నందిపై ఈశ్వరుడు (కర్నాటక)
నమఃశంభవే చ మయోభవే చ
నమఃశ్శంకరాయ చ మయస్కరాయ చ
నమఃశ్శివాయ చ శివతరాయ చ
తిక్కమొగుడితో తీర్థమెళితే...
తిక్కమొగుడితో తీర్థమెళితే తిప్పి/తిప్పి తిప్పి చంపేడంటారు.చాలా రకాల మొగుళ్ళ గురించి అనుకున్నాం. ఈ గొలుసులో చివరగా తిక్కమొగుడు...
తిక్కమొగుడెవరు? అదీ కొచ్చను..తనకి, తనపెళ్ళానికి బాగున్నది, మంచిది అనుకున్నదేదైనా, తన పెళ్ళానికి నచ్చినదేదైనా చేసేస్తాడు, ఎవరేమనుకున్నా, అన్నా లెక్కచేయడు, అదీ తిక్క. తిక్క దానికోలెక్కా అని ఆధునికులనుకునేదానికి మొదలిక్కడుంది.పెళ్ళామంటే లెక్కలేనంత ప్రేమ. ఒక కత చెప్పుకుందాం.
అదో పల్లె, కొత్తగా పెళ్ళైన జంట.అప్పుడప్పుడే కొత్త వీడుతున్న కాలం, ఇద్దరూ మంచి ముమ్మరంమీదున్న కాలం. ఇద్దరూ చిలకా గోరింకల్లా కాలం గడుపుతున్న కాలం.ఒకరొనొకరు వదలి ఉండలేనికాలం. ఒక రోజు రాత్రి, మొగుడు గుండెలపై తలపెట్టుకుని పడుకున్న సమయంలో, జాయ నెమ్మదిగా అడిగిందిలా! ”శివరాత్రి వస్తోంది, ఉపవాసం , రుద్రాభిషేకం , పట్టిసీమ వీరభద్రస్వామి, భద్రకాళీ దేవిల మహోత్సవం, జాగరం, తీర్థం చూసొద్దామా?” ”నువ్వేమో ఏడు మల్లెపూలెత్తు, మా అమ్మాయి కష్టపడలేదు సుమా! అని మీ నాన్న మరీ మరీ చెప్పేడు, నిన్ను అంపకాలెడుతూ!” "తీర్ధమంటే ఇసకతిప్పలో నడవాలి,ఉపవాసంతో, దగ్గరేం కాదు, కొండెక్కాలి, దిగాలి.ఏమో ఎన్నిసార్లో! నడవగలవా! నడక తప్ప మరో దారిలేదు" అన్నాడు. "ఆ( నడిచేస్తా" అంది ధీమాగా! సరే ఐతే ఏర్పాట్లు చేస్తాగాని, ”బండి కట్టనా? పడవమీదెళ్దామా?” అడిగాడు. ”నీటి మీద ప్రయాణం బాగుంటుంది కదూ” అనేసింది.
మర్నాడే గూటిపడవ పురమాయించేసేడు, గూటిపడవలో కావలసినవన్నీ సద్దించేసేడు,అభిషేకానికి కావలసిన కొబ్బరికాయలు వగైరాసామాన్లు, అమ్మవారికిచ్చే బట్టలు, విశ్రాంతికి పరుపుతో సహా! వీరభద్రస్వామికి అభిషేకానికి పురోహితులకీ చెప్పేసేడు. పాలికాపుకి పురమాయించవలసినవి చెప్పేసి, తను పెళ్ళాంతో బయలుదేరేడు శివరాత్రి ఉదయమే!
కను చీకటి వేళ పురోహితులతో బయలుదేరి గోదారి రేవుచేరి పురోహితుల సంకల్ప మంత్రోచ్చారణతో సరిగంగ స్నానాలు చేసి, పురోహితులతో సహా,గూటి పడవెక్కేసేరు, మంది మార్బలంతో. చిరుచలిగాలిలో పడవ బయలుదేరిoది. పట్టిసీమ వీరభద్రస్వామి గుడికి దూరంగా ఇసకతిప్పదగ్గర దిగేరు ,సూర్యోదయమవుతుండగా!
