Thursday 19 January 2023

సత్యంబ్రూయాత్

 సత్యంబ్రూయాత్


 సత్యంబ్రూయాత్ ప్రియంబ్రూయాత్

నబ్రూయాత్ సత్యమప్రియం

నిజంచెప్పు(అబద్దం చెప్పకు) సత్యాన్ని ప్రియంగా చెప్పు( అంటే ప్రియమైన సత్యమేచెప్పు). అప్రియ సత్యం చెప్పద్దూ!

ఇది సనాతనంగా చెబుతూ వస్తున్నమాట.సత్యం చెప్పడం అన్నివేళలా కుదురుతుందా? 


రామాయణంలో మారీచుడిలా చెబుతాడు

సులభా పురుషా రాజన్

సతతం  ప్రియవాదినః

అప్రియస్య చ పథ్యస్య

వక్తా శోతాచ దుర్లభః

రాజా! అందరూ ప్రియంగా మాటాడేవాళ్ళే దొరుకుతారెప్పుడూ!అప్రియమైన సత్యం చెప్పేవాడు దొరకడు,ఒకవేళ ఎవరైనా సత్యం చెబితే వినేవాడు లేడనే సత్యం చెప్పి ప్రాణాలమీదకి తెచ్చుకున్నాడు.

కాలం గడిచింది.

సత్యాన్ని ప్రియంగా ఎలా చెప్పచ్చో భారతం ఒక కత చెబుతుంది.

ఒక ముని తపస్సు చేసుకుంటూండగా, ఒక వేటగాడు ఒక లేడిని తరుముకొచ్చాడు. అది ఆశ్రమంలో దూరింది, రక్షణకి. వేటగాడు వెనకవచ్చి మునిని అడిగాడు, లేడి ఇటొచ్చింది ఎటుపోయిందో చూశారా? అని. దానికి ముని సందిగ్ధంలో పడ్డాడు. నిజమే చెప్పాలి. చెబితే వేటగాడు లోపలికిపోయి లేడిని చంపుతాడు. ఇది హత్యకితోడ్పడటం,జీవహింస. ఇదీ పాపమే! వేటగాడికి వేట అన్నది జీవనోపాధి. వేటాడద్దని చెప్పడమూ కూడదు. దానితో ముని చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదని సత్యం చెప్పి తప్పించుకున్నాడు. ఇది ఎల్లవేళలా సాధ్యమా?

ఇక భాగవతానికొస్తే

ప్రహ్లాదుడు తండ్రితో "మదయుతాసురభావంబు మానవయ్య! అయ్య! నీమ్రోల మేలాడరయ్య జనులు"

మదయుతమైన అసురభావం వదిలెయ్యి! నీ ముందు నిజం చెప్పరయ్యా! (ఎందుకు నిజం చెప్పరు, నీవు అసురభావంతో ఉన్నావని. భయం,చంపేస్తాని).  నిజం చెప్పేడు. నిజం చెప్పి బాధలనుభవించేడు.

నేటికాలానికొస్తే

రాజకీయులు తాము చెప్పేదంతా సత్యమే అని నమ్మమంటారు. వారికి నిజం చెప్పినా వినరు,వినలేరు, అదంతే! సత్యాసత్యాలని తేల్చుకోవలసినది మనమే!! కాని వీరికో చిన్న భయం మాత్రం ఉంది, మళ్ళీ ఎన్నికల్లో ఎన్నుకోరేమోనని.

 ఇక రాజకీయపార్టీలకి అంటకాగే కొందరుంటారు, వీరిలో పాత్రికేయులు మొదలు అనేక రకాల వృత్తుల్లోవారు, మేధావులమనిపించుకునే చదువుకున్నవారు, ఉంటారు.

