https://kasthephali.blogspot.com/2023/09/blog-post.html
మోసం
తరవాయి భాగం
ముల్లును ముల్లుతోనే తీయాలి
రత్నంతో సంభాషణ తరవాత,
ముత్యం మాటాడక ఇంటికి చేరిన రాత్రి, భార్యతో,రత్నంతో
సంభాషణలో జరిగినది చెప్పేడు. విన్నామె, ”కంపమీద
బట్ట పడింది, నెమ్మదిగా లాక్కోవాలి,
బర్రున లాగేస్తే చేతులారా చింపుకున్నట్టవుతుంద'’ంది. ఈ మాట ముత్యానికి నచ్చింది, తాను ఉద్రేకపడక, మాటాడక వచ్చేసినదానికి భార్య వత్తాసు పలికినట్టయింది.
ముత్యం మాటాడక వెళ్ళినా, రత్నం మనసులో గుబులు పోలేదు. మరునాడు భార్యతో కలిసి ముత్యం ఇంటికి వెళ్ళి, ముత్యాన్ని భార్యా పిల్లలని కుశల ప్రశ్నలు వేసి, కొన్ని బహుమతులిచ్చి, చివరగా వారందరిని తమ ఇంటికి విందుకు రావలసినదిగా ఆహ్వానించారు. ముత్యం ఇంటి దగ్గర గడపినంత సేపులోనూ, ముత్యంగాని, భార్యగాని తాము మోసపోయినట్టుగాని, నష్టపోయినట్టుగాని, బాధ పడుతున్నట్టుగాని అనిపించలేదు,రత్నానికి అతని భార్యకు. ఇది రత్నానికి మరింత బాధ కలిగించింది. అనుకున్నట్టుగానే ముత్యం భార్య పిల్లలతో కలసి విందుకొచ్చాడు,రత్నం ఇంటికి.
రత్నం ఇంటికొచ్చిన ముత్యం దంపతులు, రత్నం దంపతులకు బహుమతులిచ్చి, విందు స్వీకరించి,కులాసాకబుర్లతో, ఆటపాటలతో గడిపేసారు. ఆరేళ్ళ రత్నం ఏకైక కుమారుడు, ముత్యానికి, అతని భార్యకు బాగా చేరికయ్యాడు, ఆ ఒక్క రోజులోనే. ఇంటికి బయలుదేరుతూ ముత్యం దంపతులు రత్నం కుమారుడిని తమతో తీసుకెళతామని కొద్ది రోజులుంచుకుని పంపుతామని అనడంతో రత్నం దంపతులు అంగీకరించారు.
రత్నం ఆరేళ్ళ కొడుకు ముత్యం పిల్లలతో కలసి ఆటపాటల్లో మునిగిపోయాడు, ఇంటి ధ్యాసే మరచాడు. ఒక రోజు, ముత్యం భార్య పెరటితోటలో తిరుగుతుండగా ముల్లు గుచ్చుకుని కూలబడింది. కూడా ఉన్న పరిచారిక ముల్లును బయటికి తీసిందిగాని, కాలిలో ముల్లు విరగడంతో, లోపల ములుకు ఉండిపోయింది. పరిచారిక అదిగమనించి సన్నటి సూదిని తీసుకుని, నెమ్మది ములుకు చుట్టూ కుట్టి ములుకును బయటికితీస్తూ. 'ముల్లును ముల్లుతోనే తీయాలమ్మా కంగారుపడితే ఉపయోగంలేదు' అన్నది. ఈ మాట ముత్యం భార్యకి ''మోసాన్ని మోసంతోనే జయించాలనే'' మాట స్ఫురింపజేసింది, ఉత్సాహపడింది. ఆ రాత్రి ముత్యంతో మాటల్లో జరిగినది చెప్పి 'మోసాన్ని మోసంతోనే జయించాలి,వజ్రం వజ్రేన భిద్యతె' అనే మాట గుర్తు చేసింది. ఆలోచనలు రాపాడాయి, రూపు దిద్దుకున్నాయి,అపాయంలేని ఉపాయంతట్టింది.