తీర్థంలో జనం పల్చగా ఉన్నారు. చెంగున దూకింది ఇసకతిప్పలోకి, జాయ. పతి అనుసరించాడు. హుషారుగా రెండు మైళ్ళ ఇసకతిప్ప నడచి కొండెక్కేసేరు.జనం, ఒకటే జనం, స్వామి దర్శనానికి. పురోహితులు మహన్యాసపూర్వక
రుద్రాభిషేకం దంపతులతో చేయించేటప్పటికి పదకొండయింది. భద్రకాళిని దర్శించి లలితాసహస్రంతో పురోహితులు పూజచేయిస్తే, అమ్మకి నూతనవస్త్రాలు సమర్పించి, పరివార దేవతలను, క్షేత్రపాలకుడు రాములవారిని దర్శించేటప్పటికి ఒంటిగంట దాటింది. ఉపవాసమే కనక ఇబ్బంది లేదు, కాని ఫలహారానికి పళ్ళు తెస్తానని బయలుదేరాడు, పతి. నేనూ వస్తానంది, జాయ. ఇద్దరూ బయలుదేరారు తీర్థంలోకి, పళ్ళకోసం. బుట్టలతో కమలాలు, ఆపిలు, ద్రాక్ష,ఖర్జూరం, ఇలా కనపడ్డ పళ్ళు కొనేసేడు.కొన్ని తను, కొన్ని మార్బలం తెస్తుంటే, నేనూ అని ఒక బుట్ట పట్టుకుంది జాయ. నేనూ తెస్తా కొన్ని అంది, వద్దనివారించాడు, వినక ఒక చిన్నబుట్ట చేతబట్టింది, కొండెక్కేరు. ఫలహారానికి, పళ్ళు పురోహితులకు, తనపరివారానికి, అక్కడ ఉపవాసం ఉన్నవారికి,జాయ చేత ఇప్పించాడు. చివరగా తామిద్దరూ కొన్ని తీసుకున్నారు.సమయం గడచిపోయింది, తెలియకనే!
గోధూళి సేవాదర్శనం చేసుకుని, కొండదిగి తీర్థంలోకొచ్చారు.
రాత్రి, కరంటు దీపాలతో తీర్థం కళకళలాడుతోంది. తీర్థం అంటే చిన్నదా? దగ్గరగా ఇరవై చదరపు కిలోమీటర్ల మేర ఉంటుంది, ఇసకతిప్పలో. ఒకసారి తిప్పేడు, జాయ తీర్థంలో కొనుక్కోవలసినవి కొనుక్కుంది, వాటిని సేవకులు పడవలోకి చేర్చేరు. మళ్ళీ రెండవసారి తీర్థంలో కి వింతలు విశేషాలు చూస్తూ బయలుదేరారు. కొంత దూరం తరవాత జాయ నడక మందగించింది, ఉదయం నుంచి ఉపవాసం, ఇసక తిప్పలో నడక, కొండ ఎక్కి దిగడంతో. ఏం? అడిగాడు పతి. కాళ్ళు లాగుతున్నాయంది జాయ.
ఒకపక్కగా కూచోబెట్టేడు కాసేపు,కాని ఉపయోగం ఉన్నట్టనిపించలా జాయకి, నడచేలా లేదు. ఏం చేయాలో తోచలేదు కొంతసేపు. ఇప్పుడు పతి, హనుమంతునిలా ఒక కాలు మడచి కూచుని జాయను భుజం మీద ఎక్కమన్నాడు. జాయ ''అదేంపనీ? వద్దు వద్ద''ని సిగ్గుపడింది. పతి బలవంతం చేసి జాయను భుజం మీద ఎక్కించుకుని తీర్థంలో తిప్పేడు. చూసిన జనం గుసగుసలు పోయినవాళ్ళు, అదేం పని అడిగినవాళ్ళు, ఎంత పెళ్ళామంటే ప్రేమన్నా! ఇంతా? అని బుగ్గలు నొక్కుకున్నవాళ్ళు, అదీ మొగుడంటే!, పెళ్ళాం కాళ్ళులాగితే భుజమెక్కించుకుని తీర్థం తిప్పేడు, అంటూ. ఇదొక వింతయిపోయిందారోజు తీర్థంలో జనానికి.
