Friday, 27 December 2024

జరిగితే

జరిగితే జ్వరమంత సుఖం లేదు.


జరిగితే జ్వరమంత సుఖం లేదు.

విషం పని చేసినంత తొందరగా మందు పని చెయ్యదు.

గోచీకన్న దరిద్రం ప్రాణం పోవడం కంటే కష్టం లేవు.

సృష్టిలో మూడు జీవులే ఆహారాన్ని చేతితో తీసుకుని నోట్లో పెట్టుకుంటాయి. అవి మానవుడు,కోతి,ఏనుగు మాత్రమే.

పడిశం పదిరోగాల పెట్టు.


స్వగతం:- చలి,రొంప,దగ్గు, పులకరం,జ్వరం కాదు,నాలుగురోజులుగా బాధపెట్టేస్తున్నాయి జమిలిగా. ఇది జ్వరప్రేలాపన కాదు. 😊

Wednesday, 25 December 2024

నన్నెవరూ పట్టించుకోవటం లేదు.😊

నన్నెవరూ  పట్టించుకోవటం లేదు.😊


నన్నెవరూ  పట్టించుకోవటం లేదు.

ఇలా బాధపడకు. 

ఎవరికీ నీ అవసరం లేదు,అందుకే పట్టించుకోడం లేదు.ఇది పచ్చి నిజం. బాధపడి ఉపయోగం లేదు. ఇలా అనుకోడం కష్టం అనుకుంటే 

అందరూ నావాళ్ళే అందుకే పట్టించుకోటంలేదు అనుకో మనసు ప్రశాంతం. ఇలా అనుకోడం మరికొంత బాధకే కారణం అనుకుంటావా? 

నాకెవరూ లేరు అనుకో, ఈ కనపడేవాళ్ళంతా మిధ్య, ఇదొక నాటకం అనుకో,ఇప్పుడు నీ మనసుకి బహు ప్రశాంతత చిక్కి తీరుతుంది.

లేదూ!

ఎవరినీ నువ్వు పట్టించుకోడం మానెయ్యి అప్పుడు చిత్రంగా అందరూ నిన్ను పట్టించుకుంటారు. అది చేయలేవు.

అదే విష్ణుమాయ. 

Monday, 23 December 2024

అంత మనిషైనా

 అంత మనిషైనా


 అంత మనిషైనా,ఇంత మనిషైనా, ఎంత మనిషైనా, భార్య కాళ్ళ దగ్గర కూచునేవాడే.

ఎంత నేర్చినా ఎంత జూచినా ఎంతవారాలయిన కాంత దాసులే.


Saturday, 21 December 2024

పేరులోనేముంది?-లింకులు.

 పేరులోనేముంది?-లింకులు.


తెనుగునాట అందరికి ఇంటిపేరు, పేరు,చివర తోకపేరు ఉంటాయి. ఇప్పటిదాకా ఈపేరుని విరిచి ముందు వెనకలు చేసిరాసినా  చెల్లిపోయింది. ఇకముందలా చెల్లేలా లేదు. పేరుతో బేంకు,ఆధారు, పాన్ కార్డు అన్నిటిలో ఒకేలా లేకపోతే మామూలుగా జరిగిపోవచ్చుగాని సంస్థలకి చెల్లింపులు,రావలసినవి ఇబ్బందులు పడేలా ఉంది,వ్యవహారం. ఇక బేంకుల్లో పోస్టాఫీస్ లో జాయింటు కాతాలున్నవాళ్ళలో ఒకరు జారిపోతే ఆ జాయింటు పేరు తీసెయ్యడానికి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఒప్పుకోడంలేదు. ఎన్నేళ్ళైనా ఇది అలాగే ఉండిపోతోంది. ఉన్నా ఇబ్బంది లేదుగాని ఈ కాతా నెంబరు ఏ సంస్థకిచ్చినా ఒప్పుకోడం లేదు, చెల్లింపులు,రావలసినవి జరగటం లేదు.  ఇటువంటి చిక్కులో పడి కొట్టుకున్నా. ఒక్కో సంస్థ  ఒక్కోలా  అదే పేరుని తిప్పి తిప్పి రాసుకున్నాయి. ఐతే లింకంతా పాన్ కార్డులో ఉన్నట్టు పేరు లేకపోతే చికాకులే. నా సౌభాగ్యానికి ఒక పేరు కాదు రెండు పేర్లు. ఈపేర్లతో చిన్నప్పటినుంచి చిక్కుబడుతూనే ఉన్నా. 