మర్నాడు సాయంత్రం ముత్యం అవుడు గుడుచుకుంటూ రత్నం దగ్గరికి పరిగెట్టుకొచ్చాడు. రత్నం ఏమయిందని కంగారూ పెట్టేడు. ముత్యం తమాయించుకుని, ''మిత్రమా! నీకొడుకూ నేనూ సంతలోకెళ్ళేం. అక్కడ తినుబండారం కొనుక్కున్నాడు.
తిరిగి వస్తుండగా ఒక పెద్దగద్ద వచ్చి కుర్రవాడిని ఎత్తుకుపోయిందని'' బావురుమన్నాడు. విన్న రత్నం కూలబడి కోపంతో ''నువ్వే నాకొడుకును ఏదో చేసేవు,లోకంలో గద్ద మనుషుల పిల్లలని ఎత్తుకుపోవడం విన్నామా?'' అంటు రంకెలేసి, గబగబా రాజుగారి దగ్గరికి పరిగెట్టేడు.
రాజుగారి తో,
”ముత్యమనే అతను నా స్నేహితుడు ఐదేళ్ళకితం వ్యాపారం కోసం విదేశం వెళ్ళేడు. కొద్దిరోజుల కితం తిరిగొచ్చేడు. ఆ సందర్భంగా విందు ఇచ్చాను. విందు తరవాత నా కొడుకును తమ దగ్గర కొన్ని రోజులుంచుకుని పంపుతామని ముత్యం దంపతులు చెబితే వారితో పంపించాను. ఇదిగో ఇప్పుడు ముత్యం, నా కొడుకును గద్ద ఎత్తుకుపోయిందంటున్నాడు. తమరే విచారణ చేసి న్యాయం చేతాలని కోరుతున్నా” అన్నాడు
''లోకంలో గద్దలు కోడిపిల్లల్ని ఎత్తుకుపోడం విన్నాంగాని ఆరేళ్ళ పిల్లాణ్ణి ఎత్తుకుపోడం వినలేదు మహరాజా! ముత్యమే నాకొడుకుని ఎదో చేసేడని'' బావురుమన్నాడు. విన్న రాజు ముత్యం కోసం కబురంపేడు. ఈలోగా అక్కడే ఉన్న మంత్రి గూఢచారితో జరిందేమో రహస్య విచారణ చేసుకురమ్మన్నాడు. ఈలోగా ముత్యం చేతులుకట్టుకుని రాజు ఎదుట నిలిచేడు. కుర్రాణ్ణి ఏంచేసేవో చెప్పమని ముత్యాన్ని నిలదీశాడు రాజు. దానికి ముత్యం, 'నేను కుర్రాణ్ణి ఎమీ చేయలేదు, నిజంగానే గద్ద పిల్లాణ్ణి ఎత్తుకుపోయింది మహరాజా' అని లబలబలాడేడు.దానికి రాజు 'గద్ద ఆరేళ్ళ పిల్లవాణ్ణి ఎత్తుకుపోయిందంటే నమ్మమంటావా?' అడిగాడు రాజు. దానికి ముత్యం ''రెండు వందలబారువుల ఇనుమును ఎలుకలు తిన్నాయని మిత్రుడంటే నమ్మేను
ఆరేళ్ళ కుర్రాణ్ణి గద్ద ఎత్తుకుపోడం విచిత్రమా మహరాజా!'' అని వాపోయాడు.
విషయం విన్నరాజు, జరిగింది నిజం
చెప్పమన్నాడు. దానికి ముత్యం జరిగినదంతా వివరించాడు. తగువు వ్యాపారానికి సంబంధించినది, ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించినరాజు,విచారణ మర్నాటికి వాయిదా వేసేడు. మర్నాటికి వేగుల దగ్గరనుంచి వార్తా వచ్చింది. ఇనుము ఎలుకలు తినేసేయని నీవన్నావని నీ మిత్రుడు అంటున్నాడు. దీనికి నీ సంజాయిషీ ఏమంటే, రత్నం, ''నిజంగానే ఎలుకలు ఇనుమును తినేసేయి మహరాజా'' అన్నాడు. అప్పుడు రాజు ''రెండు వందల బారువుల ఇనుమును ఎలుకలు తిన్నాయంటే ముత్యం నమ్మేడు, నువ్వూ అదే చెబుతున్నావు, నేనూ నమ్మేను, ఆరేళ్ళ కుర్రవాడిని గద్ద ఎత్తుకుపోయిందంటే నమ్మలేనా? గద్ద ఎత్తుకుపోతే ముత్యం ఏం చేయగలడో చెప్పు'' అన్నాడు. దానికి రత్నం నిజం చెప్పుతున్నా మహరాజా!