రాజకీయులకి ''ఒపీనియన్ మేకర్స్'' అనే మేధావుల తోడుంటుంది. వీరికి రాజకీయులకు ఘనిష్ట సంబంధాలుంటాయి, అవి ఆర్ధికము,హార్ధికము కూడా!!వీరు రాజకీయులు చెప్పేదంతా సత్యమని ప్రచారం చేస్తారు. వీరు చెప్పే సత్యాలు,అర్ధ సత్యాలు, అసత్యాలని మనం నమ్మాలంటారు. నువ్వు నమ్మకపోతే చవటవని తేల్చేస్తారు.  నువ్వు నమ్మకపోతే నాకొచ్చిన నష్టం లేదంటారు. నాలుగే ఉపాయాలు చెప్పేరు, పాతకాలంలో కాని రాజకీయాల్లో ఐదో ఉపాయం కూడా అవసరమేనని చాణుక్యుని మాట. ఇది కూడా వీరిమీద పనిచెయ్యదు. కారణం, వీరికి రాజకీయులతో ఉన్న ఆర్ధికసంబంధం. ఒకసారి ఈ ఆర్ధిక సంబంధం తెగితే ఆపై జరిగేది వేరే చెప్పాలా?   రాజకీయుల్ని మోస్తారు, అప్పటిదాకా. అది వారికి జీవిక కదా!! నిజానికి వీరు "మోర్ ఫైత్ఫుల్ దేన్ ది కింగ్" అందుచేత వీరు నిజాని చూడలేరు, వినలేరు కూడా!! వీరినిలా అనుకోవచ్చు. 

కో అంధో? యో అకార్యరతః

కో బధిరో? యో హితాని నశృణోతి
కో మూకో? యః కాలే
ప్రియాణి వక్తుం నజానాతి.

ఎవరు గుడ్డివారు? చేయకూడని పని చేసేవారు;ఎవరు చెవిటివారు? హితవచనాలను పెడచెవిని పెట్టేవారు; ఎవరు మూగవారు? బాధల్లో ఉన్నవారితో స్వాంత వచనాలు పలుకడం తెలియనివారు.. 

 వీరు సత్యాన్ని చూడలేరు, వినలేరు.

అందుచేత వీరి జోలికి పోవడమే పొరబాటు.

నేటి రోజుల్లో సత్యం చెబుతున్నామనుకునేవారు తాము నమ్మినదే సత్యమని,తాము అనుకున్నదే నిజమని అనుకుంటే....తెలిసి తెలిసి  ముళ్ళపందినైనా కౌగలించుకుంటాను ,బురదపందితో నైనా సావాసం చేస్తాను, గొంగళిపురుగునైనా ముద్దెట్టుకుంటానంటే చేయగలది లేదు. 


ఇక నేటి భార్యాభర్తల దగ్గర కొస్తే

ఆమె ఒకరోజో కూరవండింది, అది తింటూ భర్త 'కూర అద్భుతం' అని పొగిడాడు, నిజం చెబుతూ! భార్య మొహం చింకి చేటంతయింది.మరో సారి కూరేసింది, కూడా. ఇలా  పొగిడాడు  కదా అని అదే కూర వారంలో మళ్ళీ చేసింది. ఈ సారి భర్త మాటాడలేదు. దాంతో భార్య అడిగిందిలా.

'కూరెలా ఉంది చెప్పలేదే', అని! దానికి భర్త 'నీమొహంలా ఉంద'న్నాడు. 'నా మోహానికేం చంద్రుడులా వెలిగిపోతుంటేనూ! అది చూసికదా నా వెనకబడి కట్టుకున్నారూ', అని గునిసింది.

భర్త నిజం చెప్పేడా అబద్ధం చెప్పేడా రాజా అడిగాడు భేతాళుడు.


12 comments:

  1. సత్యం ఎల్లప్పుడూ చెప్పడం కుదురుతుందండి - సత్యమే చెప్పాలనుకోగలగాలి అంతే.

    నా మటుకు నాకు రెండు సమయాల్లో మౌనంగా ఉండడం ఉత్తమం - అనవసరమైన సత్యం చెప్పలేనప్పుడు, అవసరం లేని అసత్యం చెప్పవలసి వచ్చినప్పుడు.

