Saturday, 27 May 2023

నృపస్య చిత్తం

  నృపస్య చిత్తం


నృపస్య చిత్తం కృపణస్య విత్తం

మనోరథా దుర్జనమానవానా

స్త్రియా చరిత్రం పురుషస్య భాగ్యం 

దేవో న జానాతి కుతో మనుష్య 

రాజు మనసు, లోభివాని సంపద,దుర్జనుని జేవితేఛ్చ,స్త్రీల చరిత్ర, పురుషుల సంపాదన, దేవునికే తెలియదు, మనుషులకా?

( దేవునికి కూడా తెలియనివ్వనంత గుట్టుగా ఉంచుతారు, ఇక మనుషులకెలా తెలుస్తుంది?) 


రాజుమనసెపుడూ గుట్టే! అలాగే ఉండాలట. ఎవరినీ నమ్మడు, పెళ్ళాన్ని కూడా!! నమ్మేడో ఐపోయాడే!!!


లోభివాని సంపదెంత?అతనికే తెలీదు. తెలియనివ్వడు. అంతే!!!ఎక్కడ దాచాడో తెలియదెవరికి, తెలియనివ్వడు కూడా. నేడు రెండు వేల రూపాయల నోట్ల కట్టలు బయట పడుతున్నట్టు. ఏదీ? ఎక్కడా చప్పుడు లేదే!


దుర్జనుని జీవితాశయం ఏమై ఉండచ్చు...దేశం ఏమైపోయినా బాధలేదు, అంతే, జీవితాశయం గుట్టే


స్త్రీల చరిత్ర అంటే పుట్టు పూర్వోత్తరాలు, అంటే వయసు గుట్టు, అదీ సంగతి.


పురుషుని సంపాదన, జీతమో, గీతమో, ఏ సంపాదనా గుట్టే


వీటిని పైవారు దేవునికి కూడా తెలియనివ్వరు, మనుషులకెలా తెలియనిస్తారు???

Thursday, 25 May 2023

శ్రీమాత్రేనమః

 శ్రీమాత్రేనమః

అరవైరెండు సంవత్సరాల కితం, ఇరవై సంవత్సరాల వయసులో, ఇదే రోజు యుగళజీవితానికి అనుమతించి, ఏభైఆరు సంవత్సరాలు అవిఛ్చినంగా కొనసాగింపజేసిన అమ్మకు వందనం.


ఐదు సంవత్సరాలుగా ఒంటరిజీవితాన్ని ప్రసాదించిన అమ్మకు వందనం.


వందనము రఘునందనా! భక్త చందనా!!సేతు బంధనా!!!రామా

వందనము రఘునందనా!!!!!


జీవితం వడ్డించిన విస్తరి కాదు!పూల పాన్పూకాదు!! జీవితం నల్లేరు మీద నడకా కాదు, పల్లేరులూ గుచ్చుకుంటాయి.


 ఈ రోజు ఉదయం నడక ప్రారంభిస్తుండగా  జిలేబి పద్యం రాలింది.

"తాతగారికి,
యుగళపు జీవన మధురిమ
ల గమనపు తొలకరి జల్లు లా తల్లి జతన్
జగమున మొదలైన దినము
న గ చింతనమదె మదిని మునకలిడ ప్రణతుల్"

 పద్యంచూస్తూ అడుగులు ముందుకేస్తే రెండు కాళ్ళలోనూ పల్లేరుకాయలు గుచ్చుకున్నాయి. ఒక్కసారిగా కూలబడ్డా. అరికాళ్ళలో గుచ్చుకున్న పల్లేరులేరిపారేశా. లేచినిలబడ్డా!నడక సాగించా!ఆలోచనలో పడి అదేపనిగా నడుస్తుండగా ఒక మనవరాలెదురొచ్చి, తను నాముందుండి, తను వెనక్కి పరిగెడుతూ,ఏంటీ! ఎప్పుడూ లేనిదివేళ ఇంకా నడుస్తున్నారూ? అంటూ ఆపింది. ఆగాను ప్రకృతిలో పడ్డాను.అనుక్షణం నన్ను గమనించే అమ్మకు వందనం.  