ముత్యం విదేశం వెళ్ళే ముందు నా గొదాములో 200 బారువుల ఇనుము నిలవచేసిన మాట నిజం. సంవత్సరంలో వస్తాను, వచ్చాకా అమ్ముకుంటానన్నది నిజం..ముత్యం అనుకున్నట్టుగానే సంవత్సరానికి ధర రెట్టింపైయ్యింది,ముత్యం రాలేదు, ఆపై మూడేళ్ళు అగాను, నాలుగురెట్లయింది, ధర. మిత్రుని జాడలేదు. ఆగలేక అమ్మేసాను. కొంతకాలం సొమ్ము వేరుగా ఉంచాను, ఆ తరవాత నా సొమ్ములో కలిపేసాను. మిత్రుడు వచ్చి ఇనుము అమ్ముతాననడంతో స్వార్థం మనసులో అప్పటికప్పుడు పుట్టి కట్టుకత కల్పించి, ఎలుకలు ఇనుమును తినేసాయని చెప్పేను. తప్పుచేసాను. ''మొత్తం సొమ్ము వడ్డితో సహా ఇచ్చుకుంటాను. తమరు వేసే శిక్షకు కూడా అర్హుణ్ణి మహరాజా! నన్ను క్షమించమని వేడుకుంటున్నాను'' అని లబలబ లాడేడు. విన్న,రాజు రత్నం చెప్పినట్టు సొమ్ము ముత్యానికిచ్చేటట్టు, మోసం చేయాలని ప్రయత్నించినందుకు మరొక లక్ష రూపాయలు ముత్యానికి అదనంగా చెల్లించేటట్టు,ఖజానాకు కొంత పరిహారం చెల్లించేటట్టు, ముత్యం రత్నం కొడుకును అతనికి అప్పచెప్పేటట్టు తీర్పు చెప్పేడు. దానికి, ముత్యం రాజుకు ధన్యవాదాలు చెబుతూ, ''ఇతను నా మిత్రుడు, బలహీన క్షణంలో దురాశకు లోబడిపోయాడు. ఇతన్ని క్షమించండి. నాకు నా ఇనుము అమ్మిన సొమ్ముమిస్తే చాలు, వడ్డి కూడా వద్దు. అతని గొదాముకు ఇవ్వవలసిన అద్దె నా కివ్వవలసిన సొమ్మునుంచి మినహాయించుకోవచ్చును. రత్నం కొడుకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు'' తమ ఆజ్ఞతో హాజరు పెడతాననడంతో, రత్నం కొడుకును ప్రవేశపెట్టి రత్నానికి
అప్పజెప్పడం జరిగింది. జరిగినదానికి సిగ్గుపడ్డ రత్నం ముత్యం కాళ్ళకి మొక్కేడు, అంతట ముత్యం మిత్రుణ్ణి లేవదీసి గుచ్చి కౌగలించి, నీవు చిరకాల నామిత్రుడివి, బలహీన క్షణంలో తప్పు చేసినంతలో నిన్ను వదులు కోగలనా? నీ కొడుకు నా ప్రాణం కదూ! అటువంటివానికి హాని చేస్తానని ఎలా అనుకున్నావని అడిగాడు.
రత్నం మరో సారి చేసినదానికి సిగ్గుపడ్డాడు
చిన్నప్పుడు చదువుకున్న కత. నేను కొంత మార్పు చేసేనేమో కూడా, పూర్తిగా గుర్తులేక. స్వార్ధం ఎంతపని చేయిస్తుందన్నది, కతలో ముఖ్యభాగం, అలాగే మిత్రుడు క్షణిక బలహీనతకు లోనైనా సరిదిద్దుకోవాలిగాని శత్రుత్వం వహించడం కాదని నీతి చెప్పే కత.