Friday, 26 February 2021
Monday, 22 February 2021
పొట్ట తగ్గాలంటే?
పొట్ట తగ్గాలంటే?
మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచిందీ
పదండి ముందుకు పదండి తోసుకు
పదండి పోదాం పై పైకీ
మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచిందీ
అన్నారట మహాకవి శ్రీశ్రీ. కవిగారూహించిన మరో ప్రపంచం కనబడిందో లేదో గాని తోసుకునే అలవాటు మాత్రం మిగిలిపోయింది,జనాలకి, ఎక్కడి దాకా? రిజర్వ్ కంపార్టుమెంటులోకి ఎక్కడానికి నలుగురే ఉండి, రైలు పావుగంట ఆగుతుందని తెలిసి, రైలు ఆగగానే దిగే వాళ్ళని కూడా దిగనివ్వకుండా తోసుకుని ఎక్కే అలవాటు దాకా, పిల్ల చచ్చినా పురిటి కంపు పోనట్టు ఈ అలవాటు మాత్రం మిగిలిపోయింది.. అనుకోని విపత్తు అంటే ఆకాశం విరిగి మీద పడటం అని అంటారు. ఆకాశం విరుగుతుందా?అక్కడేం లేదు కదా! అదే మరి విచిత్రం అలాటిదే నిరుడు ప్రపంచంమీద విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి. ఈ కరోనా మహమ్మారిని చూస్తూ కూడా జనం దూరం పాటించక పొట్టలతో తోసుకోడం మానలేదు, ఎక్కడా! అదీ అసలు విచిత్రం.ఐపోయిన పెళ్ళికి బాజాలెందుకుగాని,
సరే నేటి పరిస్థితి కరోనా కొంత వెనకబట్టిందనగానే గుంపులు,గుంపులు జనాలు ఎక్కడబడితే అక్కడ తోసుకుంటూనే ఉన్నారు, హాస్పిటళ్ళలో, డాక్టర్ల దగ్గర, హోటళ్ళలో, సినిమా హాళ్ళలో,బస్సుల్లో, రైళ్ళలో ఇదేస్థితి రాబోతోంది.
మా దగ్గర కొద్దికాలం తప్పించి నడక సాగించాం అందరం, మా వాకర్స్ క్లబ్ వారం. ఇప్పుడూ కొనసాగిస్తూనే ఉన్నాం. తొమ్మిది మంది దాకా ఒక గుంపు, మూడడుగుల దూరంలో ముగ్గురో వరసకి ఉంటూ అన్ని విషయాలూ, నేటి రాజకీయం మొదలు,నాటి సాంఘిక స్థితి నుంచి, కాళిదాసునుంచి విప్లవ కవిత్వం దాకా ఎవరో ఒకరు నాటి ప్రవచకులుగా నడక సాగిపోతూనే ఉంది. ఉదయం పూట నాలుగొందల మీటర్ల ట్రాక్ మీద నడక, మూడు నాలుగు గుంపులు, మరో పక్క యోగాసనాలు వేసేవారు, మరో పక్క బేస్కెట్ బాలు ఆడేవారు, మరో పక్క ఫిజికల్ ఫీట్నెస్ కోచింగూ, సాయంత్రం పూట క్రికెట్టూ, నడకా, వాలీబాల్,బేస్కెట్ బాలూ, మరో పక్క ఇండొర్ స్టేడియంలో,టేబుల్ టెన్నిస్ షటిల్ ఇలా మా గ్రౌండ్ పెళ్ళివారిల్లులా ఉంటుంది,రెండు పూటలా. చూడ రెండు కళ్ళు చాలవు.ఇక్కడికొచ్చేవారెవరఎవరుంటారూ అని కదా అనుమానం, వ్యాపార వేత్తలు, టీచర్లు,లెక్చరర్లు,పోలీస్,ఇతర ఆఫీసుల వారు, లాయర్లు,డాక్టర్లు, ఇంజనీర్లు, నాలాటి వయసుడిగినవారు, ఏమని చెప్పను? ఎన్నని చెప్పను.. ..ఈ మధ్యనే నవ్వుల క్లబ్ కూడా మొదలెట్టాలనుకుంటున్నారు.