    ReplyDelete
    Replies

    1. Lalitha19 January 2023 at 10:19
      సత్యమే చెప్పాలనుకోగలగాలి- సత్యం ఎల్లప్పుడూ చెప్పడం కుదురుతుందండి - అంతే.
      మారీచుడు తప్పక నిజం చెప్పేడు, ఫలితం ముందే తెలుసు. తరవాత ఉపమానంలో ముని తప్పించుకునే నిజం చెప్పేడు,ప్రహ్లాదుడు చెప్పాలనే నిజo చెప్పేడు.
      పెద్దలు మౌనముత్తమ భాషణం అన్నారు. తెల్లదేవతలు సైలెన్స్ ఈస్ గోల్డెన్ అండ్ స్పీచ్ ఈస్ సిల్వర్ అని శలవిచ్చేరు.
      మీమాట రతనాల మూట.

      Delete
  2. భార్యేదో మురిసి పోయింది గానీ భర్త లౌక్యంగా చెప్పాడు, సారూ 🙂.

    “వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణ విత్త మాన భంగములందు పలికి బొంకవచ్చు నధిప”
    ….. అన్నట్లున్నారు కదా ?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు19 January 2023 at 11:38
      నేటి కాలంలో శుక్రనీతి అమలు జరుగుతోందంటారు. అదీ పూర్తిగాకాదు.అందులోనూ కొన్ని అవసరమైనవే అమలవుతున్నాయి.
      భర్త నిజంగానే నిజం చెప్పేడా?? లౌక్యం కదు సార్!!!!

      Delete
  3. పద్యం పూర్తిపాఠం.
    ఆ.వె. వారిజాక్షు లందు వైవాహికము లందు
    ప్రాణ విత్త మానభంగ మందు
    చకితగోకులాగ్రజన్మరక్షణ మందు
    బొంకవచ్చు నఘము బొంద డధిప
    ఇది పోతనగారు వామనావతారఘట్టంలో వ్రాసిన పద్యం. శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి చేసిన ఉపదేశంలో భాగంగా వస్తుంది.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం19 January 2023 at 13:19
      ధన్యవాదాలు

      Delete
  4. Thank you, శ్యామలరావు గారు.
    ఏదో గుర్తున్నంతమేరలో వ్రాసాను అటూ ఇటూ చేసేసి 🙂.

    ReplyDelete
  5. మీరు భలే కథలు ఎక్కడెక్కడినుండో పట్టుకొచ్చి రసవత్తరంగా చెబ్తారండి‌

    చాలా బావుంది.

    ఇంతటి ప్రగాఢమైన అవగాహన ఏ కొద్ది మందికో మాత్రమే వుంటుంది.




    ReplyDelete
    Replies
    1. Anonymous19 January 2023 at 17:53
      ఉన్నవేనండీ!
      బలేవారండీ! ప్రగాఢమైన అవగాహన ఉన్నవారెందరో మహానుభాహావులు అందరికీ వందనములెందరో మహానుభావులు.
      ధన్యవాదాలు

      Delete
  6. లేడి, వేటగాడు, ముని కథలో, వేటగాడు మంచివాడు కాబట్టి సరిపోయింది. ఈ కాలంలో వేటగాడు ముని మెడకి కత్తి పెట్టి ప్రశ్నిస్తే అప్పుడా ముని ఏం సమాధానమిచ్చేవాడు?

    భార్యాభర్తల కథలో భార్య, చంద్రముఖి సినిమాలో చంద్రముఖీ, భర్త రజినీకాంతుడు అయివుంటే, ముగింపు వేరే విధంగా ఉంటుంది :-)

    ReplyDelete
    Replies

    1. కాంత్19 January 2023 at 23:12
      భలేటోరే!
      అడిగేదేంది వాయ్!
      అందర్ ఘుస్కే బాహర్ లే ఆయేంగే!! బస్. ఛుప్ బైటో లేకిన్.....
      సినిమాల్కి నాకు సగమెరికండీ

      Delete
  7. hari.S.babu20 January 2023 at 16:15
    నిజం నిలకడమీదగాని తెలియదు.
    విశ్వవిద్యాలన్నీ నేటికీ ఎఱ్ఱ చొక్కాల చేతుల్లోనే ఉన్నాయి. వీటినుంచి ఎప్పుడు విడుదలో !!!!!

    ReplyDelete