కాలం కలసిరానప్పుడు తాడేపామై కరచింది.
కాలం కలిసొచ్చినపుడు, ప్రపంచమే మనచుట్టూ తిరుగుతున్నట్టనిపిస్తుంది, మనమాట మీదే నడుస్తున్నట్టుంటుంది. మన మాటే వేదమని పాటించేవారికంటే, మన మాటకోసం ఎదురుచూసేవారే ఎక్కువ. సరే తరవాత చిన్నతల్లి పరుగు పరుగునా గలగలలాడుతూ చేరిపోతుంది. అడగకనే న్యాయదేవత మన ముంగిట్లోకి నడచొచ్చేస్తుంది. తెప్పలుగ జెరువునిండిన కప్పలు పదివేలు జేరు గదరా సుమతీ! వందిమాగధులకి లోటుండదు. ఇంద్రుడు చంద్రుడు అననివారు దుర్మార్గులే! సమయం అదే కాలం తెలియకనే దొర్లిపోతుంటుంది. రోజులు నిమిషాల్లా,సంవత్సరాలు రోజుల్లా నడచిపోతుంటాయి. ఆకలుండదు దాహముండదు, నిన్ను చూస్తుంటే, అన్నట్టుంటుంది.
కాలం నడుస్తున్నప్పుడు, రోజులు భారంగా నడుస్తుంటాయి. తెల్లవారుతుంది మళ్ళీ పొద్దుగూకుతుంది, అంతే!!పిలిస్తే పలుకుతారు జనం, లేకపోతే లేదు. ఎవరి ప్రపంచం వారిదే! వందిమాగధులు కైవారాలు కష్టం మీద కొనసాగచ్చు,సాగకాపోవచ్చు. ఏదీ నికరం లేదు. న్యాయదేవత కోసం పరుగులు పెడితే కరుణించచ్చు, లేకపోవచ్చు. జనాలు చేరిక చెప్పలేం, చిన్నతల్లి పలుకును బట్టి ఉంటుంది. చిన్నతల్లి పరుగులుండవు, నడకలూ ఎనకబడతాయి. ఒక్కొకప్పుడు చిన్నతల్లి పోకేగాని రాకుండదు. విత్తంకొద్దీ వైభోగం,నడుస్తూ ఉంటుంది. ఆకలుంటుంది, దాహమేస్తూ ఉంటుంది. ఇంతేనా జీవితం అనిపిస్తూ ఉంటుంది. కాలం నడుస్తుంటుంది, భారంగా.
కాలం కలసిరానపుడు,పిలిచినా పలికేవాడుండడు. నిన్నటిదాకా మన గుమ్మందగ్గర నిలబడ్డవాడి గుమ్మం దగ్గర నిలబడ్డా దర్శనముండదు. దర్శనమిచ్చినా పలుకుండకపోవచ్చు.చిన్నతల్లి పలుకే బంగారం. పోయేగాని రాలేదు. న్యాయదేవత పెడముఖం పెడుతుంది. నిన్నటిదాకా మనం చెప్పినదే న్యాయమే, మరి నేడేంటి? న్యాయదేవత శలవులు తీసుకుంటూ ఉంటుంది.పలికేవారు ఉండరు. చెరువెండిపోతే కప్పలుండవు. ఇంద్రుడు, చంద్రుడు మాట దేవుడెరుగు మన పెరే గుర్తుండదు, ఎవరికి. గడియారం లో చిన్నముల్లు కదలదు, పెద్ద ముల్లు సరే సరి. రోజు నడవదు, భారంగా కూడా. నీడని చూసి భయపడాల్సివస్తుంటుంది. తాడు కరుస్తుందా? కాని కానికాలమొస్తే తాడే పామై కరుస్తుంది.
ఇంతకీ ఎవరీకాలం?అదీ కొచ్చను. కాలం గంటలు,నిమిషాలు, రోజులు ,సంవత్సరాలే కాదు. కాలానికి రూపులేదు, గుణం లేదు; దయలేదు, దాక్షిణ్యం లేదు; పుట్టుకలేదు, చావులేదు; ఆది లేదు, అంతం లేదు; సమవర్తి. పెద్ద చిన్న తేడా లేదు. ఎవరికోసమూ ఆగదు, నడుస్తూనే ఉంటుంది.ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. మరి ఇన్నిగుణాలూ ఉన్నవారొకరున్నారు, వారే దేవుడు, మీరే పేరుతో పిలుచుకున్నా, ఏమతంవారైనా, ఇదే నిజం.
కాలం కలసిరావడమంటే భగవంతుడు మనతో ఉన్నాడు, అప్పుడు. అందుకే మనకి రోజులలా గడిచాయి, మనమా సమయంలో మంచిపనులు చేస్తామేమో అని భగవంతుడు ఎదురుచూచాడు. మన కర్మ బాగుంటే అదే కాలం కలిసొచ్చేది.
ఆ తరవాత అరోజులు భారంగా నడిచాయి, ఎందుకు? భగవంతుడు నీ పట్ల ఉన్నట్టు లేనట్టు ఉన్నకాలం. ఇక కాలం కలసిరానపుడు భగవంతుడు మన పట్ల లేడు.
అందరూ పడిపడి దణ్ణాలెట్టేవాళ్ళే!నాటి రోజుల్లో. ఎందుకూ? ఆ రోజు మన వెనక విధి ఉన్నది. అందరూ దణ్ణాళెట్టేరు, విధికి, కాని మనం, మనకే దణ్ణాలెట్టేరని భ్రమపడ్డాం, మనగొప్పే అనుకున్నాం. విధిని మరచాం. అందుకే...ఈ రోజు, పిలిచినా పలికేవాడు లేడు, సాయంచేసేవాడసలే లేడు, చిన్నతల్లి అడుగులు లేవు, ఆ రోజు మొక్కినవాడు, ఈ రోజు బయటకాపలా ఉన్నాడు, బయటికి పోకుండా. ఇప్పుడు గుళ్ళూ గోపురాలూ గుర్తొచ్చాయి, ఉపయోగమే కనపట్టదు.అదే తాడు పామైకరవడమంటే...