జీవితంలో కుప్పలా కూలబడిపోయిన సంఘటనలూ ఉన్నాయి,లేవలేమోననుకున్న ప్రతిసారి లేవగలవు, ముందడుగు వెయ్యి,చివరిదాకా నడవగలవు,నడవాలనే  ధైర్యాన్ని, దృక్పధాన్నిచ్చిన ,అమ్మకు మరోసారి వందనం. 


ఈ టపా రాసేందుకు అవకాశం కలగజేసిన జిలేబికి వందనం.ఈ మధ్య కాలంలో లేనిది, ఈ టపా రాసే అరగంటలోగా రెండుసార్లు కరంటు తీసేసి, మార్పులు,చేర్పులు,కూర్పులకు తోడిచ్చిన కరంటువారికి ప్రత్యేక వందనం.


మరొకసారి

వందనము రఘునందనా! సేతు బంధనా!! భక్తచందనా!! రామా!! వందనము రఘునందనా!!

శ్రీమాత్రేనమః 

Monday, 22 May 2023

కోటాకు ,పొత్తు, పువ్వు, గెల

 

కోటాకు

కోటాకు

పొత్తు

పువ్వు

పళ్ళగెలవేసే అరటిచెట్టు కొంచం పొట్టిగా,లావుగా పెరుగుతుంది.ఎరుపు డౌలుంటుంది.ఆకులు వెడల్పుగా పెద్దవిగా ఉంటాయి. పువ్వు పొడుగ్గా వుంటుంది, కొద్ది ఎరుపు డౌలు. గెలకి అత్తాలు పదిపైన ఉంటాయి.అత్తానికి ఇరవై నుంచి ఇరవైనాలుగు పళ్ళుంటాయి.

కాయలగెలచెట్టు కొద్ది పొడుగు ఆకుపచ్చగా ఉంటుంది,పువ్వు పొట్టిగా, చిన్నదిగా, బాగా ఎర్రగా ఉంటుంది,ఆరునుంచి ఎనిమిదత్తాలుంటాయి. అత్తానికి పది నుంచి పన్నెండు కాయలుంటాయి. ఆకులు పొడుగ్గా ఉండి కొద్ది వెడల్పు తక్కువుంటుంది.
(పనికిరాని పరిజ్ఞానం)

గెల
ది చక్కెరకేళీ పళ్ళ గెల. అత్తాలు నాలుగుగాని ఐదుగాని ఉంటాయి. అత్తానికి పదమూడు కాయలుంటాయి. అత్తంలో పైన ఏడు కింద ఆరు కాయలుంటాయి. 

Tuesday, 9 May 2023

ముక్కు,బొడ్డు జానకి అందుతాయా???

 ముక్కు,బొడ్డు జానకి అందుతాయా???


అమ్మా ఆకలేస్తోందే!


నిన్ననంతా జ్వరం పేలేసింది, లంఘనం చేసేవుగా. సీతారామయ్య తాతగారి దగ్గర కెళ్ళి ఆయన చేత చెయ్యి చూపించుకున్నావా?


వెళ్ళేను. చెయ్యి చూసేరు. ఆ తరవాత, ఒరే! ముందుకువంగి నీజానతో ముక్కుని,బొడ్డునీ అందుకో! ( జాన అంటే చిటికినవేలు చివరనుంచి బొటన వేలు చివరదాకా కొలత. ఇది తొమ్మిదంగుళాలే)


 అన్నారు.


అందిందా?


లేదు. 


మరేమన్నారు? ఈ వేళా,రేపూ లంఘనం చేసెయ్యీ అన్నారు.


ఇంకేం మరీ,తాతగారి మాటంటే సుప్రీం కోర్టు ఆర్డరే, అపీల్లేదు.అన్నం పెట్టను.


ఆకలేస్తోందే మరీ!