తొమ్మిది ప్రాంతంలో కొండపైకి చేరేరు, అక్కడ దించాడు జాయని, కిందకి.ఇప్పుడు వేద సభ ఉంటుంది చూద్దామని జాయని తీసుకుపోయి వేద సభలో, వేద పండితుల, వేద పఠనం విని, విశ్రాంతి సమయంలో జాయ చేత తాము తెచ్చినపళ్ళు దక్షిణ తాంబూలాలతో, తమతో వచ్చిన పురోహితులను,
వేదపండితులను సత్కరింప చేసేడు. జాయ,పతి వేద పండితుల ఆశీర్వాదం పొందారు. పన్నెండైంది, ఇప్పుడు లింగోద్భవకాల దర్శనం చేదామని జాయతో కలిసి దర్శనం చేసారు.
స్వామి ఊరేగింపు ఉత్సవం బయలుదేరింది తీర్థంలోకి. స్వామితో ఊరేగింపుతో బయలుదేరారు. నడక జాయకి కష్టం, దానికితోడు, జనంలో జాయకి ఏమీ కనపడకపోతుండటంతో మళ్ళీ భుజానికెత్తుకున్నాడు. ఉత్సవం తిప్పాడు, తీర్థంలో తిప్పాడు. ఉదయంనుంచి ఉపవాసం, నడక, శ్రమతో అలసిపోయిన జాయ ఇక భుజంమీద కూడా కూచోలేనంటే పడవలోకి చేర్చి, పరుపుపై పవళింపుసేవ చేసాడు.
పడవ బయలుదేరింది. మళ్ళీ సూర్యోదయానికి రేవులో దిగేరు. సరిగంగ స్నానాలు చేసి, ఇంటికి చేరేరు.ఇంతతో కత ఐపోతే నానుడే లేదు, అసలు కత ఇప్పుడే మొదలయిందా పల్లెలో.
రెండు రోజులు, బడలికతో ఇద్దరూ బయట కాలుపెట్టలేదు. తీర్థంలో జరిగినది, గుడిలో జరిగినది,వైనవైనాలుగా, అంచె టపాలమీద వార్తలు ఆ పల్లెకు జేరిపోయాయి. ఇప్పుడందరిదీ అదే విషయం మీద చర్చ.
మూడో రోజు రచ్చబండ దగ్గర ఒక పెద్దాయన పతిని చూసి పెళ్ళాన్ని తీసుకుని తీర్థమెళ్ళొచ్చావట కదూ? బాగా ఖర్చు పెట్టేవట! అని చర్చకి పునాది వేసేడు.
కలిగినవాడూ!, ఖర్చుపెట్టకపోతే ఎలా బాబాయ్! అన్నాడొక బక్కప్రాణి.
పెళ్ళాం ముద్దు చెల్లించేడు లెద్దూ! అనేసేడు మరో నీరసప్రాణి.
అబ్బాయ్! పెళ్ళాం మీద ఎంత మోజున్నా, ముద్దున్నా ఇలా తీర్థంలో ఊరేగింపు చెయ్యడం...... అని అర్ధోక్తిలో ఆగేడో నడివయసువాడు.
వాడి పెళ్ళాన్ని, వాడు భుజం ఎక్కించుకున్నాడు తప్పేంటీ? అడిగేడో అభ్యుదయవాది.
మరో పెద్దాయన అప్పటిదాకా వింటున్నవాడు, యువకుడివి, కలిగినవాడివేననుకో, ఖర్చుపెట్టగలవు పెళ్ళాం కోరిక, ముద్దు తీర్చడానికి. పెళ్ళాన్ని మల్లెపూవులా చూసుకున్నావు, ఆనందమే, కాని లోకముంది చూడూ! లోకులు పలుగాకులు,జాగ్రత్తా! అని ఉపదేశం చేసేడు. పతి మాటాడింది లేదు.