ఎంకన్నబాబూ ఎప్పటికయ్యా ఈ గోల తప్పేది నాకంటే ఆయన నవ్వుతూ నిలబడతాడంతే. 

సీతారాం,సీతారాం,సీతారాం జయ సీతారాం.  

Thursday, 19 December 2024

కల

 కల

ఆహారము,నిద్ర,భయము,మైథునము సర్వజీవులకు సమానం. మూడు అవస్థలన్నారు. అవి జాగృతి,స్వప్న,సుషుప్తి, (మెలకువ,కల,నిద్ర). మెలకువ,నిద్ర కానిదే కల. కల అనేది మానవులకే పరిమితం అనుకుంటా. కలలో మనసు మెలకువగా ఉంటుంది,లయం కాదు. 


కునుకుపడితె మనసు కాస్త కుదుట పడతది

కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది 

అన్నారో సినీకవి. 


నిద్రలేనిది కలలేదు. కలను మనసే  సృష్టించుకుంటుంది. సాధ్యాసాధ్యాలు,స్థలకాలాలు,సమయం లేనిది కల. తనకు కావలసినవన్నీ సమకూర్చుకుంటుంది. వాటిని అనుభవిస్తుంది. ఏడుస్తుంది, నవ్వుతుంది, ఏమైనా చేస్తుంది. మెలకువ వచ్చాకా ఓ! ఇది కలా అని విస్తుపోతూ ఉంటుంది.


కలలోనే ఒక కలగా

ఆ కలలోనే మెలుకువగా

కలయో నిజమో వైష్ణవ మాయో

తెలిసి తెలియని అయోమయంలో 

నీవేనా నను తలచినది,నీవేనా నను పిలచినది

అంటారో సినీకవి మరో చోట. 

కల దానిలో నిద్ర,ఆ నిద్రలో కల,కలనుంచి మెలకువ ఇలా చిక్కులు బడిపోతూ ఉన్న మనసు, ఏది నిజం,ఏది కల తెలియని అయోమయమే  వైష్ణవమాయ...


ఇటువంటి అయోమయ స్థితి లో పడిపోయినది యశోద 

కలయో! వైష్ణవమాయమో  ఇతర సంకల్పార్ధమో సత్యమో ......ఇలా అయోమయస్థితిలో పడింది,  కన్నయ్య నోటిలో భువనభాండమ్ములు జూచి. 


వైష్ణవమాయలో చిక్కుకోకు, మనసును చెదరగొట్ట బడనివ్వకు.


ఓం! భద్రం నో అపివాతయ మనః 


ఇది మన్యుసూక్తంలో చెప్పబడ్డ మొదటి మంత్రం.

మనసుకు మనసే శత్రువు. . 


Wednesday, 18 December 2024

ఓం భద్రం

ఓం భద్రం 


ఓం భద్రం నో అపివాతయ మనః

ఓం శాంతి శాంతి శాంతిః

మమ సర్వారిష్ట శాంతిరస్తు.

Tuesday, 17 December 2024

అంతా నటులే

 అంతా నటులే

ప్రపంచ రంగస్థలం మీద అంతా నటులే! ఎవరిపాత్ర వారు నటించి తప్పుకుంటుంటారు. ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు పోయేది తెలీదు. పాత్ర ఎంటో తెలీదు. ఎంతకాలమో తెలీదు. ఏం తెలుసు? ఏమీ తెలీదని కూడా తెలీదు. కాని ఉన్నదేమి? అహంకారం నేను,నేను అనేది, ఆ తరవాత హాహాకారం. అంతా తమ చెప్పు,చేతలలోనే ఉందనుకుంటారు.దానికి తోడు మరో మాయ డబ్బు. చిన్నమ్మ ముందు నడుస్తుంటే కళ్ళెలా కనపడతాయి? కొంతమంది జీవితంలో నటిస్తారు,మరికొందరు నటనలో జీవిస్తున్నామంటారు. అంతా చిరంజీవులమనుకుంటారు, అదే చిత్రం.

ఒక్కొక్కరిది ఒక్కొకపాత్ర కొంతమంది ద్విపాత్రాభినయమూ చేస్తుంటారు. చూసేవాళ్ళుంటే త్రిపాత్రాభినయం చేస్తారు. చివరికంతా వచ్చిన చోటికే చేరతారు. అక్కడే సమానత్వం. ఇదింతే మాయ విష్ణుమాయ. 