అక్కడ గ్లాసులో పాలెట్టేను తాగి పడుకో! ఎండనబడి గెంతకు, ఆగమ్మకాకిలా తిరక్కు, పుస్తకం తియ్యకు, పరుపుమీద పడుకోకు, నులకమంచం మీద బొంతేసుకు పడుకో!!!   అమ్మమాటంటే మెజిస్ట్రేటు కోర్టు ఆర్డరైనా సుప్రీంకోర్టు కెళ్ళినా తిరుగులేదు. ఏమో సుప్రీం కోర్టులో మరోటి తగిలించచ్చు కూడా!   అందుకే చచ్చినట్టు కుక్కినపేనులా అమ్మచెప్పినట్టి వినేసి పడుకోడమే మంచిదనిపించేది. 


జానతో ముక్కును,బొడ్డునూ అందుకోవడం ఒక టెస్టు, జ్వరం తగ్గిందీ లేనిదీ చెప్పడానికి, ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అంతే! ఇప్పుడు బొడ్డూ, ముక్కూ జానకి అందవు,నూటికి తొంభై మందికి.  ప్రయత్నంచద్దూ, వెన్ను నెప్పెడుతుంది. ఏం? మీ వెన్ను ముదిరిపోయింది, అది వంగదు.  మనం నడ్డొంచి పనిచేసినదెప్పుడూ! కూచుని ఫోన్ గీకడం తప్పించి చేసే పనే లేదుకదా!!అందుకు అదంతే! అంతే!!


మొన్ననోరోజు ఉదయపు నడకలో ఒకతను నలతగా ఉన్నట్టనిపిస్తే ఏమని అడిగేరు. జ్వరమొచ్చింది, తగ్గిందో లేదోగాని నీరసంగా ఉందన్నాడు. అదేమయ్యా! అనారోగ్యంతో వ్యాయామం చేయకూడదు. ముందుకువంగి జానతో బొడ్డూ,ముక్కూ అందుకోమన్నా! ప్రయత్నం చేసేడు, అందలేదు. ఇక అక్కడున్నవాళ్ళంతా ప్రయత్నం చెయ్యడం మొదలెట్టేరు. ప్రయత్నించినవారెవరికి అందలేదు. కొంతమంది సిగ్గుపడి అందుకోలేదు. వాళ్ళలో ఇద్దరిని చూపించి మీకు అందుతుంది చూసుకోండి అన్నా! ఆ కుర్రాళ్ళిద్దరూ ప్రయత్నం చేసేరు, ముక్కు,బొడ్డూ జానకి అందేయి. ఇప్పుడు ఇదొక వ్యాయామమైపోయింది :)

Sunday, 7 May 2023

అరటాకెళ్ళి ముల్లుమీద పడ్డా.....

 అరటాకెళ్ళి ముల్లుమీద పడ్డా.....


అరటాకెళ్ళి ముల్లుమీద పడ్డా, ముల్లెళ్ళి అరటాకుమీద పడ్డా  అరటాకుకే నష్టం !!! ఇదో పాతకాలపు నానుడి. ఆ కాలంలో ఆడపిల్లతో మగవాడు మాటాడితే ఆడపిల్ల బతుకు బండలైపోతుందనీ, పాడైపోతుందనీ, అలాగే  ఆడపిల్ల చొరవ తీసుకుని మగాడితో  మాటాడినా ఫలితం అలాగే ఉంటుందనీ చెప్పేవారు. ఆ తరవాత ఆడపిల్ల వీపు సాపు చేసేవారు. ఇదే లోకపు తీరు, నాడు.   


కాని రోజులు మారాయి. 


రోజులు మారాయా! లేదు!! అవే సంవత్సరాలు,అవే ఆయనాలు, అవే ఋతువులు, అవే మాసాలు, అవే పక్షాలు, అవే వారాలు, అవే గంటలు, నిమిషాలూన్ను. మరి మారిందేంటీ? మనిషి బుద్దులు మారాయి. 


ఇప్పుడు మగాడు ఆడపిల్లతో మాటాడినా, ఆడపిల్ల మగాడి వెంటపడినా,వేధించినా,మాటాడినా, పగిలేది మగాడి వీపే. వాడే వయసువాడైనా, ఏమి మాటాడినా, లోకం వినదు. మగాడి వీపు పగలడం ఖాయం.


ఆడవారితో దూరంగా ఉండడం ఆరోగ్యానికి మంచిది. తస్మాత్ జాగ్రత,జాగ్రత.  

