పాఠకదేవుళ్ళు-సందేహాలు.
ఎవరో మెయిలిచ్చారు. ఈ టపాలో,కామెంట్లలో ఉన్న కొన్ని మాటల అర్ధం, వివరణ ఇవ్వండి, అన్నారు. ఆ మాటలేవో చెప్పలేదు. అనగా ఆ మాటలు నేనే కనుక్కొవాలి,వాటి అర్ధమూ నేనే చెప్పాలి,చిత్రం. మరో విశేషం సమాధానం ఇక్కడే బ్లాగులోనే చెప్పాలి,ఇది తియ్యటి ఆజ్ఞ,పాఠకదేవులది. వీలు వెంబడి చెబుతా,ముందు వాటిని వెతికి పట్టుకుని. 🤣😘 వేడి దంచుతో ఉంది మరి.
ఆ ప్రకారంబుగా టపాను,కామెంట్లను చదివినవాడనై సోచాయించితి కాని నాకెక్కడను కొత్తపదముల జాడ కనుపట్టనే లేదు. మరలనొకసారి జాగరూకుడనై టపా మొత్తము పదము పదముగా చదువగా రెండు నిత్యమూ వాడుకలో లేని పదములు కనుపట్టినవి. ఆపై కామెంట్లలో మరొకటిన్ని కనుపట్టినది,అవి ఈ విధముగానున్నవి.
1. కరారావుడు చుట్టడం.
2. గుంటబెట్టి గంట వాయించడం.
3. నెత్తిన చేటగొట్టడం.
వీటిని నానుడులని కూడా అంటారు. వీటిని మా పల్లెటూరివాసులు బహు రమ్యంగా వాడుతుంటారు,అందుకు అలా దొర్లిపోయాయనమాట సందర్భానుసారంగా. వీటిని వివరించమన్నారు గనుక.
కరారావుడు చుట్టడం:- క కింద రవత్తిస్తే క్ర, ఈ రావత్తును వడి చుట్టడం అనగా ముందుకు,వడిగా చుట్టడం,అంటే రవత్తును పూర్తిచేస్తే సున్నా అయింది. దీన్ని 'క్రావడి' చుట్టడం అనేవారు కాలంలో సున్నా అని చెప్పడానికి గాను కరారావుడు చుట్టేసేరు అంటుంటారు. ప్రస్థుత సందర్భం, " DMK కాంగ్రెస్ ను తమిల్నాట ఇకముందు కరారవుడు చుట్టేసినట్టే". అంటే DMK ఇకముందు కాంగ్రెస్ కు తమిల్నాటు సున్న చుట్టేసినట్టే అని అర్ధం.
గుంటబెట్టి గంట వాయించడం:- చనిపోయినవారిని తగులబెట్టడంగాని పూడ్చి పెట్టడంగాని చేస్తారు. భారత దేశంలో వైవిధ్యం ఎక్కువ. కొందరు తగులబెడితే కొందరు పూడ్చి పెడతారు. ఈ పూడ్చి పెట్టడం లోనూ తేడాలున్నాయి. కొందరు పడుకోబెడితే కొందరు కూర్చోబెట్టి ఖననం చేస్తారు. ఈ కూర్చోబెట్టి ఖననం చేసేవారిలో కూడా తేడలున్నాయి. కొందరు కొందరు కూర్చోబెట్టి పూడ్చేటప్పుడు గంట కొడతారు. గుంటబెట్టి గంట వాయించేరంటే ఖననం చేసేరని అర్ధం. ప్రస్థుత సందర్భం "ఇండీ అలయన్సును గుంటబెట్టి గంట వాయించినట్టే" అంటే ఇండీ అలయన్సును ఖననం చేసినట్టే అని.
నెత్తిన చేటగొట్టడం:- ఇంట్లోని దుమ్మును చీపురుతో ఊడుస్తారు,అదే చీపురుతో చేటలోకి ఎత్తుతారు. దుమ్ముతో ఉన్నచేటను బయట పారబోస్తూ చేత ఉన్న చీపురుతో చేటను కొడతారు,మిగిలినది కూడా పోవడానికి. ఇక ప్రస్థుత సందర్భం, "రాఘవఛద్దా కబుర్లు చెప్పి కేజ్రీవాల్ నెత్తిన చేటగొట్టి, మరో ఆరుగురుని కూడా తీసుకుపోయాడు,పోతే పోయేడు బి.జె.పిలో చేరిపోయాడు". రాఘవ ఛద్దా ఆమాద్మీ పార్టీగుర్తు చీపురును పట్టుకుని పార్టిలో ఉన్న దుమ్ము తుడిచి చేటలో ఎత్తి కేజ్రీవాల్ నెత్తిన చేటతో పోస్తూ చీపురుతో కొట్టినట్టు, తన కూడా ఉన్న మరో ఆరుగురుని కూడా తీసుకుపోయాడు,పోతే పోయాడు,బి.జె.పిలో చేరి పోయాడే అదికదా బాధ.
ఇక్కడికీ అంకం అయినట్టేనా?
మరో ముచ్చట, మరో పాఠకదేవులదే! దీనికి ఓ వారం ముందేమో, ఒకరు మెయిలిస్తూ మీ బ్లాగు టపాల పి.డి.ఎఫ్ పంపగలరన్నారు. ఏడుపే వచ్చింది, నా బ్లాగుటపాలు పుస్తకాలుగా వేసేను. కినిగేవారు వేసేరు,కొంత సొమ్మూ రావాలి, ఈ లోగా కినిగే మూసేసేరు,నా సొమ్ములూ రాలేదు,వారు కనీసం నా books పంపలేదు. ఇదే పాఠకదేవునికి విన్నవించా!
శలవు.
మీ టపాలు తాతగారూ
రిప్లయితొలగించండిఇలా ఇంటర్నెట్లోనే సేఫ్. పదికాలాల పాటు
ఇలా వెబ్సైట్లను మూసుకొని పోయే చోటా మోటా వారికన్నా.
ప్లస్ సెర్చ్ ఇంజీన్ వల్ల మీ టపాలను వెంఠనే కనుక్కునే సౌలభ్యం కూడా వుండనే ఉంది