పిలక కత్తిరింపు మహోత్సవం.
వేసవిలో తలపై జుట్టు చికాకుగా ఉందని నిన్న అంబష్టుడిని రమ్మాన్నా! గుండు గీస్తూ పిలక దగ్గర కొచ్చాడు. దాన్ని ముట్టుకోడు,ఎప్పుడూ. నేనే పిలక చిక్కుబడినట్టుంది,చూడు! అన్నా. ఉత్సాహంగా దాన్ని పట్టుకుని చూసి,చిక్కడిపోయిందండీ! చిక్కు రాదు అన్నాడు.
ఎలా అన్నా! అదేమో జానడు పిలక.
కత్తిరించక తప్పదండి తీసెయ్యనా! అంటే, వద్దు దాన్ని అలా వదిలెయ్యి,నేను చూసుకుంటా! అనడంతో,ఒక్కవేటు, తీసేస్తాకదండి అని ముందుకెళ్ళబోయాడు.నేనే తీసేస్తా! ఈ రోజుల్లో పిలక పెట్టుకునేవాళ్ళే లేరు,మాటల్లో నైనా శర్మగారి పిలక కత్తిరించేననక,ఉండలేవు,అంచేతా నేనే కత్తిరించుకుంటే సరిపోతుందిగా! అనగా ఊరుకుని మిగిలిన కార్యక్రమం పూర్తిచేసేడు. ఆతరవాయి నేను పిలకని పరిశీలించి,చిక్కు ముడి విప్పడానికి ప్రయత్నం చేసి విఫలమై చివరకి ముడిపైకి కత్తిరింపు మహోత్సవం విజయవంతంగా పూర్తి చేసేను. ఇప్పుడు చూస్తే బెత్తెడు పిలక మిగిలింది. అమ్మయ్యా,అనుకున్నా!
శ్రీ వందేమాతరం రామచంద్ర రావుగారని ఒక రాజకీయనాయకుడు. ఈయన అసెంబ్లీలో ఉంటే ప్రభుత్వానికి,బయట ఉంటే అంటే ఓడిపోతే ఆయనపై నెగ్గినవాడికి దినదిన గండమే అనుకునేవారు. ఆయన మహామహులమీద పోటీ చేసి తనపై నెగ్గినవారందరిని కోర్టుకు ఈడ్చి నెగ్గి, పదవులు ఊడగొట్టినవాడు.
శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారు, వీరిని తెలియనివారు ఉండరు, తలపై టోపీ లేకుండా ఎప్పుడూ కనపడలేదాయన. ముఖ్యమంత్రిగా ఉండగా సభలో టోపీ కనక సద్దితే ఎవరికో మూడిందని చెప్పుకునేవారు.
ఇక మర్రి చెన్నారెడ్డిగారు, ఈయన చేతిలో ఎప్పుడూ ఒక కర్ర ఉండేది. దీనిపై చాల కతలున్నాయి. కర్రచెయ్యి మారితే అయినట్టే అని చెప్పుకునేవారు. అంతేకాదు 'నాట్ అప్రూవ్డ్',తరవాత కాలంలో 'నోట్ అప్రూవ్డ్' అవడాని ఒక అక్షరం తేడా అనీ అనేవారు.
నిన్న వుమన్స్ బిల్లు వీగిపోయింది మూడిట రెండు వంతుల మజారిటీ లేక, మేం నెగ్గేం అంటే మేం నెగ్గేమంటున్నారు,ఇరువురూ. మరి చూసినవాళ్ళు స్వయం పిలక కత్తిరింపుకీ దీనికి పోలికుందా? అనుకుంటున్నారు.
పోలిక ఉన్నట్లే ఉందండీ :(
రిప్లయితొలగించండినేనంటే నేనని రెండూ పార్టీలు ప్రతీ ఎలచ్చన్లోను జాదూగర్ చేయొచ్చు :)