Monday, 1 May 2023

అని, అనిపించుకోడం....

 అని, అనిపించుకోడం అత్తగారూ నీకలవాటు.


ఇదొక నానుడి,తెనుగునాట బాగా చెప్పుకునీదిన్నూ!! అత్తగారంటే సాధించేదనీ,వేధించేదనీ,బాధించేదనీ..... 


కొడుక్కి పెళ్ళిచేస్తే కోడలొస్తుంది,అప్పుడే అత్తరికమూ వస్తుంది. అత్తయ్యేటప్పటికి వయసూ మళ్ళుతూ ఉంటుంది, కోడలివి వచ్చేరోజులు అత్తవి పోయే రోజులూన్నూ. పాతరోజుల్లోలా అత్త అథారిటీ చెలాయిస్తానంటే కుదురుతుందా!!!! కుదరకపోవచ్చు. మరేం చేయ్యాలి? అదిగదా కొచ్చను? గౌరవం నిలబడాలంటే అత్త తగ్గి ఉండటం మంచిది కదా!!!!!  కాదు పాతరోజుల్లో లా అథారిటీ చెలాయిస్తానంటే ఎలా? ఇప్పటిరోజుల్లో మాటంటే కోడలూరుకుంటుందా? ఒకమాటంటే తనూ మరోమాటంటుంది, అంతే! తమలపాకుతో నీ వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా, అని చేతలకి కూడా దిగచ్చు.


తెనుగింటి అత్త అంటే ఎలావుంటుందంటే ”సూరేకాంతా”న్నే చెప్పుకోవాలి.అత్తపాత్రలో అంతగా ఇమిడిపోయి నటనలో జీవించిన నటి మరొకరు నేటికిన్నీ లేరు,లేరు,లేరు.ఇంతటి దుష్టపాత్రల్ని పోషించినామె మనసువెన్ననీ, షూటింగ్ సమయంలో అందరికి తాను ఇంటి దగ్గర స్వయంగా చేసి తెచ్చిన తినుబండారాలు పంచిపెట్టేదని నేటికిన్నీ చెప్పుకుంటూ ఉంటారు.    అత్తని తలుచుకుంటే సూరేకాంతాన్ని తలుచుకోకపోవడం పాపం.అత్తరికం వెలగబోయడం  వ్యక్తులకే కాదు దేశాలకీ వర్తిస్తుందిష.


పరోపదేశసమయే జనాః సర్వేఽపి పండితాః

తదనుష్ఠానసమయే మునయోరఽపి న పండితాః


 ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో మాదే గొప్ప దేశమని డబ్బా కొట్టుకునే అమెరికా ఈ మధ్య ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది, ఏమనీ? మీ దేశంలో గుజరాత్ కోర్ట్ రాహుల్ గాంధీ పై ఇచ్చిన తీర్పును గమనిస్తున్నామూ, అని. ప్రజాస్వామ్యదేశమని చెప్పుకుంటూ ఇతరదేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడమేమీ? అడిగేరు కొందరు. ప్రజాస్వామ్యదేశాలలో జరిగేవాటిని గమనిస్తుంటాం! అంతేగాని అది ఆ దేశపు విషయాలలో జోక్యం కాదూ, అని సెలవిచ్చేరు. సరి! ఇలాటివి ఆ దేశానికి కొత్తకాదు, మొదటిసారికాదు.  తెచ్చిపెట్టుకున్న అత్తరికం వెళ్ళబోయడం ఈ దేశపు అలవాటూ! ఇది కొత్తాకాదు. ఇలా జరుగుతున్నందుకు ఆ దేశాలూ గట్టిగా సమాధానాలూ చెప్పటంలేదు, కారణాలు తెలిసినవే! కోడలికి కూడా రోజొస్తుందికదా! అలాగే భారతదేశానికీ రోజొచ్చింది. మీదేశంలో మాజీ ప్రెసిడెంటును కోర్టులో అరెస్టు చేసిన విషయం గమనిస్తున్నామని చెప్పి బదులు తీర్చేసేరు. అంచేత అని అనిపించుకోవడం అత్తగారి లక్షణమనుకోవాలా?