నేను వీరితో కలవలేను కవిని కనక, ఒంటరిగా నడక సాగిస్తా. అలా ఒంటిగా నడచి ఒకరోజు దగ్గరే ఉన్న స్కూల్ అరుగు మీద కూచున్నా. మరో మిత్రుడు తన నడక ముగించి వచ్చి పక్కనే కూచున్నారు. చాలా తొందరగా వ్యాయామం ముగిస్తున్నారు, మరి కొంచం సేపు చెయ్యాలి అన్నారు. చేయలేకపోతున్నానన్నా! ఒక పని చెయ్యండి, వెనక్కి నడవండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటీయనా? ఎగతాళీ చేస్తున్నారా అనిపించింది, ఇంటి కొచ్చాకా గుర్తొచ్చి గూగులమ్మని అడిగా! వామ్మో! పెద్ద లిస్టు చూపింది. వెనక్కి నడిస్తే లాభాలూ అని చెప్పుకొచ్చేరు అందరూ. మర్నాటినుంచి వెనక్కి నడవడం ప్రారంభించా, నవ్వేరు, నాకేం మీపళ్ళే బయట పడ్డాయని ఊరుకున్నా! సలహా చెప్పిన స్నేహితుడూ జత కూడారు. పొట్ట తగ్గుతుందన్నారు కొందరు, కొలిచి చూసుకుందామనుకుని అలాచేశేం. ఒక నెల రోజులు విడవకుండా అందరూ నవ్వినా కొనసాగించాం. నెల తరవాత చూసుకుంటే రెండంగుళాలు పొట్ట లోపలికి పోయింది, ఇద్దరికీ. ఇప్పుడు ఆడా మగా అందరూ వెనక్కి నడుస్తున్నారు. ఇతర లాభాలు చెప్పను గూగుల్లో వెతుక్కోండి.
చైనావాళ్ళకి వెనక్కి నడవడం బాగా అలవాటట. మంచి గుణం శత్రువు నుంచైనా నేర్చుకోవలసిందే! వెనక్కి నడవండి, పొట్ట తగ్గించుకోండి.
Thursday, 18 February 2021
పొట్టెందుకు పెరుగుతుంది?
పొట్టెందుకు పెరుగుతుంది?
భోజనాగ్రే సదా పథ్యం
లవణార్ద్రక భక్షణం
రోచనం దీపనం వహ్ని
జిహ్వాకంఠ విశోధనమ్
భోజనానికి ముందు సైంధవలవణం అల్లం కలిపి నమిలితే జీర్ణ శక్తి పెరుగుతుంది,గొంతు నాలుక పరిశుద్ధమై రుచి కలుగుతుంది.
భుక్త్వా శతపదం గచ్ఛేత్, శనై స్తేన తు జాయతే,
అన్నసంఘాతశైథిల్యం, గ్రీవాజానుకటీసుఖమ్.
భుక్తోపవిశత స్తుందం, శయానస్య తు పుష్టతా,
ఆయు శ్చంక్రమమాణస్య, మృత్యు ర్ధావతి ధావతః
భోజనానంతరం నూరడుగులేస్తే అన్నము యుక్త స్థానము చేరి శరీరానికి బలం కలిగిస్తుంది. భోజనం చేసిన వెంటనే కూచుంటే పొట్టొస్తుంది,వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు చేరుతుంది, మెల్లగా నడచిన ఆయుర్వృద్ధి,పరుగెత్తినచో ఆయుక్షీణము.
మరో మాట భోజనానంతరము మెల్లగా నూరడుగులు నడచి వజ్రాసనంలో ఐదు నిమిషాలు కూచుంటే ఆరోగ్యం మీసొత్తే అంటారు పెద్దలు. చిత్రమైన మాటేమంటే భోజనం తరవాత యోగాసనాలు వేయ కూడదు కాని ఈ ఒక్క వజ్రాసనం మాత్రమే భోజనం తరవాత కూడా వేయచ్చు. యోగాసనాలు వేయడం తేలికైన పనికాదు, తెలిసి తెలియక ఆసనాలు వేయడానికి ప్రయత్నం చేస్తే కాళ్ళూ చేతులు నొప్పులు పుడతాయి, విరగచ్చు కూడా జాగర్త.
ఈ రోజుల్లో అందరికి పొట్టలెందుకొస్తున్నాయో తెలిసిందోచ్! భోజనం చేసిన వెంఠనే కంప్యూటర్ దగ్గర కూచోడం అలవాటయిపోయింది జనాలికి చాలా కాలంగా అందుకే పొట్టలొస్తున్నాయి. పొట్ట తగ్గే మార్గం........?
Monday, 15 February 2021
యతో భ్రష్టః తతో భ్రష్టః
భుక్త్వా శతపదం గఛ్ఛేత్
తాంబూలమ్ తదనంతరమ్
వామపార్శ్వేతు శయనమ్
ఔషధైః కిం ప్రయోజనమ్ ?.
భొజనానంతరము నూరడుగులు నడచి తాంబూలము సేవించి, ఎడమవైపు పడుకుంటే ఔషధములెందుకు?
After dinner sleep awhile. After supper walk a mile.
దేశీయమైనదేదీ నమ్మం, విదేశీయమైనది అర్ధం చేసుకోం.
యతో భ్రష్టః తతో భ్రష్టః