Saturday, 14 December 2024

బెల్లం-చీమలు-గుకేష్ 🤣

బెల్లం-చీమలు-గుకేష్  🤣


బెల్లం ముక్క కోసం చీమలు ఎగేసుకొచ్చేసేయి, అందులో ఓ చీమ చచ్చిపోయింది తొక్కిసలాటలో దీనికి పెద్ద పంచాయతీయా? ఇది వార్తేటీ?

ఓరి పిచ్చినాయాలా బెల్లం ముక్కని అరస్టు చేస్తే పండగ,ఎవరికనంటావా? నీది మట్టి బుర్రరా సన్నాసి. ఇను. 

బెల్లమ్ముక్కకి ఉచిత ప్రచారం, మీడియాకి పండగ,పోలీసులకి పండగ,లాయర్లకి కోర్టులకి పండగ, పిపీలకాలకి దెబ్బలు తినే పండగ. ఇది రాయి....వార్త వైరల్.. 

+++++++++++++++++++++++++

గుకేష్

ఎవడీడు? సెలిబ్రిటీయా? వరస హత్యలు చేసి ఎలా తప్పించుకోవాలా చెప్పినోడా? చదనం దుంగలు దేశం దాటించే ప్లాన్ చెప్పినోడా? లేదూ దేశాన్ని ఎలా అమ్మేయాలో చెప్పినోడా? ఈడిదేం కాదే!

ఈడు వరసబెట్టి హత్యలు చేసినోడు,పద్దెనిమిదేళ్ళ లోపు కుర్రోడు, మనదేశపోడే. ఇంటర్నేషనల్ పేరు తెచ్చేసుకున్నోడు.మన దేశానికీ పేరు తెచ్చినోడు.  

చెప్పు,చెప్పు. ఇదిరా వార్తంటే! ఎవడేసే! ఇంతమొగోడు? అంత చిన్న వయసులో. వార్నీయవ్వ!!!!

ఇను ఈ కుర్రోడు చదరంగపు ఆటలో   మొదలెట్టి ఎదుటివాని బంట్లు,ఏనుగులు,గుర్రాలను వరసగా హత్య చేసి, నల్ల పావులతో ఆడి  ప్రత్యర్ధిని చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్ అయ్యేడు. 

గుకేష్ కి అభినందనలు.

ఇలా చెబితే అది హాట్ కేక్ లా వార్త వైరల్ గా పోతదిరా!

Thursday, 12 December 2024

బొంగరం

బొంగరం

for video click on

https://sarmabc.blogspot.com/2019/04/blog-post_89.html

 

 courtesy; google

బొంగరం తిరిగినంత సేపే ముద్దు, అలాగే మానవుడు సంపాదిమచినంతసేపే కుటుంబం పట్టించుకుంటుంది.....

యావద్విత్తోపార్జన సక్తః 
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజీవతి జర్జర దేహే 
వార్తాం కోపి న పృచ్చతి గేహే ||5||

భావం: ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు. 


courtesy:
https://ckiranbabu.blogspot.com/2010/01/bhajagovindam-lyrics-in-telugu.html#google_vignette

Tuesday, 10 December 2024

పిచ్చి ముదిరింది.

 పిచ్చి ముదిరింది. 

చొక్కాలు చింపుకోడం నుంచి ఆత్మార్పణ దాకా ఇది మరీ ముదిరి చిన్నపిల్లల్ని సమిధలు చేసే స్థాయికి పెరిగింది. ఊరంతా రోగమైతే వైద్యునింట పండగని నానుడి.


Tuesday, 3 December 2024

అమ్మకానికి లేనిది

డబ్బుతో  కొనలేనిది ఉందా?/డబ్బుతో  కొనలేనిది ఉoది


 ధన మార్జయ కాకుత్స్థ

ధన మూల మిదం జగత్!

శ్రీరాముడు. శ్రీమద్రామాయణము.


డబ్బే లోకంలో సర్వానికి మూలం సుమా!


డబ్బుతో కొనలేనిది ఉందా లోకం లో?


ఎంత డబ్బుతోనూ కొనలేనిది,అమ్మకానికి లేనిది "క్షణం ఆయుస్సు!"