాత్ రూమ్ లోకి తోసింది....నిజం కదూ! ఆ తల్లి,కొడుకు,కోడలు ఒకటయ్యారు, నేను వేరయ్యాను..
అంతెందుకు నిన్నమొన్న,మన రాష్ట్ర రాజకీయాల్లో జరిగిందిదే కదూ!
దీనికి కుటుంబాలు,కులాలు, మతాలు
ట్రేడ్ యూనియన్లు, లాయర్ల,డాక్టర్ల అసోసియేషన్లు, పత్రికా విలేకరుల యూనియన్లు రాజకీయపార్టీలు,రాష్ట్ర రాజకీయాలు,దేశరాజకీయాలు,అంతర్జాతీయ రాజకీయాలూ అతీతం కాదు.
అంతా మేము దీనికి అతీతం అంటుంటారు, విని నవ్వుకోడమే! 'అందరూ శ్రీవైష్ణవులే,బుట్టడు రొయ్యలూ ఏమైనట్టు' అన్నది ఒక నానుడి.
ఎవరు ఏం చెప్పినా నీళ్ళు కొడితే ఒకటవుతాయి, పాలుకొడితే కావు!!!!