ఆరోజు మహిళలంతా సభ తీర్చారు మధ్యాహ్నం. జాయకి తోటికోడలు వరసామె, మా మరిది తీర్థం తీసుకెళ్ళేట్ట నిన్ను,గూటిపడవ కట్టిచ్చేట్ట, అందులో పరుపులేయించేట్ట,మందీమార్బలం కూడా తీసుకెళ్ళేరట, గుళ్ళో ఉపవాసం ఉన్నవాళ్ళకి పళ్ళు పంచిపెట్టేరట,వేదసభలో సత్కారాలు చేసేరట... అని ఆగింది అర్ధోక్తిలో
ఇది విన్న మరొకామె కడుపు రవిలిపోయింది, తానందుకుని తీర్థంలో తిప్పేట్ట,కావలసినవి కొనిపెట్టేట్ట, కాళ్ళు లాగితే భుజాలెక్కించుకుని ఊరేగింపు చేసేట్ట, నిద్రకి ఆగలేకపోతే పడవలో పరుపుమీద పవళింపు సేవచేసేట్ట, కాళ్ళు పిసికేట్ట......, చెప్పలేదేమే అని కడిగేసింది.
ఎంత జరుగుబాటున్నా విరగబాటు పనికిరదమ్మా! అని జనాంతికంగా అనేసి ఊరుకుందో నడికారు మహిళ.
ఏమోనే మేమూ మొగుళ్ళతో తీర్థానికెళ్ళేంగాని ఇంత విరగబాటు చూళ్ళేదమ్మా!పిదపకాలం, పిదప బుద్ధులూనూ, పెళ్ళామంటే ఎంత ప్రేమున్నా భుజాలమీదెక్కించుకుని తీర్థంలో ఊరేగింపు చేస్తారుటే, నీకు సిగ్గనిపించలేదే!! అనేసింది మరో నడికారు మహిళ.
అంతా విన్న ఒక వృద్ధు గొంతు సవరించింది, అంతా ఆగేరు.
ఏమర్రా! దానిమొగుడితో అది తీర్థానికెళ్ళిందే! (మరెవరి మొగుడితో వెళ్ళలేదని సూచిస్తూ) దాని మొగుడు దాని ముద్దు చెల్లించాడు.ఇక్కడున్న వాళ్ళలో ఎంతమందికి జరుగుబాటులేదే? ఉండడం కాదే కావలసింది, అనుభవించడం కూడా తెలియాలి. అదే చేసి చూపించాడు దానిమొగుడు. దానిచేత పుణ్యకార్యం చేయించేడు, మీమొగుళ్ళు చేయించలేదని కుళ్ళు కాదుటే! దానికి తీర్థంలో కాళ్ళు లాగితే ఎత్తుకున్నాడు, దాని మొగుడు చంక అదెక్కింది!ఎప్పుడేనా మీ మొగుళ్ళు అలా చంకెక్కించుకున్నారుటే! తీర్థంలో తిరిగితే కాళ్ళు లాగుతాయని చెప్పేనా? విన్నవా? అనుభవించని తిట్టిపొయ్యలేదు, సాధించలేదు, నిబ్బరంగా పెళ్ళాన్ని భుజమెక్కించుకున్నాడు కదూ! వాడిపెళ్ళాన్ని వాడు భుజమెక్కించుకున్నాడుగాని, మరే రంకుపెళ్ళాన్నీ భుజమెక్కించుకోలేదే! వాడే మొగాడంటే, పెళ్ళాం బాధపడుతుంటే చోద్యం చూస్తూ కూచో లేదే, వాడేనే మగాడంటే. పెళ్ళామంటే నిజమైన ప్రేమున్నవాడే! దానికి నిద్దరొస్తే పడవలో పరుపులేయించి నిద్దరోమన్నాడు, ఎప్పుడో అది బంగారపు పువ్వులతో పూజచేసిందే, అందుకే దానికి అటువంటి మొగుడు దొరికేడే!
ఒసే! దానికి కాళ్ళు లాగితే పిసికేడనికదూ కుళ్ళు నీకూ! మీ మొగుళ్ళు పీక పిసకటమేగాని కాళ్ళు పిసకటం ఎరుగుదువే?వాడికి తిక్కేనే, ప్రేమఎక్కువైతే అనుభవించడమూ కష్టమేనేమో...తిక్కమొగుడితో తీర్థమెళితే తిప్పితిప్పి చంఫేడు కదూ! అని ముగించింది, మనకీ నానుడి మిగిలిపోయింది.
జాయ మాటాడింది లేదు. ఎవరిబతుకు వారు బతికినా లోకం ఊరుకోదు, ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.